🌺అమృతం గమయ🌺
శోభకృత నామ సంవత్సర శరన్నవరాత్రులు
17 అక్టోబర్ - మంగళవారం - మూడవరోజు
_*మూడవరోజు - చంద్రఘంటా దుర్గా*_
చంద్రఘంటా దుర్గా , దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో మూడవ అవతారం. భక్తులు ఈ అమ్మవారిని చంద్రఖండ , చండికా , రణచండీ అని కూడా పిలుస్తారు. చంద్రఘంటా అంటే అర్ధచంద్రాకారంతో , గంట కలగి ఉన్నది అని అర్ధం. నవరాత్రులలో పూజించే నవదుర్గల్లో మూడో అవతారమైన చంద్రఘంటా దేవి ధైర్యానికీ , శక్తికీ , తేజస్సుకూ ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఆమె తన తేజస్సుతో పూజించినవారి పాపాలు , ఈతిబాధలు , రోగాలు , మానసిక రుగ్మతలు , భూత భయాలు దూరం చేస్తుంది.
*పురాణ గాథ*
శివుడు , పార్వతి దేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తరువాత ఆమె ఎంతో సంతోషిస్తుంది. పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకా దేవి , హిమవంతులు కూడా పెళ్ళికి అంగీకరిస్తారు. పెళ్ళి రోజున శివుడు దేవతలతోనూ , మునులతోనూ , తన గణాలతోనూ , శ్మశానంలో తనతో ఉండే భూత , ప్రేత , పిశాచాలతోనూ తరలి విడిదికి వస్తాడు. వారందరినీ చూసి పార్వతి తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివునకు కనిపించి , తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆయనను కోరుతుంది. అప్పుడు శివుడు రాజకుమారుని వేషంలో , లెక్కలేనన్ని నగలతో తయారవుతాడు. అప్పుడు ఆమె కుటుంబసభ్యులు , స్నేహితులు , బంధువులూ భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారు. ఆ తరువాత శివ , పార్వతులు వివాహం చేసుకుంటారు. అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రఘంటా అవతారం ఎత్తింది.
శివ , పార్వతుల కుమార్తె కౌషికిగా దుర్గాదేవి జన్మించింది. శుంభ , నిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు. ఆమె యుద్ధం చేస్తుండగా , ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు. అమెను తన తమ్ముడు నిశుంభునికిచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకుని ధూమ్రలోచనుణ్ణి కౌషికిని ఎత్తుకురమ్మని పంపిస్తారు. అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంటా దుర్గా అవతారం ధరించి ధూమ్రలోచనుణ్ణి , అతని పరివారాన్ని సంహరిస్తుంది. అలా శుంభ , నిశుంభులతో యుద్ధంలో నవదుర్గా అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంటా దుర్గా అవతారం ఎత్తింది అమ్మవారు.
*రూప వర్ణన*
చంద్రఘంటా దుర్గా దేవి ఎనిమిది చేతులతో ఉంటుంది. ఒక చేతిలో త్రిశూలం , మరో చేతిలో గద , ఒక చేతిలో ధనుర్భాణాలు , మరో చేతిలో ఖడ్గం , ఇంకో చేతిలో కమండలం ఉంటాయి. కుడి హస్తం మాత్రం అభయముద్రతో ఉంటుంది. చంద్రఘంటా దుర్గాదేవి పులి మీదగానీ , సింహం మీదగానీ ఉంటుంది . ఈ వాహనాలు ధైర్యానికి , సాహసానికీ ప్రతీకలు. అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా , ఫాలభాగంలో మూడో నేత్రంతో ప్రకాశిస్తుంది ఆ తల్లి. అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూంటుంది. శివుడు ఈ అమ్మవారి అందానికి ముగ్ధుడయ్యాడని పురాణోక్తి.
పులి లేదా సంహవాహిని అయిన అమ్మవారు ధైర్య ప్రదాయిని. నిజానికి ఈ రూపం కొంచెం ఉగ్రమయినా , ఆమె ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతోనే ఉంటుంది. ఉగ్రరూపంలో ఉండే ఈ అమ్మవారిని చండి , చాముండాదేవి అని పిలుస్తారు.
ఈ అమ్మవారిని ఉపాసించేవారు మొహంలో దైవ శోభతో ప్రకాశిస్తుంటారని భక్తుల నమ్మికం. వారు అద్భుతమైన తేజస్సుతో ఉంటారట. ఈ అమ్మవారిని పూజించేవారు విజయాన్ని అతిశీఘ్రంగా పొందగలరని భక్తుల విశ్వాశం. దుష్టులను శిక్షించేందుకు ఈ అమ్మవారు ఎప్పుడూ తయారుగా ఉంటుందని పురాణోక్తి. అలాగే తన భక్తులకు ప్రశాంతత , జ్ఞానం , ధైర్యం ప్రసాదిస్తుందట ఈ అమ్మవారు. రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని ఘంట భీకరమైన శబ్దం చేసిందట. కొందరు రాక్షసులకు ఆ ఘంటానినాదానికే గుండెలవిసాయని దేవి పురాణం చెబుతోంది. అయితే ఈ ఘంటానినాదం ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమనీ , ఎంతో మధురంగా వినపడుతుందని ప్రతీతి. దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో , ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది.
*ధ్యాన శ్లోకం*
*పిండజ ప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ప్రసాదం తనుతే మహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా*
No comments:
Post a Comment