100323c1452. 110323-3.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀293.
శ్రీ మహాభారతం
➖➖➖✍️
293 వ భాగం
శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:
#బ్రహ్మపదము హరిత గీత:
ధర్మరాజు… “పితామహా! ఎటువంటి శీలము కలవాడు బ్రహ్మపదము పొందుతాడు” అని అడిగాడు.
భీష్ముడు.. “ధర్మనందనా! మితంగా ఆహారం తీసుకుంటూ ఇంద్రియ సుఖములను త్యజించి మోక్షము కొరకు ప్రయత్నించాలి. ఈ సందర్భంలో నీకు హరిత గీత చెప్తాను. పూర్వము హరితుడు అనే మహాముని కొంత మంది పండితులకు ఇలా బోధించాడు. సాధకుడైన వాడు నిష్టతో ఇల్లు వదలాలి. కోరికలకు దూరంగా ఉండాలి. త్రికరణ శుద్ధిగా పరులకు కీడు చెయ్యకూడదు. అందరి పట్ల సమదృష్టి కలిగి ఉండాలి. పొగడ్తలకు పొంగడము, నిందకు కుంగడము ఉండ కూడదు. నివాసగృహాలను త్యజించి దేవాలయములో నిద్రించాలి, అడవులలో ఉన్నపుడు కొండగుహలలో తలదాచు కోవాలి. భోజన సమయంలో మాత్రమే భిక్షాటన చేయాలి. తనకు కావలసిన దానికంటే ఎక్కువ తీసుకొనక సున్నితంగా తిరస్కరించాలి. ఎల్లప్పుడూ ఆత్మానురక్తుడై ఉండాలి. ఇలాంటి వాడికి మోక్షము కరతలామలకము” అని చెప్పాడు.
#వృత్త గీత:
ధర్మరాజు… “పితామహా ! నేను క్షత్రియుడిని పైగా చక్రవర్తిని, ఇంద్రియములను జయించి రాజసము వదిలి త్రిగుణములను వదిలి శాంతి సుఖము ఎప్పుడు పొందుతానో కదా !” అని ధర్మరాజు ఆవేదన చెందాడు.
“దేవాసుర యుద్ధములో వృత్తాసురుడనే రాక్షసుడు పడి పోయాడు. అప్పుడు రాక్షసులు అతడిని సురక్షిత స్థావరానికి తీసుకు వెళ్ళారు. కాని వృత్తాసురుడి మొహంలో విషాదఛాయలు కనిపించక నిర్మలంగా ఉన్నాడు. అప్పుడు రాక్షస గురువైన శుక్రుడు వృత్తా! శత్రువులు నీ రాజ్యము, సంపదలు అపహరించారు కదా ! నీకు ఏమాత్రము దుఃఖము కలుగక పోవడానికి కారణం ఏమిటి?” అని అడిగాడు.
వృత్తాసురుడు.. “కలిమి లేములు కాలవశాత్తు వస్తుంటాయి పోతుంటాయి. అజ్ఞానులు మాత్రమే కలిమి ఉన్నప్పుడు దర్పము, పోయినప్పుడు దైన్యము అనుభవిస్తుంటారు. సంపదలు అశాశ్వతము అని తెలిసిన వాడు సంపదలు ఉన్నా పోయినా బాధపడక నిర్మల మనస్కుడై ఉంటాడు. లోకం లోని ప్రాణులన్నీ కర్మవశాన దేవతలు గాను, మనుష్యుల గాను, జంతువులు గాను జన్మలు ఎత్తుతూ మరణిస్తూ ఉంటారు. ఈ విషయము నాకు తెలుసు కనుక నేను ఎందుకూ బాధ పడను” అని అన్నాడు వృత్తుడు.
శుక్రాచార్యుడు వృత్తుని గురించి మనశుద్ధి తెలుసుకోవాలని… “ఓ వృత్తాసురా ! నీవు రాక్షస రాజువు నీవు ఇంత విరక్తి పడడము తగదు” అని అతడిని రెచ్చగొట్టాడు.
వృత్తుడు చలించక.. “గురుదేవా! నేను పూర్వము దేవతలను జయించాలని ఘోరమైన తపస్సు చేసి విజయము సాధించి ముల్లోకాలు జయించి సమస్త సంపదలు అనుభవించాను. ఏదో పాపం చేసాను కనుక అవన్నీ ఇప్పుడు పోయాయి. ఇప్పుడిక దుఃఖించడం ఎందుకు. ఇక నేను సుకృత దుష్కృతముల జోలికి పోకుండా తటస్థుడనై నిర్మలచిత్తుడనై విష్ణువును పూజిస్తాను. నేను ఇంద్రుడితో యుద్ధము చేసే సమయంలో అతడి పక్కన విష్ణుమూర్తిని చూసి అతడి మహత్యానికి ఆశ్చర్య పోయాను. గురువర్యా! నాకు విష్ణువు మహిమ గురించి వివరించండి” అని అడిగాడు.
