🌺 *అమృతం గమయ* 🌺
*20 అక్టోబర్ శుక్రవారం ఆరవ రోజు దుర్గా నవరాత్రి -ఆరవ దుర్గా అవతారము - కాత్యాయని దుర్గ*
కాత్యాయనీ దుర్గాదేవి, నవదుర్గల్లో ఆరో అవతారం. నవరాత్రుల్లో ఆరవ రోజైన ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు భక్తులు. అమరకోశం పార్వతీదేవికి ఇచ్చిన రెండో పేరు కాత్యాయనీ.
*స్వరూపం*
ఈమె స్వరూపము దివ్యము, భవ్యము. బంగారు వర్ణము గలది. నాలుగు భుజములతో విరాజిల్లుచుండును. ఈమె కుడిచేతిలో ఒకటి అభయ ముద్రను, మఱియొకటి వరముద్రను కలిగియుండును. ఎడమచేతిలో ఒకదానియందు ఖడ్గము, వేఱొకదానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమెయు సింహవాహన.
*విశిష్టత*
శాక్తేయంలో ఈ అమ్మవారిని శక్తి, దుర్గ, భద్రకాళి, చండికల అపర అవతారంగా భావిస్తారు. పతంజలి రాసిన మహాభాష్యంలో కాత్యాయనీ అమ్మవారిని దుర్గదేవిగా వర్ణించారు.
యజుర్వేదంలోని త్రైతీయ అరణ్యకలో మొట్టమొదటే అమ్మవారి ప్రస్తావన వస్తుంది. స్కంద పురాణం ప్రకారం సింహవాహిని అయిన ఈ అమ్మవారు మహిషాసుర సంహారంలో పార్వతీదేవికి సహాయం అందించింది. నవరాత్రుల సమయంలో
అమ్మవారిని భారతదేశమంతటా పూజిస్తారు. మార్కండేయ పురాణం, దేవి భాగవతాలలో కూడా ఈ అమ్మవారి గురించి ప్రస్తావన చూడవచ్చు. బౌద్ధ, జైన గ్రంధాలలో కూడా ఈ అమ్మవారి గురించి ఉండటం విశేషం. ముఖ్యంగా కాళికా పురాణంలో కాత్యాయనీదేవి గురించి ప్రస్తావస్తూ ఓడిశా ప్రదేశం జగన్నాధునికీ, కాత్యాయనీ దేవికి పీట వంటిది అని వివరించారు.
హిందూ శాస్త్రాలు, యోగ, తంత్ర విద్యల ప్రకారం కాత్యాయనీ దేవి అజ్ఞా చక్రానికి అధిష్ఠాన దేవత. ఈ అమ్మవారిని ధ్యానించడం వల్ల ఏకాగ్రత బాగా ఉంటుందని విశ్వాసం. ఈ దేవిని భక్తితో సేవించినవారికి ధర్మార్ధకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్ధముల ఫలములు లభించును. రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరమగును. జన్మజన్మాంతర పాపములు నశించును.
*కథ*
"కాత్యాయనీ మాత" బాధ్రపద బహుళ చతుర్దశి (ఉత్తరభారత పంచాంగ సంప్రదాయము ననుసరించి ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి) నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట పుత్రికగా అవతరించింది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను.
కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని పడయుటకు గోకులములోని గోపికలందఱును యమునాతీరమున ఈమెను పూజించిరి.
*ధ్యాన శ్లోకం:*
*చంద్రహాసోజ్వలకరా శార్దూలవరవాహనా!*
*కాత్యాయినీ శుభం దద్యాదేవి దానవఘాతినీ!!*
No comments:
Post a Comment