Wednesday, November 8, 2023

నమో నారాయణా.....

 291222j1646.   040323-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


          *నమో నారాయణా.....* 
               ➖➖➖✍️


*భక్తి సంప్రదాయంలో- పంచాక్షరి, అష్టాక్షరి మంత్రాలు ఉదాత్తమైనవి.*

* ‘ఓం నమో నారాయణాయ’ *

*అనేది అష్టాక్షరి మంత్రం. నారాయణ స్వరూపాన్ని తనలో ఇముడ్చుకున్న మంత్రం. నారాయణుడు అంటే నీటిలో నివసించేవాడని అర్థం.*

*ఆయన సర్వవ్యాపి అయిన పరమాత్మ.*

*‘ఓమ్‌’ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరం. దీన్ని ‘ప్రణవం’గా పిలుస్తారు. నిత్య శుద్ధమైన బీజాక్షరం ఇది.*

*అకార, ఉకార, మకారాలతో కూడిన ఓంకారం వేదాల్లోనూ వ్యాపించి ఉంది. ఓంకారం సర్వ శుభదాయకమని ఋషులు బోధించారు. ఓంకారం సకలార్థ సాధకం. క్షరం కానిది అక్షరం.*

*‘న’కారం అన్ని ప్రాణాలకూ మూలం శ్రీహరి అని చెబుతుంది.*
*శరీరం ప్రాపంచిక సుఖాలనే కోరుకుంటుందని; మనం చేసే కర్మను బట్టి పుట్టుక, చావు ఉంటాయని పురాణ గాథలు చెబుతాయి.*

*పరమాత్ముడే అన్నింటికీ మూల కారణమని, ‘న’కారం అంటే నాశనమని వివరిస్తాయి. సజ్జనుల్ని హింసించే రాక్షసులను సంహరించడాన్ని నకారం సూచిస్తుంది.*

*‘మో’ అంటే మోహన రూపుడు. ఋషుల్ని, యోగుల్ని, భక్తుల్ని ఆయన సమ్మోహపరిచేవాడు. మోహాన్ని నాశనం చేసేవాడనీ అర్థం చెప్పవచ్చు.*

*‘న’ అంటే నారాయణుడు. ఆయనను నరసింహావతారానికి సంకేతంగా పరిగణిస్తారు. నరసింహుడు శత్రు భయంకరుడు.*

*అనంతర బీజాక్షరం ‘రా’కారం. రమింపజేసేవాడు రామచంద్రుడు. ఆయన తనను సేవించేవారిపై చల్లని వెన్నెల ప్రసరింపజేసేవాడు. రఘుకుల తిలకుడు, రమ్య గుణధాముడు శ్రీరాముడే!*

*‘య’కారం యజ్ఞానికి సంకేత రూపం. శ్రీహరి యజ్ఞ స్వరూపుడు. ఆ మహావిష్ణువు ధరించిన అనేక అవతారాల్లో ‘యజ్ఞావతారం’ ఒకటి.*

*‘ణ’ కారాన్ని అనేక అభీష్టాల్ని నెరవేర్చే బీజాక్షరంగా భావిస్తారు.*

*చివరి అక్షరం ‘య’ కారం. ఇది యజ్ఞ కర్తను, యజ్ఞ భర్తను సూచించేది.                        యజ్ఞ కర్త లోకహితాన్ని కోరి యజ్ఞం చేస్తే, ఆ యజ్ఞ ఫల స్వీకర్త మహావిష్ణువే!*

*భక్తులపై విష్ణుదేవుడి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరించాలంటే, అష్టాక్షరి మంత్రంతో స్తుతించాలని పురాణగాథలు చెబుతాయి.*

*ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి సులభ మార్గంలో రూపొందించిన జప విధానం ఇది. ఆపదల్లో ఉన్నవారికి, అజ్ఞానంలో మునిగినవారికి విష్ణు నామమే దివ్యమైన ఔషధమని, ఆధారమని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.*

*స్వామికి ప్రీతిపాత్రులు కావడానికి, ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత జీవనం గడపడానికి అష్టాక్షరి మంత్రాన్ని ఓ సాధనంగా పరిగణిస్తారు.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment