Tuesday, November 7, 2023

గోపికల పాదధూళి

 0902.     2-7.    230223-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


            *గోపికల పాదధూళి*
                 ➖➖➖✍️

*వందే నంద వ్రజ స్త్రీణాం పాదరేణు మభీక్ష్ణశః*
*యాసాం హరికథోద్గీతం పునాతి భువన త్రయమ్‌*

*‘ఏ బృందావన గోపికల కృష్ణకథా గానం మూడు లోకాలనూ పావనం చేస్తోందో, అట్టివారి (గోపికల) పవిత్ర పాద ధూళి యొక్క ఒక్క రేణువుకు మాటిమాటికీ నమస్కారం’ అని స్తుతించి ఉత్సవమూర్తి ఐన ‘ఉద్ధవుడు’ వారి పాదరజాన్ని ప్రసాదంగా స్వీకరించాడు.*

*నారద మహర్షి తన ‘భక్తి’ సూత్రాలలో.. ‘యథా వ్రజ గోపికానాం’ అని భక్తికి గోపికలనే పరమ, చరమ ఆదర్శంగా పేర్కొన్నాడు.*

*ఆ ప్రేమాభక్తి పొందటానికి ఉద్ధవాది భక్తులు పరితపించారు. గోపికలు ప్రేమ సన్యాసినులు, భక్తి యోగినులు.                          ‘సా త్వస్మిన్‌ పరమ ప్రేమరూపా’- ఈ ప్రేమా భక్తి (ప్రేమ పూర్వక భగవత్‌ సేవ)నే భక్తి శాస్త్రం ‘పంచమ పురుషార్థం’గా ప్రవచించింది.* 

*గోపికల తనువు, మనువు, ప్రాణం, మానం.. అంతా గోపాలుడే! అందుకే ద్వారకలో 16,100 మంది పత్నులతో, రుక్మిణీ సత్యభామాది అష్ట పట్టమహిషులతో ఉన్నా గోపాలకృష్ణుడు వ్రజగోపికల పట్లే తన్మయత్వం పొందేవాడు.*

*దీని వలన ద్వారకలోని దేవేరులంతా ద్వేషం పూనారు. ‘గోపికల గొప్పేంటి? మా తప్పేంటి?’ అంతఃపురమంతా అసూయతో రగిలిపోతోంది.*

*‘నక్రోధో నచ మాత్సర్యం నలోభో నాశుభామతిః’ భగవంతుడు భక్తుల్లో కోపం, కపటం, కుళ్లు, కుత్సితం అస్సలు ఓర్వడు. తన రాణులందరికీ ఒకే రోగం. కనుక మందు కూడా ఒకటే. రోగం ఎలా కుదురుతుంది? పరమాత్మది ఎప్పుడూ పరోక్ష పద్ధతేగా! మాయా మనుష విగ్రహుడు మాధవుడు కూడా తనకొక మాయ రోగం కల్పించుకొన్నాడు.* 

*తీవ్రమైన జ్వరం! ఒళ్లు కాలిపోతోంది. ఎవ్వరికీ కాళ్లూచేతులూ ఆడటం లేదు. వైద్యుడొచ్చి మందిచ్చి దానితో పాటు అనుపానం అనివార్యమన్నాడు. అసాధారణమైన అనుపానం! ఏమిటది? అంఘ్రిరజం! ప్రేమీభక్తుల పాదధూళి! అందర్నీ అడిగారు. ఎవ్వరూ ముందుకు రాలేదు. ‘అమ్మో! ప్రాణనాఽథునికి పాదధూళితో ఉపచారమా? అపచారం కాదా? ఎంత పాపం! ఇంకేమన్నా ఉందా? నరకానికి పోమూ!’ అంటూ రుక్మిణి మొదలుగా మురహరి పత్నులంతా ముఖం చాటేశారు.*

.*అప్పుడే నారద మహర్షి విచ్చేశాడు.*

*అచ్యుతుని ఆంతర్యం గ్రహించి లోలోన మురిసిపోతున్న నారదమునిని నందనందనుడు బృందావనం దర్శించి రమ్మన్నాడు. ద్వారక నుంచి దేవర్షి వచ్చాడని విని రాధాదేవి వెంటరాగా గోపికలందరూ పాచిమొహాలతోనే పరుగుపరుగున వచ్చి యోగేశ్వరుని యోగక్షేమాలు అడిగారు.*

*విషయం విదితం కాగా ముదితలకి ముచ్చమటలు పోసినై.    ప్రాణాలు కడగట్టగా గోపికలు ఓపిక తెచ్చుకొని ‘అదేమిటి మహర్షీ! అంతటి మహానగరంలో మందిచ్చేవాడే కరవయ్యాడా?’ అని ఆతురతతో అడగ్గా నారదుడు ఔషధం సిద్ధంగా ఉందికాని అనుపానమే దొరకలేదన్నాడు.*

* ‘అదేమి అనుపానం ఆర్యా?’ ఆశ్యర్యంగా అడిగారు గోపికలు.*

*‘అమ్మా! అది అందరి వద్ద ఉన్నదే. అపురూపమేమికాదు. మీ వద్ద కూడా పుష్కలంగా ఉంది. కానీ, మీరు కూడా ఇవ్వలేరనేగా నాబాధ’ అన్నాడు మహర్షి. *

