🪔🪔 ఆత్మ భావంతో ఆనంద జీవనము🪔🪔
🌹మానవ జీవితం ఏ స్థాయిలో ఉన్నా ఉరుకులు
పరుగులతో కూడి ఉంటుంది. ఆదిమ మానవుడు ఎలా జీవించాడో ఏమోగానీ ఆధునిక మానవుడు మాత్రం బతుకు యాత్రలో ఊపిరి సలపని వేగంతో ఆందోళనను గుండెల నిండా నింపుకొని పయనిస్తున్నాడు. నాటి మానవుడు పూట గడవడం కోసం, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం, భద్రంగా జీవించడం కోసం తపనపడి ఉంటాడు. నేటి మానవుడు అన్ని సౌకర్యాలు అందివచ్చినా ఒత్తిడిని పుణికిపుచ్చుకొని హాయిగా జీవించలేకపోతున్నాడు. ఎన్ని చదువులు చదివినా ఎంత అనుభవం గడించినా జీవించడం ఎలాగో తెలియని అమాయకత్వంతో అజ్ఞానిగా మిగిలిపోతున్నాడు.
🌹 మనిషి జ్ఞానానికి, అజ్ఞానానికి చదువులు ఒక్కటే కారణం కాదని మహాపురుషుల జీవితాలు పరికిస్తే అర్ధమవుతుంది. అక్షరజ్ఞానం లేకపోయినా ఆత్మజ్ఞానం తెలిసినవారు కష్టసుఖాలలో సమభావంతో జీవించడం సాధ్యమని మహాపురుషులు జీవించిన భారతావని సంస్కృతిని పరిశీలిస్తే బోధపడుతుంది.
🌹'నేను' అనగానే మనిషికి బోధపడే అంశం ఒడ్డు- పొడుగు గల తన దేహపు బాహ్య దృశ్యరూపమే. రెండక్షరాలు నేను అనే పదం అవ్యక్తంగా హృదయస్థానంలో కొలువై ఉండే ఆత్మకు సంబంధించినదని చెబుతారు వేదాంతులు, శ్రీకృష్ణ భగవానుడు తన శిష్యుడైన అర్జునుడికి బోధించిన పవిత్ర భగవద్గీతా సారం ఆ నేను'తో ముడివడిఉన్న పాఠ్యాంశమే. నాశనమనేది దేహానికేగానీ ఆత్మకు కాదన్నది పరమాత్మ బోధ.
🌹 ఆధునిక రుషి, మౌని, యోగి అయిన రమణ మహర్షి సైతం తన శరీరాన్ని సతతం ఆత్మ నుంచి వేరుచేసి చూశారు. చూపించారు. తన భక్తులకు బోధపరచారు. తన శరీరానికి సంక్ర మించిన మహావ్యాధిని సైతం తేలిగ్గా తీసుకున్నారే తప్ప వారు చింతపడలేదు.
🌹ఓ భక్తుడు ఒక సంస్కృత గ్రంథానికి తమిళంలో
వచనం రాశాడు. దాన్ని రమణులకు చూపవలసి ఉంది. అతడలా చేయకపోవడంతో రమణ మహర్షి ఒకరోజు అతడి గ్రంథరచన ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. భగవాన్ అస్వస్థులుగా ఉండటంతో ఆ భక్తుడు గ్రంధాన్ని చూపితే మార్పులు చేర్పులు చేస్తూ వారు మరింత అస్వస్థులవుతారని భావించి ఆయన దృష్టికి తేలేదు.
🌹రమణులు కారణం ఏమిటని ప్రశ్నించారు. అతడితో అన్నారు. 'నా శరీరం అస్వస్థతతో ఉన్నమాట నిజమే. కానీ, నేను (ఆత్మ) బాగానే, ఖాళీగానే ఉన్నా కదా! నేను ఆ గ్రంధాన్ని సరిదిద్దుతాను' అని చెప్పి ఆ బాధ్యతను విజయవంతంగా పూర్తి చేశారు.
🌹రమణుల దృష్టిలో తన శరీరం జబ్బుతో బాధపడుతున్నప్పటికీ ఆత్మ పరంగా ఆనందంగా, హాయిగానే ఉందికదా!! ఆత్మను శరీరానికి భిన్నంగా చూసేవారు మన మహర్షులు. అందువల్ల శరీరాలు వ్యాధితో బాధపడుతున్న సందర్భంలోనూ వారు నిశ్చింతగానే ఉండేవారు. ఆ భావం అందిపుచ్చుకొన్నప్పుడే ఆధునిక యుగంలోనూ మానవుడు శాంతి సౌభాగ్యాలతో జీవించగలుగుతాడని ఆశ కలుగుతుంది.
🌹నేటి మనిషి నిరంతరం సమయాభావంతో కుంచించుకుపోతూ ఉరుకులు పరుగులు పెడుతున్నాడు.
🌹తానంటే బయటకు కనిపించే దేహం కాదు.
🌹లోపల ఆత్మ అనే దివ్యపదార్థం ఉంది.
🌹అది వెలుగుతో ప్రకాశమానమవుతూ శరీరాన్ని నడిపిస్తుంది.
🌹అదే లేకపోతే మనిషి జడపదార్ధమే కాక మృతసమానుడు!
🌹 ఆ సత్యాన్ని తెలుసుకుంటే దైవభావంతో జీవనం చేయడం సాధ్యమవుతుంది.
🌹కష్టసుఖాల్లో సమభావంతో జీవించడం నేర్చుకున్నాక దైవం చెంతనే జీవిస్తున్నానన్న స్ఫురణ కలిగి మనిషి ఇహ పరాల సర్వోన్నతికి అర్హత సాధిస్తాడు.🙏
-✍️గోపాలుని రఘుపతిరావు.
No comments:
Post a Comment