==================
అరుణాచల శివా
జన జగత్తులతో జ్ఞాని
రచన -- వి.ఎస్. ఆర్. మూర్తి
==================
ఒకానొక రోజున మహర్షి అరుణాచలం మీద ఉండగానే ఒక బాలుణ్ణి పాము కాటు వేసింది. వాడు మరణించాడు. తల్లి, రమణా! రమణా! అని ఏడుస్తోంది. ఈయన కూడా పరుగెత్తుకుని వెళ్లారు కిందకి, ఎవరు ఇంతగా పిలుస్తున్నారు
అని. ఎందుకంతగా అరుస్తున్నావు? అన్నారు.
“ఎవర్ని ?నిన్ను పిలువ లేదు. నా కొడుకు పేరు రమణుడు. వాణ్ణి పాము కరచింది. మరణించాడు" అన్నది ఆమె.
"ఎక్కడికి పోయాడు? అంతా ఇక్కడే ఉన్నది", అని చూశారు. ఐదు నిముషాల తర్వాత “రమణాలే” అన్నారు. పిల్లవాడు లేచాడు.
“ఏం చూశావు ఇప్పటిదాక" అన్నారు.
"ఇప్పటిదాకా బ్రహ్మానంద స్థితిలో మిమ్మల్ని" చూశాను అన్నాడు ఏడేండ్ల పిల్లవాడు.
అంటే వాడికి మరణానుభవంలోనించే రమణ దర్శనాన్ని ఇచ్చినటువంటి దీనిని, మహి మ అనడానికి వీలులేదు. ఇది గురువు అనుగ్రహ మే. అక్కడి నుంచి రమణులు నిమిత్తమాత్రుడిగా తపుకున్నారు.
రమణుల జీవితంలో జ్ఞాన యోగం ఒక ఎత్తయితే, ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించిన స్త్రీవాద రచయిత చలం రమణుల్ని ఒకసారి అడిగారు, “భగవాన్! అరుణాచలం నుంచి మీరు ప్రతి సాయంకాలం దిగివచ్చి మంచం మీద కూర్చుని
దేనినో చూస్తున్నట్లు, మీ ముఖ మండలం మీద వెలిగే ఆ దివ్యమైన వెలుగు ఎంత అద్భుతమో, ఎంత సౌందర్యమో" అనీ, “ఏం చూస్తారు? మీరు" అని అడిగినప్పుడు, “ఆ క్షణాన నన్ను నేను చూసుకుంటాను" అని చెప్పారు.
నిజమే! దేన్నయినా చూస్తే మనసు వికారం చెందవచ్చు. దేన్నయినా చూస్తే అది నాకు కావాలని అనిపించవచ్చు.
కానీ తనను తాను చూసుకునేటువంటి దివ్యానుభవం జ్ఞానులకు,
యోగులకు మాత్రమే సాధ్యం. ఆ యోగస్థితిని అటువంటి ఉదాత్త స్థాయిని మనం కూడా అనుభవించగలిగిన ఒక మౌన జ్ఞాన భూమికని రమణులు అందరికీ కూడా ప్రతిపాదన చేశారు.
