Sunday, October 15, 2023

అక్టోబర్1అంతర్జాతీయ వృద్ధుల* *దినోత్సవం

 *(అక్టోబర్1అంతర్జాతీయ వృద్ధుల*
  *దినోత్సవం)*

*విధి విసిరే చివరి అస్త్రం "* *ముసలితనం ".!*

*వృద్ధాప్యపు బందిలదొడ్డిలో* నువ్వు 
 ఒంటరివి.!!

*వృద్ధోపనిషత్ లోని  ప్రతీ పేజీ…* 'మసకే' ,
 సాయం తక్కువ…సలహాలు ఎక్కువ..!!

మనిషి ఏడో రుతువే…"వృద్ధాప్యం".!!

కాలధర్మంలో  దేహధర్మమే "వృధ్ధాప్యం"!!

మంచం మీద వెల్లకిలా పడుకొని ఆకాశం 
  వైపు చూస్తూ ఉంటావు. గగనంలో నక్షత్రాలు
  ‌ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి!!

ఈ లోకంలో పుట్టిన ప్రతీవాడు"వృద్ధోపనిషత్"
లో భాగస్వామి కాక తప్పదు.జీవితం భళ్లున తెల్లవారుతుంది.. మెల్లగా చీకటి పడుతుంది.
వృద్ధుడికి వెన్నుపై కళ్ళుంటాయన్న ఓ నానుడి 
వుంది.అంటే వృద్ధాప్యంలో వెనుక చూపేతప్ప 
ముందు చూపు వుండదు.జీవితంలోమనం… 
ఎన్నో సాధించి ఉండవచ్చు గాక. మన కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక
అయితే వృద్ధాప్యంలో  దాన్నెవరూగుర్తించరు.
అసలు పట్టించుకోరు.‌ ఓ సారి సీనియర్ సిటి
జన్ బడిలోకి అడుగుపెడితే సమాజం మన గురించి పట్టించుకోదు.పాత వస్తువులా….
ఓ  పక్కనపడేస్తుంది.

"ఆరోజుల్లో..నేను."అంటూ గతవైభవ చర్విత చర్వణం తప్ప భవిష్యత్ ఆలోచన  వుండదు.
కాళ్ళు,కీళ్ళుఒళ్ళు సడలి,కదల్లేక,మెదల్లేక,దేహా
న్ని వదల్లేక, ఏమీ చేయలేక,..వృద్ధులు పడే మనో
వ్యధ అంతాఇంతాకాదు.‌

వృద్ధాప్యం అనేసరికి అదేదో శాపంగా భావి
స్తుంటారు.జనం.నిజానికి వృద్ధాప్యం శాపమో
పాపమో కాదు. అది ప్రకృతి పరమధర్మం. వృద్ధాప్యం రాగానే బయటివాళ్ళు సరే కుటుం
బ సభ్యులు‌ కూడా చులకనగాచూస్తారు.నిన్న మొన్నటిదాకా.తలొంచిన వానపాములుసైతం 
తలెగరేసి, నిలదీస్తాయి.లెక్కలు  అడగటం మొదలెడతాయి.!

"ఏమండీ / నాన్నగారూ." అంటూ  విధేయంగా వుండే  భార్యాపిల్లలుకూడా ధిక్కరించడం మొద
లు పెడతారు.వాళ్ళేదో పుడింగులన్నట్లులేనిపోని సలహాలు,సూచనలిస్తుంటారు.ఏంమాట్లాడినా,యేం చేసినా వాళ్ళకు నచ్చదు సరికదా 'చాదస్తం ' అంటూ కరివేపాకులా తీసిపారేస్తారు.లోకువగా
చూస్తారు.!

*మధ్యతరగతి కుటుంబం అయితే,మనం సంపా
దించిన డబ్బు ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా? లేక చూసీ చూడనట్టు మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో మన పక్క గది
లో మనవాళ్ళే చర్చిస్తూ ఉంటారు.*

*అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్కగదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది.! ఆరాత్రి
నిద్ర కరువవుతుంది.

*చివరి మజిలీ !!

మనిషి జీవన ప్రయాణంలో చివరి మజిలీ వృద్ధా
ప్యం.(Old Age)మనం కాదనుకున్నా కూడా కోరి వస్తుంది వృధ్ధాప్యం.మనిషి జీవితం రుతువులతో ముడిపడి వుంటుంది.వసంత రుతువుతో మొదల
య్యే కాలం శిశిరంతో ముగుస్తుంది. వసంతకాలం మన పుట్టుక అనుకుంటే,శిశిరం వృద్ధాప్యం.వసం
తంలో ప్రకృతి ఆకుపచ్చగా,రంగు రంగుల పూలతో మురిపిస్తుంది.మనసు ఉల్లాసభరితమవుతుంది.
ఇక శిశిరానికొచ్చేసరికి ఆకులు పండి,ఎండి ,రాలి , 
చెట్లు మోడులవుతాయి.అలాగే వృద్ధాప్యంలో…
మనిషి దేహం కూడా ఒడలి,ఎండిన మోడవు..
తుంది.!అయితే వృద్ధాప్య దశకు చేరుకున్నారంటే..
జీవితంలో వాళ్ళుఎన్నెన్ని చూసివుంటారు.ఎంత అనుభవంగడించి వుంటారో!ఒక్క సారి ఆలోచిస్తే తెలుస్తుంది.అందుకే వృద్ధుల్ని భారంగాకాకుండా
గౌరవంగా చూడాలి.వారి అనుభవాన్ని యువతరం
చూపుడువేలుగా తీసుకొని ముందుకు నడవాలి.
అప్పుడు వాళ్ళ భవిష్యత్తు మహత్తరంగా వుంటుం
ది.కానీ దురదృష్టంయేమంటే, వృద్ధుల్ని గౌరవించ
డం  అటుంచి  అసలులెక్కేచేయరు.!.

కొందరైతే ముసలాళ్ళను భరించలేక  వృద్ధాశ్రమాల
పాలు చేస్తారు.ఇవాళ మనం చేసిందే..రేపు మన పిల్లలు కూడా చేస్తారన్నసోయి ఏమాత్రం వుండదు.
ఏతావాతా వృద్ధాప్యం శాపంగా మారుతుంది.

యవ్వనంలో హెల్త్ ఇన్సూరెన్స్ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టేస్తాం.. మధ్య వయసులో సంపాదించింది ఖర్చుపెట్టి పిల్లల్ని విదేశాలకు ….
పంపుతాం..‘నా కొడుకు అమెరికాలోనో,ఇంకేదో దేశంలో వున్నాడనో? , కూతురు ఆస్ట్రేలియాలో నో ఇంకేదో దేశంలో ఉన్నదనో ’గర్వంగా చెప్తూ ఫాల్స్
ప్రిస్టేజి ఫీలవుతాం..అంతా బాగానే వుంటుంది…
పిల్లలూ విదేశాల్లో సెటిలైపోయి బాగుంటారు.మన
వృద్ధాప్యంలో మాత్రం వాళ్ళు కనీసం చూడటానికి
కూడా రారు..అప్పుడప్పుడు సీజనల్ గావచ్చే'సెల్' 
ఫోన్ కాల్స్ తోనే సరిపెట్టుకోవాలి.తృప్తి పడాలి. !
కొడుకో,కూతురో,మనవడో గుర్తొచ్చి,వాళ్ళతోమాట్లా
డాలని ఫోన్ చేస్తే…'సారీ.! బిజీ.' అంటూ సమాధా
న మొస్తుంది.

పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో, వృద్ధాప్యంలో తిరిగి అదే పరిస్థితి సంభవిస్తుంది. అయితే ఒకటే 'చిన్న
ప్పుడు ఆలనాపాలనా చూసుకోవటానికి కన్నతల్లి
ఉంటుంది.వృద్ధాప్యంలో ఎవరూ వుండరు.అదృష్టం
బాగుంటే.. అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతు
రూ,తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ వుండొచ్చు.
అనాథాశ్రమంలోఅయితే  వాళ్ళు కూడా ఉండరు.!

అయితే ఇది అందరికీ.. జరుగుతుందని కాదు.
కొందరుంటారు.అదృష్టవంతులు.తల్లిదండ్రుల్ని ప్రేమించే పిల్లలూ వుంటారు.అలాంటివాళ్ళు తల్లి
దండ్రులు వృద్ధులైనా నెత్తిన పెట్టుకొని ఎంతో ప్రేమ
తో చూసుకుంటారు.నేను ఎంతో గౌరవించే, అభి‌
మానించే పెద్దలు,మిత్రులు,న్యాయవాదిబి.హను
మారెడ్డి (ఒంగోలు ) గారు తన  వృద్ధాప్యాన్ని..… వైభవంగా గడిపారు.వృద్ధులు ఎలా వుండాలో చేతల్లో చూపించి, పదిమందికీ రోల్ మోడల్ గా నిలిచారు.అంతేకాదు..ఆయన కవి,రచయిత కావడంవల్ల తన వృద్ధాప్య ' వైభవాన్ని' ఓ దీర్ఘకవి
తగా మలిచి చదువుకోమంటూ..మనకిచ్చి మరీ వెళ్ళిపోయారు.దాని పేరు"వెన్నెల గీతం ".!!

*మానవ జన్మ అద్భుతం
దాని ప్రాయం బుద్బుదం

కడ సంజ వెచ్చని వీడుకోలు
తొలి సంజ పచ్చని ఆహ్వానం

జననం ఒక సంభవం
అది కోటి దీపాల కోవెల

జవ్వనం ఒక సందర్భం
అది కోటి రాగాల కోయిలర

వార్థక్యం అందాల జలపాతం
అది సడిలేని వెన్నెల గీతం"అంటారు 
హనుమారెడ్డిగారు..!

ఇక వజీర్ రెహమాన్ గారు వృద్ధాప్యం గురించి
చెప్పారు.చిత్రమేమంటే ఆయన వృద్ధాప్యాన్ని 
చూడకుండానే అర్ధంతరంగా కాలం చేశారు…
కాకుంటే  వృద్ధులు పడిన కష్టాల్ని,బాధను తన
కళ్ళారా చూసి "ముసలితనం" కవిత రాశారు..

"ముసలితనం 
 కడుపాపి
 భయంకరం
 క్రూరాతి క్రూర
 నీచ పిశాచం

 దాన్ని మించి
 వేరే వుండబోదు
 శోక నరకం

చూస్తో
చూస్తోండగా
నవ్వుతో
నవ్విస్తో
మభ్యపెట్టి
లాగుతుంది

బతుకంతా
రోతపడ్డ
రొచ్చులోకి
రొష్టులోకి

నువ్వెగరేసిన జండాల్ని
కొలిచిన దేవతల్ని
ఆశల్ని ఆశయాలని 
ఆత్మాభిమానాల్ని
చీలి పీలికలు చేసి
యెగరేస్తే…..

దీనంగా పిచ్చిగా
నువ్వా పీలికలేరుకొని
వొళ్ళు మరిచి
ఆడుకుంటావు
అదే మహాప్రసాద
మనుకుంటో

పగబట్టిన
తాచుకన్న
క్రూరం
ముసలితనం

విధి
విసిరే
చివరి
అస్త్రం
తప్పించుకోలేవు
దాని ఘాతం

తలవొంచు
తనువు చాలించు"!

బతుకంతా బుద్ధి బలం మీద ఆధారపడ్డ వారికి
ముసలితనం కన్నా పెద్ద శిక్ష వుండదేమో? బాగా
బతికిన మహామహులే ముసలితనం రాగానే. దిగ
జారి హీనమై పోవడం,నా కళ్ళతో నేను చూశాను.
ఇంకా చూస్తూనే వున్నాను.. ఇలాంటి అవస్థను
తలుచుకుంటేనే భయమేస్తుంది..

భగవాన్.!
ఇలాంటిదురవస్థ ఎవరికీ రాకూడదు.
ఇందులో నుంచి అందర్నీ తప్పించు తండ్రీ !!
(ఇందులో నేనూ వుండాలి.)

*వృద్ధాప్యం శాపం కాదు..ఓ వరం!!

వృద్ధాప్యం అంటే..అదేదో శాపంగా భావించడం 
కాకుండా...వృద్ధాప్యాన్ని ఓ 'వరంగా,వైభవంగా' 
భావించాలి.రేకులు రాలుతున్న సమయం అలలు
అంచులకు చేరిన తరుణం. ఇది చందనాల సమా
హారం సరిగమలను పలికించి సంతృప్తిని ప్రకటిం
చాలి..వృద్ధాప్యం అనుభవాల సాగరం.సర్వస్వం.'.

"'వృద్ధాప్యం జ్ఞాపకాల సందడి.
వృద్ధాప్యం శాపం కాదు.
ప్రసిద్ధ కళారూపం.
దర్శకత్వం వహించు '
వృద్ధాప్యం ఆఖరి చరణం కాదు.
పునరపిజననం.క్షేత్రం సిద్ధం చేసుకో"
అంటారు..హనుమారెడ్డి.!!

