Thursday, October 26, 2023

ఏకాగ్రత

 .                    *ఏకాగ్రత*

*నిగ్రహం లేనివాడు నిలకడ లేనివాడు ఒకటేనని సామెత. నిగ్రహం వల్లనే నిలకడ సాధ్యమవుతుంది కనుక ఆ సామెత పుట్టింది. నిగ్రహం అంటే మనసును, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడమే. మనసును అదుపులో పెట్టుకుంటే శమమని, ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటే దమమని పిలుస్తారు. ఈ శమదమాలు యోగాన్ని -అభ్యసించే వారికే కాదు, విద్యాభ్యాసం చేసేవారికీ అవసరమే. తరగతి గదిలో పారు విన్నప్పుడు గాని, ఆ పాఠం ఇంట్లో చదువుతున్నప్పుడు గాని, పరీక్షలు రాస్తున్నప్పుడు గాని విద్యార్థికి నిగ్రహం తప్పనిసరి. విద్యార్థికే కాదు, ఏ వ్యక్తి ఏ పని చేసినా దాని మీద ఉంచాలి కదా! ఆ శ్రద్దకే నిగ్రహం అని పేరు. ఆవకాయ పచ్చడి మొదలుకొని, అణు బాంబులు తయారు చేసేవరకు... నిగ్రహం ఉండాల్సిందే.*

*నిగ్రహం అంటే ఏకాగ్రత. ఏ పని చేస్తున్నామో. దాని మీద మనసు నిలపడం. వస్తు ప్రదర్శనశాలకు వెళ్ళినా, విహార యాత్రకు వెళ్ళినా మనకున్న ఏకాగ్రతను బట్టి ఆనందం కలుగుతుంది. బ్యాంకు లావాదేవీలు జరిపేటప్పుడు ఏకాగ్రచిత్తులు కావలసిందే. లేకపోతే చిత్తైపోతాం. ఏకాగ్రతకే జాగరూకత అని మరొక అర్ధం. ఏకాగ్రత వల్ల వస్తు రూపం. మనసులో నిలబడుతుంది. దాని స్వరూపం బోధపడుతుంది. దాన్ని ఉపయోగించుకునే విధానం అవ గతమవుతుంది. సాధారణంగా మనం చేసే పనులకే ఏకాగ్రత అవసరమైనప్పుడు, యోగమార్గంలో నడిచేవారికి దాని అవసరం మరింత ఉంటుంది. ఉదాహరణకు, భగవంతుణ్ని ధ్యానం చేయాలి అనుకున్నప్పుడు ఆయన నామాన్ని గుర్తుచేసుకోవాలి. నామస్మరణతో పాటు అర్థభావన చేయాలి. ఏకాగ్రతలేని మనిషికి ఏదీ సాధ్యం కానప్పుడు యోగ విద్య సాధ్యమవుతుందని ఎలా చెప్పగలం?*

*యోగమంటే ఏకాగ్రత. చిత్తవృత్తులను నిరోధించుకొని కేవలం భగవంతుణ్ని మాత్రమే. అనుభవంలోకి తెచ్చుకోవడమే యోగం. అయితే భగవంతుడు సాకారుడా, నిరాకారుడా తెలుసుకోవలసి ఉంది. సాకార రూపంలో భగవంతుణ్ని అర్చించాలన్నా ఏకాగ్రత అవసరమే. మరి నిరాకారుడైన భగవంతుణ్ని మనసులో ధ్యానించాలని అనుకున్నప్పుడు మరింత ఏకాగ్రత అవసరమవుతుంది. మనం తోటలోకి వెళ్ళినప్పుడు ఎక్కడో ఒకచోట ఆగిపోయి, తదేక దృష్టితో ఒక పూలమొక్క దగ్గర నిలిచిపోతాం. అదే ఏకాగ్రత అంటే. మన కళ్లముందు ఎన్ని వస్తువులున్నా, ప్రత్యేకంగా ఒక వస్తువు మీదనే దృష్టి పెట్టడమే ఏకాగ్రత. ఏకాగ్రతను ఎలా సాధించాలని చాలామంది అడుగుతుంటారు.*

*చంచలమైన మనసును మనకు కావలసిన వస్తువుమీద కానీ, విషయం మీద కాని కదలకుండా నిలపడమే ఏకాగ్రత. మనకు శ్రద్ధతోపాటు లక్ష్యశుద్ధి ఉన్నప్పుడు ఏకాగ్రత సిద్ధిస్తుంది.*

*'నా మనసు చలిస్తోంది... దీన్ని కట్టడి చేయడం ఎట్లా? అని అర్జునుడు యుద్ధ రంగంలో అడిగినప్పుడు, కృష్ణుడు అతణ్ని 'యోగివి కమ్ము' అంటాడు. మనసుతో పాటు ఇంద్రియాలను అదుపులో పెట్టుకొమ్మని కృష్ణుడిచ్చిన సందేశం యుద్ధం చేసి విజయాన్ని సంపాదించడానికి అర్జునుడికెంతో ఉపయోగపడింది. మనం కూడా ఏ పని చేసినా మనసును, ఇంద్రియాలను నిగ్రహించుకున్నట్లైతే, అనుకున్నది సాధించగలుగుతాం. జీవితంలో విజేతలమై నిలుస్తాం...*

*🙏|సర్వేజనా సుఖినోభవంతు|🙏*

No comments:

Post a Comment