Wednesday, November 8, 2023

శ్రీ మహాభారతంలో చిన్ని కథలు: #శాంతి పర్వము పంచమాశ్వాసము

 040323c1852.    050323-3.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

              శ్రీ మహాభారతం 
               ➖➖➖✍️
                289 వ భాగం
   శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:

#శాంతి పర్వము పంచమాశ్వాసము

వైశంపాయనుడు జనమేజయుడికి భారత కథను వినిపిస్తున్నాడు…

ధర్మరాజు శంకలకు భీష్ముడు చక్కగా సమాధానము ఇస్తున్నాడు. ఆ క్రమంలో ధర్మరాజు భీష్ముడిని… “పితామహా దేహంలోని పురుషుడు ఏ కారణంగా శ్రీమంతుడు ఔతాడు. ఏకారణంగా నశిస్తాడు” అని అడిగాడు.


#శ్రీమంతుడు:

దేవరాజు ఇంద్రునికి నారదునికి లక్ష్మీదేవి ప్రత్యక్షమగుట!

భీష్ముడు… “ధర్మనందనా ! నీకు ఇంద్రుడు లక్ష్మీదేవికి మధ్య జరిగిన సంవాదము చెప్తాను విను... ‘ఒక రోజు నారదుడు లోక సంచారము చేస్తూ మందాకినీ నదిని చేరుకుని అక్కడ స్నానమాచరించి ఆ సమయంలో అప్పటికే ఇంద్రుడు మందాకినీ నదిలో స్నానమాచరించి అనుష్టానం తీర్చుకోవడం చూసి ఇంద్రుడితో సంభాషించ సాగాడు. అప్పుడు ఒక స్త్రీ వచ్చి ఇంద్రుడికి నమస్కరించింది. ఇంద్రుడు ‘నీవు ఎవరు ఎక్కడకు పోతున్నావు?’ అని అడిగాడు. 

ఆ స్త్రీ ‘ఓ ఇంద్రా! నేను తామరపువ్వు నుండి జన్మించిన లక్ష్మిని. ఇప్పటి వరకు నేను రాక్షసుల వద్ద ఉన్నాను. ప్రస్తుతము వారి ప్రవర్తన నచ్చక ఇప్పుడు నీ వద్దకు వచ్చాను’ అన్నది. 

ఇంద్రుడు ‘అదిసరే ఇప్పటి వరకు రాక్షసుల వద్ద ఏ గుణములు నచ్చి వారి వద్ద ఉన్నావు? ఇప్పుడు నీకు వారు ఎందుకు నచ్చ లేదు? నిన్ను మెప్పించాలంటే ఏమి చేయాలి?’ అని అడిగాడు. 

లక్ష్మి… ‘ఇంద్రా ! ఇప్పటి వరకు అసురులు దానములు, వేదాధ్యయనము చేయడము, అతిథులను సత్కరించడం వంటి మంచి పనులు చేసారు. ఇప్పుడు వారికి గర్వము పెరిగి మంచి గుణములను విడిచి పెట్టారు. అందుకని నేను వారిని విడిచి పెట్టాను. నీవు సత్యధర్మపరుడవని ఎరిగి నీ వద్దకు వచ్చాను. గురువుల ఎడ భక్తి కల వారు, పితరులను దేవతలను పూజించు వారు, సత్యమును పలికే వారు, దానశీలురు, ఇతరుల ధనమును కాని భార్యలను కాని కోరనివారు, పగలునిద్రించని వారు, వృద్ధులపట్ల బాలలపట్ల స్త్రీలపట్ల దయ కలిగిన వారు, బ్రాహ్మణులను పూజించు వారు, నిత్యము శుచిశుభ్రత కలిగిన వారు, అతిథులకు పెట్టికాని భుజించని వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. నేను వారివద్ద ఉండడానికి ఇష్ట పడతాను. అలా కాక కామముకు, లోభము, క్రోధములకు లోనై   ధర్మమును విడిచిన వారు, గర్విష్టులు, అతిథి సత్కారము చేయని వారు, పరుషవాక్యములు పలుకువారు, క్రూరపు పనులు చేయువారిని నేను మెచ్చను. అటువంటి వారి వద్ద ఉండడానికి నేను ఇష్టపడను’ అన్నది లక్ష్మి. 

ఆ మాటలకు ఇంద్రుడు, లక్ష్మి ఎంతో సంతోషించారు. ఇంద్రుడు లక్ష్మీదేవితోసహా స్వర్గానికి వెళ్ళాడు. కనుక ధర్మరాజా ! లక్ష్మీ దేవి నివాస స్థానములు తెలుసుకుంటివి కదా అలా నడచుకో’ అన్నాడు.


#ముక్తి_మార్గము:

ధర్మరాజు… “పితామహా! ప్రజలు దేనిని ఆచరించిన, ఏవిధ్య అభ్యసించిన ముక్తి పొందగలరు” అని అడిగాడు. 

భీష్ముడు…  “ధర్మనందనా ! ఈ సందర్భంలో నీకు ఒక ఇతిహాసము చెప్తాను విను… ‘పూర్వము జైగిషల్యుడు అనే మహాముని దేవలుడికి ఇలా చెప్పాడు… ’శాంతిమతులకు, సౌమ్యులకు ఏధర్మము వర్తిస్తుందో నాకు అదే ఇష్టము. ఆ ధర్మమును నీకు వివరిస్తాను. తనను పొగిడినా, తిట్టినా, ప్రియము చేసినా, అప్రియము చేసినా, తనను ఎవరైనా పొగిడినా బాధించినా అటువంటి వారి ఎడ సమభావం వహించడము జ్ఞానుల లక్షణము. కోరిన వస్తువు లభించలేదని చింతించక ఉన్న దానితో తృప్తిపడాలి. తాను అనుకున్నది జరగలేదని చింతించ కూడదు. హర్షము, అభిమానము, అసూయ, మదము, తప్పు చేయడము మొదలైనవి దుర్గుణాలు. ఇంద్రియనిగ్రహము కలవాడు తనకు అవమానము జరిగినా సన్మానము జరిగినట్లే భావిస్తాడు. తనకు సన్మానము జరిగినా అందుకు అధికముగా పొంగిపోక సమభావము కలిగి ఉంటాడు. ఇంద్రియములను అదుపులో పెట్టుకున్నవాడు ప్రశాంత మనస్కుడై ఉంటాడు. దేవతలు సహితము అతడి స్నేహాన్ని కాంక్షిస్తారు” అని చెప్పాడు.


#జనప్రియుడు:

ధర్మరాజు “పితామహా ! అఖిల జనులకు ప్రియము కలిగించువాడు ఎవరు?”  అని అడిగాడు. 

భీష్ముడు… “ధర్మనందనా ! ఈ సందర్భంలో శ్రీకృష్ణుడికి ఉగ్రసేనుడికి జరిగిన సంవాదము వినిపిస్తాను…. ‘ఒకసారి ఉగ్రసేనుడు శ్రీకృష్ణుడితో… ’కృష్ణా ! లోకంలోని జనులంతా నారదుడిని భక్తి ప్రపత్తులతో పూజిస్తారు కదా! అతడు అంతటి గొప్ప వాడా! నారదుడిలో ఉన్న గొప్పతనము ఏమిటి ?’ అని అడిగాడు. 

శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు… ‘నారదుడిలో వేదవిద్య, ఆచారము సమృద్ధిగా ఉన్నాయి కాని అహంకారము కొంచము కూడా లేదు. సచ్చీలవంతుడు నిరాడంబర వేషధారి, మత్సరము, గర్వము, మదము, మచ్చుకైనా లేవు. నారదుడు తన పుట్టుకచేత, తపస్సుచేత, తేజముచేత, బుద్ధిచేత, నీతిచేత ప్రసిద్ధిపొందాడు. నారదుడు ధీరుడు, మృదుమధురంగా మాటాడువాడు. కాఠిన్యము, దైన్యము, క్రోధము, లోభము, నిరాసక్తత మచ్చుకూడా లేదు. నారదుడుకి ఈర్ష్య, అసూయ అనేవి, ఎలా ఉంటాయో తెలియదు. కనుక జనులు నారదుడిని కీర్తిస్తారు. ధర్మజా నీవడిగిన ప్రశ్నకు సమాధానము ఇదే!” అని అన్నాడు.


