‘నాకు కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు’ అని చాలామంది నోట వింటుంటాం. ఈ వాక్యంలో నాలుగు అంశాలు దాగి ఉన్నాయి. ఒకటి కోపం, రెండోది రావడం, మూడోది చేయడం, నాల్గోది తెలియకపోవడం. ‘కోపం వస్తుంది’ అనడం వల్ల అది మానవుని సహజ స్వభావం కాదని తెలుస్తుంది. అది మనకు దూరంగా ఉన్నా మన బలహీనతను ఆసరా చేసుకొని మన దగ్గరికి వస్తుంది. అలాగే మనసులో తిష్టవేసుకోగలుగుతుంది. కొందరు ‘కోపాన్ని ప్రదర్శించకండి’ అంటారు. ఇది కూడా అలాంటి వాక్యమే.
కోపాన్ని నాటకంలోలా చూపించడం అనేది లోకంలో సామాన్యంగా జరిగేదే! కోపం సహజమైనది కాదు. అది ఆయా పరిస్థితులను బట్టి మనలో ప్రవేశిస్తుంటుంది. ఇంతకు మనిషిలో కోపం ప్రవేశించడానికి కారణం ఏమిటి? అందుకు కారణం ‘కామం’. కోరికకే కామం అని పేరు. ఎప్పుడైతే ఇష్టమైన వస్తువు లభించక, ఇష్టం కాని వస్తువు లభిస్తుందో అప్పుడు కోపం వస్తుంది. తద్వారా కోపానికి కారణం కోరిక అని తెలుస్తున్నది. మరి కారణభూతమైన కోరిక కూడా మానవుడి సహజ గుణమా? యోగులకు కోరికలు లేవని కదా భగవద్గీత చెబుతున్నది! నిష్కామ కర్మయోగుల గురించి మనకు తెలుసు. వాళ్లు కామాన్ని ఎలా జయించారు? అది సంక్రమించిందే కానీ సహజాతం కాదు కాబట్టి.
కోపమే.. క్రోధంగా పరిణమిస్తుంది. కోపమన్నా, క్రోధమన్నా ఒకటే. కోపానికి కారణం కామం (కోరిక) అయితే, మోహానికి కారణం క్రోధం అవుతుంది. ‘క్రోధోద్భవతి సమ్మోహః’ అని భగవద్గీత చెబుతున్నది. కామం, క్రోధం, మోహం- ఈ మూడింటితోపాటు లోభం, మదం, మాత్సర్యం అనే గుణాలు కూడా మనిషి సహజాతాలు కావు. అత్యాశ వల్ల, మోహం వల్ల లోభం ఏర్పడుతుంది. సద్వివేకం లేకపోవడం వల్ల లోభం ఏర్పడుతుంది. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతమో తెలియకపోవడం వల్ల లోభం కలుగుతుంది. ‘లోభి తాను తినడు, ఇతరులకు పెట్టడు’ అనే సామెత కూడా ఉంది. కొందరు సంపద కారణంగా విర్రవీగుతూ గర్వాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ గర్వానికే ‘మదం’ అని పేరు. ఎప్పుడైతే గర్వం కలుగుతుందో, అప్పుడే ఇతరులతో కలహించుకునే అలవాటు సంభవిస్తుంది. కలహించుకునే గుణాన్నే ‘మాత్సర్యం’ అని పిలుస్తారు.
మొత్తం మీద కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం అనే ఆరుగుణాలను ‘అరిషడ్వర్గం’గా పిలుస్తారు. ఈ ఆరింటిలో మొదటిది ‘కామం’. ఈ ఒక్క చెడుగుణమే మిగిలిన దుర్గుణాలకు కారణం అవుతుంది. కాబట్టి యోగులు మొట్టమొదట కామాన్ని జయించడానికి ప్రయత్నిస్తుంటారు. నిష్కామ కర్మ యోగులు అవుతారు, మోక్షగాములు అవుతారు. కామాది షడ్గుణాలు మనకు శత్రువుల వంటివి. వాటిని కోరి తెచ్చుకోవడం బుద్ధిమంతుల పనికాదు. వాటి మాయాజాలంలో చిక్కుకుంటే ఆపదలు కొనితెచ్చుకోవడమే అవుతుంది. అజ్ఞానంలో మునిగిపోవలసి వస్తుంది. ఈ సందర్భంగా సుమతీ శతకకారుడు చెప్పిన ‘తన కోపమె తన శత్రువు’ అనే మాటలను గుర్తు చేసుకోవాలి. ఎవరైనా శత్రువులను ఇంట్లోకి రానిస్తారా? ఈ ఆరుగురూ బలమైన శత్రువులే! వారిలో మొదటి శత్రువు మరీ బలమైనవాడు. కోపాన్ని జయిస్తే తక్కిన శత్రువులు మన ప్రమేయం లేకుండానే అణగిపోతారు.
షడ్గుణాలలో కార్యకారణ సంబంధం ఉంది. ఒకదానికి మరొకటి కారణం అవుతుంది. కారణాన్ని తొలగించుకుంటే కార్యం నశిస్తుంది. శాశ్వతమైన జీవాత్మకు జన్మకారణంగా షడ్గుణాలు సంక్రమించాయి. ఏ జన్మా శాశ్వతమైనది కాదు కదా! మానవ జన్మ శాశ్వతం అనుకోవడం వల్లే శాశ్వతం కాని అరిషడ్వర్గాన్ని ఆహ్వానించవలసి వస్తుంది. అరిషడ్వర్గం ప్రకృతి కారణంగా ఏర్పడింది. శరీరం ప్రకృతి మూలంగా సంభవించిందే! శరీరంతోపాటు ఈ ఆరుగురు శత్రువులు మనల్ని బాధించడానికి చూస్తారు. నిజానికి వీరంతా పరాయివాళ్లే. కానీ, బలవంతులు మనకు తెలియకుండానే మనసులోకి ప్రవేశించి మనలను పాపాలకు గురిచేస్తారు.
మనం కనిపించే శత్రువులను తేలికగా తీసుకోవచ్చేమో గానీ, ఈ అంతర్గత శత్రువులను జాగ్రత్తగా కనిపెట్టాలి. ఒక్కో శత్రువును ఒక్కో ఆయుధంతో మట్టుపెట్టాలి. శాంతంతో కోపాన్ని, అనాసక్తితో కామాన్ని, త్యాగంతో లోభాన్ని, జ్ఞానంతో మోహాన్ని, సమతాదృష్టితో మదాన్ని, మైత్రితో మాత్సర్యాన్ని జయించాలి. ఇంద్రియజయం ఒక ఎత్తయితే, అరిషడ్వర్గాన్ని జయించడం మరొక ఎత్తు. కానీ, యోగమార్గంలో నడిచేవారి విషయంలో ఇవేవీ లెక్కలోకి రావని తెలుసుకోవాలి.
No comments:
Post a Comment