Sunday, September 3, 2023

తుష ఖండన న్యాయము

 *తుష ఖండన న్యాయము*
***************
*తుషము అంటే పొట్టు,ఉముక ఊక,బూసి,బూగర అనే అర్థాలున్నాయి.ఖండనము అంటే ఛేదనము,విరుచుట, ముక్కలుగా చేయుట, నాశనము చేయుట అనే అర్థాలు ఉన్నాయి.*

*తుష ఖండనము అంటే ఊకను ఎంత ముక్కలుగా చేసినా లేదా దంపినా దానివల్ల ప్రయోజనం ఉండదు.అలాగే ఉపయోగం లేని మాటలు ఎన్ని మాట్లాడినా ఆ మాటల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.అలా నిష్ప్రయోజనమైన మాటలను "ఊకదంపుడు" లేదా తుష ఖండనము లేదా తుషా ఘాతము అంటారు.*

*మాటల్లో పదాడంబరమే తప్ప కార్యాచరణకు పనికి వచ్చేది ఏమీ ఉండదు. అన్నీ ఊకలా గాలికి తేలిపోతాయి.ఒక్క మాట గట్టిమాట గుర్తుంచుకోదగినదీ ఉండదు. ఆ విధంగా చెప్పుకోదగినవిగా లేని మాటల్ని, అలా వక్తలు చేసే  ఉపన్యాసాలను ఈ తుష ఖండన న్యాయముతో పోలుస్తూ ఉంటారు.*

*ఇలాంటి వారిని ఉద్దేశించి రాసిన వేమన శతక పద్యాన్ని చూద్దాం.*

*" నిండు నదులు పారు నిల్చి గంభీరమై/ వెఱ్ఱి వాగు పారు వేగ బొర్లి/ అల్పుడాడు రీతి నధికుండు నాడునా/ విశ్వధాభిరామ వినురవేమ!"*

*అనగా నీటితో నిండి ఉండే నదులు గంభీరంగా నిలిచి ప్రవహిస్తూ ఉంటాయి. కానీ చిన్న చిన్న వాగులు, కాలువలు పైకి పొర్లి వేగంగా పెద్ద శబ్దం చేస్తూ గలగలా ప్రవహిస్తుంటాయి.వాటి వల్ల ఉపయోగం అంతగా ఉండదు.*

*అలాగే అల్పుడి మాటల్లో  వాగాడంబరమే కానీ పద విజ్ఞానం ఇసుమంతైనా  కనిపించదు.*

*అందుకే మనం మాట్లాడే మాటల్లో వందలో ఒకటైన గుర్తుంచుకోదగినదీ,ఉపయోగకరంగా ఉండాలి.*

 *ఇలాంటి న్యాయాలు లోకోక్తులు చదివినప్పుడు మన ముందు తరం వారి నిశిత దృష్టికి ఆశ్చర్యం, ఆనందం కలుగక మానదు.*

No comments:

Post a Comment