Monday, October 23, 2023

శరన్నవ రాత్రులు

 *అమృతం గమయ*

*శరన్నవ రాత్రులు*

*ఆశ్వయుజ మాసం విశిష్టత*

🌺అమృతం గమయ🌺

జీవితాన్ని ఆరాధించండి, భయపడకుండా జీవించి ఉండండి. జీవితంలో ప్రతిదీ పవిత్రమైనది,  జీవితంలో ప్రతిదీ దైవికమైనది. మీరు చేయాల్సిందల్లా మీ జీవితాన్ని స్పృహతో నిర్వహించడం - సత్ చిత్.

శోభకృత నామ సంవత్సర శరన్నవరాత్ర దీక్ష స్వీకరించిన దివ్యసాధకులకు ఎవరికి వారికి తగురీతిలో జగన్మాత అనుగ్రహంగా ఇచ్చినటువంటి దీక్ష రేపటి నుంచి ఆరంభించవలసినది.  దీక్షా పరమైన సందేహాలు ఉన్నటువంటి వారి సందేశాలకు వెంటనే ప్రతిస్పందన ఇవ్వడం జరుగుతుంది. మిగతా సందేశాలకు ఈ పౌర్ణమి వరకు ప్రతిస్పందన ఆలస్యం కావచ్చు. జగన్మాత ఆదేశంతో ఎప్పటిలాగే ఎప్పుడు కూడా ఈ విశేష అమృతంగమయ ఆధ్యాత్మిక కార్యక్రమములు కేవలం ఆధ్యాత్మిక సేవా భావంతో చేయటం జరుగుతుంది - సత్ చిత్.

త్రిముర్తులైన బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల దేవేరులైన సరస్వతి , మహాలక్ష్మీ , పార్వతిదేవిలకు అత్యంత ప్రీతికరమైన......వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఆశ్వయుజం !

జగన్మాత అయిన పార్వతిదేవి దుష్ట శిక్షణ , శిష్ట రక్షణార్ధం , తొమ్మిది అవతారలను ధరించిన మాసం...ఆయుర్వేద దేవుడు అయిన ' ధన్వంతరీ , త్రిమతాచార్యులలో ద్వైత సిద్ధాంత ప్రవక్త శ్రీ మధ్వాచార్యులు జన్మించిన మాసం. దుష్ట దానవుడైన నరకాసురుడు అంతమొందింపబడి ప్రజలందరికి ఆనందాల వెలుగులను పంచిన దివ్య మాసము ఇది !

ఈ మాసం లోని తొలి తొమ్మిది రోజులు *"దేవి నవరాత్రులు."* సంప్రదాయబద్ధంగా పూజలు చెయ్యాలి అనుకున్న భక్తులు కలశాన్ని స్థాపించి , ముగ్గురు అమ్మల మూలపుటమ్మను ఈ నాటి నుండి తొమ్మిది రోజుల పాటు నియమముగా ఆరాధించాలి. దేవి పూజను ఆశ్వీయుజ మాసం అష్టమి , నవమిలలో పూజించిన భక్తులకు ఎటువంటి శోకాలు దరిచేరవు. దేవి పూజకు ఉత్కృష్టమైన ఈ రోజులలో అమ్మవారిని పూజించి రోజుకొక నైవేద్యం చొప్పున సమర్పించడం మంచిది. కలశ స్థాపనాదులతో పూజించలేని వారు , అమ్మవారి పటానికి గాని , విగ్రహానికి గాని , పుస్తకాలను గాని పూజిస్తూ స్తోత్ర , నామ పారాయణలను చేయవచ్చు.

ఈ విధముగ దేవి నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించడం వల్ల ఆ దేవి సంతృప్తురాలు అవుతుంది. అంతే కాకుండా దుష్ట , గ్రహ పీడలు నశించి అమ్మవారి కృప కటాక్షలు కలుగుతాయని చెప్పబడుతోంది. 

