Tuesday, November 14, 2023

డబ్బుతో జాగ్రత్త

 "డబ్బుతో జాగ్రత్త"

మిత్రమా... డబ్బుతో జాగ్రత్త!!
డబ్బే తెగింపు..డబ్బే ముగింపు
డబ్బే మోసం..డబ్బే ద్వేషం..డబ్బే పగ
అందరూ డబ్బుకు దాసోహం!!
డబ్బుకు బేధాలుండవు..
బంధుత్వం ఉండదు..

వ్యక్తిత్వాన్ని కూల్చేస్తుంది..
ఆత్మీయతను పేల్చేస్తుంది..
స్వార్థాన్ని నింపుతుంది..
సత్యాన్ని చంపుతుంది..
బాకీ ఇస్తే బాధలు నింపుకున్నట్లే!! 
బాకీ తీసుకుంటే బంధుత్వం తెంపుకున్నట్లే!!..
అన్నిటికీ మూల కారణం డబ్బే!!...

అందుకే డబ్బు దగ్గర జాగ్రత్తగా ఉండాలి
డబ్బున్నోడు గొప్పోడు కాదు..
నిండైన వ్యక్తిత్వం ఉన్నోడే గొప్పోడు..
పూటకు లేనోడు నిజమైన పుణ్యాత్ముడు...
ఆ పూటలేకున్నా అడుక్కొని తినగలరు
డబ్బే మనుషులను పరుగులు తీయిస్తుంది..
పక్కలో బల్లెమై బరువు మోపిస్తుంది
అందుకే మిత్రమా..డబ్బుతో జాగ్రత్త!!

అప్పు ఇచ్చి తప్పు చేయకు!! 
అప్పు ప్రాణానికే ముప్పు!!
అప్పుచేయొద్దు..ఆపదలో పడొద్దు!!..
కంటికి రెప్పలా కాపాడాలి..
చేనుకు కంచెలా కాపలా కాయాలి..
డబ్బుతో గర్వం పెరుగుతుంది 
గౌరవమూ తరుగుతుంది..
అలానే ఆశ పెరుగుతుంది  
కానీ ఆత్మవిశ్వాసం ఆవిరవుతుంది!!

డబ్బు వలన ఆస్తులు పెరగొచ్చు!!
అంతస్తుల భవనాలు
నిర్మాణం చేయవచ్చు!!..
కానీ ఉన్నత విలువలు దిగజారిపోతాయి...
ఎంత డబ్బున్నా కాలాన్ని అధికమించలేవు...
కాలంలో కలిసిపోయేటప్పుడు 
డబ్బు ఆపలేదు...
మాటలతో.. డబ్బు మూటలతో 
ఎప్పటికైనా ముప్పు!!

డబ్బుకున్న శక్తి  గొప్పది!!
ఎదుటివారిని ఒప్పించగలదు నొప్పించగలదు...
ఆపదలనుండి తప్పించగలదు!!..
అదే ఆపదలను తెప్పించనూ గలదు..
డబ్బుకు కోపమెక్కువ రోషమెక్కువ
స్వార్థం కూడ ఎక్కువే!!...
ప్రపంచం డబ్బు మీదనే నడుస్తుంది..
డబ్బుకు అనేక పార్శ్వాలు...
పలురకాల పలుకుబడులు...
డబ్బు అవసరమే కానీ 
డబ్బే జబ్బుగా మారకూడదు..
అందుకే మిత్రమా!! 
డబ్బనే అగాధం లోంచి 
ఎప్పటికప్పుడు బయటపడేలా ప్రయత్నిద్దాం!!....


అంబటి నారాయణ

No comments:

Post a Comment