Thursday, May 11, 2023

*****'బీడీబాబా' ('నిసర్గదత్త మహరాజ్') వెలుగురవ్వలు :నేపథ్యంగా(అతీతంగా) ఉండు... ఉన్నది - నేపథ్యమే. ఉన్నది - నిశ్శబ్ధమే.

 నేపథ్యంగా(అతీతంగా) ఉండు...

ఉన్నది - నేపథ్యమే.
ఉన్నది - నిశ్శబ్ధమే.

* * *

త్రాడే లేకుంటే పాము అనే భ్రాంతే కలుగదు కదా!
'ఉన్నది' లేకుండా 'ఉన్నట్లున్నది' ఉండదు కదా!
తెర లేకుండా సినిమా ఆడడం ఉండదు కదా!

ఆ తెరపై సకల నామరూపాలు నీడలు వలె కదలాడుతున్నాయి...
రకరకాల శబ్ధాలు చేస్తూ గోలగోల చేస్తున్నాయి.

రూపాలకూ శబ్ధాలకూ నేపథ్యంగా, నిశ్శబ్ధంగా తెర ఉంది.
తెర "ఆధారమే"గానీ, "కారణం" కాదు సుమా!
ఆ నేపథ్యం కార్యకారణాలకు అతీతం.

బీడీబాబా ఇలా అంటున్నారు-
నాకు నేనే ఒక సినిమా తెరని అని అనిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధంగా, ఖాళీగా ఉన్న ఈ తెర మీద బొమ్మలు ఆడి మాయమవుతూ ఉంటాయి. మళ్లీ ఖాళీగా స్వచ్ఛమైన తెర మాత్రం ఉంటుంది. ఆడే బొమ్మల తెరని ఏమీ చెయ్యలేవు. అలాగే బొమ్మల మీద తెర ప్రభావం ఏమీ ఉండదు.

* * *

నామరూపచిత్రములకు ఏ మాత్రమూ ప్రాభావితం కాకుండా సదా ఆ "నేపథ్యం"గా ఉండిపోయిన బీడీబాబా సంక్షిప్త జీవితచిత్రణ-

* * *

ముంబాయి నగరంలో శివరాంపంత్-పార్వతీబాయి పుణ్యదంపతులకు 17-4-1897 హనుమజ్జయంతి పుణ్యదినాన కుమారుడు పుట్టిన కారణంగా వానికి 'మారుతి' అని నామకరణం చేశారు.

ముంబాయిలో ప్లేగు చెలరేగుతుండడంతో ముంబాయి వదిలి స్వగ్రామమైన కాందల్ గావ్ చేరుకున్నారు... 

మారుతి తన తండ్రికి వ్యవసాయంలో సాయం చేస్తూ... 
"గో"పాల బాలుడుగా బాల్యం గడిపారు...

1915లో తండ్రి మరణించడంతో...
అన్నతో కలిసి  ముంబాయి చేరుకున్నారు...
1920లో బీడీ దుకాణం తెరిచారు...
1924లో వివాహం చేసుకున్నారు...
ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు.
ఒక ప్రక్క వ్యాపారం చేసుకుంటూనే...
మరోప్రక్క ఆధ్యాత్మిక విషయాల్లో చరించేవారు.
'నవనాథ భక్తిసార్' అనే పుస్తకాన్ని అమితభక్తితో చదివేవారు...
నవనాథ సంప్రదాయానికి చెందిన "సిద్ధరామేశ్వర్" అనే జ్ఞాని వద్ద దీక్ష తీసుకున్నారు.

ఆ గురువు  ఇలా బోధించారు-
ఒక దేహంతో, మనసుతో విడిగా ఉన్న వ్యక్తివి కావు నీవు. నువ్వు సర్వోత్కృష్ట సత్యస్వరూపానివి. ఏ నామరూపాలు లేని 'అచ్చమైన నేను' పైనే నీ ధ్యాస నిలుపు' 

సారవంతమైన ఆ గురూపదేశాన్ని అక్షరాలా, అతి గాఢంగా విశ్వసించి, అమిత చిత్తశుద్ధితో పాటించసాగారు...

పట్టు సడలని వారి ఆత్మనిష్ఠ వారిని పరిపూర్ణస్థితికి చేర్చింది.

బీడీ దుకాణం నడుపుతూ, బీడీలు కాలుస్తుండడం చేత 'బీడీబాబా' అనీ,

తన గురువు నవనాథ సంప్రదాయం అవడం చేత 'నిసర్గదత్త మహరాజ్' అనీ,

పేర్లు వచ్చాయి...

ఆ నోటా ఈ నోటా పడి వారి కీర్తి ప్రపంచదేశాలన్నింటికీ ప్రాకింది.

పోలండ్ దేశస్తుడైన మారిస్ ఫ్రీడ్మన్ అనే రమణభక్తుడు
బీడీబాబాతో జిజ్ఞాసువులు సలిపిన సంభాషణలను "అయామ్ దట్" అనే పుస్తకంగా వెలుగులోకి తీసుకొచ్చారు.

దానిని తెలుగులోకి మా ఆత్మీయమిత్రులు, సద్గురు భక్తులు, అరుణాచలవాసి అయిన పిడూరి రాజశేఖర్ గారు తెలుగులోకి అందంగా అనువదించారు.

బీడీబాబా 8-9-1981న తనువు చాలించారు. 
నేపథ్యంగా మిగిలిపోయారు.
_____________________

బీడీబాబా వెలుగురవ్వలు
_____________________

1. ప్రశ్న: మీ గురువు మీద సంపూర్ణమైన విశ్వాసం కలగడానికి మీరేం అదృష్టం చేసుకున్నారు?

బాబా: ఏమో ఎవరు చెప్పగలరు? అలా సంభవించిందంతే.
అకారణంగా, అహేతుకంగా విషయాలు జరుగుతాయి.

2. ప్రకృతి సూత్రాలకు మినహాయింపులుంటాయని నేననుకోవడం లేదు. నా వరకూ నాకు అలాంటిదేమీ లేదు. ఈ చైతన్యంలోనే ప్రతి విషయమూ సంభవిస్తుంది. 

3. మీలోని అచ్చమైన 'నేను'పై మీరు శ్రద్ధ పెట్టరు.
మీ మనసు ఎప్పుడూ మనుషులు, విషయాలు, ఊహలతో నిండిపోవడం వల్ల, అచ్చమైన 'నేను' మీద మీ ధ్యాస నిలువదు.

4. సత్యం అనేది ఊహలో ఉండేది కాదు, 
అది మనసు తయారుచేసేదీ కాదు.

5. మిమ్మల్ని మీరు నిర్వచించుకోవాలన్న ధోరణిని వదులుకోవాలి.

6. బంగారం కన్నా స్వర్ణాభరణాలకు విలువ ఎక్కువని మనసు మనల్ని నమ్మిస్తుంది. అసలు 'సత్తా'లో మనం అందరం ఒకటే. బాహ్యస్వరూపాలలోనే భేదం.

7. కోరికా, భయమూ లేకుండా జరుగుతున్నదానిని ఉన్నదున్నట్టుగా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. ఆ జరుగుతున్న జీవితం మీరు కాదు. అది మీకు సంభవిస్తున్నది అంతే. చివరికి ఆ గమనించేది కూడా మీరు కాదు. 
సకలాన్ని జరిపించగల పరమోత్కృష్టమైన 'అదే నువ్వు. సర్వవ్యాప్తమైన ఈ చైతన్యం అంతా దాని వ్యక్తీకరణే. అభివ్యక్తే.

8. కనబడుతున్న ప్రపంచం చాలా అల్పమైనది. అది పూర్తిగా నీ వ్యక్తిగతమే. దాన్ని ఒక కలలా తీసుకొని వదలండి.

9. నేనేమీ వినడం లేదు; నేనేమీ చెప్పడం లేదు. 
ఘటనాప్రపంచంలో ప్రశ్న అడగడం, జవాబు రావడం అనేవి సంభవిస్తున్నాయి. అన్నీ అలా ఘటిస్తున్నాయి అంతే. 

10. నీవూ, నీ ప్రపంచమూ రెండూ స్వప్నస్థితులే. 
కలలో నీవెన్ని బాధలు పడినా అవి ఎవరికీ తెలియవు.
ఎవరూ నీకు సహాయపడలేరు. 

11. సత్యం కోసం ప్రాణాలైనా ఇవ్వగల వ్యక్తి 
సత్యాన్ని పొందుతాడు.

12. నిజానికి 'వాస్తవ ప్రపంచం' మనుషుల విషయపరిజ్ఞానం పరిధికి ఆవల ఉంటుంది.

13. ఏ నియమాలూ వర్తించని అవ్యవస్థలో 
కార్యకారణ సంబంధం అనేది ఉండదు.

14. మొదటి అడుగు వేయండి ముందు.
మీ లోపల నుంచే కటాక్షం ఉప్పొంగుతుంది. 
అంతర్ముఖులవ్వండి.
వీలైనంత ఎక్కువ సేపు
మీ అచ్చమైన 'నేను' పైనే ధ్యాస పెట్టండి.
'నేను' అన్న తలపును తప్ప అన్నిటినీ నిరాకరించు.
మొదట్లో మనసు తిరగబడుతుంది.
కొంచెం ఓర్పుతో, పట్టుదలతో ఉంటే మనసు లొంగుతుంది, నెమ్మదిస్తుంది.
'నేను ఉన్నాను' అన్నది అప్రయత్నంగా, 
సద్యస్ఫురణగా తెలియడం అలవడేదాక 
ఈ సాధన చేయండి. 
ఇంతకన్నా సూటియైన, సులభమైన మార్గం 
మరొకటి లేదు.

15. కార్యకలాపాలనూ, వాంఛలనూ, యోచనలనూ ఏ మాత్రం పట్టించుకోకుండా 'అహం అస్మి' అన్న ఆలోచనాభావన పైననే శ్రద్ధ పెట్టండి. 'నేను' పై పూర్తి ధ్యాసను మనసులో నిలుపుకొని ఆ తలపులోనే నిలిచిపొండి. రకరకాల అనుభవాలు కలగవచ్చు. ఈ అనుభవాల ద్వారా గ్రహిస్తున్నదంతా వెళ్లిపోయేదే, తత్కాలికమే అన్న జ్ఞానంలో స్థిరంగా ఉండిపోండి. నిలిచేది 'అహంస్ఫురణ' ఒక్కటేనన్న స్పృహ కలిగి ఉండండి...............

16. 'నేను' అన్న ఎరుకలో దృఢంగా పాదుకొనండి.
సకల ప్రయత్నాలకూ ప్రారంభమూ, అంతమూ ఇదే.


17. 'ఇక చాలు' అన్న నిండుతనపు అనుభూతితో మనసు నిశ్శబ్దంగా ప్రశాంతంగా అవుతుంది.

18. వచ్చినదానిని వచ్చినట్టుగా 
జీవితాన్ని అనుభవించు.

19. అనుభవాలను పక్కకి తోసేయండి...
అనుభవించేవాడి మీద మీ ధ్యాస నిలపండి...

20. శరీరం పట్ల మీ వైఖరిని మార్చుకోండి. దాని పాటికి దాన్ని వదలండి. దాన్ని గారాభం చెయ్యకండి. అలా అని హింసించకండి. శరీరస్పృహ కలగకండా వ్యక్తి చేతన సరిహద్దుకి కిందగానే శరీరాన్ని దాని పని దాన్ని చేసుకోనివ్వండి- వీలైనంతవరకు.

21. లోకాన్ని చూడటమే దైవాన్ని చూసినట్లు.
ఈ ప్రపంచాన్ని చూడటం కన్నా ఇంక వేరేగా దైవాన్ని చూడటం అంటూ ఏమీలేదు.
లోకం లేకపోతే లోకేశ్వరుడూ ఉండడు.

22. కారణాన్వేషణ, మనసు ఆడుకునే కాలక్షేపక్రీడ మాత్రమే. 
కారణం, ఫలితం అన్న ద్వంద్వాలు  అసలు లేనే లేవు.
ప్రతి విషయమూ తనకు తానే కారణం.

23. చైతన్యంలోనే అంతా నడుస్తోంది.
చైతన్యంలో అన్నీ సాధ్యమే.

24. అత్యంత సులభంగా చేరుకోగలిగినది అదే నిజానికి.
ఎందుకంటే అదే నువ్వు కాబట్టి.
తలపులన్నీ మాని పరమసత్యం తప్ప మరేమీ అక్కర్లేదనుకుంటే చాలు.

25. జాగ్రత్ స్వప్న స్థితులలో 'వ్యక్తి'గా ఉంటావు.
గాఢనిద్ర, తురీయస్థితులలో 'వ్యక్త'గా ఉంటావు.

26. సకలమూ ఏకమే.
సమస్తమూ 'నేను'లోనే ఉంది.

27. సత్యం అనేది అతి సరళం.
అవాస్తవమే నిజానికి క్లిష్టమైనది.

28. నిజానికి మీకు ఏదీ విముక్తినివ్వలేదు.
ఎందుకంటే ఇప్పుడే, ఇప్పటికే, ప్రస్తుతక్షణంలోనే మీరు విముక్తులు. ఏ కోరికా లేని స్పష్టతతో మిమ్మల్ని మీరు చూసుకోండి అంతే. 

29. క్షణాల వరుసే కాలం.
ఏమీ లేని శూన్యం నుంచి ప్రతిక్షణమూ ప్రత్యక్షమై
మళ్లీ శూన్యంలోకే మాయమౌతుంది.

30. 'నేను ఉన్నాను' అన్నది మాత్రమే ఖచ్చితమైన సత్యం.
'నేను ఫలానా వాడిగా ఉన్నాను' అనేది మాత్రం కాదు.

31. అహమస్మి - నేను అన్న అమూర్తభావమే దైవం.

32. శుద్ధ పరబ్రహ్మంలో వ్యక్తుల ప్రసక్తి లేదు.
అత్యంత శుద్ధమైన ఆ ప్రజ్ఞానసాగరంలో పాపమూ లేదు, పుణ్యమూ లేదు.

33. మనిషిలో స్వాభావికంగా ఉన్న అంతఃప్రకృతే జ్ఞానం

34. పూర్ణం, శూన్యం అనేవి సాపేక్షపదాలు.
శుద్ధసత్యం, పరబ్రహ్మం అనేది వీటికి పూర్తిగా అతీతమైనది.

35. 'ఒక స్థితి నుండి వేరొక స్థితికి మారుతూ వెళ్లే
అన్వేషణాప్రక్రియలో చరమ అంకం - చివరి ఫలితమే - సత్యదర్శనం' అని భావించవద్దు.
సత్యం అనేది ఇంకొక స్థితి కాదు. 
సమస్త వైరుధ్యాలూ దాని లోపలే ఉన్నాయి.
కానీ అది ఈ వైరుధ్యక్రీడలో భాగం కాదు.

36. ఈ సంభాషణ జరుగుతున్నది మీ ప్రపంచంలో.
నా లోకంలో ఉండేది నిరంతర మౌనం. 

37. ప్రశ్న: దానివల్ల నాకు ప్రయోజనమేమి?
బీడీబాబా: నీకు ఒరిగేదేమీ ఉండదు.
నీకు చెందనిదాన్ని వదిలేస్తావు.
నీవ్వెన్నడూ కోల్పోనిదానిని కనుగొంటావు.
అదే నీ వాస్తవ సత్తా.

38. చిన్న అగ్గిపుల్ల ఒక మహారణ్యాన్ని తగలబెట్టగలిగినట్టు,
కోరిక ఎన్నో అభివ్యక్తాగ్నులతో ఒక విశ్వాన్నే సృష్టించగలదు.
సృష్టి వెనుక ఉన్న నేపథ్యం మాత్రం శూన్యాకాశం.
అది మాత్రం తటస్థంగానే ఉంటుంది. 
దాన్ని మీ ఇష్టం వచ్చినదానితో నింపవచ్చు.

39. ఒకరు: మీ పిల్లవాడికి జ్వరం వస్తే పట్టించుకుంటారా లేదా?

బీడీబాబా: పట్టించుకుంటాను. కానీ కలవరపడను.

40. చంద్రుని ప్రతిబింబం చలించేది సెలయేటి కదలికల వల్లే. ఇదీ అంతే. అంతా ఇంద్రియగోచరమే. నిజానికి అసలు ఏదీ సంభవించడం లేదు. 

41. స్మృతి ఒక మానసికస్థితి. 
విస్మృతి వేరొక మానసికస్థితి.
ఈ రెంటికీ అతీతమైనదే అసలు సత్యం.

42. 'నేనే' సకలాన్ని. 
నేనుగా సర్వమూ సత్యమే.
నా నుంచి విడిగా ఏదీ సత్యం కాదు.

43. మీలో మీరు అంతర్గతంగానూ, బాహ్యంగానూ సమగ్రతను పొంది, పరిపూర్ణులైనాక - లోకాన్ని ఆనందించడం తప్ప ఇంక చేసేదేముంది? మీకే ప్రయాసా ఉండదు. ఆ పూర్ణత్వమూ, అవిభాజ్యతా లేనివారికి మీరు బాగా కష్టపడిపోతున్నట్లు కన్పిస్తారు. కానీ అది వారి భ్రమ మాత్రమే. క్రీడాకారులు చాలా ఎక్కువగా కష్టపడుతున్నట్లు కన్పిస్తారు కానీ వారి ఏకైక లక్ష్యం ఆడి చూపించడమే.

44. దైవం అనేది సత్యమూ శివమే కాదు. సుందరం కూడా. 
సౌందర్యసృష్టి కేవలం దాని ఆనందం కోసమే.

45. జీవిస్తూ, భావిస్తూ, యోచిస్తూ, చురుకుగా, స్తబ్ధుగా, సుఖదుఃఖాలను అనుభవించే విడివ్యక్తిగా మిమ్మల్ని మీరు భావిస్తూ ఉంటారు. మీలో ఉన్న ఈ "వ్యక్తి" కేవలం ఒక అలవాటు మాత్రమే. ఇది జ్ఞాపకాల మీద ఆధారపడి నిర్మితమైందనీ, కోరికల వల్ల ఆడించబడుతోందన్న గుర్తింపు కలిగేదాకా 'ఈ విడివ్యక్తిగా ఉండే అలవాటు' తప్పదు.

46. ఇదంతా నిజమేనా? నేను ఎవరు? దీని వెనుక ఉన్నది, దీనికి అతీతంగా ఉన్నది ఏమిటి? అంటూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. తొందర్లోనే మీ తప్పు, దోషం మీక తెలుస్తుంది. ఊహించుకుంటున్నామన్న పొరపాటును గుర్తించిన వెంటనే ఆ ఊహ మాయమౌతుంది. గుర్తించబడిన వెంటనే మాయమవడం - అవిద్యాదోషం యొక్క తత్త్వం, లక్షణం. 

47. మనసుకు ఆవలగా అనుభవమనేదే లేదు.
అనుభవించడానికి ద్వంద్వ స్థితి ఉండవలసిందే.
సత్యాన్ని మీరు ఒక అనుభవంగా వర్ణించలేరు - చెప్పలేరు. ఇది గనక అర్థం చేసుకుంటే - ఏదో అస్తిత్వస్థితి పొందాలనిగానీ, 'ఉన్న'దానికి అన్యంగా అవ్వాలనిగానీ అనుకోవడం మానేస్తారు.

48. అతి సాధారణమైన వాస్తవ సత్తా నేను.
నాకు ఆసరాగా ఏమీ అక్కర్లేదు.

49. సత్యాన్ని మీరు అనుభవం స్థాయికి దించేస్తున్నారు. అనుభవాలన్నింటికీ ఆధారం సత్యమే.

50. ప్రతి అనుభవమూ చివరకు ఒక మానసికస్థితే.
కానీ వాస్తవసత్తా అనేది మానసిక స్థితి కాదు. 

51. కల కనేవాడు లేకుండా కల ఉండనట్టు,
'ఉండటం' లేకుండా 'తెలుసుకోవడం' అనేది లేదు.
నిజానికి స్వాప్నికుడే స్వప్నం. జ్ఞాతయే జ్ఞానం. భేదం కేవలం మాటల స్థాయిలోనే.

52. స్థలకాలాల ఉనికి మనసులోనే.

53. అవిద్య అనేది విశ్వంలో అది ఎప్పటికీ అంతం కాదు. ఎందుకంటే అసలు సృష్ట్యారంభపు కదలికకు మూలమే ఈ అవిద్య కాబట్టి.

54. ఈ మెలకువను కలగా చూడడమే మీరు చెయ్యాల్సింది. అంతే. ఇది చేస్తే ఇక చెయ్యవలసినదంతా చేసేసినట్లే.

55. 'ఈ మనశ్శరీరాలే నేను' అన్న భ్రమ పటాపంచలయితే, మరణం పట్ల భయం మాయమవుతుంది. జీవితంలో మరణం ఒక భాగమౌతుంది.

56. మిమ్మల్ని మీరు మార్చుకోగలిగితే, ఇంకే మార్పూ తేవాల్సిన అవసరం లేదని కనుగొంటారు. సినిమా బొమ్మని మార్చడానికి ఫిల్మ్  ని మారిస్తే చాలు. తెర మీద దాడి చేసి ఏం ప్రయోజనం?

57. అందరికీ ఉమ్మడిగా ఉన్న ప్రపంచమొకటి ఒకవేళ ఉన్నా మనం నిజంగా నివసించేది దానిలో కాదు. మానసిక ప్రపంచంలోనే మనం నివసిస్తున్నాం.

58. దైహికంగా బ్రతకడానికి మనకి కావల్సింది నిజానికి చాలా తక్కువ. మన సమస్యలు దైహికావసరాలకి సంబంధించినవి కావు. వాంఛలూ, భయాలూ, దోషపూరితమైన ఊహలూ - వీటికి పరిష్కారం కేవలం మానసిక స్థాయిలోనే దొరకాలి. మీ మనసుని వశం చేసుకోవాల్సిందే. దాని కోసం మనసుని మీరి వెళ్లాల్సిందే. 

59. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే, శరీరంపై అక్కర వదులుతుంది.
మనసు పరిపూర్ణ సవ్యత్వంతో సక్రమంగా ఉంటేనే, మనసును దాటి వెళ్లగలం.

60. సాగరంలో అలలు ఎలా ఐతే విడదీయలేని భాగాలో
విడిగా ఉనికిలో ఉన్నట్టు గోచరమవుతున్నవన్నీ వాస్తవాస్తిత్వమైన సత్యంలోని భాగాలే.

61. శరీరభావనతో ఏ సమస్యా లేదు. ఆ మాటకొస్తే 'ఈ దేహం నేను' అన్న భావనలో కూడా తప్పేమీ లేదు. కానీ 'నేను'ని ఈ ఒక్క శరీరానికే పరిమితం చేసుకోవడం మాత్రం తప్పే.

62. నేనేమిటి అనేది చెప్పగలిగి లేను. 
కానీ నేను ఉన్నాను.
నేనెవరు అన్న ప్రశ్నకు సమాధానం లేదు.

63. "ఇప్పుడు-ఇక్కడ-ఇలా ఉన్న నేను"ఇదే సత్యం.
ఈ యదార్థాన్ని ఒక ప్రశ్నగా మార్చకండి.

64. ప్రశ్న: అయితే ఏ ప్రయత్నం చేయనక్కర్లేదంటారా?

బీడీ బాబా: ప్రయత్నం అవసరమయినప్పుడు అదీ సంభవిస్తుంది. అలాగే ప్రయత్నరాహిత్యస్థితి కావల్సినప్పుడు, అదీ సహజంగా అమరుతుంది. కుదురుకుంటుంది. జీవితాన్ని మీరేమీ నెట్టనక్కర్లేదు. దాంతో పాటే ప్రవహిస్తూ ఉండండి. ప్రస్తుతక్షణం మీ మీద విధిస్తున్న దానికి మిమ్మల్ని మీరు పూర్తిగా అర్పించుకోండి. 

65. ప్రపంచమూ, శుద్ధసత్తా - రెండూ ఒకటేననీ, అవి పరిపూర్ణత్వంతో విలసిల్లుతున్నాయన్న ముఖ్యవిషయాన్ని గ్రహించండి. మారాల్సినదీ మీ వైఖరే, దృక్పథమే. మీ దృక్పథంలో, ధోరణిలో మార్పు తెచ్చుకునే ప్రక్రియే ఈ ఆధ్యాత్మిక సాధన అంతా.

66. ఈ చైతన్యంలో కొన్ని సంఘటనల వరుస యొక్క ఆద్యంతాలే జననమరణాలు కదా! వాటిని విడిగా తీసుకొని, పరిమితం చెయ్యడం వల్లనే అవి బాధా కారణాలవుతున్నాయి.

67. జననమరణాలకు లోబడిన ఈ శరీరానికి వెలుపలే మీ వాస్తవసత్తా ఉందని తెలిస్తే, మీ సమస్యలన్నీ పరిష్కారమౌతాయి. 'విడిగా ఉన్న ఒక వ్యక్తిని' అన్న విశ్వాసంతో మీ చుట్టూ మీరే అల్లుకున్న ఈ మోసంలో నుంచి బయటపడండి. మీరొక వ్యక్తి కాదు. జనించి మరణించబోయే వ్యక్తిగా మిమ్మల్ని మీరు అనుకోవడం వల్లనే మీకీ సమస్యలన్నీ.

68. మేలుకోండి - అతీతంగా వెళ్లండి - నిజంగా బ్రతకండి.

69. చెయ్యడానికీ, వదిలెయ్యడానికీ ఏమీలేదు.

70. ఇంద్రియాల వల్ల గ్రహిస్తున్నదంతా మీరు కాదు, మీది కాదు అన్న విషయం పట్ల ఎరుకగా ఉండండి. చాలు.

71. ప్రస్తుత క్షణంలో జరుగుతున్నదానిని చూస్తూ, 
మీరు దానికి అతీతులమని తెలుసుకోండి. 

72. అత్యున్నతమైన గురువు మీ అంతర్గత వాస్తవ సత్తాయే. అదే పరమగురువు.

73. సర్వాన్ని కదిలిస్తున్నదొకటి ఈ నడుస్తున్న దాని వెనక ఉందని గ్రహించి, అంతా దానికి వదిలెయ్యండి. నిస్సంకోచంగా, నిర్ద్వంద్వంగా, ఏ కాపట్యమూ లేకుండా ఇలా ఉండగలిగితే ఇదే సత్యానికి అతి దగ్గర దారి. అదుపు చేయాలన్న కోరిక, కర్తృత్వబాధ్యతా పూర్తిగా వదిలేసి ఎటువంటి వాంఛాభయాలూ లేకుండా నిలవండి. చాలు.

74. ఒకరు: ఇంత క్రూరమైన ప్రపంచపుదైవం కూడా మహాక్రూరుడే అయి ఉండాలి.

బీడీబాబా: మూర్ఖత్వంతో, క్రూరత్వంతో మీ ప్రపంచాన్ని నడిపిస్తున్న దైవం.

75. అయినా ఎందుకిలా ఊహలతో చెలగాటం? ఇప్పటికి మీకు నిశ్చయంగా తెలిసిన విషయంతో తృప్తి పడండి. ముందు. మీకు ఖాయంగా తెలిసిన విషయం 'నేను' అన్నదొక్కటే, దానితోనే నిలిచి ఉండండి. మిగతా దాన్నంతా తిరస్కరించండి. ఇదే యోగమంటే.

76. 'మీరు' ఈ మనసు కాదు.
మళ్లీ మళ్లీ పుట్టేది మనసే.
మీరు కాదు.

77. శరీరాన్ని మీరితే ఉన్నదంతా ఒక్కటే.

78. ఈ జగత్తు శరీరంగా కలిగినవాడే సృష్టికర్త.

79. 'సమస్తమూ' నిరంతరం సంభవిస్తూనే ఉంటుంది.
కానీ మీరు దానికి సిద్ధంగా ఉండాలి. ఇలా సిద్ధపడి తయారుగా ఉండడమే పక్వమవడం అంటే. మీ మనసు దానికి సిద్ధపడి లేదు. కనుకనే సత్యాన్ని చూడలేకపోతున్నారు. 

80. మీకు జ్ఞానం లేదని మీకు గట్టిగా తెలిస్తే ఇక మీరు జ్ఞానహీనులు కాదనే అర్థం.

81. సుఖదుఃఖాలు రెండూ ఆనందమే. 
పరమానందసాగరంలో ఎగిసి,విరిగిపడిపోయే అలలు ఈ సుఖదుఃఖాలు. అట్టడుగున సంపూర్ణత్వం నెలకొని ఉంది.

82. తల తిరుగుతున్నప్పుడు ప్రపంచం అంతా గిర్రున తిరుగుతున్నట్లుంటుంది. ఒక పని, దానికో ప్రయోజనం, దాని మార్గం, దాని లక్ష్యం - ఇలాంటి భావనా ధోరణులతోనే మీ మనసంతా నిండిపోయి ఉండటం వల్ల, నేనూ పని చేస్తున్నట్లే మీకు గోచరిస్తుంది. నిజానికి నేను సాక్షీమాత్రుణ్ణే.

83. సకలమూ ఏకమే.
సమస్తమూ సమానమే.

84. 'కారణరహితంగా ఉద్భవించడం' అనేది మనసుకు అందదు. మనకది అనూహ్యం. అంతమాత్రం చేతనే కార్యకారణ సంబంధం వాస్తవం అయిపోదు. 

85. సర్వాధారమూ, సకలానికీ మూలమూ అయిన ప్రధమ కారణం యొక్క ఆనవాలు ఎన్నటికీ దొరకదు. 

86. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు.
అపార్థం చేసుకోకుండా ఉంటే చాలు.

87. పరమసత్యమే సకలం, సమస్తం.
ఏదీ కానిదీ, దేనికీ చెందనిది కూడా.

88. లోకంగానీ, దాని యొక్క ఆలోచనగానీ లేని స్థితిని ఎరిగినవాడే పరమగురువు. మనం ఊహించుకుంటన్నదంతా సత్యం కాదన్న స్థితిని చేరడమే గురువును తెలుసుకోవడం అంటే.

89. మీ పనిని మీరు నిర్వర్తించండి. ఓ క్షణం విరామం దొరికినప్పుడు మీ లోపలికి చూసుకోండి. అంతర్ముఖులయ్యే అవకాశం మీ ముందుకొచ్చినప్పుడు, దాన్ని అందిపుచ్చుకోవడం అత్యంత ముఖ్యం. 

90. సమాచారం ఏమీ లిఖించబడని తెల్లకాగితం లాంటిదది. అలానే ఉండండి. ఏదో అవుదామని ప్రయత్నించకండి. ఏమీ కాకుండా అలా ఉండిపోవడంలోనే సంతోషాన్ని పొందండి.

91. ఒక రాకుమారుడు చిన్నప్పుడు జబ్బు పడితే, వైద్యుడు రక్షించాడనుకుందాం. పెద్దయ్యాక అతను రాజు కావడానికి కారణం కేవలం ఆ వైద్యుడే అనవచ్చా? దానికి సహకరించిన అనేక కారణాలలో బహుశా అదొకటి అయ్యివుండవచ్చు. ఇతరత్రా ఇంకా ఎన్నో దోహదం చేసి ఉండవచ్చు. కానీ అన్నింటికన్నా అత్యంత ముఖ్యమైనది రాకుమారుడిగా పుట్టడం. 
అలాగే గురువు మీకు సహాయం చేయవచ్చు. కానీ ముఖ్యంగా సహాయపడే ప్రధాన విషయం - లోలోపల పరమసత్యం కనుగొనాలన్న ధ్యాస ఉండటం. అత్యంత ముఖ్యం మీ స్వసత్తా. మీ చిత్తశుద్ధి, నిష్ఠ.

92. ఆహారంతో చెయ్యబడినదే శరీరం. మీరు తినే ఆహారపు స్థూల సూక్ష్మ ప్రకృతులను అనుసరించే ఉంటుంది నీ ఆరోగ్యం కూడా.

93. కావల్సిందల్లా మీ మనసు పట్ల సంపూర్ణమైన ఎరుకతో, పూర్తి సావధానతతో ఉండడం.

94. ఒకరు: ఇన్ని విభజనలను మనసు ఎందుకు సృజించుకుంటుంది?

బీడీబాబా: నిర్దిష్టభాగాలుగా చేసి విభజించడం మనసు యొక్క ప్రకృతి. దాని నైజమే అది. ఇలా విభజించి, విశ్లేషించుకోవడం వలన హాని ఏమీ లేదు. కానీ అంతమాత్రాన అవన్నీ నిజంగానే విడివిడిగా ఉన్నాయనుకోవడం సత్యం కాదు. వ్యక్తులలో, విషయాలలో భిన్నత్వం, వ్యత్యాసం ఉన్నాయి. కానీ వాటికి ఉన్నది ప్రత్యేకమైన, విడి అస్తిత్వం కాదు. ప్రకృతి, సత్యం ఒక్కటే. వ్యత్యయాలు ఉన్నాయి. కానీ అవి పరస్పర వ్యతిరేకాలు కావు. 

95. ఆ నేను కేంద్రం పై ధ్యాసను ఉంచి, దాన్ని మళ్లీ మళ్లీ తడమటమే ప్రధాన సాధన.

96. మంచో చెడో ఏది జరిగినా పర్వాలేదు. జరగనివ్వండి. కానీ జరుగతున్నదానిలో మీరు మునిగిపోకుండా మాత్రం చూసుకోండి. 

97. ఎరుకతో కూడి, ఏ మార్పూ చెందని ఒక నేపథ్యం తన వెనక ఉందన్న విషయం, ఈ చలించే మనసుకు తప్పనిసరిగా అర్థం కావాలి. 

98. ఒకరు: మీరీ స్థితికి ఎలా చేరుకున్నారో అడగవచ్చా?

బీడీబాబా: నాలోని అచ్చమైన 'నేను' అన్న భావనపై గట్టిగా వదలకుండా ధ్యాస పెట్టమని, ఒక్క క్షణం కూడా దాన్నించి మరలవద్దనీ నా గురువు చెప్పారు. నాకున్న శక్తి మేరకు పూర్తిగా దానిని పాటించాను. అనతికాలంలోనే ఆయన బోధలోని వాస్తవాన్ని నాలో నేనే సాక్షాత్కరించుకోగలిగాను. 

99. ప్రశ్నను వింటాను కదా.
అలానే సమాధానమూ వినబడుతుంది.

100. ఏం చెయ్యాలి? ఏ జీవనమార్గాన్ని అనుసరించాలి? ఏ సాధనలు పాటించాలి? అని వాళ్లడిగితే - "ఏమీ చెయ్యకండి - ఊరికే ఉండిపొండి - సకలమూ స్వస్వరూప సత్వంలోనే సహజంగా సంభవిస్తుంది. అనేదే జవాబు.

101. మీరేమీ మనసును బాగు చెయ్యనక్కర్లేదు. దానంతట అదే బాగవుతుంది. గతమూ, భవిష్యత్తుల గురించిన  చింతలన్నింటినీ వదిలిపెట్టి వర్తమానంలో, ప్రస్తుతంలో జీవించండి చాలు. 

102. పరిశుద్ధ నిర్మల చైతన్యంలో ఎప్పుడూ ఏదీ సంభవించదు. 
'పరమసత్యం'లో నిజానికి ఏదీ జరుగదు.

103. ఒక వీధిలో వచ్చిపోయే జనాల్ని చూస్తున్నట్లు, మీ ఆలోచనలను కూడా చూడండి. ఏ స్పందనా లేకుండా ఊరికే అలా చూస్తూ ఉండండి.

104. అనాసక్తియే మీకు విముక్తినిస్తుంది.

105. నిజానికి 'శరీరం' అంటూ విడిగా ఏమీలేదు. 
అది ఒక మానసిక స్థితే.

106. 'మీరు ఏది అవునో' దానిని ప్రకటించలేరు.
'మీరు ఏది కాదో' అదే మీరుగా ప్రకటించుకుంటారు.

107. వ్యక్తి కొనసాగడమంటే, 
స్వప్నం కొనసాగడమే.

108. చర్య అవసరమైనప్పుడు అది జరిగిపోతుంది. మనిషి దానికి కర్త కాడు. నడుస్తున్నదానిని గమనించే ఎరుకతో ఉండడమే మనిషి పని. 

109. ఒకరు: ప్రస్తుత క్షణంలో మీ స్థితి ఏమిటి?
బీడీబాబా:విడిగా ఏ అనుభవమూ లేని స్థితి.

110. ఒకరు: అయితే మీరు ఇంకొకరి మనసులోకి ప్రవేశించి వారి అనుభవాన్ని పంచుకోగలరా?

బీడీబాబా: అహ. లేదు. అలాంటివి చెయ్యాలంటే ప్రత్యేక శిక్షణ కావాలి. 'ప్రాధమికమైన ముడిదినుసు' గురించి మాత్రమే నేను మాట్లాడుతాను. రకరకాల వంటకాలు, ఆధరువుల గురించి నాకు తెలియదు. ఆ ముడి దినుసుతో చేసే అత్యంత సులువైన పానీయపు రుచి కూడా నేనెరగకపోవచ్చును. అయితే ఆ మూల పదార్థం గురించి నాకు బాగా, పూర్తిగా తెలుసు. అన్ని అనుభవాల మూలమూ నాకు తెలుసును.

111. వాంఛారాహిత్యం తోనే కాలరహిత స్థితీ ఉంటుంది.

112. ఒకరు: మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు?

బీడీబాబా: అతడేమని అవుతానని నమ్ముతూ ఉంటాడో అదే అవుతాడు. దాని ప్రకారమే జరుగుతుంది అంతా. మరణించడానికి ముందు అతని జీవితం ఎలా ఊహగా నడిచిందో, అలాగే మృత్యువు తర్వాత కూడా ఆ కలే కొనసాగుతుంది. 

113. అన్ని అలలూ సముద్రంలోనే ఉన్నట్టు
భౌతిక, మానసిక విషయాలన్నీ ఎరుకలోనే ఉన్నాయి. 

114. జరుగుతున్నదాని గురించిన ఎరుక ఉంటుంది. కానీ ఎక్కడో సుదూర తీరాలలో ఇవన్నీ సంభవిస్తున్నట్లు ఉంటుంది. ఈ శరీరానికి, మనసుకీ జరుగుతున్నవన్నీ ఎక్కడో దిగంతాలలో, దిఙ్మండలంలోని సంఘటనల్లా ఉంటాయి. నాకు నేనే ఒక సినిమా తెరని అని అనిపిస్తూ ఉంటుంది. 

115. అనివార్యమైన దానితో జ్ఞానికి వైరం లేదు. స్నేహమే.
అందుకని అతనికి దుఃఖం ఉండదు.

116. ప్రపంచంతో ఏ సమస్యా లేదు. మనం దానివంక చూసే వైఖరితోనే సమస్య అంతా. మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నది మీ ఊహాపోహలే. మీ ఊహల్లో తప్ప ప్రపంచం అనేది లేదు.

117. 'నేను స్వస్వరూప సాక్షాత్కారం పొందాను' అన్న ఆలోచనే పొరపాటు. సహజ, నిసర్గ స్థితిలో 'నేను ఫలానా అయ్యాను', 'నేను అలాగ, ఇలాగ' అనుకోవడమే ఉండదు. 

118. 'నేను ఫలానావాడిని' అంటున్న వ్యక్తికి,
అలా అంటున్న వ్యక్తిని గమనిస్తున్న పరిశీలకుడికీ
మధ్య ఉన్న ప్రేమయే భక్తి.

119. బుద్ధుడు, క్రీస్తు, జిడ్డుకృష్ణమూర్తి - వీరందరూ మీలోని 'వ్యక్తి'ని ఉద్దేశించి మాట్లాడుతున్నారని అనుకుంటే అది పొరపాటే. బాహ్యంగా కనబడే ఈ వ్యక్తి  - నిజానికి అంతస్సులో లోలోపల ఉన్న వ్యక్త యొక్క ఛాయే అని వారికి తెలుసు. వాళ్లు బుద్ధి చెప్పి మందలిస్తున్నదీ, మాట్లాడుతున్నదీ 'వ్యక్త'తోనే. 
బాహ్యంగా ఉన్న వ్యక్తి పట్ల కొంత శ్రద్ధ చూపి , బాధ్యత తీసుకొని కొంచెం దారి చూపి సహాయం చెయ్యమనీ, దానిపట్ల పూర్తి ఎరుకతో ఉండమనీ వాళ్లు అంతఃసాక్షికి చెబుతున్నారు. అసలు ఈ 'ఎరుక' అంతరంగంలోకి వచ్చేది, వ్యాపించేది పరమసత్యం నుంచే. మనం మన శ్రద్ధనూ, ఎరుకనీ సరిగా ఇవ్వని మన అస్తిత్వపు భాగమే - బాహ్యంగా కనబడే 'స్వ'.

120. 'నేను బద్ధుడిని' అనేది ఏంత అసత్యమో,
'నేను విముక్తుడిని' అన్నది కూడా అంతే అసత్యం. ఈ రెంటిలో ఉమ్మడిగా ఉన్న 'నేను'ను కనిపెట్టి, దానికి అతీతంగా వెళ్లండి. 

121. ఉన్నది జీవితమే; జీవమే. 
దాన్ని జీవించేవ్యక్తి అంటూ విడిగా ఎవరూ లేరు. 

122. 'స్వ' అన్న విడి వ్యక్తిభావన మీకు జన్మతః వచ్చింది కాదు. ఇది లేకుండా కూడా మీరు బాగానే జీవితం గడపవచ్చు. మీ దేహాత్మబుద్ధి వల్లనే ఈ 'స్వ' ఏర్పడింది. అవిభాజ్యమైనదానిలో విభజన ఉందన్న భ్రమను కల్పించింది. మీ ప్రపంచంలోనే మిమ్మల్నొక అపరిచితుడిగా చేసి ప్రపంచాన్ని పరాయిదిగా, శత్రువుగా చేసింది.

123. నాకు అందరూ ఒకటే. బాహ్యస్వరూపాలలో, వైఖరులలో తేడాలుండవచ్చుగానీ, నాకు వాటి పట్టింపు లేదు. ఆభరణపు ఆకార ప్రభావం బంగారం మీద ఉండనట్లే, బాహ్యమైనదేదీ మనిషి లోపలి స్వస్వరూపపు అంతస్సారాన్ని ప్రభావితం చెయ్యలేదు. ఈ ఆత్మ సమానత్వ భావన లోపించిందంటే, సత్యాన్ని స్పృశించనట్లే.

124. కర్త, కర్మ రెండూ మీలోనివే. 

125. అసత్యాన్ని అసత్యంగా చూసి నిరాకరించడమే
సత్యం యొక్క అభివ్యక్తీకరణ. అంతే.

126. ప్రపంచం గురించే కాదు, 
మీ గురించిన ఆలోచనని కూడా వదిలిపెట్టేయండి.
అన్ని ఆలోచనలకూ అతీతంగా ఉండిపొండి, 
కేవలం నిశ్శబ్ధమైన మీ సహజ ఉనికి ఎరుకలో.
ఇది ఆధ్యాత్మిక ప్రగతి కాదు.
యెందుకంటే మీరు చేరుకున్న తావు ఇప్పటికే మీలో ఉంది.
మీ కోసం వేచి చూస్తూ.

127. మంచిచెడ్డలు, ఒకదానినొకటి సమవ్యాప్తంగా అనుసరిస్తూ ఉండటమనేది అసలు సృష్టి అభివ్యక్తీకరణలోనే ఉన్న సహజప్రకృతి. 

128. జిజ్ఞాసి: ఇప్పుడు నేనేం చెయ్యాలి?
బీడీబాబా: దేహమూ, మనసూ కూడా మీరు కాదన్న విషయాన్ని గుర్తించి, అలానే ఉండిపొండి. అంతే.

129. నిత్యస్ఫురణలో సోపానాలు లేవు. అది క్రమంగా జరిగేది కాదు. అది హఠాత్సంభవమూ, అనుత్క్రమణీయమూ(irreversible).
అంటే దానికి ముందున్న స్థితికి మళ్లీ తిరిగి వెళ్లే వీలులేనిదన్నమాట. అదొక నవీన తలం, క్షేత్రం. 
అక్కణ్ణుంచి చూస్తే మిగిలిన తలాలన్నీ వొట్టి ఊహాకల్పనలుగా, విక్షేపాలుగా, వికల్పాలుగా తెలుస్తాయి.

క్రమాభివృద్ధి, ప్రగతి ఉండేది సాధనలోనే. విడుదల, విముక్తి అనేవి హఠాత్సంభవాలే. అకస్మాత్తుగా జరిగేవి. పక్వమవడం క్రమంగా జరిగినా, సడలి రాలిపోవడం, తటాలున జరిగేదే - మళ్లీ కాయగా మారి వెనక్కి పోలేకుండా. 

130. మీకై మీకు తెలిసేది మీ అపరిపూర్ణత్వం.
మీ పరిపూర్ణత్వాన్ని మీరు ఎన్నటికీ తెలుసుకోలేరు.
తెలుసుకోవడానికి భిన్నత్వం ఉండాలి.
మీరు 'ఏది కాదో' తెలుసుకోగలరు.
'ఏమి అవునో' దానిగా ఉండగలరు.

131. విభజించే ఈ కుడ్యాన్ని పగలకొట్టండి.
'నేను దేహాన్ని' అన్న భావన పోతే
అంతర్గతమూ, బాహ్యమూ అనేవి ఏకమౌతాయి.

132. రెండే మార్గాలు-
1. నిస్స్వభావంగా గుర్వాజ్ఞ పాటించడం.
2. స్వీయవిచారణకు పూర్తిగా అంకితమైపోవడం.

133. ఈ కలలో చిక్కుకుని మీ నిజమైన సత్తాను మీరు మర్చిపోయారు. లేని ప్రపంచం మీద జాలి చూపకండి. మీలో ఉన్న అహంత మీదా, స్వీయం మీదా జాలి చూపండి.

134. సత్యాన్ని చూడటమనే స్థితే లేదు. 
చూచేవారెవరు? చూడవలసినదేమిటి?
'సత్యంగా' ఉండగలరు. అంతే. 
ఎటుతిరిగీ ఆ మాటకొస్తే, మీరు ఇప్పటికే 'సత్యం'గా ఉన్నారు కూడా. 
ఈ సమస్య కేవలం మానసికమే. అసత్యమైన అన్ని ఆలోచనలనూ, భావనలనూ వదిలిపెట్టండి. అంతేచాలు. 

135. మనసు ఎప్పుడూ ఒక లక్ష్యాన్ని, ఆ లక్ష్యసిద్ధి వల్ల కలిగే ప్రయోజనాన్ని ఆశిస్తూ ఉంటుంది. అసత్యాన్నించి విడివడమని ప్రోత్సహించడం కోసం, మనసుకి ఒక లక్ష్యాన్ని కల్పించి, ప్రయోజనం చేకూరుతుందని హామీ ఇస్తారు. నిజానికి అలాంటి లక్ష్యాలూ, ప్రయోజనాల అవసరమే లేదు. అసత్యం నుంచి విముక్తి చెందడమే పరమ హితకరం. ఇక వేరేగా ఏ ప్రయోజనమూ, బహుమతీ దీకికి అక్కర్లేదు. పరిశుభ్రంగా ఉండడం లాంటిదిది - దానికదే ఒక బహుమతి. 

136. ఈ ప్రపంచం మీ సృష్టే అని తెలుసుకొని విముక్తి పొందండి. 

137. సత్యమైన వాస్తవసత్తాగా మిమ్మల్ని మీరు స్ఫురింపజేసుకుంటే ప్రపంచమే మీరని తెలుస్తుంది. 

138. మీరు దూరంగా ఒదిగి ఒక సాక్షిగా ఉంటే
మీకు దుఃఖం ఉండదు.
ప్రపంచాన్ని ఒక ఆటగా చూస్తారు.

139. మీరెప్పుడూ జన్మించలేదూ, మరణించబోరూ.
జనించి మరణిస్తున్నది ఒక ఊహ; ఆలోచన మాత్రమే.
మీరు కాదు.

140. తెరపై కనిపిస్తున్న సినిమా అంతా కాంతి తప్ప మరేమీ కాదు.
చైతన్యమే ఈ విస్తార విశాల ప్రపంచంగా రూపొందింది.

141. ఒకరు: చర్య, క్రియ అనేవి ఆత్మసాక్షాత్కారానికి అవసరమా?

బీడీబాబా: విముక్తికి అవసరమైనది అవగాహనే.

142. ప్రశ్న: పదార్థం అంటే?
బీడీబాబా: మీకు అవగాహన కానిదంతా పదార్థమే.

143. ప్రతి అనుభవంలోనూ కాలరహితమైన అంశాన్ని కనుగొనడమే మోక్షం.

144. ప్రకృతిని కేవలం చైతన్యంగా చూడగలగడమే ఎరుక.

145. ఒకరు: పరిపూర్ణతని చేరుకోవడమెలా?
బీడీబాబా: చెయ్యవలసిన పనులు చేసుకుంటూనే, లోపల మాత్రం మౌనంగా ఉండండి. ఇక సకలమూ మీ దగ్గరకు వస్తుంది. 

146. ఒకరు: ఇప్పుడు మీరు నివసించేది ఏ ప్రపంచంలో?
బీడీబాబా: ఉనికి-లేమి కి అతీతమైన శూన్యంలో.

147. కూడబెట్టుకున్న పరిజ్ఞానమంతా అవిద్యేననీ, నిజానికి మనకేమీ తెలియదనీ తెలుసుకోవడమే జ్ఞానం.

148. పరమసత్యం స్థిరమైనదీ, నిరంతర ప్రవాహశీలత గలది కూడా. అది నిండుగా ప్రవహించే నది లాంటిది. నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ నిత్యమూ, స్థిరమూ అయ్యే ఉంటుంది. నదీగర్భమూ, నదీ తీరాలూ ప్రవహించవు. పారేది నీరే.

149. అసలు పరమసత్యం ఏమంటే- ఏదీ సంభవించడమే లేదు.

150. విషయాసక్తులపై పట్టు వదలడం
అన్నిటి నుంచీ విడివడి దూరంగా ఒదిగి నిలబడడం
ఇవే మానసికంగా మరణించడానికి మార్గాలు.

151. కడలిలోని ప్రతి అలా దానిలోకే లయించినట్లు, ప్రతిక్షణమూ దాని ఆధారమూలం లోనికే తిరిగి వెళుతుంది. విముక్తి అంటే ఆ ఆధారమూలాన్ని కనుగొని అక్కడే పాదుకొనడం.

152. "ఏమీలేదు" - అనేదే అంతిమ సమాధానం.

153. కొనసాగుతున్నట్లు కనబడే ఈ నామరూపాలన్నీ
మానసిక రచనలే! మనఃకల్పనలే!

154. చిత్రకారుడు చిత్రంలోనే ఉన్నాడు. 
మీరు అతణ్ణి చిత్రం నుంచి వేరేగా ఊహించుకుని 
విడిగా ఎక్కడో చూస్తారు.
విషయాలన్నీ వాటికవే ఉన్నై. 
ఏ నిర్దిష్ట వ్యక్తికీ బాధ్యత లేదు.

155. సినిమా అయిపోయి అంతా లేచిపోయాక,
ప్రదర్శనకు ముందున్న స్థితే కదా మిగిలేది!
మరణించిన తర్వాత ఉండే స్థితి ఏమంటే-
మీరు జన్మించక ముందు ఉన్న స్థితే!!

156. ఒకరు: ఈ జీవితపు పరమార్థం, లక్ష్యం, ప్రయోజనం ఏమిటి?

బీడీబాబా: ఆభరణంగా మార్చినందువల్ల బంగారానికి ఏం లాభం అని అడిగినట్లుంది.

ఒకరు: ఈ అభివ్యక్తి వల్ల సత్యానికి ప్రయోజనం ఏమిటి?

బీడీబాబా: ఏముంటుంది? ఏమీ ఉండదు! ఏమీ లేదు!!

156. విడదీయరానిదానిని విడదీసి చూడకూడదు.

157. భూభాగపటం కూడా కాగితమే.
పరిజ్ఞానం అంతా  జ్ఞాపకమే.

158. ఇప్పటికే మీలో ఉన్నదానిని ఇక మళ్లీ అందుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని అందుకోవాలని బాహ్యానికి చేయి చాచడం వల్లనే మీరు దాన్ని తప్పిపోతున్నారు.

159. మిమ్మల్ని మీరు "నిజంగా" తెలుసుకోగలిగితే
అసలు ఇతరులనే వారెవరూ లేకుండా పోయి, అందరూ "మీరే" అవుతారు. 

160. మీరు సరిగా ఉంటే, సరియైన గురువే మిమ్మల్ని ఎంచుకుంటాడు. తనే మిమ్మల్ని కనుగొంటాడు.

161. రూపసహిత గురువు గమ్యం కాదు.
గమ్యానికి చేర్చే సాధనం మాత్రమే.

162. ఒకరు: శ్రీబాబాజీ గురువు మీద మీ అభిప్రాయమేమి?

బీడీబాబా: ఏం ప్రశ్న ఇది? పూనాలోని స్థలాకాశం మీద మీ అభిప్రాయం ఏమిటని బొంబాయిలోని స్థలాకాశాన్ని అడిగినట్లుంది. 

163. విముక్తి పొందడం కర్తవ్యం కాదు.
ఇలా విడిగా ఉన్న కర్త మాయమైపోవడమే విముక్తి.

164. ఒకరు: నేను ఒక వ్యక్తిని కాకపోతే మరెవరిని?
బీడీబాబా: గుడ్డ తడిసినప్పుడు, దాని వాసన, స్పర్శ, రూపం మారుతాయి. తడి ఆరిపోయిన వెంటనే తన నిజస్థితికి వస్తుంది. మునుపు తడిసి ఉందన్న ఆనవాలు ఉంటుందా? పైకి కనిపిస్తున్నదానికీ, మీ నిజప్రకృతికీ పోలిక లేదు.

165. ఏ తలుపును మూసి మిమ్మల్ని బంధించారో
దాన్ని తెరుచుకునే బయటకు వెళ్లాలి మీరు. 
'నేనున్నాను' అనేదే ఆ తలుపు.
అది తెరుచుకునేదాకా దాని దగ్గరే, దానితోనే ఉండండి. ఆ మాటకొస్తే, అది తెరచే ఉంది నిజానికి. నిజమైన ఆ ద్వారాన్ని గుర్తించలేక, వేరే విషయద్వారాలు తెరుచుకుంటాయేమోనని వేచి చూస్తున్నారు. అది ఎన్నటికీ జరుగదు. 'నేను' తలపు తలుపు మీదే నిజమైన దృష్టినీ, శ్రద్ధనూ పెట్టి దానినే ఆశ్రయించాలి.  మీరలా చేయడం లేదు.

166. ఒకరు: ఆత్మసాక్షాత్కారపు అనుభవాన్ని కొద్దిగా మాకు రుచి చూపించగలరా?

బీడీబాబా: కొద్దిగా ఏం? మొత్తమే తీసుకోండి. కోరినవారికి అది ఇక్కడే సిద్ధంగా ఉంది. కానీ మీరు కోరరు. అడగరు. అడిగినా తీసుకోరు. తీసుకోకుండా అడ్డుపడుతున్నది ఏమిటో కనిపెట్టండి. 

ఒకరు: నా అహమే...

బీడీబాబా: సరే అయితే, మరి ఇక మీ అహంతోనే జీవించండి. నన్ను వదిలెయ్యండి.

167. జీవితపు నాటకరంగ ప్రదర్శనలాగా చూడండి. ఆ ప్రదర్శన అద్భుతంగానో, పేలవంగానో ఉండవచ్చు. కానీ మీరు దానిలో భాగం కాదు. ఊరికే చూడండి అంతే. చూసేటప్పుడు సహజంగానే దీనిపట్ల ఆసక్తితో, సానుభూతితో ఈ నాటకాన్ని చూస్తారు. కానీ మీరు కేవలం ప్రేక్షకుడే అన్న మాటను గుర్తుంచుకోండి. ఈ జీవిత నాటకం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది.

168. విముక్తి ఇప్పుడే ఇక్కడే అందుబాటులోనే ఉంది.
దానిని అడ్డుకుంటున్నది మీ విషయాసక్తులే.

169. విషయ పరిజ్ఞానంలో ఆసక్తి సంపూర్ణంగా కోల్పోయినప్పుడు సర్వజ్ఞత్వం సిద్ధిస్తుంది. 
సరియైన చర్యని, సరియైన సమయంలో దోషరహితంగా చేయడానికి ఏది అవసరమో అది తెలుసుకునే ప్రజ్ఞే సర్వజ్ఞత్వం. 

170. సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దు. 
ఎందుకంటే మనసుతో తెలుసుకునే ఏ పరిజ్ఞానమైనా నిజమైనది కాదు. అయితే ఏది సత్యం కాదో దాన్ని తెలుసుకోవచ్చు. అసత్యం నుండి మిమ్మల్ని విముక్తి చెందించడానికి అది చాలు. 

171. ఏ పరిశోధనా, విచారణా చెయ్యకుండా విముక్తి కలుగదు. విచారణ చెయ్యకపోవడమే బంధపాశాలకు ప్రధాన కారణం.

172. నా గురువు యొక్క పవిత్ర సన్నిధిలోనే అంతా లభించింది. నాకై నేను పెద్దగా ఏమీ చెయ్యలేదు. మౌనంగా ఉండిపొమ్మని ఆయన నాకు చెప్పారు. నాకు సాధ్యమైనంత వరకూ దాన్ని పాటించాను.

173. ఒకరు: ఆధ్యాత్మిక గురువు చేసే పని కన్నా అత్యుత్తమమైనది వేరే లేదనుకుంటాను. 

బీడీబాబా: చేస్తున్నట్టుగా బయటికి గోచరించే దానికన్నా, అంతర్గత నేపథ్యంలో ఉన్న అభిమతమే ప్రధానం.

174. మౌనం గురించిన సంభాషణంతా ఒట్టి చప్పుడే.

175. గాఢనిద్రలో ఉన్న శూన్యస్థితిని మెలకువగా ఉండగానే తెచ్చుకొని చూడండి. అది మీ నిజస్థితితో చక్కగా సమరసంగా అమరుతుంది. 

176. అడగకుండా, కోరకుండా అనుక్షణమూ మీకు తటస్థిస్తున్నదంతా దైవం నుంచి వస్తున్నదే.

177. ఒకరు: శరణాగతి అంటే?
బీడీబాబా: వచ్చినదానినంతా అంగీకరించడం.

178. ఒకరు: ఈ విశ్వానికి నేను సృష్టికర్తనో లేక దానికి లోబడి ఉండే తోలుబొమ్మనో అర్థం కావడం లేదు.

బీడీబాబా: 'నేను' అనేది నిత్యసత్యం. అయితే నేను సృజింపబడ్డాను అనేది మాత్రం ఒక భావనే. నిన్ను సృజించింది మేమే అంటూ దైవమో, విశ్వమో వచ్చి మీకు చెప్పలేదు కదా! ప్రతిదానికీ కారణమొకటి ఉండాలన్న ప్రభలమైన భావన మీ మనసులో పాతుకుపోయింది. అందువల్ల మీ మనసు 'సృష్టి' అనే భావనని తనకి తాను కల్పించుకొని తర్వాత ఈ సృష్టికి కర్త ఎవరు? అని ప్రశ్నించడం ఆరంభిస్తుంది. మనసే దీనికంతా సృష్టికర్త. నిజానికి ఈ మాట కూడా పూర్తి సత్యం కాదు. దీన్నంతా సృష్టించుకున్న మనసూ, దానిచేత సృజింపబడిన ప్రపంచమూ వేరు వేరు కాదు. ఈ రెండూ ఒకటే. ప్రపంచం అని మీరు అనుకుంటున్నదంతా నిజానికి మీ మనసు తప్ప వేరు కాదు అన్న విషయాన్ని అర్థం చేసుకోండి.

179. ఒకరు: పాపకర్మ పట్ల మీ వైఖరి ఏమిటి?
బీడీబాబా: నాకు పాపము, పాపి అనేవి తెలియవు.
అవి నాకు లేవు. ప్రతివారూ తమ ప్రవృత్తి అనుసరించే నడచుకుంటారు. దానికి ఎవరూ ఏమీ చేయలేరు. దీనిలో విచారింపవలసినది ఏమీలేదు. 

180. ఒకరు: పాపకర్మలలో మునిగిపోయినవారి పట్ల కనీసం కరుణ, దయ చూపిస్తారు కదా!
బీడీబాబా: అవును. ఆ మనిషిని నేనే అని, అతని పాపాలు నావేనన్న అనుభూతికి లోనవుతాను.

181. తన మనసు లోతులలోకి క్రమబద్ధంగా, గాఢంగా చేసే పరిశోధనే ఆధ్యాత్మిక సాధన.

182. పుణ్యాత్ములూ, పాపాత్ములూ నాకు కనబడరు.
నాకు కనబడేదల్లా ప్రాణులే. జీవాస్తిత్వాలే. 

183. మనశ్శరీరాలతో మీరు మమేకం అయినంత కాలమూ దుఃఖం తప్పదు.

184. ఒకరు: ఈ స్వప్నం ఎప్పుడు మొదలయింది?
బీడీబాబా: ఈ స్వప్నానికి ఆరంభం లేదు అన్నట్టుగా తోస్తుంది. అలా కనిపిస్తుంది. కానీ నిజానికి, ఆ స్వప్నం ఈ క్షణంలోదే, ప్రస్తుతమే. అయితే క్షణక్షణమూ మీరు దాన్ని పునరుజ్జీవింపజేసుకుంటున్నారు. కలగంటున్నానని ఒక్కసారి చూడగలిగితే, మీరు మేల్కొంటారు. కానీ మీరు చూడరు. ఎందుకంటే ఈ కల కొనసాగాలని కోరుకుంటున్నారు కాబట్టి. ఈ కల ముగియాలని మీ మనస్సుతో హృదయంతో తపన పడుతూ, దానికోసం ఎంత మూల్యాన్నైనా చెల్లించడానికి సిద్ధపడే రోజు ఒకటి వస్తుంది. 
నిర్మోహం, వైరాగ్యం, భావోద్వేగరహిత సమబుద్ధీ - మేల్కొనడానికి చెల్లించబోయే మూల్యాలు ఇవే.

185. నిత్యమూ మారుతున్న మనసుని గమనిస్తూ ఉండే పరిణామ రహితమైన సాక్షిగా మిమ్మల్ని మీరు గుర్తెరగండి. అంతేచాలు.

185. ప్రస్తుత జీవనవిధానంలో మీకు ఆసక్తి ఉన్నంతకాలమూ మీరు దాన్ని వదిలిపెట్టరు. తెలిసినదానినీ, పరిచయం అయినదానినీ పట్టుకొని వేళ్లాడుతున్నంతకాలమూ నూతనావిష్కరణ అనేది జరగదు. జీవితపు విస్తారమైన దుఃఖాన్ని మీరు గుర్తించి దానికి ఎదురు తిరిగితే తప్ప 'తెలిసిన దానినుంచి' బయటపడే మార్గం దొరకదు.

186. నేనే ప్రపంచాన్ని, ప్రపంచమే నేను
అన్న భావన జ్ఞానికి అతి సహజమైపోతుంది.
ఒకసారి ఇది సుస్థాపితమయ్యాక, ఇక స్వార్థపరాయణత్వం అనే ప్రశ్నే రాదు. స్వార్థపరాయణత్వం అంటే అఖండానికి విరుద్ధంగా విడిగా ఒక శకలం తరపున కోరుతూ, ఆర్జించుకుంటూ కూడబెట్టుకోవడమే.

187. మనశ్శరీరాల గురించిన స్పృహ కలిగి ఉంటూనే ఈ రెండింటిలోనూ మీరు లేరన్న విషయం తెలుసుకోవడమే స్వీయజ్ఞానం.

188. 'ఉనికిలో ఉన్నదేదీ నేను కాదు' అనేది మొదటి మెట్టు.
'ఉనికి అంతా నేనే' అనేది తరువాతి మెట్టు.

189. ఒకరు: పాపం అంటే?
బీడీబాబా: ఏది మిమ్మల్ని బద్ధుల్ని చేస్తుందో అదే.

190. 'నేను' అన్న అచ్చమైన శుద్ధమైన ఎరుకతో ఉండిపోండి.

"సరే. నిజమే. నేను ఉన్నాను. మరిప్పుడిక తర్వాత ఏమిటి?" అని అడగొద్దు. 'నేను' అనే శుద్ధమైన ఎరుకలో 'తర్వాత' అనేది లేదు. కాలరహితమైనస్థితి అది.

* * *

No comments:

Post a Comment