*_విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ దృష్టిలో "విద్య"అంటే..._*
_(ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు.. అందరూ తప్పనిసరిగా చదివి ఆలోచించదగిన విషయం... -వె. నా. రావు🙏)_ *==================*
*ఈ వ్యాసంలో రవీంద్రనాథ్ టాగూర్ గారు విద్య గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలు అమూల్యమైనవి. ఆలోచించి, ఆచరించదగినవి.*
*పిల్లలను ఐదు సంవత్సరాల వరకు బడులకు పంపరాదు.*
*అప్పటివరకూ పిల్లలు ప్రకృతి ఒడిలో పడుకుని శరీరాన్ని మట్టితో పులుముకొని చెట్లెక్కి పండ్లు కోసుకోకపోతే ఇటువంటి సువర్ణావకాశం వారికి మళ్ళీ జీవితకాలంలో ఎప్పుడు లభిస్తుంది?!?!?!?*
*"ప్రాపంచిక భోగలాలసత్వం” వారిని స్వాధీనం చేసుకోకముందే నీలాకాశపు పందిరికింద ఎండా నీడల్లో ఆడుకునేచోట మనసారా ఆడుకోనివ్వండి. గెంతులువేయనివ్వండి. మంచుతో తడిసి గాలితాకిడికి సయ్యాటలాడుతూ అనేక రంగులు పులుముకున్న పొలాల అందాలను తమ కళ్ళారా చూసి తరించ నివ్వండి. అని పెద్దలకు టాగూర్ సూచిస్తారు.*
*ప్రకృతి ఒడిలో కన్ను విప్పిన నాటినుండి ప్రకృతితో చాలినంత బాంధవ్యం ఏర్పరుచుకోవాలి. “తల్లిపాల మాదిరి ప్రకృతి మాతనుండి అమృతం జుర్రుకోవాలి”. ఆమెనుండి హృదయ వైశాల్యాన్ని, భయరాహిత్యాన్ని అలవర్చు కోవాలి.*
*రవీంద్రుని మాటల్లో ఉపాధ్యాయునికి, గురువుకూ తేడాను గమనించండి. ఉపాధ్యాయుడు వేతనాన్ని గ్రహిస్తాడు. శిక్షకుడికి విద్యార్థికి మధ్య సంబంధం సమసిపోతుంది. గురువులు విద్యార్థులలో జీవం పోయడం తమ కర్తవ్యమని భావిస్తారు. తమ జ్ఞానంద్వారా వారి హృదయాలలో జ్ఞాన జ్యోతిని వెలిగిస్తారు. జీవికకై వేతనం తీసుకున్నా ప్రతిఫలంగా ఎక్కువ అందించి ఉన్నత స్థానాన్ని పొందుతారు.*
*నేడు పిల్లలు పసితనంలోనే తమ అమూల్యమైన సమయాన్ని ఒక విదేశీ భాష వర్ణములను, పదకోశాన్ని గుర్తుపెట్టు కోవటంలో నష్టం చేసుకోవాల్సి వస్తుంది. దీనిలో జీవం లేదు. ఆనందానుభూతి లేదు. ఆంగ్లభాషలో గుట్టలకొద్దీ పుస్తకాలను మింగినా... మనబుద్ధి మాత్రం వికసించడంలేదు.*
*_ప్రస్తుత విద్యావిధానంలోని లోపాలు:_*
***********************
*బిడ్డలను ముందుగా అసలైన మనుషులుగా తీర్చిదిద్దటం ప్రతి తల్లిదండ్రుల కర్తవ్యం. కానీ వారు బాల్యంనుండీ ఎంతో ధనం వృధాచేసి పిల్లలను ఎందుకూ పనికిరానివారిగా తయారుచేస్తున్నారు. మనవిద్యను గోడలలో బంధించి, ద్వారాలతో అడ్డగించి, కాపలాదారునిలా కూర్చోబెట్టి దండిస్తూ, గంటలతో మేల్కొల్పుతూ వికృతరూపాన్ని కలిగిస్తున్నారు. ఆకాశం, గాలి యిచ్చే ఆనందాన్ని, స్వేచ్ఛను లాక్కొని బోధనను దండనగా మార్చుతున్నారు. మన అసమర్థత వల్ల, అనాగరికత వల్ల జ్ఞానబోధను రుచికరం చెయ్యలేక పోయాం. మనస్సుకూ నచ్చిన ఆటపాటలు లేక పిల్లల శరీరాలు దుర్భలంగా, తయారవడమే కాకుండా మనసులు కూడా బలహీనమై పోతున్నాయి. మనచదువుకూ జీవితానికి ఏవిధమైన సంబంధము ఉండడము లేదు. విద్యార్థి తనభావాలను ఉన్నత శిఖరాలకు చేర్చలేక పోతున్నాడు.*
*_మరి ఇప్పుడేం చేయాలి?_*
************************
*నేటి అవసరాలను గుర్తించి ఉపయోగకరమైన విద్యావిధానాన్ని రూపొందించు కోవాలి. మేథావులు విషయంపై చర్చలు జరిపి జాతి జీవనంలో జీవం ప్రవహించేలా చూడాలి. బాల్యం నుండి వాస్తవికమైన విద్యను మనుషులుగా తయారుచేసే విద్యను నేర్పాలి.*
*------------------------*
🙏🙏🙏
No comments:
Post a Comment