Tuesday, November 7, 2023

పిసినారి పెద్దమనిషి

 1901.    2-7.  270223-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


            *పిసినారి పెద్దమనిషి*
                 ➖➖➖✍️

*పరమ పిసినారి  సోమనాథం తినీతినకా  కూడబెడుతున్న సమయంలో ఊళ్ళో దొంగల బెడద ఎక్కువగా వున్నదని తెలిసింది.*

*దాంతో తను కూడబెట్టుకున్న సంపదనంతా భద్రంగా దాచి పెట్టాలని నిర్ణయించుకుని భార్య సుగుణను పిలిచి- "మనం సంపాదించిన సంపద మొత్తాన్నీ రెండు భాగాలు చేసి పంచుకుందాం. నేను నా భాగాన్ని నాకు తెలిసిన చోట దాస్తాను. నీ భాగాన్ని నువ్వు నీకు తెలిసిన చోట దాచు. ఒక వేళ దొంగలు పడి మన ఇల్లు కొల్లగొడితే ఒక భాగం పోయినా ఇంకో భాగం దక్కుతుంది" అన్నాడు.*

*"మీరు చెప్పినట్టు చేస్తాను; కానీ నా భాగాన్ని నేను ఎక్కడ దాచానో మీరు అడగకూడదు"* అంది సుగుణ.

*'ఎక్కడైనా దాచి పెట్టనివ్వు, సొమ్ము క్షేమంగా ఉంటే అంతే చాలు' అనుకున్న సోమనాథం, ఆమె షరతుకు ఒప్పుకున్నాడు.*

*కొంతకాలానికి అనుకున్నట్లుగానే దొంగల ముఠా కళ్ళు ఊళ్ళోని భాగ్యవంతుల ఇళ్ళన్నిటిమీదా పడ్డాయి. అందరినీ‌ నిలువునా దోచారు. సోమనాథం ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దొంగల పాలయ్యాయి. అతను రహస్యం గా దాచుకున్న సొమ్మంతా దొంగలపాలైంది. లబోదిబో మన్నాడు.*

*అంతలో భార్య సుగుణ వచ్చి ఓదార్చింది. ఆయన  భార్యని- "కనీసం నేను నీకు దాచమని ఇచ్చిన సొత్తయినా జాగ్రత్తగా ఉందా?" అని అడిగాడు.*

*"జాగ్రత్తగానే ఉందిలెండి!" అన్నది సుగుణ.*

*"పద, చూద్దాం!" అని సోమనాథం తొందరపడ్డాడు.*

*సుగుణ సోమనాథాన్ని ఒక మురికివాడకు తీసుకెళ్ళింది.*

*ఆ వాడ జనం మొత్తం పరుగున వచ్చి వాళ్ళిద్దరికీ మర్యాదలు చేశారు. "అమ్మా, మీరు చేసిన సాయం వల్ల మేము ఇలా చల్లగా బ్రతుకుతున్నాం. మీరు ఇచ్చిన డబ్బుతోనే మేము పొలాలు కొనుక్కొని సాగు చేసుకుంటున్నాం. మా పిల్లలు చదువుకుంటున్నారు. మా మాట ప్రకారం మేము ప్రతి నెలా మీకు కొంత డబ్బు, అలాగే పంటలో వాటాగా సంవత్సరానికి ధాన్యం పంపిస్తాం" అన్నారు.*

*వాళ్ళ అభిమానం, గౌరవ మర్యాదలు చూసిన సోమనాథం కళ్ళు చెమ్మగిల్లాయి. *

*"నేను దాచింది దొంగల పాలైంది, కాని నువ్వు దాచినది పదింతలై మనకు మంచి చేస్తోంది. ఒకప్పుడు సంపాదించడమే గొప్ప అనుకున్నాను. కానీ 'ఇతరులకు సహాయపడడం అంతకంటే గొప్ప' అని తెలియజేశావు నువ్వు. అసలైన సంపదంటే ఏమిటో ఇప్పుడు తెలిసి వచ్చింది నాకు!"* అన్నాడు సోమనాథం, విప్పారిన ముఖంతో .

*భర్తలో వచ్చిన మార్పును చూసి సుగుణ ఎంతో ఆనందించింది.*

*ప్రజా సేవ చేయడానికి మేము పుట్టాము అన్నట్టు నటిస్తున్న మహా నాయకులారా, అలాగే అభిమానులు అంటే మా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ అని  నటించమంటే జీవిస్తున్నా సినిమా హీరో లా రా, ప్రజల అమాయకత్వాన్ని అభిమానాన్ని సొమ్ము చేసుకొని మీ సంపాదన పంచుకుంటున్న మహనీయులారా!*

*మీరు సంపాదిస్తున్న సొమ్ము అక్రమమో లేక సక్రమమో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం, కానీ కనీసం దోచుకున్న సొమ్ముని దాచుకోకుండా తిరిగి ఏదో ఒక రంగంలో పెట్టుబడి పెడితే  ఆ పెట్టుబడి ఎంతో కొంత మందికి జీవనాధారాన్ని చూపిస్తుంది. మీ సొమ్ము మరింత భద్రంగా చాలాకాలం కంచుకోటలో కళాఖండం లా  కాపలా కాస్తారు మిమ్మల్ని నమ్మిన ఈ అమాయకపు  గొర్రెలు.*

*ఆ విధంగానైనా ఈ పాపానికి ఎంతో కొంత ప్రాయశ్చిత్తం అయినా జరుగుతుంది. లేదంటే మీరు అక్రమంగా దాచుకున్న సొమ్ము పరులపాలు అయిపోతుంది. కనీసం వాటిని  మీ తరువాతి తరాలవారు కూడా అనుభవించే అవకాశం లేకుండా పోతుంది.*

*అందరం కష్టపడి సంపాదించుకుందాం వాటిని  సక్రమైన మార్గంలో  పెట్టుబడులు పెట్టి మన కుటుంబాన్ని, దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకుందాం.*

*అంతేకానీ సంపాదించుకున్న సొమ్మును దాచుకుంటే ప్రయోజనం శూన్యం.*

*భూమి గుండ్రంగా ఉంది అన్నట్టు మన జీవితం ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడికే పోయే ప్రమాదం కూడా వుంది తస్మాత్ జాగ్రత్త, దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకుందాం.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment