Tuesday, November 7, 2023

యోగులు యోగ దృష్టి తో చెప్పినవి కూడా ఇదే.

 0802.     2-6. 270123-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


*దేహం ఒక రథం, ఆత్మ రథ సారథి*
                  ➖➖➖✍️

*ఒక కారు ఉంది, ఇంజను కండిషన్‌లో ఉంది. వీల్స్‌, స్టీరింగ్‌, బ్రేకు, గేర్స్‌ అన్నీ బాగున్నాయి. కొంత దూరం ఆ కారు నడిపి డ్రైవర్‌ దిగి వెళ్లిపోయాడనుకుందాం.*

* కారును అతను ఎక్కడ వదలి వెళ్లాడో అక్కడే ఉంటుంది. అంగుళం కూడా అటూఇటూ కదలదు. ఎందువల్ల?*

*దానిని నడిపే డ్రైవరు దిగిపోయినందువల్ల.*

*అట్లే మానవదేహం కూడా. ఈదేహం ఆ కారువంటిదైతే, దీనిని కదిలించే చైతన్యం డ్రైవరు వంటివాడు. చైతన్యం శరీరం నుంచి వెడలిపోతే డ్రైవరు కారు దిగిపోయినట్లే. అయితే ప్రాకృతికంగా కారులో మరో డ్రైవరు ఎక్కి నడిపించవచ్చు. కాని భగవంతుడిచ్చిన ఈ దేహంలో మరో డ్రైవరు ఆ స్థానాన్ని ఆక్రమించ వీలులేదు.*

*ఆత్మ, దైవశక్తి లేక చైతన్యము ఉన్నంత వరకే మనదేహానికి విలువ. ఆ తదుపరి అంతకన్న పనికిరాని వస్తువు మరొకటిలేదు.*

*మన కళ్లు చూస్తున్నాయి, నోరు మాట్లాడుతున్నది, కాళ్లూచేతులు చలనాత్మకంగా ఉన్నాయి. చెవులు వింటున్నాయి, మనస్సు ఆలోచనలను రేకెత్తిస్తున్నది. ఈ పనులన్నింటినీ మన దేహమే చేస్తున్నదనుకుంటాం.*

*కానీ, కాదు దేహంలో గల చైతన్య శక్తి శరీరావయవాలచే, అంగాలచే, ఇంద్రియాలచే ఆ విధంగా పని చేయిస్తున్నది.*

*దేహం నుండి ఆ చైతన్యం వెళ్లిపోయిన మరుక్షణం చలనశీలమైన దేహం నేలకూలుతుంది. చలనరహితమవుతుంది. దేహంలోని ఏ అవయవమూ పనిచేయదు.*

*అప్పటి వరకు ‘ఫలానా’ వారు అని పిలువబడిన, గౌరవింపబడిన దేహం ‘ఫలానా’ వారి పార్థివ దేహమవుతుంది. శవంగా మారుతుంది.*

*అంత్యక్రియలకు సిద్దం అవుతుంది. శాశ్వతంగా ఈ లోకంనుండి కనుమరుగవుతుంది. ఆ క్షణం వరకు శరీరాన్ని లోనుండి పనిచేయించిన చైతన్యమే భగవంతుడు.*

*దేహం ఒక రథం!*
*ఆత్మ రథ సారథి!!*

*ఆ చైతన్యాన్నే ‘ఆత్మ’ అని కూడా అంటాం.*

*ఆత్మానాం రథినం విద్ధి, శరీరం రథమేవ తు’ అంటుంది కఠోపనిషత్‌.*

*ఈ ధర్మసూక్ష్మాన్ని అవగాహన చేసుకొని గాఢంగా విశ్వసించగల్గితే దేవుని దర్శనార్థం అక్కడకు ఇక్కడకు పోనవసరం లేదు. గుళ్లు గోపురాలకు ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం అంతగా ఉండదు. ఈ భావన స్థిరపడినపుడు ఎవరూ మనకు పరాయి వారు కాదు. అందరూ దైవస్వరూపులే.*

*మానవదేహం కదలాడే దేవాలయం వంటిది. ప్రతి దేవాలయంలో దైవ ప్రతిమ ప్రతిష్ఠింపబడి ఉన్నట్లుగా, ప్రతీ దేహంలో చైతన్య స్వరూపంగా ఆత్మతత్వం వ్యాపించియుంటుంది.*

*అందుకే ఎవరిని గౌరవించినా, ఆదరించినా భగవంతుని గౌరవించినట్లే. ఎవరిని కించపరచినా, కష్టపెట్టినా, నష్టపెట్టినా భగవంతునికి అపరాధం గావించినట్లే.*

*ఒక్క మానవ దేహంలో మాత్రమేగాదు... ఈ భూమిపై ఉన్న 84లక్షల జీవరాశుల్లోను భగవత్‌ చైతన్యం తొణికిసలాడుతూ ఉంటుంది.*

*ఒక చిన్న చీమను పరిశీలించండి. ఏదో పెద్దపని ఉన్నట్లు అటూ ఇటూ హడావుడిగా తిరుగుతుంటుంది. ఆ చిన్న చీమలోనున్న ఆ కదలాడే శక్తి ఆత్మతత్వమే.*

*దేవుడెక్కడనుచు దేవులాడగనేల దేవుడుండు తనదు దేహమందె,* *దేవుడే తానయ్యు*
*దేవుని వెదకుట, తన్నుతా* *వెదకునట్లుగాదె!’*

*అని భగవాన్‌ సత్యసాయిబాబా వారు చెప్పేవారు.*

*కాబట్టి మనలో ఉన్న ఆత్మ అనే దేవుడిని తెలుసుకోవడానికి ‘ధ్యాన సాధన’ చేయాలి.*

*నేను ఎవ్వరు? అని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని రమణ మహర్షి చెప్పేవారు.*

*నిన్ను నీవు తెలుసుకున్నపుడు అంతా నీకు అర్థం అవుతుంది అని రమణ మహర్షి భోధించేవారు.*

*’అహం బ్రహ్మాస్మి’ అంటే నేను దేవుడిని.*
*’తత్వమసి’ అంటే నువ్వు కూడా దేవుడివే.*
*’సర్వం ఖల్విదం బ్రహ్మ’  అంటే మన అందరిలోనూ, అన్ని జీవుల్లోనూ దేవుడు ఉన్నాడు.*
*ఇదే వేదాలు మరియు ఉపనిషత్తుల సారాంశం!*

*యోగులు యోగ దృష్టి తో చెప్పినవి కూడా ఇదే.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment