Saturday, November 25, 2023

☸️బౌద్ధం అంటే మానవతా మార్గం☸️

 ☸️బౌద్ధం అంటే మానవతా మార్గం☸️

మానవుడే కేంద్రంగా ప్రకృతిని వేదికగా దైవం మహిమలను తిరస్కరించి చెప్పబడింది బౌద్ధం. వ్యక్తి వికాసం సమాజాభివృద్ధి నైతిక విలువలు శాస్త్రీయతను మానవజాతి కందించిన బుద్ధుని మార్గాన్ని మనం నేడు ఆచరించడానికి కారణం ప్రజాస్వామికమైన అంశాలను బౌద్ధం బోధిస్తున్నది వాటిని ప్రజలు అధ్యయనం చేసి ఆచరించడానికి సమాయత్త పరిచేందుకు సమాజ సేవకులుగా మేము చేస్తున్న ప్రయత్నమే ఇది బౌద్ధం మతంగా వివిధ దేశాలలో ఉన్నా భారతదేశ సమాజానికి మతపరంగా కాక లౌకిక ప్రజాస్వామ్య విలువలకు శాస్త్రీయ అవగాహనకు అవినీతిరహిత సమాజ నిర్మాణానికి సౌమ్యవాద సిద్ధాంతాలకు తోడ్పడుతుంది. బుద్ధుని బోధనలో ఉన్న వ్యక్తి వికాసం రాజకీయ విధానాలు ఆర్థిక శ్రేయోవాదం శ్రమైక జీవనం భద్రత కలిగిన భవిష్యత్తు ప్రకృతిని కాపాడే విధానము శాంతియుత జీవనము నాటికి నేటికీ ఏనాటికైనా సర్వకాలినమైన విశ్వ జనీయమైనదిగా అందించాలని సంకల్పంతోనే ఈ మానవతా ఉద్యమంలోకి ఆహ్వానిస్తున్నాం.
-మహోదయ యాజరా

☸️బౌద్ధ ధర్మ సారాంశము బుద్ధ భగవానుని బోధ☸️

నేను నాది అంటూ సుఖపడాలనే తాపత్రయం ఎందుకు ఎంతో ఏదేదో పొందాలని వెంపర్లాట పంచభూతాల పంచ స్కందాల సహజాతాల దేహమిది జనన జరామరణాల జీవితమంతా వేదనామయం కార్యకరణ ప్రక్రియ నిరంతర మార్పు కూర్పులు ప్రకృతి ప్రపంచమంతా ప్రవాహమానం కాలచక్రం నీది నాది ఏదైనా నశించక ఉండవు కలసిపోతాయి అతిగా కోరకు అసలేదీ వద్దనకు మధ్యే మార్గాన్న నడువు పాపం చేయకు దుఃఖం వెంటే ఉంటుంది. మంచినే చెయ్యి పుణ్యం నీతోనే వస్తుంది. మనసు నిగ్రహంగా ఉంచుకో ధ్యానం చెయ్యి సద్భావం సౌశీల్యం సధర్మాచరణంతో సాగిపో ప్రజ్ఞతో నీ నిర్వాణాన్ని నీవే సాధించుకో "బహుజన హితాయ! బహుజన సుఖాయ లోకానుకంపాయ" అహంకారం మమకారం అంతరించినప్పుడే పరిపూర్ణ శాంతి రాగ ద్వేష మోహ రహితమైన ప్రశాంత స్థితి నిర్వాణం!

☸️ధర్మాచరణ☸️

ఏ చెడును చేయకుండా ఉండటం ఎప్పుడూ మంచినే చేస్తూ ఉండడం మనసుని స్వాధీనంలో ఉంచి పరిశుద్ధుడగుట బుద్ధిజీవికి బుద్ధి వికాసంతో ధన్యత. నిర్వాణం అర్హతుడు బుద్ధ భగవానునికి నమస్కారం. త్రిషరణం నిత్య పారాయణం. నాలుగు అరియసత్యాలు నిత్య నిజాలు. కరుణ కూడిన లక్షణాలు పొందాలి. ఏడు విధాలగు జ్ఞానంతో వికసించాలి. అష్టాంగ మార్గము ఆచరణీయ సత్య ధర్మం. నవవిధ గ్రంథ పఠనము బౌద్ధులకు ఆవశ్యము. దశాదేశములు పది మంచి పనులొనర్చుము ప్రజ్ఞాది పారమితలతో ప్రపంచాన్ని జయించుము అతీత శక్తులు అతీంద్రియ మహిమలు అతి విశ్వాసం ఆరాధనలు నిర్వాణాన్ని ఇవ్వవు అంతా అనిత్యం కార్య కారణ సంబందితం జన్మ జరామరణాలు దుఃఖ అనాత్మం తనేమిటో తాను తెలుసుకొనుట విపసన ప్రకృతి జ్ఞానం ప్రజ్ఞతోనే పరిపూర్ణ మైత్రితో మానవతాయే ధర్మ పీఠము సత్య ధర్మ సమ్యక్ భోధి సాధించుము వసుదైక కుటుంబానికి మానవతా సూర్యుడు అహింసా మూర్తి విశ్వశాంతి జ్యోతి బుద్ధుడు.

☸️భారతీయులకు బౌద్ధమే శరణ్యం☸️

సాటిలేని బౌద్ధ ధర్మ మార్గం ఉన్నది. ఆ ధర్మ జ్ఞాన సాధనకై ప్రతిన బూనుదాం.
సంస్కృతి రాజధానిగా పేరొందిన పవిత్ర గోదావరి నదీ తీర రాజమండ్రి నగరం అంతర్జాతీయ యాత్రా స్థలము కానున్నది.
జపాన్, చైనా, బర్మా, శ్రీలంక, మలేషియా తదితర దేశాల ప్రజల మతంగా వర్ధిల్లుచూ ప్రపంచంలోని ఆలోచనపరుల ఆచరణలో ఉన్న బౌద్ధ ధర్మం మానవజాతిలో నీతిగా ఉన్న బౌద్ధం మానవ వికాసం కోసం పటిష్టమైన విధానాలు కలిగి ఉన్నది. శాంతియుతమైన జీవనాన్ని మనం అందుకోవడానికి బౌద్ధాన్ని ఆశ్రయించడమే శరణ్యం ఉత్తమం ఆదర్శనీయం.
ధర్మాచరణంతో బౌద్ధ ధర్మ పునరుజ్జీవనం ద్వారా ప్రపంచాన్ని ధర్మదామం శాంతిమయం చేయుట కోసం జాతీయ ధర్మదీక్ష పరుల ఉద్యమం ఆహ్వానిస్తున్నది.
మానవతా సారము బౌద్ధాన్ని ప్రపంచానికి అందించిన మన భారత సమాజాన్ని బౌద్ధంతో సుసంపన్నం చేద్దాం.

☸️ బౌద్ధ ధర్మ పరిచయము☸️

బుద్ధం శరణం గచ్చామి
ధర్మం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి
నమో తస్స భగవతో అరహతో సమాసం బుద్ధస్స (ఉన్నతుడు అర్హతుడు మహా జ్ఞాని అయిన వానికి నమస్కారములు.)
మానవుడే ప్రధానమని అతి మిత విధానాలకు మధ్యమ మార్గముగా సహేతుక సమధర్మం ప్రబోధించిన బౌద్ధం నుండి ప్రజ్ఞ సత్యం శాంతి కరుణ అహింస హేతువాదం శ్రమ సాధన సత్ప్రవర్తన నీతి న్యాయాలు సమానత్వం మానవత్వం విజ్ఞానం నిర్వాణం ప్రపంచం స్వీకరించింది.
సమస్త ప్రజలు సత్యాన్ని గ్రహించి వివేక వికాసాలతో వర్ధిల్లాలి. ఉన్నత నైతిక విలువలు ఉత్తమ జీవన ప్రమాణాలు కలిగిన ప్రజాస్వామిక సమసమాజ నిర్మాణానికి విలువైన సాంస్కృతిక వారసత్వం బౌద్ధ ధర్మమే! మానవ విలువల్ని సుస్థిరం గావించిన బౌద్ధ ధర్మాన్ని పునః ప్రతిష్టించాల్సిన అవసరం భారతీయులకు ఎంతైనా ఉంది.

☸️ నాలుగు అరియసత్యాలు☸️

1) దుఃఖం ఉంది.
2) దుఃఖానికి కారణం ఉంది.
3) దుఃఖ నిరోధనం చేయవచ్చును.
4) దుఃఖ నిరోధానికి మార్గం ఉంది.
నాలుగు ధ్యానములు: 1. ఏకాంత సాధన, 2. శాంత చిత్తత. 3. ఆధ్యాత్మిక ఆనంద స్థితి, 4. పరిపూర్ణమైన శాంతి.
నాలుగు బుద్ధి పాదములు: 1. చెడు పనులు చేయకుండా ఉండుట. 2. మంచి పనులు చేయడం. 3. చిత్తవృత్తులని అదుపులో ఉంచుకోవడం. 4. ఓర్పుతో, పట్టుదలతో, సరైన అన్వేషణతో సత్యమును కనుగొనటం.
పంచశీల: 1. జీవహింస చేయను. 2. దొంగతనం చేయను. 3. వ్యభిచారం చేయను. 4. అసత్యం పలకను. 5. మత్తు పదార్థాలు తీసుకోనని ప్రతిజ్ఞ చేసి పాటించాలి.
పంచ సమాధులు: 1. మైత్రీ సమాధి. 2. కరుణా సమాధి. 3. ముదితా సమాధి. 4. సంక్లేశ సమాధి. 5. శాంతి సమాధి.
పంచ స్కందాలు: 1. శారీరకమైన స్థితి. 2. ఊగిసలాడుట. 3. నైతికంగా కర్మకాండలపై ఆధారపడటం. 4. మానసిక వాంఛల పట్ల తాపత్రయం. 5. దేశభావం.
ఐదు ఉపాదాన స్కందాలు: 1. రూపం 2. వేదన 3. సంజ్ఞ 4. సంస్కారం. 5. విజ్ఞానం.
ధర్మ విశిష్ట లక్షణాలు: 1.సానుభూతి 2.ప్రేమ 3.సత్యాసక్తి 4.పరిశుద్ధత 5.ఉదాత్తమైన భావన 6.కరుణ.
సప్తవిధజ్ఞానం: 1. శక్తి 2.జ్ఞానం 3.అన్వేషణ 4.ఆనందము 5.ప్రశాంతత 6.నిర్మలత్వము 7.అష్ట గుణంభగు మార్గము.

సప్త శాసనములు: ప్రజాతంత్రానికి విదేహ గణతంత్ర రాజ్యానికి బుద్ధుడు సూచించిన నియమాలు: 1. ఎప్పుడూ కలిసి ఉండండి. సామూహికంగా నిర్ణయాలు తీసుకోండి. 2.నిర్ణయాలు సారం కర్తవ్యాన్ని అందరూ కలిసి నిర్వహించండి. 3.రాజ్య శాసనాన్ని పాటించండి. రాజ్యం పట్ల విధేయులై ఉండండి. 4.జ్ఞానవృద్ధుల్ని గౌరవించండి. 5. స్త్రీలను హింసించకండి వారికి స్వాతంత్రం ఇవ్వండి. 6. జాతీయ ధర్మాన్ని ఆచరించండి. 7. ధర్మాచార్యులను గౌరవించండి.

☸️అష్టాంగ మార్గము☸️

1 సరైన దృష్టి 2.సరైన సంకల్పం 3.సరైన మాట 4.సరైన పని 5.సరైన జీవనం 6.సరైన ప్రయత్నం 7.సరైన స్మృతి 8.సరైన సమాధి.

☸️నవధర్మ గ్రంథాలు☸️

1.సూత్రము 2.కథా సూత్రము 3.విపుల వ్యాఖ్య 4.ధర్మ పదము 5.సూత్ర వచనములు 6.ఇతి పుస్తకములు 7.జాతక కథలు 8.చమత్కారములు 9.సంభాషణ గ్రంథములు.

☸️బుద్ధుని ఆదేశములు☸️

1.జీవహింస చేయరాదు 2.దొంగతనం చేయరాదు 3.వ్యభిచారం కూడదు 4.అబద్ధం ఆడరాదు 5.అపనిందలు వేయరాదు 6.పరుష వాక్కు కూడదు 7.వృధా సంభాషణ చేయవద్దు 8.ఇతరుల సొత్తు ఆశించకూడదు 9.ద్వేషము ఉండరాదు 10.ధర్మ మార్గమున నడుచుకొనుము.

