🥀 *సంచయాల సంచీ* 🥀
✍️ డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
✍️🌹🌹🌹🙏💐🙏🌹🌹🌹✍️
జగత్తు అంతా ఒక మాయే అని వేదాంతుల మాట. భౌతికవాదులు ఈ మాటను అంగీకరించకపోయినా, ఇది అక్షరసత్యం.
ఎందుకంటే ఈ జగత్తు అంతా మనిషిని ఎన్నో భ్రమలకు గురిచేస్తుంది. ఈ ప్రపంచంలోని సంపదలన్నీ ప్రకృతి సహజంగా ఏర్పడ్డవే. ఈ సంపదలన్నీ ప్రాణుల రక్షణ కోసం ఉద్దేశించినవే. వీటిని ప్రతిప్రాణీ తనకు ప్రాణధారణకు అవసరమైనంత మేరకే వాడుకోవాలి. అంతేగాని, ఇతరులకు ఏమీ మిగిలించకుండా తన సొంతం చేసుకోకూడదు. ఇది పెద్దలమాట.
మనిషిలోని దురాశ, స్వార్థం ఈ నియమాన్ని తుంగలో తొక్కి స్వైరవిహారం చేస్తున్నాయి. తోటి ప్రాణుల బాగోగులను ఎంతమాత్రం లెక్కచేయడం లేదు. అన్నీ తనకే కావాలని అర్రులు చాస్తున్నాడు స్వార్థపరుడైన మనిషి.
జీవితం అంటే సంచయమే తప్ప మరొకటి కాదని విర్రవీగుతున్నాడు.
సంచయం అంటే ఆర్జన. తన కోసం సమకూర్చుకోవడం. బతకడానికి ఆరడుగుల నేల చాలని ఎందరు చెప్పినా మనిషి వింటాడా? విననే వినడు. ఎంత వీలైతే అంత భూమిని సొంతం చేసుకోవడానికి ఎత్తులకు పైయెత్తులు వేస్తుంటాడు. సక్రమంగా, అక్రమంగా అన్ని విధాలుగా ప్రయత్నిస్తాడు.
ఎంత భూమిని ఆక్రమించినా మరణించిన తరవాత అంతా ఈ లోకంలోనే వదిలేయాలి. భూమి, ధనం, భవనాలు, అధికారాలు... అన్నింటినీ తృణప్రాయంగా వదిలేయవలసిందే. కేవలం సంపదలే కాదు, తనవాళ్లు కూడా ఎవరూ వెంటరారు. జన్మను ఇచ్చిన తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు, మిత్రులు, సంతానం, చివరికి కట్టుకున్న భార్య కూడా జీవించి ఉన్నంతవరకే వెంట ఉండేది. చచ్చిన తరవాత ఎవరి దారి వారిదే.
అయినా మనిషి సంచయాలను వదలడు. తన సంతతి కోసం కోట్లు కూడబెట్టాలని ప్రయత్నిస్తాడు. తరతరాలూ తిన్నా తరగనంత ఆస్తిని సంచయం చేసి పెడతాడు.
*మనిషి సంచయాల సంచీ ఎన్ని వేసినా నిండదు. అది ఎప్పుడూ భుజానికి వేలాడుతునే ఉంటుంది. పెరుగుతున్న సంపదలు తరుగుతున్న ఆయువును ఆపలేవు. ఎంత ధనం వెచ్చించినా మరణం ఆగదు. సామాన్యుణ్ని, మాన్యుణ్ని మృత్యువు సమానంగా కబళిస్తుంది. సామాన్యుడి అంతిమయాత్ర చడీచప్పుడు లేకుండా ముగుస్తుంది. మాన్యుడి అంతిమ ప్రయాణం రాజలాంఛనాలతో సాగుతుంది. శ్మశానంలో ఇద్దరి చోటూ ఒకటే!*
అవసరాలకు మించి ఉన్నదంతా దీనులకు, ఆర్తులకు ఉపయోగపడాలి. ఇది సృష్టిలోని సమన్యాయం. కానీ దీనిపై మనిషికి స్పృహ ఉండదు. ఎంత పడితే అంత దోచుకోవడమే మనిషికి అలవాటు. అగ్నిజ్వాలలో ఆజ్యం పోస్తే మండుతూనే ఉంటుంది కానీ చల్లారుతుందా? ఒక కోరిక ఇంకొక కోరికను ప్రసవిస్తుంది. కోరికలు ఎంత కాలమైనా పెరిగేవే కాని, తరిగేవి కావు. కనుక మనిషి కోరికలను అదుపులో ఉంచుకోవాలి. సంచయాల సంచీని ఖాళీ చేస్తుండాలి.
మనిషి జీవితం ఒక సంచీలాంటిదే. ఇందులో పుణ్యాలు, పాపాలు, సుకృతాలు, దుష్కృతాలు... అన్నీ ఉంటాయి. అన్నింటినీ ఆజీవనాంతం మోయడం సాధ్యం కాదు గనుక పాపాలను, దుష్కృతాలను వెంటనే వదిలించుకోవాలి. అతడికి ఉత్తమ స్థితిని తెచ్చిపెట్టేవి సుకృతాలే. మనిషి మరణించినా అతడి కీర్తి శాశ్వతం. మంచి మనిషిని లోకం ఎల్లప్పుడూ గుర్తు చేసుకొంటుంది. అతడు సంపాదించిన ధనం కాని, ఆస్తులు కాని ఎవరినీ ప్రభావితం చేయలేవు. సంపదలు వస్తూ పోతుంటాయే తప్ప, వాటికి శాశ్వతత్వం లేదు. మనిషి గుణగణాలే శాశ్వతంగా చెరగని ముద్ర వేస్తాయి.
*Courtesy* : *ఈనాడు*
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు*
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు
*సేకరణ:*
No comments:
Post a Comment