అలాగే అరుణాచలేశ్వరుడికి సమర్పణం చేసి, శరణాగతి పొందిన తర్వాత యాభైనాలుగు సంవత్సరాలు ఆ అరుణాచల దేవాలయం పక్కనే ఉన్నా ఆ దేవాలయంలో మళ్ళీ అడుగు పెట్టలేదు. అవసరం లేదన్నారు. ఎందుకంటే ఆ
గుడిలో ఉన్న
దేవుడు రాయి, మాట్లాడడు. అట్లాగే అరుణాచలం కొండ. అదీ మాట్లాడదు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి అద్వైతమూర్తి,
జ్ఞానమూర్తి రమణులూ పలకరు. అంతా మౌనమే. అక్కడ ప్రజ్ఞానమంతా మౌనం పరిమళించనట్లుగా, విస్తృతమైనట్లుగా, వ్యాపించినట్లుగా దక్షిణామూర్తి మౌనవ్యాఖ్య చేసినట్లుగా ఉంటుంది కాబట్టి. రమణులు మానవ జీవితాన్ని
సుసంపన్నం చేసి, “మీరు ఎక్కడ ఉన్నా సరే మీతో మీరు ఉండండి. దేనితో కూడి ఉన్నా మీకు దుఃఖమే. మీరు ఎంత జ్ఞాన యోగంలో ఉన్నా, కర్మయోగమనేది తప్పదు. ఒక శిఖరాన్ని అధిరోహించిన తర్వాత టె
న్సింగ్ నార్కే ఎవరెస్ట్ శిఖరం మీద జండా పాతాడు. అక్కడే కాపురం పెట్టాడా? దిగి రాలేదా?" అన్నారు. దిగి రావాలి. మనం కూడా ఎంత జ్ఞాన యోగంలోకి వెళ్లినా ఇదిగో ఈ సంసారం, ఈ కుటుంబం, ఈ ప్రపంచం, ఈ జగత్తు, ఈ
సమాజం వీటన్నిటితో గనక మమేకం కాకపోయినట్లయితే ఆ జ్ఞానం వృథా అనేవారు.
అలాగే అరుణాచలం నుంచి సాయంకాలం వాహ్యాళికి వెళ్ళి తిరిగి వచ్చినపుడు అక్కడ పది పదిహేను ఆవగింజలు కిందపడి ఉంటే వాటన్నింటినీ ఒక్కొక్కటిగా ఏరి డబ్బాలో వేసేవారు. ఎందుకింత శ్రమ, పోనీ ఆవగింజలే
కదా! అంటే, “అంతేనా ! ఒక్కొక్క ఆగింజలో ఒక్కొక్క చెట్టు ఉన్నది సుమా! ఒక్కొక్క చెట్టు కొన్ని వేల గింజలను సృష్టించగలదు. వృధా చేసే హక్కు మనకెక్కడ ఉన్నది? అన్నారు. జ్ఞాని అయినవాడు కర్మ యోగాన్ని వదిలిపెట్టడు.
ఒకానొక రోజున ఒక పరిచారకుడు, ఈయన తన కౌపీనాన్ని ఉతుక్కునే ముందే ఉతికి , ఆరేసినప్పుడు, రమణులు చూశారు. ఎవరో ఇది ఉతికారు అనుకున్నారు. పిండి రుబ్బేవాణ్ణి పక్కకు జరగమన్నారు. “కాయకష్టం లేకుండా
ముద్ద ఎత్తే హక్కు జ్ఞానికి కూడా లేదు. కర్మ యోగంలో దేహాన్ని ధరించి వచ్చాను గనుక నేనూ
కష్టపడవలసిందే. ఈ రోజు నీవు నా బట్టలు ఉతికినందుకు నేను నీ పని చేసిఋణం తీర్చుకుంటానన్నారు".
జ్ఞాని ఎటువంటి పాఠాలు నేర్పుతాడో చూడండి.
ఒక స్త్రీ ఆయన దగ్గరికి రావడానికి సంకోచిస్తూ, ప్రాపంచికమైన యాతనలు పడుతూ ఉన్నప్పుడు, గేటుకు అవతల నించుని భగవాన్ని ప్రార్థిస్తూ ఉంటే రమణులు ఎవరో పిలిచినట్లు బయటకు వచ్చి, గేటు దగ్గరే నించుని “ఓం
నమశ్శివాయ అనుకో! కష్టాలన్నీ తీరుతాయి" అన్నారు. వారి జీవితంలో ఎవరికైనా సరే ఒక మంత్రాన్ని నేరుగా ఉపదేశించినటువంటి సన్నివేశం అదే! మళ్లీ ఎవరికీ చేయలేదు. మళ్ళీ పదిహేను రోజుల తరువాత ఆమె వచ్చి 'మీరు
చెప్పినట్లే చేశాను. అన్నీ బాగా అయిపోయినై, భగవాన్"! అన్నప్పుడు నిమిత్తమాత్రంగా, నిర్లిప్తంగా, నిర్మలంగా తనకేమీ పట్టనట్లుగానే ఆయన వ్యవహరించారు.
No comments:
Post a Comment