పుణ్య కర్మలు: 1.దాన పాత్రులకు దానమిమ్ము. 2.ధర్మసూత్రములను ఆచరింపుము. 3.శుభసంకల్పమును పెంపొందించుకొనుము. 4.పరోపకారము చేయుము. 5.తల్లిదండ్రులను పెద్దలను గౌరవించు సేవించుము. 6. పుణ్య కార్యఫలములలో ఇతరులకు భాగం ఇచ్చుట. 7. ఇతరుల పుణ్య కార్యాఫలములను స్వికరించుట. 8. ధర్మోపదేశమును వినుము. 9. ధర్మం ఉపదేశించుము. 10. నీ దోషములను దిద్దుకొనుము.

ధర్మపీఠం: సర్వోత్రోస్కుష్టమైన శాంతము. ఓరిమీ యనునవి తథాగతని వస్త్రములు. సర్వ ప్రాణుల యందు ప్రేమ దానము అనునవి తథాగతుని ఆవాసములు. ధర్మ సూత్రములను సూత్రప్రాయముగను విశేష సన్నివేశపరముగను పూర్తిగా అవగాహన చేసుకొనుటయే తథాగతుని ఉపదేశ వేదిక.

ధర్మ చక్ర ప్రవర్తనము: చక్రమునందలి ఆకులు సత్ప్రవర్తనను తెచ్చు నియమములు. వాటి పొడవు సమానంగా నుండుట న్యాయ లక్షణం. చక్రము చుట్టును వెలుపలి భాగమున గల ఇనుప రేకు జ్ఞానము. సత్యము యొక్క స్థిరమైన ఇరుసు బిగింప చక్రనాభియే వినయము, మననము.

మధ్యే మార్గము: ఓ భిక్షువులారా! సర్వము శాశ్వతముగానున్నది. ఏమియును ఎప్పుడును లేదు అను రెండు అవదులకు దూరముగా ఉన్న మధ్యమ మార్గం ఇది.
దీర్ఘ పరిశ్రమ అమరత్వానికి మార్గం. సోమరితనం మరణానికి మార్గం. పరిశ్రమించేవారు మరణించరు.
సోమరిపోతులు ఎప్పుడో మరణించిన వారి కిందే జమ. రహస్య సిద్ధాంతం-బహిరంగ ప్రచారం-అనే వ్యత్యాసం పాటించకుండా సత్యాన్ని మీకు వివరిస్తూ వచ్చాను. సూర్యుడు చంద్రుడు వలె తథాగతుడు బోధించిన ధర్మం నిత్యము యావత్ ప్రపంచంలోనూ వెలుగుతుంది. దానిని ఎవరూ దాచిపెట్టలేరు. వీటి విషయంలో రహస్యం లేదు.
బహుజన హితం బహుజనుల సుఖం కోసం సర్వ మానవాళి శ్రేయస్సు కోరి మీరు నా ధర్మాన్ని ప్రచారం చేయండి. జనుల పట్ల కరుణతో మెలగండి ఆదిలో మధ్యలో నుంచి అంతంలో మాటలో చేతలో శ్రేయస్కరమైనది నా ధర్మం. ప్రజల నేత్రాలు ధూళిలో కమ్మి ఉన్నాయి. వారికి ఈ ధర్మం బోధిస్తే ధూళి తొలగి దుఃఖ నివారణ కలుగుతుంది. నా ధర్మాన్ని స్వీకరిస్తారు. పవిత్ర జీవిత సందేశాన్ని ప్రజలకు అందజేయండి.
నా ధర్మాన్ని ఆశ్రయించు, ధర్మాన్నిష్టలను చిత్తశుద్ధితో పాటించు, ధ్యానం, సద్ధర్మాన్ని పాటిస్తే ఎవరైనా నిర్వాణాన్ని పొందవచ్చు. కులంతో పనిలేదు. నిర్వాణం ఏ ఒక్క కులం యొక్క ప్రత్యేక సౌకర్యం కాదు. గాలి అన్ని కులాలకు సమానం, అలాగే నా ధర్మాన్ని అందరూ అనుసరించవచ్చు.
అన్ని మిశ్రమ పదార్థాలు నశించక తప్పవు. అలాగే నేను నిర్వాణం పొందుచున్నాను. జ్ఞానం పొందండి. శ్రద్ధతో మీ నిర్వాణాన్ని మీరే సాధించుకొనండి.
నా పట్ల ఆధర భావంతో నా మాటలను మీరు విశ్వసించవద్దు. వాటిని విశ్లేషించి అగ్నిపరీక్షకు గురిచేసి మరీ నమ్మండి. మీరు దీప శిఖలు మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. ధర్మం అనే జ్యోతి పట్ల గాడ నిబద్ధత ప్రదర్శించండి. ధర్మాన్ని ఆచరించండి తనపై తనకు విశ్వాసం కలవానికి అంతర్గర్బితమైన శక్తులన్నీ వెలికి వస్తాయి.
బుద్ధస్తు భగవాన్ స్వయం
బుద్ధం వందే జగద్గురుం
బుద్ధం నమో విశ్వతేజం
మనసా సుచరితం చెరే
సంఘం సుచరితం చెరే
శారద బిక్కవే చారి కం బహుజనహితాయ,
బహుజన సుఖాయ లోకానుకంపాయ.
సర్వసత్యానాం నిఖిల దుఃఖోపశమనః
అహంకారం, మమకారం అంతరించినప్పుడే పరిపూర్ణ శాంతి.
-బుద్ధ భగవాన్

సమానత: పుట్టుకచే మనుషులందరూ సమానులే దుర్మార్గపు పనులు చేయువారు దుర్జనులు. సత్కార్యములు చేయువారు సజ్జనులు. గుణకర్మల చేత సజ్జనులు కూడా దుర్జనులు కావచ్చు. అట్లే సత్ప్రవర్తనము వలన ఎవరైనా సజ్జనులు కావచ్చు.

ప్రజ్ఞ: అస్థిరమైన చిత్తము గలవాడు సందర్భము తెలియనివాడు ప్రశాంత చిత్తము లేక వెనుకకు ముందుకు కదిలెడి మానవుని ప్రజ్ఞ పరిపూర్ణము కాజాలదు. మనసును ఉన్నత మార్గమున నిలిపి స్థిరమగు ప్రయోజనముతో నిష్కపటమైన నమ్మికనిచ్చు సత్యమును అన్వేషించుము.

కరుణ: ప్రాణమన్న సకల జీవులకు మిక్కిలి ప్రీతి. మానవుడు ప్రాణమును తీయగలవాడే గాని ప్రాణదానము చేయలేడు. ఒక ప్రాణి పాప పంకిలను వేరొక ప్రాణి రక్తము కడుగజాలదు. ఇట్టి స్వార్థ బుద్ధి కంటే వేరు పెద్ద పాపమేమి కలదు? భూత దయయే ఉత్కృష్ట ధర్మము.

నిర్వాణము: దుఃఖం నుండి వ్యామోహాల నుండి పూర్తి స్వేచ్ఛ పొందడమే నిర్వాణం. సద్ధర్మజీవనం సార్ధకమైనప్పుడు నిర్వాణ పధం స్థిరమౌతుంది. నిర్వాణమే గమ్యం. నిర్వాణమే ధ్యేయం. నిర్వాణమే అంతిమం.
తథాగతుడు సమ్యక్ సంబుద్ధుడు.

☸️బుద్ధ ఉవాచ☸️

యత్కించిత్ సుభాషితం తత్ సర్వం బుద్ధభాషితం

ఏదైతే సత్యము సక్రమమైనదో అదంతా బుద్ధుడు మాట్లాడినది. ప్రకృతి అనుభవానికి విరుద్ధమైనది ఏది బుద్ధుడు బోధించలేదు.

☸️మానవతా మార్గము☸️

వ్యక్తుల పరిపూర్ణతకు సమాజ శ్రేయస్సుకు పాటించాల్సిన ఆచరణాత్మకమైన జీవన విధానాలనే బుద్ధుడు పారమిలుగా దశాదేశాలుగా చెప్పాడు. పది పారమితులు ఇవి.
1. శీలం: సచ్చీలుడుగా సత్ప్రవర్తనతో ఉండడం చెడు చేయకుండా మంచి చేయాలన్న విలువలను కలిగి ఉండడం.
2. సత్యం: సత్యం గ్రహించి నిజాన్నే స్వీకరించి నిజాన్నే చెప్పాలి. నిజాయితీగా పని చేయటం న్యాయమైనదే ఆచరించటం జ్ఞానంతోనే సత్యసంధ్యత అనిత్యత అనాత్మ ప్రతీత్య సముత్పాదం బౌద్ధ జ్ఞాన తత్వం.
3. వీర్యం: కార్యశీలత ఎన్ని అవంతరాలు ఎదురైనా మంచి పనులు చేయటానికి పట్టుదలతో కష్టపడి పనిచేసే మంచి ఫలితాలను సాధించటము.
4. శాంతి: సహనం ఓర్పుతో వ్యవహరించటం ఒత్తిడులను ఓర్చుకొని సహన శక్తి దుఃఖాన్ని అధిగమించే శాంతి మనుషులకుండే నేర్పు ఓర్పుల ప్రశాంతత.
5. ప్రజ్ఞ: ఏకాగ్రతతో కూడిన కార్యశీలత విద్యా వికాసం ఆర్థిక అభివృద్ధి భద్రతతో ఉండే బతుకు హృదయానందం ప్రజ్ఞతోనే సాధ్యం. అంతర్గత ధ్యానం ఆధ్యాత్మిక ప్రజ్ఞ ప్రతిభాసీలుగా ఎదగడం భౌతిక ప్రజ్ఞ రెండింటివలన నిర్వాణం ప్రజ్ఞ.
6. అధిష్టాన ము: పని పట్ల పట్టుదలతో పాటు పడటం దృఢనిశ్చయంతో లక్ష్యసాధన ధ్యేయసాధనలో ధైర్యంగా ఉండడం పట్టు పట్టాలి ఫలితం వచ్చేవరకు పని చేయాలి.
7. ఉపేక్ష: సమతా భావంతో కష్టదుఖాల్ని భరించడం పనిచేస్తూ ఫలితాలు పట్ల ఆందోళన లేకుండటం భావోద్వేగాలను అదుపులో ఉంచుకొనడం నిర్లక్ష్యం కాదు. సుఖాలకు పొంగిపోవడం బాధలకు కృంగిపోకుండా ఉండుట.
8. మైత్రి: ప్రేమతో ఉండడం ప్రేమ నాణేనికి రాగద్వేషాలు ఉన్నవి మైత్రికి లేవు స్నేహభావంతో జనుల పట్ల ప్రాణికోటిపట్ల ఉండటం సమాజానికి ప్రకృతికి మేలు.
9. నిష్కామ: సర్వసంగ పరి త్యాగము చేసి సంఘ సేవ చేయుట సొంతానికి ఏదీ చేయని త్యాగంతోనే సమాజ హితం కోసం ఆదర్శాల ఆచరణ.
10. దానం: మనకున్నది ఇతరులకు ఇవ్వడం మంచిని చేసేవారిని ప్రోత్సహించటం పోషించటము దాన లక్షణాలకు ప్రతీక అశోక చక్రవర్తి, సమాజ సేవకు దానగుణం మంచిది మతాల వృద్ధికి కాదు.

☸️ బుద్ధ జ్యోతి☸️

కారుణ్య ప్రవాహం నుండి వెలుగులు రావాలి. ప్రశాంత తాత్విక శోభ నుండి కర్తవ్యోపదేశాలు రావాలి. ఆ మానవత్వం సాత్విక జీవన ప్రవాహ రూపం శాంతి. సంక్షోభ సుడిగుండంలో నలిగి వేసారుతున్న మానవాళి బ్రతుకులకు వెలుగుదారిని చూపే రాదారి అదే బుద్ధ జ్యోతి.

☸️ త్రిశణాలు☸️

బుద్ధం శరణం గచ్చామి-జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాను.
ధర్మం శరణం గచ్చామి-ధర్మమును ఆచరిస్తాను.
సంఘం శరణం గచ్చామి-సంఘమును శరణు జొచ్చుచున్నాను.

"సబ్బపాపస్స అకరణం, కుశలస్స ఉపసంపద సచిత్తపరియోదపనం ఏతం బుద్దాను శాసనం"

శ్రీ తోట చిన్నారావు
విపస్సన ధ్యాన గురువు
8919613755.

మైత్రేయ బుద్ధ విహార 
వేమగిరి
తూర్పుగోదావరి జిల్లా-533125.
9441265845.

మీకందించినవారు.
పాము రవీంద్రనాథ్
బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా
ఏలూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ
7382716390.

✊🏻జై భీమ్ బుద్ధ వందనాలు🙏🏻☸️🌻🦚💐🪷🌼🌸🌹🌺🌷🥀🪻🙏🏻

No comments:

Post a Comment