*🍃🪷 అన్నింటికీ కర్త ఈశ్వరుడే...!!*
గొడ్డలి కట్టెలను కొడుతుంది. అది గొడ్డలి గొప్పతనం కాదు..!
కలం గొప్ప గ్రంధాలను వ్రాస్తుంది, అది కలం గొప్పతనం కాదు..!
మనం గొప్ప గొప్ప పనులు చేస్తాం, అది మన గొప్పతనం కాదు..!
*అన్నింటికి కర్త అయిన ఈశ్వరునిదే ఆ గొప్పతనం..! ‘మనం కేవలం నిమిత్త మాత్రులం. ఈశ్వరుని చేతిలో పనిముట్లo...అని భావిస్తూ సర్వ కర్మలను, కర్మ ఫలాలను ఈశ్వరుని యందు వదిలి భక్తుడు నిశ్చింతుడై యుండాలి..*
ఒక రోజు..
కాశి వెళ్ళే ట్రైను కదిలింది, ఆదరాబాదరాగా పరుగెత్తుకుంటూ ఒక పల్లెటూరి వ్యక్తి రెండు పెట్టెలు నెత్తిమీద పెట్టుకొని ఎలాగో శ్రమపడి రైలు ఎక్కాడు.
అతడు రొప్పుతూ రోజుతూ, చెమటలు పట్టి ఉన్నాడు, అటూఇటూ చూచి ఒకచోట సీటు ఉంటే కూర్చున్నాడు...
కూర్చొని తాను తెచ్చిన పెట్టెలను తన తలపై ఉంచుకొని ప్రయాణం చేస్తున్నాడు.
ప్రక్కన కూర్చున్న వ్యక్తి ఈ పల్లెటూరు ఆసామిని అడుగుతున్నాడు..
“అయ్యా! ఆ పెట్టెలను ఎందుకు నెత్తిమీద పెట్టుకొని మోస్తున్నావు..? నీ సీటు క్రింద పెట్టుకోవచ్చు గదా..!” అన్నాడు.
దానికా పల్లెటూరి ఆసామి అంటున్నాడు..
"బాబూ! నేను నాకే టికెట్టు తీసుకున్నాను, వీటిని రైలు మోస్తుందో మోయలేదో తెలియదు గదా.. అందుకే నేనే మోస్తున్నాను!” అని అన్నాడట...
దానికా వ్యక్తి అతడి అమాయకత్వానికి నవ్వి...
“నాయనా! నిన్నూ, నీ పెట్టెలను అన్నింటిని ఆ రైలే మోస్తుంది...
నీవు నెత్తిమీద పెట్టుకున్నా వాటి బరువును రైలే మొయ్యాలి.
ఎందుకు అనవసరంగా నెత్తిన పెట్టుకొని హైరాన పడతావు.. క్రింద పెట్టుకో.. ఏం ఫరవాలేదు!” అన్నాడు..
*అలాగే ... అన్ని భారాలు మోసేవాడు ఆ ఈశ్వరుడు, అనవసరంగా అహంకారాన్ని నెత్తిన పెట్టుకొని అన్నీ నేనే మోస్తున్నానని భ్రమ పడుతూ ఉండరాదు...*
అన్నీ నావల్లనే జరుగుతున్నవి అనుకోరాదు.
ఇదంతా ఒట్టి అహంకారం, బ్రమ ఈ అహంకారాన్ని వదిలితేనే భగవంతుని సాన్నిధ్యం లభించేది..
*కనుక కర్మలన్నింటిని ఈశ్వరుని యందే విడిచిపెట్టాలి..*
అంటే... ఈశ్వరుని స్మరిస్తూ కర్మలు ప్రారంభించు.
ఈశ్వరుని స్మరిస్తూనే కర్మలను కొనసాగించు.
ఈశ్వరుని స్మరణతోనే కర్మలను ముగించు..!
కర్మఫలాలను గురించి ఆలోచించకు.
లభించిన దానిని ప్రసాద బుద్ధితో స్వీకరించు...
నేను నిమిత్తమాత్రుడను అని భావించు, కర్త ఈశ్వరుడే అనే నమ్మకంతో ఉండు..
ఏమి జరిగినా నిశ్చితంగా ఉండు, నేను చేస్తున్నాను, ఇది నా వల్లనే జరుగుతుంది అనే భ్రమను వదులు..
ఈ బ్రమలను వదలటమే కర్మలను ఈశ్వరునిలో సన్యసించుట..
ఇలా సర్వ కర్మలను ఈశ్వరుని తో సన్యసించి, ఈశ్వరుని ధ్యానము నే లక్ష్యంగా పెట్టుకోవాలి...
🙌సర్వే జనాః సుఖినోభవంతు 🙌
🍃🪷 నమస్సులు మీకు ఆత్మీయం గా స్వీకరించండి..వల్లూరి సూర్యప్రకాష్ కరీంనగర్
No comments:
Post a Comment