*అమృతం గమయ*
*22 అక్టోబర్ 2023 - 8వ రోజు దుర్గా నవరాత్రి - 8వ దుర్గా అవతారము మహా గౌరీ దుర్గ - దుర్గాష్టమి*
మహాగౌరీ దుర్గా నవదుర్గల అలంకారాల్లో ఎనిమదవ అవతారం. నవరాత్రులలో
ఎనిమిదవ రోజైన ఆశ్వీయుజ శుద్ధ అష్టమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు.
అష్టవర్షా భవేద్గౌరీ - "మహాగౌరి" అష్టవర్ష ప్రాయము గలది. ఈమె గౌర వర్ణ శోభలు మల్లెపూవులను, శంఖమును, చంద్రుని తలపింపజేయును.ఈమె ధరించు వస్త్రములును, ఆభరణములును ధవళ కాంతులను వెదజల్లుచుండును. ఈమె చతుర్భుజ, వృషభవాహన.
తనను పూజించే భక్తుల అన్ని కోరికలనూ ఈ
అమ్మవారు తీర్చగలదు. జీవితంలోని కష్టాలన్నిటినీ ఈ అమ్మవారి ఉపాసన ద్వారా
దూరం చేసుకోవచ్చు అని భక్తుల నమ్మిక.
*స్వరూపం*
మహాగౌరీదేవి నాలుగు
చేతులుతో ఉంటుంది. తన కుడిచేతులలో ఒకదానియందు అభయముద్రను, మఱియొకదానియందు త్రిశూలమును వహించియుండును. అట్లే ఎడమచేతులలో ఒకదానియందు డమరుకమును, వేఱొకదానియందు వరముద్రను కలిగియుండును. ఈమె దర్శనము ప్రశాంతము. మహాగౌరి అనే పేరు గొప్ప తెలుపు అని అర్ధం, దుర్గాదేవి తెలుపు రంగులో, చాలా అందంగా ఉంటుంది. (మహ, మహా = గొప్ప; గౌరీ, గౌరీ = తెలుపు).
*కథ*
పార్వతి యవతారమున పరమశివుని పతిగా పొందుటకు కఠోరమైన తపస్సు చేయగా ఈమె శరీరము పూర్తిగా నలుపెక్కెను. ప్రసన్నుడైన శివుడు గంగాజలముతో అభిషేకించగా ఈమె శ్వేత వర్ణశోభితయై విద్యుత్కాంతులను విరజిమ్ముచు "మహాగౌరి" యని వాసిగాంచెను. ఈమె శక్తి అమోఘము. సద్యఃఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నియును ప్రక్షాళితమగును. వారి పూర్వ సంచిత పాపములును పూర్తిగా నశించును. భవిష్యత్తులో గూడ పాపతాపములుగాని, దైన్య దుఃఖములుగాని వారిని దరిజేరవు. వారు సర్వవిధముల పునీతులై, ఆక్షయముగా పుణ్యఫలములను పొందుదురు. ఈ దేవి పాదారవిందములను సేవించుటవలన కష్టములు మటుమాయమగును. ఈమె యుపాసన ప్రభావమున అసంభవములైన కార్యముల సైతము సంభవములే యగును. ఆ విధంగా తెల్లని రంగును సంపాదించడం ద్వారా పార్వతిని మహాగౌరి అని పిలుస్తారు. తల్లి గౌరీ దేవి, శక్తి, మాతృదేవత, దుర్గా, పార్వతి, కాళీ అని అనేక రూపాల్లో కనిపిస్తుంది. ఆమె పవిత్రమైనది, తెలివైనది. చెడు పనులను చేసేవారిని శిక్షించి, మంచి వ్యక్తులను రక్షిస్తుంది. తల్లి గౌరీ మోక్షాన్ని ఇవ్వడం ద్వారా పునర్జన్మ భయాన్ని తొలగిస్తుంది.
ఇంకో కధ ప్రకారం, పుట్టుకతోనే నల్లని రంగు గల పరమేశ్వరిని, పతి అయిన పరమేశ్వరుడు ఒకసారి పరిహాసముగా " కాళీ " అని పిలుస్తాడు. దాంతో ఆమె శివునితో పంతగించి , బ్రహ్మ గురించి కఠోర తపస్సు చేసి ... ఆ నల్లని దేహాన్ని వదిలి శివునికి దీటుగా తెల్లని ఛాయతో 'మహా గౌరి 'గా అవతరించినది .
అష్టమ శక్తియైన మహాగౌరి పూజ కరణంగా ప్రాప్తించే మహిమలు శ్రీదేవీ భాగవతంలో వర్ణించబడినవి. ఈమె నామస్మరణ చేత సత్ప్రవర్తన వైపు మనసు నడుస్తుంది. సర్వవిధ శుభంకరి - మహాగౌరి.
*ప్రార్ధనా శ్లోకము :*
*'శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।*
*మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవప్రమోదదా ॥*
No comments:
Post a Comment