#కాలప్రమాణము:

ధర్మరాజు “పితామహా! నాకు కాల విభజన గురించి యుగప్రమాణముల గురించి భూతములు ఎన్ని రకములు? వాటిని వివరించండి” అని అడిగాడు. 

భీష్ముడు… “ధర్మనందనా ! ఈ విషయములను పూర్వము వేదవ్యాసుడు శుకుడికి చెప్పాడు. అవే విషయములను నీకు వివరిస్తాను... వేదవ్యాసుడు కుమారా ! ఈ కాలముకు పంచభూతములకు ఆధారభూతంగా వెలిగే తేజోరూపము ఒకటి ఉంది. ఆ తేజస్సు ఎప్పుడూ చైతన్యవంతంగా ఉన్నట్లు కనిపిస్తుంది కాని ఏ పనీ చేయదు. కేవలం సాక్షీ భూతంగా మాత్రమే ఉంటుంది. ఆ తేజస్సు కేవలం భావనలో మాత్రమే కనిపిస్తుంది. ఇక కాలప్రమాణము గురించి చెప్తాను విను… 
18 నిముషాలు కలిస్తే ఒక కాష్ట ఔతుంది. 30 కాష్టలు ఒక కళ ఔతుంది. 360 కళలు ఒక ముహూర్తము. 30 ముహూర్తాలు ఒక అహోరాత్రము. 30 అహోరాత్రములు ఒక మాసము. 2 మాసములు ఒక ఋతువు ఔతుంది. 3 ఋతువులు ఒక ఆయనము ఔతుంది. రెండు ఆయనములు ఒక సంవత్సరం ఔతుంది. ఆయనములు రెండు అందులో ఒకటి ఉత్తరాయణము రెండవది దక్షిణాయనము. ఉత్తరాయణమును అగ్ని అంటారు. దక్షిణాయణాన్ని ధూమము అంటారు. ఉత్తరాయణము మంచి చేస్తుంది. దక్షిణాయణము చెడ్డచేస్తుంది. భూమి మీద మానవులకు ఒక మాసకాలము పితరులకు ఒకరోజు. మానవుల సంవత్సరకాలము దేవతలకు ఒక రోజు. ఇక యుగముల గురించి చెప్తాను విను... దేవతలకు 12,000 సంవత్సరాలు భూమి మీద 4 యుగముల కాలము. మొదటిది కృత యుగము అది 12,000 సంవత్సరముల కాలంలో 40 శాతము అంటే 4,800 సంవత్సరాలు. రెండవది త్రేతా యుగము అది 12,000 సంవత్సరాల కాలములో 30 శాతము అంటే 3,600 సంవత్సరములు. మూడవది ద్వాపర యుగము అది 12,000 సంవత్సర కాలములో 20 శాతము అంటే 2,400 సంవత్సరములు. నాల్గవది కలియుగము అది 12,000 సంవత్సర కాలములో 10 శాతము అంటే 12,00 సంవత్సరాల కాలము. 

*యుగములు మానవ కాలములో 
ఇలా…

కృతయుగము : 17,28,000 సంవత్సరాలు.
త్రేతాయుగము : 12,96,000 సంవత్సరాలు.
ద్వాపరయుగము : 8,64,000 సంవత్సరాలు.
కలియుగము : 4,32,000 సంవత్సరాలు.

యుగముల మధ్యకాలాన్ని యుగసంధి కాలము అంటారు. యుగ సంధి కాలము కృతయుగమున 400 దేవ సంవత్సరాలు, త్రేతాయుగమున 300 దేవ సంవత్సరాలు, ద్వాపర యుగమున 200 దేవ సంవత్సరాలు, కలియుగమున 100 దేవ సంవత్సరాల కాలము ఉంటాయి.

