Sunday, April 23, 2023

అపరిపక్వ సాధన

 అపరిపక్వ సాధన

ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం అరుదైన వరం. ఆ బాటలో అడుగులు వేస్తున్న ప్రతి ఒక్కరూ చేరుకోవాలనుకునే గమ్యస్థానం మోక్షం. భక్తిపథంలో సాగుతూ ముక్తిని పొందాలని ఆకాంక్షిస్తారు. అయితే, భగవత్‌ సాన్నిధ్యం పొందడం అనుకున్నంత తేలిక కాదు. ముక్తిపథం చేరుకోవడమంటే.. ఒక ఊళ్లో రైలు ఎక్కి మరొక ఊళ్లో దిగిపోవడం అంతకన్నా కాదు. కాలం కలిసి రాకపోతే, పక్కనే ఉన్న గ్రామానికి కూడా అనుకున్న సమయానికి చేరుకోలేం. దీనికితోడు మార్గంలో ఏవైనా అవాంతరాలు ఏర్పడినా, కాని వ్యవహారంలో ఇరుక్కున్నా ప్రయాణం అక్కడితోనే ఆగిపోయే ప్రమాదం ఉన్నది. రెండు గ్రామాల మధ్య ప్రయాణమే ఇలా కష్టసాధ్యమైనప్పుడు, భగవంతుడి చరణాలు అందుకోవాలనే లక్ష్యంతో చేసే ప్రయాణం ఇంకెంత కఠినంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఏ దోవలో వెళ్తున్నది, మార్గనిర్దేశనం చేస్తున్న వ్యక్తి, ప్రయాణికుడి మానసిక స్థితి ఇవన్నీ ఆ ప్రయాణాన్ని అనుక్షణం ప్రభావితం చేస్తూనే ఉంటాయి. మోక్షాన్ని కోరుకోవడం ఎంత తేలికో, దాన్ని చేరుకోవడం అంత కష్టం.

ఒకానొక గ్రామం శివారులో ఒక నరసింహస్వామి దేవాలయం ఉండేది. గ్రామానికి చెందిన ఒక ఆసామిని అనుకోకుండా అనేక కష్టాలు చుట్టుముట్టాయి. జీవితంపై విసుగు పుట్టింది. ఆలయ అర్చకుడి దగ్గరికి వచ్చి తన దీనస్థితి గురించి చెప్పుకొన్నాడు. ఏదైనా మంత్రం ఉపదేశిస్తే.. తన బతుకు బాగుపడుతుందని కోరాడు. అప్పుడు పురోహితుడు ‘నాయనా! మంత్రోపదేశంతో సరిపోదు. దానిని పద్ధతిగా సాధన చేయాలి. కఠిన నియమాలు పాటించాలి. ధార్మికంగా వ్యవహరించాలి’ అని చెప్పాడు. అన్నిటికీ ఒప్పుకోవడంతో.. పురోహితుడు మంత్రాన్ని ఉపదేశించి ‘దీన్ని క్రమక్రమంగా సాధన చేయాలి. నియమాలు పాటించాలి. ధార్మికంగా వ్యవహరించాలి’ అని చెప్పాడు. ఈ మంత్రాన్ని క్రమక్రమంగా సాధన చేయాలి. తొందర పాటు, అత్యుత్సాహం పనికిరాదు’ అని హితవు పలికాడు అర్చకుడు. అలాగే అన్నట్టు తలూపాడు ఆసామి. గుడి సమీపంలోని కొండపైకి ఎక్కి మంత్రం జపించడం మొదలుపెట్టాడు. నిద్రాహారాలు మాని కఠోరంగా తపస్సు ప్రారంభించాడు. కొన్నాళ్లకు నరసింహ స్వామి ప్రత్యక్షమయ్యాడు. స్వామి భీకర రూపాన్ని చూసి తట్టుకోలేక తన పొట్టను తానే చీల్చుకొని ఆసామి కన్నుమూశాడు. విపరీత సాధన చేశాడు కానీ, మానసికంగా సిద్ధం కాలేకపోయాడు.

ఈ చిన్నకథలో అద్భుతమైన సందేశం ఉంది. శ్రద్ధ లేకుండా ఎన్ని గంటలు చదివినా ప్రయోజనం కలగదు. అలాగే, నమ్మకం, ఆత్మవిశ్వాసం లేనిదే సాధన పరిపక్వం చెందదు. చాలామంది సాధకులు కుండలిని శక్తిని ప్రేరేపించడం ద్వారా ఆధ్యాత్మిక లక్ష్యాన్ని త్వరగా అందుకోవచ్చని భావిస్తూ ఉంటారు. మిడిమిడి జ్ఞానంతో ఈ ప్రక్రియను అనుసరిస్తుంటారు. తమ సాధన ద్వారా శరీరంలోని షట్చక్రాల్లో ఒక్కోదాన్నీ ప్రేరేపిస్తూ ముందడుగు వేస్తుంటారు. అయితే, తీవ్ర సాధన వల్ల చక్రాలు ఉత్తేజితమవుతాయి కానీ, వాటిని నియంత్రించడం అందరికీ సాధ్యపడదు. బ్రహ్మరంధ్రంపై ఉండే సహస్రార చక్రాన్ని నియంత్రించలేకపోతే.. మతిస్థిమితం కోల్పోయే ప్రమాదమూ ఉన్నది. పుణ్యక్షేత్రాల్లో కొందరు సాధువులు పిచ్చిపట్టిన వారిలా కనిపించడం గమనిస్తుంటాం. వారిలో కొందరి పరిస్థితికి ఈ అపరిపక్వ సాధనే కారణంగా చెబుతారు.

‘సాధనాత్‌ సాధ్యతే సర్వం’ అన్నారు రుషులు. అయితే, ఆ సాధన చేసే విధానం ముఖ్యం. దానిని చేయించే గురువు అంతకన్నా ముఖ్యం. సరైన గురువు అనుగ్రహం లేకపోతే ఏ సాధనా పరిపక్వత చెందదు. శారీరక సమస్యలు, మానసిక దౌర్బల్యాలు, విషయ వాసనలు, చిత్త ప్రవృత్తులు ఇలా ఎన్నో సాధకుణ్ని కకావికలం చేస్తుంటాయి. పక్కదారి పట్టిస్తాయి. వీటిని జయించకుండా సాధన కొనసాగిస్తానంటే కుదరదు. ఇలాంటివారికి జన్మాంతర పుణ్యంతో దైవానుగ్రహం లభించినా.. దాన్ని సద్వినియోగం చేసుకునే నేర్పు కొరవడుతుంది. పసిబాలుడు అడుగులు వేసే క్రమంలో, అరుగులు దిగే సమయంలో పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తాడు. తల్లి చెంతనే ఉంటే.. ఆ పసివాడు పడిపోయే ప్రమాదం ఉండదు. అలాగే సద్గురువు మార్గనిర్దేశంలో కొనసాగిన సాధన పరిపక్వత సాధిస్తుంది. లేకపోతే అపరిపక్వంగానే మిగిలిపోతుంది. 

No comments:

Post a Comment