అలాగే , ఈ మాసం లో సప్తమి రోజున గోపూజ చెయ్యవలెను. కపిల గోవును పూజించాలని , కేవలం పంచగవ్యములను మాత్రం స్వీకరించి ఉపవాసము ఉండవలెను. 

పూర్ణిమ నాడు  *"నారదీయ పురాణము"* ను పండితులకు తాంబూలములో వుంచి దానము ఇవ్వవలేను.

పూర్ణిమ నాడు స్త్రీలు జాగరణ చెయ్యటం వలన లక్ష్మిదేవి సంతోషించి , అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది అని శాస్త్ర వచనం.

ఈ నెలలోని బహుళ పక్షములో చతుర్దశి , అమావాస్య తిధులలో దీపాలను దేవాలయం , మఠము ప్రాకారాల్లోను , వీధులు , ఇంటి ముందు సాయంత్రము సమయములో వెలిగించుకోవడంవల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారని చెప్పబడుతోంది. 

ఈ విధముగ ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న మాసం *ఆశ్వయుజ మాసం.*

ఈ మాసం లో చేసే పూజలు , విధుల ఆచరణ వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి. అనంత రూపాలలో విలసిల్లే శక్తిస్వరూపిణి అయిన ఆ తల్లి ఏ రూపములోనైనా , ఏ నామంతోనైనా ఆరాధించవచ్చు. *ఆ తల్లి అమ్మలగన్న అమ్మ !.*

*తనను నమ్మిన భక్తులను ఎట్టి పరిస్థితులలో విడవకుండా కాపాడే కల్పవల్లి  కరుణామయి..ఆ తల్లి !*

*శ్రీ దుర్గా దేవ్యై నమో నమః !*

దేవీ నవరాత్రుల ప్రాశస్త్యం 
అమ్మవారి తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలు
నవరాత్రుల వెనుక చరిత్ర

శరదృతువులో వస్తుంది కాబట్టి ‘శరన్నవరాత్రులు’ అంటారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట.

ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి
తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్ధామ్‌||
పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ
సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం
నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||

1 శైలపుత్రి : దుర్గాశరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మిం చింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దులా మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కల్గించడానికి సంకేతం శైలపుత్రి. 

2. బ్రహ్మచారిణి : దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి.

3. చంద్రఘంట : అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. శిరస్సుపై ధరించిన అర్థచంద్రుడు అర్ధాకృతలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది.

4. కూష్మాండ: నాలుగవ స్వరూప నామం కూష్మాండ. అంటే బూడిద గుమ్మడికాయ ఈమె తేజోమయి. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజదేవి’ అని కూడా అంటారు.

5. స్కందమాత : అయిదో అవతారం స్కందమాత స్కంధుడు అనగా కుమార స్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేతపద్మంతో శోభిల్లుతుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తుందునటానికి సంకేతమే ఇది.

6. కాత్యాయని : దుర్గామాత ఆరో రూపం కాత్యాయని. ‘కొత్స’ అనే రుషి తనకు పార్వతీమాత కుమర్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతనికి కూతురుగా జన్మించింది. కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.

7. కాళరాత్రి : దుర్గామాత ఏడో రూపం కాళరాత్రి. ఈమె శరీరం ఛాయ చీకటివలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈదేవికి కాళరాత్రి అని పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.

8. మహాగౌరి : ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకుమెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. దాని వలన ఆమె శరీరం గౌరవర్ణతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది.

9. సిద్ధిధాత్రి : దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాది స్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి.

*దసరా నవరాత్రుల లో అమ్మవారి అవతారాలు , అమ్మకు పెట్టవలసిన నైవేద్యాలు , శ్లోకాలు*

ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాసించ వలెను.

*నవదుర్గలు :*

ప్రథమా శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థికీ|పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనేతిచ|సప్తమా కాళరాత్రీచ| అష్టమాచేతి భైరవీ|నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితా||
నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించాలి.