అలాగే చెప్పబోతున్న సమయంలో అక్కడకు వచ్చిన సనత్కుమారుడిని చూసి శుక్రాచార్యుడు.. “ఋషివర్యా ! ఈ దానవేంద్రుడికి విష్ణుమహిమ గురించి వివరించండి” అని అడిగాడు.
సనత్కుమారుడు సర్వవ్యాపి అయిన విష్ణువుకు భూమియే పాదాలు, ఆకాశమే తల, దిక్కులే భుజాలు అలా విష్ణువు సర్వదేవమయుడై సర్వవ్యాప్తుడై ఉన్నాడు. ఈ చరాచర జీవులను సృష్టించడం, పోషించడం, చంపడం ఆయన లీలామాత్రంగా చేస్తుంటాడు. మానవుని జీవితంలో అనేక వర్ణములుగా వస్తుంటాయి. పూర్వజన్మ కర్మవిశేషము చేత అనేక వర్ణములలో ఫలితము అనుభవిస్తుంటాడు. ఇలా జననమరణ చక్రంలో చిక్కుకుని నిరంతరము జీవుడు పరిభ్రమిస్తుంటాడు. జీవుడు ఉత్తముడు, అధముడు, మధ్యముడు అను మూడు విధములైన జన్మ ఎత్తుతుంటాడు. దేవతాజన్మ ఉత్తమం, మానవజన్మ మధ్యమం, పశుపక్ష్యాదుల జన్మ అధమం. ఈ జన్మలో ఒకరికి ఉపకారము చేసిన వాడికి మరుజన్మలో ఉత్తమమైన జన్మ లభిస్తుంది. ఈ జన్మలో పరులకు అపకారం చేసిన వాడికి మరు జన్మలో అధమ జన్మ లభిస్తుంది. పుణ్యకార్యాచరణతో జీవుడు మాలిన్యము వదిలి పవిత్రుడౌతాడు. ఎన్ని ఎక్కువ పుణ్య కార్యాలు చేస్తే అంత మంచి జన్మ లభిస్తుంది. అప్పుడు అతడు దుఃఖము వదిలి నిర్మలానందాన్ని పొందుతాడు. ఏ జీవుడు సదా తెల్లనివర్ణమును మనసున తలుస్తాడో అప్పుడు అతడికి విష్ణు భావన కలుగుతుంది” అన్నాడు సనత్కుమారుడు.
అమృతోపమాయమైన ఆమాటలు విన్న వృత్తుడు శుద్ధమనస్కుడై విష్ణుసాయుజ్యం పొందాడు.
#ఇంద్రుడు వృత్తాసురల మధ్య యుద్ధము:
ధర్మరాజు.. “పితామహా! వృత్తుడు ఇంతటి విష్ణుభక్తుడు కదా అతడికి ఇంద్రుడితో యుద్ధము ఎందుకు సంభవించింది” అని అడిగాడు.
భీష్ముడు… “ఇంద్రుడు అపారమైన దేవసేనతో రాక్షసరాజు వృత్తాసురుడి మీదకు వెళ్ళి రాక్షససైన్యాలను చూసి జంకుతూ రాక్షసరాజైన వృత్తుడితో తలపడ్డాడు. పర్వతాకారంతో యుద్ధము చేస్తున్న వృత్తుడిని చూసి ఇంద్రుడికి వణుకు పుట్టింది. వృత్తుడు ఇంద్రుడిని మూర్ఛిల్లజేసాడు. అప్పుడు వశిష్ఠుడు తన తపో మహిమతో ఇంద్రుడి మూర్ఛ నుండి కోలుకునేలా చేసి తిరిగి యుద్ధానికి పురికొల్పాడు. దేవగురువైన బృహస్పతి ఇంద్రుడికి విజయం కలిగించమని ఈశ్వరుడిని ప్రార్ధించాడు.
ఈశ్వరశక్తి ఇంద్రుడిలో ప్రవేశించింది. వృత్తుడిని చంపడానికి ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఎత్తగానే విష్ణువు ఆ వజ్రాయుధంలో ప్రవేశించాడు. అప్పుడు శివుడు.. “ఇంద్రా ! ఈ వృత్తుడు 60,000 దివ్య సంవత్సరములు బ్రహ్మ గురించి తపస్సు చేసాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ వృత్తుడికి మహోగ్రమైన బలాన్ని ప్రసాదించాడు. ఆ బలాన్ని నేను నా తేజముతో నాశనం చేస్తాను. అనగానే ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టి పడగొట్టాడు. దేవతలు తూర్యనాదములతో, విజయఘోషతో ఇంద్రుడిని పొగిడారు. వజ్రాయుధపు ఘాతముతో విష్ణువు వృత్తునిలో ప్రవేశించాడు. విష్ణుస్పర్శ తగలగానే వృత్తుడు మాలిన్యము తొలిగి పునీతుడయ్యాడు. ఇంద్రుడు శివుడికి నమస్కరించి.. ‘శంకరా నీ దయతో కదా నేను ఈ విజయము సాధించాను’ అని స్వర్గానికి వెళ్ళాడు.
#బ్రహ్మహత్యా పాతకము:
#దక్ష యాగ విధ్వంసం:
స్వర్గానికి వెళ్ళిన ఇంద్రుడికి మనశ్శాంతి లోపించింది. అతడికి బ్రహ్మహత్యాపాతక భయముపట్టుకుంది. ఇంద్రాది దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి తరుణోపాయము చెప్పమని అడిగాడు. బ్రహ్మ ఆ పాపమును అందరికి పంచి విముక్తి పొందమని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకమును పంచి ఇవ్వడానికి అగ్నిని, గడ్డిని, ఓషధులను చెట్లను, జలమును, స్త్రీలను పిలిచి బ్రహ్మహత్యాపాతకమును పంచుకొమ్మని ఆజ్ఞాపించాడు. అందుకు వారు భయముతో అంగీకరించారు. ప్రతిగా ఇంద్రుడు వారికి కోరికలను ప్రసాదిస్తూ చెట్లను తుంచిన వాడికి నరికిన వాడికి, అగ్నిని ప్రజ్వలింపచేయక హవిస్సులను వేసినవాడికి, జలములో మల మూత్రములను విడిచిన వాడికి, నదిలో ఉమ్మి వేసిన వాడికి, బహిష్టు సమయంలో స్త్రీని చేరిన వాడికి బ్రహ్మహత్యాపాతకము చుట్టుకుంటుందని వరమిచ్చాడు. ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకము నుండి విముక్తుడయ్యాడు.
ఇంద్రుడు బ్రహ్మ అనుమతితో అశ్వమేధయాగము చేసి స్వర్గాన్నిపాలించసాగాడు.
వృత్తుడి శరీరము నుండి కారిన రక్తము పుట్టగొడుగులుగా మారాయి. కనుక బ్రాహ్మణులు పుట్టగొడుగులను ఆహారముగా స్వీకరించరు” అని చెప్పి భీష్ముడు “ధర్మనందనా ! నీవు కూడా ఇంద్రుడిలా శత్రువులను జయించి కీర్తిని పొందు” అని చెప్పాడు.
#జ్వరము:
ధర్మరాజు సందేహంతో.. “పితామహా! వృత్తుడికి జ్వరము వచ్చిందని విన్నాను. వృత్తాసురుడికి ఏజ్వరము వచ్చింది” అని అడిగాడు.
భీష్ముడు.. “ధర్మరాజా ! వెండి కొండ మీద పార్వతీ సమేతంగా పరమశివుడు, దేవతలు, మునులు, యక్షులు మొదలగు వారు సేవిస్తుండగా కొలువు తీరి ఉన్నాడు. అప్పుడు సతీదేవి భర్తను చూసి ‘నాధా ! వీరంతా ఎక్కడికి పోతున్నారు’ అని అడిగింది.
శివుడు ‘దేవీ ! దక్షుడు చేయు యాగములో తమ తమ హవిర్భాగములు తీసుకొనుటకు వెడుతున్నారు’ అన్నాడు.
సతీదేవి ‘నాధా! మీరు ఎందుకు పోవడము లేదు మీ హవిర్భాగము మీరూ పొందాలి కదా!’ అని అడిగింది.
శివుడు ‘దేవీ ! దక్షుడు నన్ను యాగముకు పిలువ లేదు. నాకు హవిర్భాగమునూ ఏర్పరచలేదు. అందుకని నేను వెళ్ళ లేదు’ అని చెప్పాడు.
