Thursday, October 26, 2023

బాల్యం అమూల్యం -- పిల్లలు.‌. అదో ప్రపంచం. పిల్లలు లేని ఇంటికి కళ ఉండదు.

 బాల్యం అమూల్యం --  పిల్లలు.‌. అదో ప్రపంచం.  పిల్లలు లేని ఇంటికి కళ ఉండదు.  వారి అమాయకపు చేతలు, చేష్టలు, నడకలు, వచ్చీరాని మాటలు మనల్ని మురిపిస్తొయి.  ఉమ్మడి కుటుంబాలు వెలుగొందుతున్న రోజుల్లో తాతయ్యల బామ్మల అమ్మమ్మల మధ్య కడు మురిపెంగా పిల్లలు పెరిగేవారు.  ఆడుకుందికి విశాలమైన గదులు ఉండేవి..  ఇరుగుపొరుగు పిల్లల సాన్నిహిత్యం ఉండేది..  చందమామ కథలే కాకుండా బాల భారత రామాయణ భాగవతాలు పిల్లలకి పెద్దలు చెప్పేవారు.  ఐతే..  ఇదంతా గతం.  ఇప్పుడు ఈ సినేరియో ఏ యింట్లోను కనపడదు.  ఈరోజుల్లో చాలామంది ఒక్క బిడ్డతోనే సరిపెట్టేస్తున్నారు.  పెద్దల, తోటివారి సాన్నిహిత్యం ఉండడం లేదు.  తనతో తనే ఆడుకోవాలి.  ఏ దూర ప్రాంతాల్లోనో విదేశాల్లోనో పెరుగుతుంటారు. మమ్మీ డాడీ సంస్కృతి తప్పించితే మన సంప్రదాయాలు, కట్టుబాట్లు తెలియవు.  చెప్పడానికి తల్లిదండ్రులకి ఓపిక తీరిక ఉండవు.. ఆడించడానికి, కథలు చెప్పడానికి వీరి తల్లిదండ్రులు ఉండరు.  మనవలతో గడపాలన్న కోరిక బలంగా ఉన్నా ఏ రెండేళ్లకో మూడేళ్లకో ఓసారి.. అదీ కొద్దిరోజుల పాటు..  తీరే ముచ్చటే.  పిల్లలకి చనువు ఏర్పడదు.  ఇటువంటి పరిస్థితుల్లో ఈ పసిపిల్లలు పెద్దయ్యాక బాల్యంలో జ్జాపకాలు ముచ్చట్లు తలుచుకుందికి పెద్దగా ఏమీ ఉండవు.  మనకి బాల్యం అమూల్యం..  వాళ్లకి మాత్రం శూన్యమే.  ఈరోజుల్లో మన పిల్లలు అనుభూతులకు అభిమానాలకు దూరమైపోతున్నారు..  అమూల్యమైన అనుభవాలు కోల్పోతున్నారు.  కాలం తెచ్చిన మార్పు ఇది. ఒకప్పుడు పిల్లల కోసం చందమామ, బాలమిత్ర వంటి పత్రికలు ఉండేవి.  ఇప్పుడు లేవు.  ఆడుకుందికి స్థలాలు, మైదానాలు ఉండేవి.  పాఠశాలల్లో డ్రిల్ క్లాసెస్ క్రమంగా కనుమరుగవు తున్నాయి.  ఆటబొమ్మలు అక్కర్లేదు..  మొబైల్ ఫోనే ఆట వస్తువైపోయింది.  సంగీతం నేర్చుకోవాలన్నా, డాన్స్ నేర్చుకోవాలన్నా ఆన్లైన్ తరగతులే శరణ్యం.  బాలల మనోవికాసానికి అంతగా అవకాశం లేకుండా పోతోంది.  ఏమిటో పిల్లలు ఇట్టే ఎదిగిపోతున్నారు..  వాళ్ళ ముచ్చట్లు చూసే ముచ్చటే మనకు లేకుండా పోతోందని ఒక పెద్దాయన వాపోయారు.  ఈరోజుల్లో పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు సరియైన జాగ్రత్తలు తీసుకోవడంలేదు.  అనేక అపోహల మధ్య వారిని పెంచుతున్నారు.  పెంచే విధానంపై సరియైన అవగాహన ఉండటం లేదు.  చాలా లిమిటెడ్ స్పాన్ లో పెరుగుతున్నారు..  అందరూ కాకపోయినా అధిక శాతం.  ఇప్పుడు నాలుగైదు సంవత్సరాల వయసుగల పిల్లలు 60, 70 ఏళ్ళ తర్వాత ఎలా నెట్టుకొస్తారనేదే నా ఆలోచన.  అప్పుడు తన  అనేవారు ఎవరైనా ఉంటారా అనేది ఓ ప్రశ్న.. అంతుచిక్కని సందేహం..  కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల, మనవల పట్ల వ్యక్తపరిచిన ఆవేదనే ఈరోజు ఈ కాఫీ కబుర్లుకి స్పూర్తి..  ------ గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని)

No comments:

Post a Comment