#యుగసంధి_మానవ_కాలములో :

కృతయుగము : 1,44,000 సంవత్సరాలు.
త్రేతాయుగము : 1,08,000 సంవత్సరాలు.
ద్వాపరయుగము : 72,000 సంవత్సరాలు.
కలియుగము : 36,000 సంవత్సరాలు.

త్రేతాయుగము నుండి మానవులలో ధర్మము, న్యాయము, ఆయువు, శరీరబలము, ధారుఢ్యము క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి. 

ఈ నాలుగు యుగములు ఒక మహాయుగము ఔతుంది. అటువంటి మహయుగములు వెయ్యి బ్రహ్మదేవుడికి ఒక పగలు. అలాగే ఒక వెయ్యి మహాయుగములు ఒక రాత్రి ఔతాయి. బ్రహ్మ నిద్రించే సమయంలో జగత్తుకు ప్రళయం సంభవిస్తుంది. బ్రహ్మదేవుడు నిద్ర లేవగానే బ్రహ్మదేవుడు సృష్టికి పూనుకుంటాడు. ఇలా సృష్టి క్రమం నడుస్తూ ఉంటుంది.

#బ్రహ్మతత్వము:
ఈ బ్రహ్మతత్వము నుండి మహాతత్వము పుట్టింది. మహాతత్వము నుండి క్రమముగా మనస్సు, గగనము, పవనము, నీరు, భూమి ఒక దాని నుండి ఒకటి ఆవిర్భవించాయి. 
ఈ పంచభూతములకు శబ్ధ, స్పర్శ, రస, గంధములు గుణములుగా భాసిస్తున్నాయి. 
ఈ సప్తస్వరూపములను పురుషులు అంటారు. వారంతా సమిష్టిగా సృష్టికార్యము నెరవేరుస్తారు. మనలో ఉన్న తేజోమయమైన పురుషరూపమును బ్రహ్మము అనీ ప్రజాపత్యము అని అంటారు. 
ఆ పురుషుడు సర్వవ్యాపకుడు, స్రష్ట, బ్రహ్మ, ప్రజాపతి అనే పేర్లతో పిలువబడతాడు. ఆ పురుషుడు సత్యము, నిత్యము అయిన ఆత్మ స్వరూపుడు, ఆ పురుషునకు జగత్తు విషయాలు ఏవీ అంటవు. అతడు దేవతలలో, మునీంద్రులలో, గరుడ, ఉరగ, కిన్నెరులలో, నదులలో, వనములలో, సముద్రాలలో నిండి ఆయాకార్యములు నిర్వహిస్తుంటాడు. 

ఇక మనుష్యుల స్వభావములు విచిత్రంగా ఉంటాయి. కొందరు తమ ప్రయత్నాల వలన మాత్రమే తనకు అన్నీ లభిస్తున్నాయి అనుకుంటారు. మరి కొందరు అన్నీ దేవుడే ఇస్తున్నాడు అనుకుంటారు. మరి కొందరు పంచభూతాలే సకలమూ చేస్తున్నాడని అనుకుంటున్నారు. ఇక సాత్వికులు అంతటా సమాన దృష్టితో చూస్తూ సుఖదుఃఖాలకు లోనుకాక ఉంటారు. అన్నిటికంటే తపస్సు గొప్పది, తపసుకు ఇంద్రియ నిగ్రహము , మానశిక శాంతి అవసరము. ఇంకా స్వాధ్యాయనము వేదాధ్యయనము ఈ తపసుకు బలము చేకూర్చి మంచి బలాన్నిస్తుంది. ఈ బ్రహ్మములు శబ్ధబ్రహ్మము, పరబ్రహ్మము అని రెండు విధములు. సాధకుడు ముందు శబ్ధబ్రహ్మమును ఆరాధించి పరబ్రహ్మాన్ని పొందగలడు. ఈ పరబ్రహ్మ జగత్తును సృష్టిస్తుంది లయము చేస్తుంది కాని తాను దేనిలోనూ పాల్గొనదు.