ఆ మాటలకు కోపించిన సతీదేవి కోపమును నిగ్రహించుకుని మౌనంగా ఊగిపోయింది.
భార్య అంతర్యము గ్రహించిన శివుడు తన ప్రమధ గణములతో పోయి దక్షుడి యజ్ఞమును నాశనం చేసాడు.
యజ్ఞమునకు విచ్చేసిన దేవతలు, మునులు, యక్షులు తలొక దిక్కుకు పారి పోయారు.
అప్పుడు బ్రహ్మదేవుడు.. ‘పరమశివా ! నీకు ఈ యాగములో హవిర్భాగము కల్పిస్తాము శాంతించు’ అన్నాడు.
ఆ మాటలకు శివుడు శాంతించాడు. బ్రహ్మదేవుడు ‘పరమేశ్వరా ! నీ నుదుటి నుండి పుట్టిన స్వేదము నుండి ఒక పురుషుడు ఉద్భవించాడు. అతడు జ్వరము అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు. అతడు జీవులను ఆవహిస్తాడు. అతడు ఏకరూపములో ఉంటే ప్రజలుభరించ లేరు కనుక అతడికి వివిధ రూపాలను ప్రసాదించండి’ అని అడిగాడు.
అప్పుడు శివుడు జ్వరాన్ని ఏనుగులకు తలనొప్పిలాగా, పాముకు కుబుసంగా, గోవులకు పాదాల నొప్పిగా, లేళ్ళకు తన రూపము తాము చూడడానికి నిరోధంగా, గుర్రములకు పార్శపు నొప్పిగా, నెమళ్ళకు ఈకలు రాలునట్లుగా, కోకిలలకు కళ్ళ వ్యాధిగా, చిలుకలకు ఎక్కిళ్ళుగా, మేకలకు కంగారుతనంగా, పులులకు అలసటగా, మనుష్యులకు చావు పుట్టులకు కలిగే వ్యాధిగా విభజిస్తున్నాను’ అని చెప్పాడు.
#ఆచరించవలసిన కర్మలు:
ధర్మరాజు.. “పితామహా ! శాస్త్ర తత్వము తెలిసిన వాడికి అనుమానాలు అధికము. పరమాత్మ గురించి ఎవరికీ తెలియదు. అలాంటి వాడు ఎలాంటి కర్మలు ఆచరించాలి” అని అడిగాడు.
భీష్ముడు.. “ధర్మరాజా ! గురుపూజ, వేదాధ్యయనము, వృద్ధులకు సేవ చెయ్యడము చేయవలసిన సత్కర్మలు. నారదుడు ఈ విషయము ఒక సారి గాలవుడికి చెప్పాడు. ఒక సారి గాలవుడు నారదుడి వద్దకు వచ్చి ‘మునీంద్రా ! నేను చాలా శాస్త్రములు అధ్యయనము చేసాను. కాని నా మనసులో ఏదోవెలితి ఉంది నాకు సంపూర్ణజ్ఞానము ప్రసాదించండి’ అని అడిగాడు.
బదులుగా నారదుడు ‘గాలవా ! మానవుడు ముందు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పాపకర్మలను అన్నింటినీ వదిలి పుణ్యకర్మాచరణ చేయాలి. మనసు పరిశుద్ధం చేయాలి. సమస్తప్రాణుల పట్ల దయకలిగి ఉండాలి. సజ్జనసాంగత్యము చేయాలి, ఎప్పుడూ మధురంగా సౌమ్యంగా మాట్లాడాలి. దేవతలను, పితృదేవతలను ఆరాధించాలి. అహంకారమును వదిలి పెట్టాలి.
ఏ వస్తువు కొరకు ఎవరిని యాచించకూడదు. ఇంద్రియ నిగ్రహము కావాలి. విషయ వాంఛలకు దూరంగా ఉండాలి. పరనింద, ఆత్మపొగడ్త మాని వేయాలి. సోమరితనము, అధిక ప్రసగం, మాత్సర్యం, కోపము ఉండకూడదు. ఎల్లప్పుడూ అతిథి సత్కారం చెయ్యాలి. వేదాధ్యయనము, వేదాంగచర్చలు, యజ్ఞయాగములు, బ్రాహ్మణ సన్మానము జరిగే ప్రదేశములలో నివసించాలి. ఇలాంటి ఋజువర్తనుడికి సకల దోషములు తొలగి జ్ఞానోదయం ఔతుంది’ అని నారదుడు గాలవుడికి వివరించాడు అని భీష్ముడు చెప్పాడు.✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment