🌺అమృతం గమయ🌺
శోభకృత నామ సంవత్సర శరన్నవరాత్రులు
15 అక్టోబర్ - ఆదివారం - మొదటిరోజు.
*మొదటి రోజు శైలపుత్రి దుర్గ*
శ్లో ॥ వందే వాంచిత లాభాయ చంద్రార్థ కృత శేకరామ్
వృషారూడాం శూలధారాం శైలపుత్రీం యశస్వినీమ్ ॥
శ్రీ దుర్గ దేవి అవతరాలు తొమ్మిది . ఈ తొమ్మిది అవతారాలు నవదుర్గలుగా ప్రసిద్ధి . మొదటి అవతారం 'శైలపుత్రి' శైలరాజగు హిమవంతుని కూతురై జన్మించింది . కావున ఈ దేవి శైలపుత్రిగా వాసిగాంచినది . ఈ దేవి వృషభవాహన . కుడిచేత త్రిశూలం,ఎడమచేత పద్మం ధరించి ఉంటుంది .
పూర్వం మేనకా హిమవంతులకు బ్రహ్మవరంతో మైనాకుడు అనే గొప్ప పర్వతం జన్మించింది . ఈ మైనాకపర్వతం ఇంద్రుడి వజ్రాయుధానికి భయపడి సముద్ర గర్భంలో దాగింది .
అప్పుడు పుత్రవియోగాన్ని భరించలేని మేనకహిమవంతులు తిరిగి సంతానం కోసం అదిశక్తియైన జగన్మాత తమకు కూతురై జన్మించాలని భక్తితో శక్త్యారాధాన చేశారు . వారి భక్తికి మెచ్చి దాక్షయనిదేవి ప్రత్యక్షమై వారి కోరిక ప్రకారం వారికి పుత్రికై జన్మించింది . ఈమె బాల్యం నుండి ఈశ్వరుడిని ఆరాధన చేస్తూ ,ఈశ్వరుడిని పతిగా పొందాలని నిత్యం పరమేశ్వరుడినే ధ్యానిస్తూ పెరిగి పెద్దయై యుక్తవయసునకు వచ్చింది . ఆ సమయములో నారద మహర్షి హిమవంతుని చెంతకు వచ్చి ఈమే ఈశ్వరుడిని పతిగా పొందగోరి అవతారం దాల్చిందని ఆమె పూర్వ వృత్తాంతం చెప్పి పార్వతి మనోభీష్టాన్ని అతనికి ఎరుకచేసి వెళ్ళాడు .
కొంత కాలానికి తపస్సుకై హిమవత్పర్వతం చెంతకు రాగా హిమవంతుడు భక్తితో స్వాగతం పలికి ఆ మహాదేవుని తపస్సునకు అనువైన చోటును ఏర్పరచి పార్వతిని శివునికి పరిచర్య చేయటానికి శివుని అజ్ఞానుసారంగా నియమించి వెళ్ళాడు . పార్వతి చేస్తున్న పరిచర్యలకు ఆమె భక్తిశ్రద్ధలకు పరమశివుడు ఎంతో సంతషిచాడు . కొంతకాలం గడిచిన తరువాత మన్మధుని వల్ల మనోవికారం చెందిన ఈశ్వరుడు తపస్సు విడిచి కైలాశం చేరుకున్నాడు . కాని పరమశివుడు పార్వతి చూపిన భక్తిశ్రద్ధలను , చేసిన ఉపచారాలను మరువలేక పోయాడు . ఆమె జగదేక సౌందర్యరూపంపై అనురాగాన్ని పెంచుకొన్నాడు. పార్వతిని పెళ్లాడగోరి సప్త ఋషులను పిలచి ఆ మునీశ్వరులతో ఇలా చెప్పాడు
"ఓ సప్తమహర్షులారా పార్వతీదేవి యొక్క అనన్య భక్తికి నేనెంతో సంతసించాను , ఆమె నన్ను పతిగా గోరి నిష్ఠతో తపస్సుచేసింది . అందుకు నేను ఆమెను వివాహమాడ దలచాను . "
"మీరువెళ్ళి ఈ వృత్తాంతం హిమవంతునకు చెప్పి తరువాత పార్వతి తెలియపరచి ఈ కల్యాణానికి మీరే పురోహితులై వ్యవహరించాలని " చెప్పాడు .
అప్పుడా సప్తర్షులంతా ఏక కంఠముతో దేవా మహాప్రసాదం విశ్వజనని జనుకులైన మీ కల్యాణాన్ని నిర్వహించటానికి మేమే పెండ్లి పెద్దరికాన్ని వహించటం కన్నా వేరొక భాగ్యమేముంది ? అని పరమశివుని శతవిధాలా ప్రస్తుతించి హిమాచలం వేళ్ళి మేనకహిమవంతులకు , పార్వతీదేవికి పరమశివుని ఆజ్ఞను వినిపించారు.అది విన్న హిమవంతుడు మహానందంతో సమ్మతించాడు . పార్వతిపరమేశ్వరుని కళ్యాణానికి సప్తఋషులు, బ్రహ్మ, విష్ణువు ,దేవేంద్రాదుల సమక్షంలో నారదమునీంద్రుని పర్యావేక్షణలో వైభవంగా జరిపించారు. ఆ విధంగా శైలపుత్రిని శివుడు పరిగ్రహించాడు . ఇది శైలపుత్రి అవతార విశిష్ఠత. శరన్నవరాత్రుల్లో ఈ దేవిని ఉత్సవముర్తిగా అలంకరించి తొలినాడైన పాడ్యమినాడు పూజించి , ఉపాసించి భక్తులు తరిస్తారు .
No comments:
Post a Comment