జ్ఞాపకాల తేనెటీగలు (లేక)అమెరికా మోజు!
💐💐💐💐💐💐
మా మనవరాలు పదేళ్ళ తర్వాత
అమెరికానుంచి ఇండియా వస్తోంది.
ఇంక మా అమ్మాయి, అల్లుళ్ళ హడావిడి
ఇంతా అంతా కాదు.
ఇవాంకా ట్రంపు వచ్చినప్పుడు
మన హైడ్రాబాడ్ చేసినంత
హడావుడి పడిపోతున్నారు !
ఇంటికి రంగులు వేయించేశారు !
ఇంట్లో ఎప్పణ్ణించో వాడుతున్న సామాన్లన్నీ మార్చేశారు !
వీళ్ళు - వాళ్ళు రోజూ వీడియో కాల్స్ లో
మాట్టాడుకుంటూనే వుంటారు,
పిల్లల్నీ, ఇల్లూ వాకిళ్ళు , కొత్తగా కొనుక్కున్న వస్తువులు, రోజూ ఒండుకునే కూర దగ్గిర్నుంచీ
వాళ్ళ ముద్దుల కుక్కపిల్ల దాకా అన్నిటినీ
చూస్తూనే వుంటారు.
వీళ్ళు నాలుగైదుసార్లు అమెరికా వెళ్ళొచ్చారు కూడాను.
ఇన్నేళ్ళుగా హైడ్రాబాడ్ లో వున్నా, చార్మినారూ,
గోల్కొండా చూళ్ళేదు కానీ, అమెరికాలో వున్న
నదులు, పర్వతాలు, జలపాతాలు, పార్కులు,
వీళ్ళకి కొట్టినపిండి అయిపోయాయి !
మణిపూరు, మేఘాలయ, ఎక్కడున్నాయో
తెలీదు కానీ, ఒహాయో, సియాటిల్లు వీళ్ళకి
బాగా తెలుసు !
😊
చిక్కడపల్లి వేంకటేశ్వరుణ్ణి చూళ్ళేదు కానీ,
పిట్స్ బర్గ్ దేవుడు సుపరిచితమే !
😊😊
వాళ్ళు తిరిగిన రాష్ట్రాలన్నీ వీళ్ళనీ తిప్పేశారు ,
అన్నీ చూపించారు.
ఎటొచ్ఛీ వైట్ హౌసు బయట్నించి చూసినపుడు, లోపలున్న ట్రంప్ ని చూళ్ళేదని బాధపడిపోతుంటుంది, మా అమ్మాయి !
😊
వీళ్ళు అమెరికా వెళ్ళే ముందు ప్రతిసారీ ఏవేవో కొనేస్తారు, వాళ్ళకిష్టమైనవన్నీ పురమాయించి, తెప్పించి, కుట్టించి, ఒండించి, 'ఎన్నారై ప్యాకింగులు'
(ఇదో కొత్త మాట పుట్టుకొచ్చింది) చేయించి,
నాలుగు డకోటా పెట్టిలు నిండిపోగా, తూనికలు - కొలతలు చేశాక, కొన్ని తీసేసి, కొన్ని పెట్టి,
ఆఖరి నిమిషం దాకా హడావిడే...హడావుడి !
అర్ధరాత్రి పూట పెద్ద క్యాబ్ చేయించుకుని, ఎగిరిపోతుంటారు.
ఇంటి కాపలాకి మేం వున్నాంగా !
👍👍
💐💐
ఆర్నెల్ల తరవాత, ఇక్కడ దొరకనివన్నీ అక్కణ్ణించి మోసుకొచ్చి, రాగానే మూటలు విప్పి, ఎవరెవరికి ఏమేమి తెచ్చారో చూపిస్తూ, పంచిపెట్టడం
పెద్ద ఆనందకర ప్రహసనం !
నా పడక్కుర్చీలో కూచుని, అవన్నీ చూస్తూ ఆనందించడం నాకు చాలా ఇష్టం.
వాళ్ళు అక్కణ్ణించి అందరికోసం తెచ్చిన
వింత వింత వస్తువులు, సెంట్లు, బట్టలు,
మెత్తటి స్వెట్టర్లు, పెద్ద పెద్ద రగ్గులు,
విటమిన్ మాత్రలు చూపిస్తుంటే,
వీళ్ళ మొహాల్లో వచ్చే వింత వెలుగు చూడ్డం
చాలా బాగుంటుంది.
ఇప్పుడిలాంటివన్నీ "ఇంటింటి రామాయణం" అయిపోయాయిగానీ...
💐💐
మా రోజుల్లో మేము చేసిన పుట్టింటి ప్రయాణాలు,
ఆనాటి ఆప్యాయతలు, ప్రేమలు, ఇంకా కళ్ళముందే మెదులుతుంటాయి !
అదొక మధురానుభూతుల తేనెపట్టు !
ఏ తెల్లారుకట్లో మెలకువొస్తే, మనసు ఆ తేనెతుట్టని కదిలిస్తూనే ఉంటుంది. ఆ తేనెటీగలు మీద వాలి,
తియ్యటి తేనెను చిలకరిస్తాయి కానీ,
అస్సలు కుట్టవు !
ఇప్పుడు ఈతరం వాళ్ళకున్న డబ్బు, దస్కం,
బ్యాంకు బేలన్సులు, క్రెడిట్ కార్డులు, ఇరవై రకాల నగలు, లెక్కలేనన్ని బట్టలు, రెండు - మూడు కార్లు చూస్తుంటే ఆనందంగా ఉంటుంది.
మా అమ్మా నాన్నలకంటే మేము, మాకంటే మా పిల్లలు, వాళ్ళకంటే వాళ్ళ పిల్లలు ఆర్ధికంగా, సామాజికపరంగా ఎదగడం ఆనందమేగా !
💐💐
మా చిన్నతనంలో మా తల్లితండ్రులు సామాన్య మధ్యతరగతి వాళ్ళు. మేము ముచ్చటగా
ముగ్గురప్పచెల్లెళ్ళం, ముగ్గురన్నదమ్ములం...
మా అమ్మా నాన్నల ప్రేమానురాగాలతో
పెరిగి పెద్దయ్యాం.
మా పుట్టిల్లు పాలకొల్లులో ఒక ఆరుగదుల
పెంకుటిల్లు, పెద్ద దొడ్డి, చెట్లు - చేమలు చెప్పనే అఖ్ఖర్లేదు. మట్టిల్లు !
అయితే ఏం, నైనిటాల్ కి నాలుగో ఇల్లు,
స్వర్గానికి పక్కిల్లే !
😌😌
మా నాన్న ఎలిమెంటరీ స్కూలు టీచరుగా పనిచేస్తూ, ట్యూషన్లు చెప్పుకుంటూ, మా ఆరుగుర్నీ కనీ, పెంచి, పెద్దచేసి, పెళ్ళిళ్ళు కూడా చెయ్యడానికి వాళ్ళ ఆదాయాలు ఎలా సరిపోయేవనేది, నాకు ఎప్పటికీ అంతుపట్టని భేతాళ ప్రశ్నే !
మా చిన్నతనం అంతా ఎంతో సందడిగా,
ఆనందంగా గడిచిపోయింది.
పెద్దాళ్ళు ఏం ఇబ్బందులు పడ్డారో, ఎన్ని అప్పులు చేశారో మాకు తెలీదు కానీ, ఎప్పుడూ ఏలోటూ రాకుండా పెంచారు.
పుట్టిన్రోజులు, పండగలు, కొత్తబట్టలు, అన్ని రకాల పిండివంటలతో ఆనందంగా గడిచిపోయాయి.
దానికి తోడు, నిత్యం అతిధులు, అభ్యాగతులు
ఇంట్లో ఉంటూనే ఉండేవారు.
ఇంతమందికి తిండికి, మర్యాదలకు ఏలోటూ
వచ్చేది కాదు.
అన్ని కాలాల్లో వచ్చే పళ్ళు, కూరలు, పరిమితి లేకుండా, ఇంతమందీ బొక్కేస్తూనే ఉండేవాళ్ళం.
మా పెళ్ళిళ్ళు కూడా, మా నాన్న మంచి సంబంధాలు చూసి, బాగా చేశారని చెప్పుకునేవారు.