రుతువుల్లాగే..కాల ధర్మం,దేహ ధర్మమూ మారు
తుంది.వాటిని బట్టి మనం నడుచుకోవాలి.వాస్తవ
స్థితిని అంగీకరించి,ధైర్యంతో ముందడుగువేయాలి. 
"సహస్ర చంద్రుని "చేరుకోడానికి మనకు మనమే
ఓ పూలపల్లకిని సిద్ధం చేసుకోవాలి‌.!

*వృద్ధాప్యంలో వచ్చే కష్టాల్ని 
 తగ్గించుకోవడం ఎలా?

 "The Sky Gets Dark Slowly "అనే ఆంగ్ల
 పుస్తకంలో  రచయిత వృద్ధాప్యంలో వచ్చే కష్ట
 నష్టాల్ని తగ్గించుకునే సులువులు కొన్ని చెప్పారు.
"ప్రస్తుత జీవన విధానంమార్చుకుంటే,వృధ్ధాప్యం
 లో వచ్చే సమస్యల్లో కొన్నైనా తగ్గించుకోవచ్చు' 
 అంటాడు..దీనికి 5సూత్రాలు చెప్పాడు..

*ఆకాశం పూర్తిగా నల్లబడక ముందే నీ దారి
పొడుగునా లైట్లు వెలిగించి శక్తి ఉన్నంతవరకూ
పని చేస్తూ ఉండాలి.

*నీకన్నా అశక్తులకీ, అనాథలకీ సహాయం చేస్తూ 
 ఉండాలి.

*ఏకాంతం స్థానే శూన్యత ప్రవేశించినప్పుడు అది అతి తొందరలో ఒంటరితనంగా మారుతుందన్న సత్యాన్ని ఎంత తొందరగా తెలుసుకుంటే అంత 
మంచిది.ప్రతి మనిషి చుట్టూ ఒక ‘తావి’ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ అది సుగంధంగానో పరిమళం
గానో, దుర్గంధ భరితంగానో మారుతుంది.అదెలా..
మారుతుందనేది హుందాతనాల /  చాదస్త ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది.*

*పిల్లలు పుట్టగానే లావు అవటం సహజం అనుకోకు. జిహ్వ చాపల్యం తగ్గించు. ఒక వయ
సు వచ్చాక తిండి ఆనందం కాదు. అవసరం.
వయసు పెరిగే కొద్దీ శరీరం ఇచ్చే సంకేతాలు గమనించాలి. పెగ్గులు సిగరెట్లు తగ్గించాలి.. 

*వయసు వల్ల వచ్చిన అధికారంతో మన చుట్టూ ఉన్నవాళ్ళని శాసించకూడ బోధనలాపి ఒంటరిగా  ఉండటం ఎలాగో  నేర్చుకోవాలి.‌. లేకపోతే మన. ఇంటివారే మనల్ని మరింత దూరం పెడతారు..!

*ఇక ఒంటరితనంలో
 వ్యాపకాలు..

*ఒంటరిగా కూర్చొని పుస్తకాలు చదువుకోవచ్చొ.

ఏకాంతంలో సంగీతాన్ని వింటూ కాలక్షేపం చెయ్యొచ్చు..

*ఓపిక,సదుపాయముంటే పెరటి మొక్కల్ని పరిరక్షి
 స్తూ కాలం గడపాలో..

*చిన్న పిల్లలుంటే కొద్ది సేపు వారికి ఇంటరెస్టు ఉన్న టాపిక్స్ కబుర్లు చెప్పుకోవచ్చు,ఆడుకోవచ్చు.

*ఏం చేసినా…అఫెక్షన్ బ్యాంక్ లో ఆప్యాయతని క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళాలి.ఎప్పుడైతే మనం  మానసికంగా ఇలా  ప్రిపేర్ అవుతామో? మన 
వృద్ధాప్యాన్ని ఓ పది సంవత్సరాలపాటు వాయి
దా వెయ్యొచ్చు..!

సో …ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ అయిన వారు,
భవిష్యత్తులో సీనియర్ సిటిజన్స్ కాబోయే వారు జీవితాల మీద  ఓ లుక్కేసి వుంచుకోండి.!!

*లోక సమస్తా సుఖినో భవంతు*
🙏🏼🙏🏽🙏🏼

No comments:

Post a Comment