#లయము:

“కుమారా ! ఇప్పటి వరకు సృష్టి గురించి చెప్పాను. ఇక లయం గురించి చెప్తాను. ‘ప్రళయకాలంలో ఈ చరాచర జీవరాశులు సమస్తము భూమిలో కలిసిపోతాయి. అంటే మట్టితో నిర్మించబడిన ఈ శరీరాలు తిరిగి మట్టిలో కలిసిపోతాయి. తరువాత ఈ భూమి సమస్తం జలమయమౌతుంది. జలం అగ్నిలోకలుస్తుంది. అగ్ని వాయువులోకలుస్తుంది. వాయువు ఆకాశంలోకలుస్తుంది. ఈ ఆకాశాన్ని మనసులాగుతుంది. మనసు చంద్రుడిలో లీనమౌతుంది. మనసులో పుట్టినసంకల్పాలు చంద్రుడిని తనలో లీనం చేసుకుంటుంది. ఆ సంకల్పాలను జ్ఞానం తనలో ఇముడ్చుకుంటుంది. ఆ జ్ఞానం కాలంలో కలిసి పోతుంది. ఆ తరువాత కాలం కూడా నశిస్తుంది.

ఆఖరున శుద్ధతత్వము స్వరూపమై అఖండ జ్ఞానము వెలుగుతూ ఉంటుంది. దానినే బ్రహ్మరూపము అంటారు. ఈ సంహారణకారణము అంతా బ్రహ్మ వలననే జరుగుతుంది” అని వ్యాసుడు చెప్పాడు.


#జాతి_ధర్మములు:

వ్యాసుడు ఇంకా… “కుమారా ! బ్రాహ్మణుడు పుట్టగానే జాతకకర్మ చేస్తారు. తరువాత ఉపనయనము చేస్తారు. తరువాత అతడు గురువు వద్దకు వెళ్ళి వేదములు, శాస్త్రములు నేర్చుకుంటాడు. అలా గురువు ఋణము తీర్చుకుంటాడు. తరువాత గురువుగారి అనుజ్ఞతో వివాహము చేసుకుని గృహస్థాశ్రమం స్వీకరిస్తాడు. గృహస్థాశ్రమంలో దేవఋణం పితృఋణం తీర్చుకుంటాడు. బ్రాహ్మణులకు యజ్ఞములు చేయడం చేయించడం, వేదాధ్యనం చేయడం, వేదములు ఇతరులకు బోధించడం, దానములు చెయ్యడం, దానములు స్వీకరించడం లాంటి ఆరుకర్మలు బ్రాహ్మణులు చేయతగ్గవి. అన్ని జాతులవారు దానములు చేయవచ్చు. దానముకు అర్హము కాని వస్తువు లేదు. కాశ్యుడు అనే రాజు తన ప్రాణములు దానం ఇచ్చి ఒక బ్రాహ్మణుడి ప్రాణములు కాపాడాడు. శిబిచక్రవర్తి తన శరీర అవయవములను, తన కుమారుడిని బ్రాహ్మణుడి కొరకు అర్పించాడు. కాశీరాజు ప్రత్యయనుడు తన కళ్ళను బ్రాహ్మణుల కొరకు దానంచేసాడు. జనకమహారాజు, పరశురాముడు తమ రాజ్యాలను బ్రాహ్మణులకు దానంచేసారు. పాంచాలరాజు బ్రహ్మదత్తుడు శంఖనిధిని బ్రాహ్మణులకు దానంచేసాడు, ఇంకా బ్రాహ్మణులకు తమతమ ప్రాణములను, శరీరములను, మణులను, బంగారమును, కన్యలను, ఆవులు మొదలైన ప్రశస్త వస్తువులను అనేకులు దానంగా ఇచ్చారు. వారికందరికి ఉత్తమగతులు ప్రాప్తించాయి. దానం చేయడము వలన, వేదాధ్యయనము చేయడము వలన, యజ్ఞము చెయ్యడము వలన నానావిధములైన పాపములు వినాశనం ఔతాయి. కనుక దానగుణము ఆచరించడం ఉత్తమము.✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment