*✍️ నేటి కథ ✍🏻*
*ఆదర్శబాలుడు - వికాస్*
ఒక ఊళ్లో వికాస్ అనే అబ్బాయి ఉన్నాడు. అతని వయస్సు ఎనిమిది
సంవత్సరాలు. తమ గ్రామంలోని ప్రాథమిక
పాఠశాలలో ఐదవ తరగతి మంచి మార్కులతో
పాసయ్యాడు. వారి గ్రామంలో ఉన్నత పాఠశాల
లేదు. వాళ్ళ నాన్న రామారావు అతడిని
పట్టణంలోని ఉన్నత పాఠశాలలో చేర్చాలను
కున్నాడు.వేసవి సెలవుల తరువాత పాఠశాలలు
తెరిచారు. వికాస్ ను విద్యారణ్య ఉన్నత
పాఠశాలలో చేర్చాలని తండ్రి రామారావు
నిశ్చయించుకున్నాడు. ఆ పాఠశాల చాలా పేరు
పొందినది. పట్నానికి బస్సులో బయలు
దేరారు. పోను పోను ప్రయాణికుల రద్దీ
ఎక్కువైంది. చాలా మంది నిలబడే ఉన్నారు.
నిలబడిన వారిలో ఒక యాభై ఏళ్ళ ఆవిడ బస్సులో ఉసూరంటూ మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ
నిలబడటానికి చాలా ఇబ్బంది పడుతోంది.
వికాస్ ఆమెను చూశాడు. వెంటనే లేచి నిలబడి ఆమెని పిలిచి “ఇక్కడకు వచ్చి కూర్చోండి" అన్నాడు. ఆమె తటపటాయించింది.
“పర్వాలేదు బాబూ, నువ్వు కూర్చో,నువ్వూ చిన్న పిల్లవాడివే కదా” అంది ఆవిడ.వికాస్ “లేదండీ, నిలబడి ప్రయాణించడం
నాకేమీ కష్టం కాదు.” అని గట్టిగా అన్నాడు.ఆమె వచ్చి కూర్చుంది.వికాస్ వాళ్ళు దిగి, విద్యారణ్య
పాఠశాల వైపు నడిచారు.
వికాస్ వాళ్ళు ఆ పాఠశాలకి చేరుకుని,
స్కూలు ఆఫీస్కు వెళ్ళారు. అక్కడ ఆఫీసులో గుమస్తాని సీటు అడగగా “ఆరవ తరగతిలో
అడ్మిషన్లు పూర్తి అయ్యాయి. ఇక ఖాళీ
లేదు. మీరు చాలా ఆలస్యంగా వచ్చారు”
అని సమాధానం ఇచ్చాడు.
రామారావు ఎంత బతిమాలినా గుమస్తా ఏమీ లాభం లేదన్నాడు. చేసేది ఏమీలేక నిరాశతో బయటకు వస్తున్నారు
వికాస్, రామారావు.
వరండాలో నడుస్తున్న వారికి ఇందాక బస్సులో కలిసినావిడ ఎదురు పడింది. ఆవిడ వారిని చూసి "ఏమిటీ? మీరిక్కడికి ఎందుకొచ్చారు?” అని అడిగింది.అప్పుడు రామారావు ఆవిడతో “నా పేరు రామారావు. వీడు మా అబ్బాయి వికాస్.
వీడిని ఆరవ తరగతిలో చేర్చడానికి వచ్చాం.
ఆఫీసులో గుమస్తా ఆరవ తరగతిలో సీటు
ఖాళీ లేదని చెప్పారు. హెడ్మాష్టర్ గారిని
కలిసినా లాభం ఉండదని అన్నారు." అని
బాధగా చెప్పాడు. ఇదంతా విని ఆమె “నాతో
రండి” అని వాళ్ళని తన గదికి తీసుకెళ్ళింది.
ఆవిడ గది ముందర హెడ్ మిస్ట్రెస్ అని బోర్డు కన్పించింది వికాస్ తండ్రికి,వాళ్ళను కూర్చోమని చెప్పి, ఒక జవానును పిలిచి “నీవు ఆఫీసుకు వెళ్ళి ఒక
అడ్మిషన్ ఫారం పట్టుకురా” అని పంపింది.జవాను తెచ్చాడు. దానిని వికాస్ తండ్రికి
ఇచ్చి పూర్తి చెయ్యమన్నారు హెడ్మాస్ట్రెస్.వికాసికి ఐదవ తరగతిలో వచ్చిన మార్కులు
తెలుసుకుని ఆవిడ వికాస్ని అభినందించింది.“ఆఫీస్ క్లర్క్ చెప్పింది నిజమే. సీట్లు ఖాళీ లేవు. అయినా హెడ్మాస్ట్రెస్ని కాబట్టి నా కోటాలో నేను ఇద్దరిని చేర్చుకునే
వీలుంది. మీ అబ్బాయి వికాస్ చాలా మంచి
నడవడిక కలవాడు. పెద్దల పట్ల గౌరవం,ఇంత చిన్న వయస్సులోనే అతడిలో ఉన్నాయి. అలాంటి వాడిని మా పాఠశాలలో
చేర్చుకోవడం మాకూ ఆనందమే" అని వికాస్ కి ఆరవ తరగతిలో సీటిచ్చింది. వికాస్ మంచి ప్రవర్తనే అతనికి సీటు తెచ్చిపెట్టింది.
No comments:
Post a Comment