*నవదుర్గా ధ్యాన శ్లోకములు*

*శైలపుత్రీ : (బాలా త్రిపుర సుందరి)*

నైవేద్యం : కట్టు పొంగలి

శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||

*బ్రహ్మ చారిణి ( గాయత్రి ):*

నైవేద్యం : పులిహోర

శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ | దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

*చంద్రఘంట ( అన్నపూర్ణ )*

 నైవేద్యం : కొబ్బరి అన్నము

శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా| ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

*కూష్మాండ ( కామాక్షి )*

నైవేద్యం : చిల్లులులేని అల్లం గారెలు

శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ| దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||

*స్కందమాత ( లలిత )*

నైవేద్యం : పెరుగు అన్నం

శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా| శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||

*కాత్యాయని(లక్ష్మి)*

నైవేద్యం : రవ్వ కేసరి

శ్లో|| చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా | కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||

*కాళరాత్రి ( సరస్వతి )*

నైవేద్యం : కూరగాయలతో వండిన అన్నాన్ని

శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||

*మహాగౌరి( దుర్గ )*

నైవేద్యం : చక్కెర పొంగలి (గుడాన్నం)

శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||

*సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి )*

నైవేద్యం : పాయసాన్నం

శ్లో|| సిద్ధ గంధర్వ యక్షాద్యైరసురైరమరైరపి | సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||

*దుర్గా ధ్యాన శ్లోకము :*

శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాంశంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీంధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ॥

*నవదుర్గా అవతారాలు , నైవేద్యం , మంత్రం*

శైలపుత్రి , 
బ్రహ్మచారిణి , చంద్రఘంట , 
కూష్మాండ , 
స్కందమాత , కాత్యాయిని , 
కాలరాత్రి , 
మహాగౌరీ , 
సిద్ధిధాత్రీలను నవదుర్గలుగా పిలుస్తారు. ఈ నవదుర్గలకు సానుకూలంగానే భక్తులు శైలపుత్రి - గాయత్రీదేవి , చంద్రఘంట - అన్నపూర్ణ , 
కూష్మాండ - మహాలక్ష్మి , స్కందమాతను లలితా త్రిపురసుందరి., కాత్యాయిని - సరస్వతీదేవి , 
కాలరాత్రిని దుర్గాదేవి., మహాగౌరి - మహిషాసురమర్దని , 
సిద్ధి ధాత్ని - రాజరాజేశ్వరీదేవిగా అలంకరించి పూజిస్తారు.

తిథులలో అమ్మవారి అవతార విశేషం , ఆ రోజున సమర్పించాల్సిన నైవేద్యం , జపించాల్సిన మంత్రం , గాయత్రి మంత్రం.

పాడ్యమి - బాలా త్రిపురసుందరి - పాల పాయసం

"దినకర కిరణైః జ్యోతి రూపే శివాఖ్యే - హేమ వర్ణే హిమ కర కిరణా భాసమా నేన్దుచూడే
సకల జయకరీ , శక్తి బాలే నమస్తే|| " అని మొదటి రోజున బాల స్వరూపంగా పూజించాలి

*బాల గాయత్రి :*

" ఓం త్రిపురేశ్యచ విద్మహే కామేశ్వర్యైచ ధీమహి - తన్నో బాలా ప్రచోదయాత్‌||"
అనే బాల గాయత్రి సహస్ర గాయత్రి జపించిన మంచి ఫలితం లభిస్తుంది.

విదియ - అన్నపూర్ణేశ్వరి - పాయసన్నం

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి||
మాతాచ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః

*అన్నపూర్ణ గాయత్రి :*

అన్నపూర్ణాయై విద్మహే జగన్మాత్రేచ థీమహి - తన్నో దేవి ప్రచోదయాత్‌||

తదియ - శ్రీమహలక్ష్మి - గుఢాన్నం

మాతర్నమామి కమలే కమలాయతాక్షి - శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వమాతః
క్షీరదజే కమల కోమల గర్భగౌరి - లక్ష్మీప్రసీద సతతం సమతాం శరణ్యే||

*లక్ష్మీ గాయత్రి :*

ఓం మహాలక్ష్యైచ విద్మహే సర్వసిద్ధ్యైచ ధీమహి - తన్నో దేవి ప్రచోదయాత్‌||
"ఓం అమృతవాసిన్యైచ విద్మహే పద్మలోచన్యైచ ధీమహి - తన్నో లక్ష్మిః ప్రచోదయాత్‌||" అని పఠించినా మంచిది.

చవితి - గాయత్రి దేవి - కట్టు పొంగలి అన్నం

ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య థీమహి ధియో యోనః ప్రచోదయాత్‌||
అని పఠించినట్టయితే తల్లి కరుణిస్తుంది.

పంచమి - శ్రీ లలితా దేవి - పులిహోరాన్నం

అనఘాద్భుత చరిత్రా వాంచితార్థ ప్రదాయినీ - ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్య శాసనా||

*శ్రీలలితా గాయత్రి :*

లలితాయై చ విద్మహే కామేశ్వర్యైచ థీమహి ఔతన్నో దేవి ప్రచోదయాత్‌||

షష్టి - శ్రీ దుర్గాదేవి - చిల్లు లేకుండా అల్లపు గారెలు

ప్రథమా శైల పుత్రీచ ద్వితీయ బ్రహ్మచారిణే - తృతీయా చంద్రఘాటేతి కుష్మాండతేతి చతుర్థికీ
పంచమాస్కంద మాతేతి షష్టా కాత్యేయనేతిచ - సప్తమ కాల రాత్రిచ అష్టమా చేతి భైరవీ
నవమా సర్వస్థిశ్చేత్‌ నవదుర్గా ప్రకీర్తితా||

*దుర్గా గాయత్రి :*

ఓం మహా దుర్గాయై విద్మహే సర్వ శక్తయైచ థీమహి - తన్నో దుర్గా ప్రచోదయాత్‌

సప్తమి - మూల నక్షత్రం - సరస్వతి దేవి - కొబ్బరి అన్నం

సరస్వతీత్వియం దృష్టా వీణా పుస్తక ధారిణీ - హంస వాహన సమాయుక్తా విద్యాదానకరీ మమ||

*సరస్వతీ గాయత్రి :*

సరస్వత్యైచ విద్మహే బ్రహ్మసతియైచ ధీమహి - తన్నో వాణీ ప్రచోదయాత్‌||

అష్టమి - మహిషాసురమర్ధని - శాకాన్నం , కేసరిబాత్‌

జయ జయహే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే

*మహిషాసుర మర్ధిని గాయత్రి :*

మహిషష్యైచ విద్మహే జగన్మాత్రేచ ధీమహి - తన్నో మాతా ప్రచోదయాత్‌||

నవమి - శ్రీరాజరాజేశ్వరి - చిత్రాన్నం , లడ్డూలు

అంబా పాలిత భక్తరాజరనిశం అంబాష్టకం యః పఠేత్‌
దంబాలోక కటాక్షవీక్ష లలితా ఐశ్వర్య మవ్యాహతా
అంబాపావన మంత్ రాజ పఠనాద్ధంతీశ మోక్ష ప్రదా
చిద్రూపీ వరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ||

*రాజరాజేశ్వరి గాయత్రి :*

రాజేశ్వర్యైచ విద్మహే శ్రీభవానీయైచ ధీమహి - తన్నో దేవి ప్రచోదయాత్‌||
ఓం శ్రీ మాత్రే నమః

తొమ్మిది రోజుల జగన్మాత విశిష్టత తెలుసుకుందాం.



*శుభం - స్వస్తి*

No comments:

Post a Comment