Monday, November 6, 2023

వివేకమైన ఆలోచన వల్ల వచ్చే వైరాగ్యమే మెరుగైన వైరాగ్యం...వైరాగ్యం కలగడానికి మూడు కారణాలు ఉన్నాయి....

 *సత్సంగం*

ఆనందం అనేది నీకు ఎన్ని వస్తువులు ఉన్నాయి అన్నదానిమీద కాక 
వాటిలో ఎన్ని ఉపయోగించకుండా నువ్వు ఆనందంగా ఉన్నావు అన్నదానిమీద ఆధారపడి ఉంటుందని వేదాంతలు చెప్తారు 

అయితే  వస్తువులు త్యాగం చేయటం ద్వారా అవలంబించే వైరాగ్యం కన్నా 
వివేకమైన ఆలోచన వల్ల వచ్చే వైరాగ్యమే మెరుగైన వైరాగ్యం

మనసు భగవంతునిలో లీనమైనప్పుడే వైరాగ్యం వస్తుంది

జీవితంలో కొంతమంది వ్యక్తుల  సాంగత్యం వలన ఏర్పడిన కొన్ని అనుభవాల వల్ల కూడా వైరాగ్యం వస్తుంది 
అప్పుడు ఆ వైరాగ్యం 
  మళ్ళీ పడిపోకుండా ఎరుక తో ఉంటూ
ఆ వ్యక్తులతో ఆచితూచి మెలగాలి

స్వధర్మాన్ని వదిలేయటం వైరాగ్యం కాదు

కొన్ని ఇతర కారణాల వల్ల కలిగే వైరాగ్యం వల్ల శాశ్వత లాభం ఉండదు. 
వైరాగ్యం కలగడానికి మూడు కారణాలు ఉన్నాయి

ఒకటవది దుఃఖం వలన కలిగే వైరాగ్యం.. 
ధన నష్టం, గృహ నష్టం, భార్యా పుత్రుల వియోగం వలన కలిగే వైరాగ్యం ఇది 
కానీ ఈ దుఃఖానికి కారణమైన పరిస్థితులు మారిపోతే వైరాగ్యం కూడా పడిపోతుంది

 రెండవది భయము చేత కలిగే వైరాగ్యం 
ఆరోగ్య భయం, రాజదండన భయం ,సమాజ భయం ,గౌరవ భయం ,ప్రతిష్ట భయం ,జనన మరణాల భయం ,నరక భయం మొదలైన వాటి వల్ల వైరాగ్యం కలుగుతుంది
 ఈ వైరాగ్యం వల్ల కొన్ని కర్మలు చేయకపోవచ్చు 

మూడవది వివేకం వల్ల కలిగే వైరాగ్యం
 దుఃఖం వల్ల కలిగే వైరాగ్యం, భయం వల్ల కలిగే వైరాగ్యం కన్నా వివేకం వలన కలిగే వైరాగ్యం శ్రేష్టమైనది 

ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం అనే ఆలోచన ద్వారా ఈ లోకంలోని సుఖాలన్నీ తాత్కాలికమైనవని గ్రహించి 
వాటి మీద అనురాగం పోయి భగవదనుభూతితో ఉంటూ వైరాగ్యంతో మెలగడం వివేక వైరాగ్యం

ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి పోయే ఈ వైరాగ్యం ఆధ్యాత్మికంగా మేలు చేసే మంచి వైరాగ్యం.

ఓ దంపతులకు వైరాగ్యం కలిగి  సన్యాసం స్వీకరించడానికి ఇద్దరూ ఓ ఆశ్రమానికి వెడుతున్నారు
 కొంత దూరం వెళ్ళాకా
 దారిలో భర్తకు ఒక సంచీ కనబడింది
 అందులో బంగారు ఆభరణాలు ఉన్నాయి
 వీటిని చూస్తే భార్య మనసు సన్యాసం నుంచి మళ్ళుతుందేమో అనుకుని భార్యకి కనపడకుండా దాచబోయాడు 
ఇంతలో భార్య చూడనే చూసింది 
అదేమిటి ,అందులో ఏమున్నాయి? అని అడిగింది
 అప్పుడు భర్త తన మనసులోని సంగతి బయటపెట్టాడు 
నా సంగతి సరే *మీకు ఇంకా మట్టికీ, బంగారానికీ తేడా తెలుస్తోందా? అయితే మీకు ఇంకా సన్యసించే అర్హత రాలేదు. లేదంటే ఆ సంచీని చూడగానే అక్కడే వదిలేసేవారు నేను వెళ్తున్నా* అంటూ భర్త కంటే ముందే వెళ్ళిపోయింది సన్యాస స్వీకారానికి.

వైరాగ్యం అనేది తాత్కాలిక వైరాగ్యం కాకుండా
 అసలైన వైరాగ్యాన్ని పొందగలగటం కూడా
 ఒక భాగ్యమే

No comments:

Post a Comment