ఇప్పుడు మావారు పెద్ద ఉజ్జోగం చేసి, ఉన్న ఇద్దరు పిల్లలకీ చదువులు _ పెళ్ళిళ్ళు చెయ్యడం పెద్ద కష్టం ఏమీ కాదనిపిస్తుంది.
ఇంక తరవాత తరం వాళ్ళ గురించి చెప్పేదేముంది ?
అసలు మా అమ్మా నాన్నలతో ఎవరినీ పోల్చలేం అనిపిస్తుంది.
నా ఎనిమిదో పుట్టిన్రోజుకి పట్టు పరికిణీ కుట్టించమని మా అమ్మని పీకి పాకం పట్టేసి, చివరికి సాధించినప్పుడు ఏమీ తెలియని ఆ వయసులో
ఎంత ఆనందించానో....
అప్పుడు మా నాన్న చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని,
మా నాయనమ్మ వైద్యానికి చాలా ఖర్చయిందని, తరవాత ఎప్పుడో మా అమ్మ చెబితే,
నామీద నాకే అసహ్యం వేసింది.
"నన్ను గట్టిగా కొట్టి, పరికిణీ లేదు, ఏమీ లేదు, నోరు మూసుకో" అని ఎందుకు నా నోరు మూయించలేదని
మా అమ్మని అడిగితే,
"మీ నాన్నకి ఆడపిల్లలమీద అంత ప్రేమమ్మా,
ఏదీ కాదనలేరు. చివరికి బట్టలకొట్టు షావుకారు
దగ్గిర అరువు తీసుకుని, వాళ్ళబ్బాయి ట్యూషను
డబ్బులకి సరిపెట్టారు !" అని చెబితే, ఆరోజు
నాకు గుండెలు పిండేసినట్టయిపోయింది !
😔😔
ఆ సంఘటన తల్చుకుంటే ఇప్పటికీ మనసు
ఏదోలా అయిపోతుంది.
వాళ్ళకి ఎన్ని రకాల అవసరాలున్నా,
"మాకు ఇది కావాలి, ఇలా చెయ్యండి"
అని వాళ్ళు అడగలేదేంటి ?
😱😱
పైగా, "మాకేమీ వద్దు, మీరు...
మీకు, మీ పిల్లలకీ చూసుకోండి,
చాలా అవసరాలుంటాయి" అనేవారు !
మాకు తోచిన విధంగా వాళ్ళకోసం కొన్ని
కొన్నా, చేసినా, మాకు తృప్తిగా లేదు.
ఇప్పుడు కనక మా అమ్మా నాన్నా బతికుంటే,
వాళ్ళకి ఎన్నో కొనిపెట్టేసి, పుణ్యక్షేత్రాలన్నీ
విమానాల్లో తిప్పేసి, చూపించాలన్నంత
ఆవేశం వచ్చేస్తుంది.
మా అమ్మకి అప్పుడప్పుడు, ఏదో ఒక సందర్భంగా
నాలుగు చీరలు కొన్నాను కానీ, మా నాన్నకి
ఒఖ్ఖ జామారు అయినా ఎందుకు కొనలేదా
అని బాధ వచ్చేస్తుంటుంది !
😔😔
మా అమ్మా నాన్నలు చిరునవ్వులు చిందిస్తూ,
నా సెల్ ఫోనులో కనిపిస్తూనే వుంటారు,
వాళ్ళ దీవెనలతో వాళ్ళ పిల్లలం అందరం
జీవితంలో పైకి వచ్చాం.
మేము, మా పిల్లలు, మా మనవలూ కల్లో కూడా ఊహించని అభివృద్ధి సాధించాం కానీ,
వాళ్ళు మాత్రం మధ్య తరగతి జీవితాలే గడిపి,
వాళ్ళు బావున్నంత కాలం, అందర్నీ ఆదరిస్తూనే,
మాకు పుట్టింటి ప్రేమానురాగాలు పంచుతూనే
వెళ్ళిపోయిన ధన్యులు !
🙏🙏
మాకు మాత్రం వాళ్ళకి చెయ్యవలసినంత చెయ్యలేకపోయామనే అపరాధభావం
ఎప్పటికీ పోదు !
😥
💐💐
ఇద్దరు పిల్లలతో, నరసాపురం బొగ్గింజను
పాసింజర్ రైల్లో వెళ్ళినప్పుడు,
మా పాలకొల్లు స్టేషను వస్తోందంటే,
అన్ని గంటలు చేసిన ప్రయాణ
బడలిక ఏమైపోయేదో !
మా ప్రయాణానికి పది రోజులు ముందే ఈయన కార్డుముక్క రాసి పడేసేవారు.
రైలుని ఎప్పుడైనా ఔటర్లో ఆపేస్తే,
వెంఠనే అక్కడే దిగిపోయి,
నడిచి వెళ్ళిపోవాలనిపించేది !
పుట్టింటి మహత్యం అలాంటిది కాబోలు !
"పాలకొల్లు" అనే బోర్డు కనబడితేనే...
ఏదో పులకింత !
అందరికీ అలాగే ఉంటుందో,
మరి నాకే ఉంటుందో తెలీదు.
మా అన్నయ్య స్టేషన్ లో అన్ని పెట్టెలూ
వెతుక్కుంటూ వచ్చి, ముందు పిల్లల్ని,
తరవాత నా ట్రంకు పెట్టినీ దింపి,
"రావే, అమ్మాయ్ " అనే మాట,
ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది.
వాడికి నేనన్నా, మా పిల్లలన్నా, ఎంత ప్రేమో !
అసలు అలాంటి ప్రేమలు చూపించేవాళ్ళు
ఉండడమే అదృష్టం.
అలాంటి ప్రేమాభిమానాలు ఉన్నచోట మనలో
మంచి మంచి హార్మోన్లు ఉత్పత్తి అయి,
ఆరోగ్యాన్నిస్తాయని ఎక్కడో చదివాను.
నా ట్రంకు పెట్టి నెత్తిమీద పెట్టుకుని, మా అమ్మాయి చెయ్యి పట్టుకుని ముందు వాడు నడుస్తుంటే,
వెనకాల మా చంటాణ్ణి ఎత్తుకుని నడుస్తున్న నాకు,
తెలియని ఆనందం, గర్వం వచ్చేవి.
రిక్షా మాట్లాడి రడీగా వుంచేవాడు.
మా పిల్లలకి రిక్షా ఎక్కడం ఎంత సరదానో !
ఆ రిక్షా అతను నెమ్మదిగా తొక్కుతుంటే,
ప్రయాణం ఎప్పటికీ తెమలనట్టు ఉండేది.
దూరంనుంచి మా పుట్టింటి పెంకుటిల్లు,
వీధివైపున్న రెండు కొబ్బరి చెట్లు, ఒక బాదంచెట్టు,
మందార పువ్వులు మాకు స్వాగతం పలుకుతున్నట్టు అనిపించేది.
ఇప్పుడందరూ " సెంటిమెంటల్ ఫూల్స్ " అని
పేరెట్టారు కానీ, మేము అదే !
ఇంక మా అమ్మా- నాన్నల్ని పట్టేసుకున్నప్పుడు
వచ్చిన ఆనంద బాష్పాల్ని ఇప్పటికీ దాచుకున్నాను.
మా అమ్మ నాకిష్టమైన ములక్కాళ్ళ కూర,
మజ్జిగపులుసు, చేసి ఉంచేది.
పిల్లలకోసం పిండివంటలు సరే సరి !
మా వదిన.. మాకు వదిన కాదు...
మా పెద్దక్కకంటే ఎక్కువగా వుండేది.
'మేవెంత అదృష్టవంతులం' అనిపించేది.
ఆ అనుభూతులు, ఆనందాలు, అప్పటి నవరసభరితమైన బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లాగ, మనసులోనే పదిలంగా దాచుకుంటుంటే,
మనసు తేలిపోతుంటుంది.
ఆరోజులు మళ్ళీ రావని తెలుసు... కానీ, అలనాటి జ్ఞాపకాల తేనెటీగలు ఆ మకరందాన్ని అందిస్తూనే వుంటాయి.
"ఆనందమె జీవిత మకరందం"
💐💐💐💐💐💐💐💐
(ఒక మిత్రుడు వాట్సప్ లో పంపింది.రచయిత ఎవరో తెలియదు)
No comments:
Post a Comment