🌺అమృతం గమయ 🌺
శోభకృత నామ సంవత్సర శరన్నవరాత్రులు
16 అక్టోబర్ - సోమవారం - రెండవ రోజు
*రెండవ రోజు బ్రహ్మచారిణి దుర్గ*
ధ్యాన శ్లోక
"దధానాకర పద్మాభ్యామక్షమాలా కమండలూ
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా
నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణీ దుర్గా దేవిని నవరాత్రుల్లో రెండో రోజైన ఆశ్వీయుజ
శుక్ల విదియ నాడు పూజిస్తారు.
బ్రహ్మచారిణీ దుర్గా దుర్గాదేవి అవతారాల్లో రెండో అవతారం. గురువు వద్ద బ్రహ్మచార్యాశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం ఇది. నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణీ దుర్గా దేవిని నవరాత్రుల్లో రెండోరోజున పూజిస్తారు. తెల్లని చీర దాల్చి, కుడి చేతిలో జప మాల, కమండలం, ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణీ దేవి.
పురాణాల ప్రకారం పార్వతీ దేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంది.
ఆమె తల్లిదండ్రులైన మేనకా, హిమవంతులు అది దుర్ఘటమైన కోరిక అని చెప్పినా, ఆమె పట్టుదలతో శివుని కోసం 5000 ఏళ్ళు తపస్సు చేసింది. తారకాసురుడనే రాక్షసుడు శివ సంతానం చేతిలో తప్ప చనిపోకుండా వరం పొందాడు. సతీదేవి వియోగంలో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోడనీ, ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు. కానీ భవానీ పార్వతీదేవిగా జన్మెత్తి, శివుని కోసం తపస్సు చేస్తోందని ముందే
తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుణ్ణి కోరతారు. శివునిపై పూలబాణం వేసిన మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు శివుడు. నిరాశ చెందని పార్వతి శివునిలాగానే ఉండేందుకు బ్రహ్మచారిణి అయి, తపస్సు చేస్తూ ఉంటుంది. అలా బ్రహ్మచారిణీ అవతారంలో ఘోరతపస్సు చేస్తుంది అమ్మవారు. ఈ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ, తనకు సేవ చేస్తున్న పార్వతి పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు. కానీ సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్యా కాలేరని భావించి శివుడు, తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు. తాను దొంగ సన్యాసిని అంటూ స్వనింద చేసుకుంటాడు. కానీ పార్వతీ దేవి అ మాటలను నమ్మకుండా తన తపస్సు తీవ్రతరం చేస్తుంది. చివరికి శివుని పట్టుదలపై పార్వతి ప్రేమే గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు.
No comments:
Post a Comment