*‘ఏమిటి మీరనేది? శ్యామ సుందరునికి ఇవ్వలేనిది కూడా మావద్ద ఉన్నదా మహాశయా? ఐతే అదేంటో తక్షణం చెప్పండి’ అని గోపికలు అడిగారు.*

*‘మీ పాదధూళే ఆ అనుపానం. ఇవ్వగలరా’ అని నారదుడు ప్రశ్నించగా గోపకాంతలు ఎగిరి గంతేసి ఎంతో ఆనందంగా- ‘ఓస్‌! ఇంతేనా? మా పాదరజం ఎంత కావాలో తీసుకోండి మునివరా!’ అంటూ మహర్షి ముందు అందరూ కాళ్లు జాపారు.*

*నారదుడు భయం నటిస్తూ ‘అరే! ఏమిటిది? కృష్ణుడు భగవంతుడని మీకు తెలియదా? ఆదిదేవునికి అనుపానంగా ఆరగించమని అరికాలి మట్టి ఇస్తారా? పాపం కాదా? మీకు నరకభయం లేదా?’ అని గద్దించాడు.*

*గోపికలు- ‘దేవర్షీ! మా దేహ-గేహాలు, మా సుఖ-దుఃఖాలు, మా చావు-బ్రతుకులు, మా భోగ-మోక్షాలు, మా స్వర్గ-నరకాలు.. ‘వాసుదేవ స్సర్వం’- అన్నీ వాసుదేవుడే ఆయన కోసం మేము ఎన్ని పాపాలైనా భరిస్తాం. ఎన్ని నరకాలైనా అనుభవిస్తాం. మహర్షీ! మీరేదో పాప(అఘం)మనీ, నరకమనీ అన్నారే.. మా శ్యామ సుందరుడు మాకోసం అఘాసురుణ్ణి (పాపమనే రాక్షసుని), నరకాసురుణ్ణి ఎప్పుడో సంహరించాడు. మీకు తెలియదా? స్వామీ! మాకు తెలిసింది ఒక్కటే. శ్రీకృష్ణుల వారి సుఖమే మా సుఖం’ అన్నారు.*

*పవిత్ర ప్రేమాశ్రుధారతో దేవర్షి వక్షఃస్థలం తడిసిపోయింది.   రాధాదేవి, ఆమె అంశలే అయిన గోపికల పాదధూళి సేకరించి నారదుడు కొంత ధూళితో తన్నుతాను అభిషేకించుకొని మిగిలిన దాన్ని జాగ్రత్తగా మూట కట్టుకొని, భరతుడు రామపాదుకలు ధరించినట్లు తలపై పెట్టుకొని, నామ సంకీర్తనతో నృత్యం చేస్తూ ద్వారక వచ్చి పరమాత్మకు సమర్పించగా స్వామి స్వీకరించి స్వస్థుడయ్యాడు.* 

*గోవింద పత్నులకు గర్వ భంగం కాగా సిగ్గుతో తలదించుకున్నారు. గోపీభావం గ్రహించి, మన్నించమని గోపాలదేవునికి శరణాగతి చేశారు. అప్పటి నుంచి ప్రేమపాఠం ఓనమాలు దిద్దటం ప్రారంభించారు.*

*‘తత్‌సుఖే సుఖిత్వం- మాధవుని సుఖమే మా సుఖం’ ఇదే గోపీత్వం!            గోపి భావం! మనసులో పరమాత్మ వచ్చి చేరనంత వరకు ఎట్టివారైనా ‘గోపిక’  కాలేరు.*

*గోపీత్వం స్త్రీత్వం కాదు. దాన్ని పొందాలంటే ముఖ్యంగా మూడు విషయాలు పాటించాలని పూర్వ ఆచార్యుల బోధ.*

*అవేంటంటే.. మనసుతో ప్రపంచాన్ని తొలగించాలి. శూన్యమైన మనస్సును భగవదర్పణం చెయ్యడానికి సిద్ధపడాలి, ఎట్టి పరిస్థితిలో ఏకారణం చేతగానీ ఎప్పుడూ సాంసారిక వ్యక్తుల్లో, వస్తువుల్లో, విషయాల్లో ఇరుక్కుపోవటమనేది ఉండరాదు. భగవంతుని వలన సుఖపడాలనుకునే వాడు భక్తుడే కాదు, భాగవతుడే కాదు. అది ఒక్క భగవత్‌ ప్రేమికునికే తగిపోయింది. మరెవ్వరికీ ఆ స్థితి లేదు. గొప్ప గొప్ప భక్తులు కూడా భగవంతుని వలన ఏదోవిధంగా సుఖించాలని ఆశించినవారే. సాలోక్యాది ముక్తులు కోరేవారే! జిజ్ఞాసువులు, సాధకులు కూడా బంధముక్తి కల్గించమని అర్థిస్తారు. సకామ భక్తుల సంగతి చెప్పేపనేలేదు. ఇక భోగాసక్తులు నరకక్రిములు, కీటకాలే!*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment