హరిఓం , - - చాలా విషయాలను ఒక వయసు
వచ్చాక మనం వదిలేయాలి .........
*_వయసు పెరిగితే మనకేమీ కొమ్ములు పొడుచుకుని రావు. చాలా విషయాలను మనం వదిలేయాలి._*
*_“చలం” (గుడిపాటి వెంకటాచలం), గాయని వాణీ జయరామ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గార్లను ఆదర్శంగా పెట్టుకోవాలి._*
*_చలంగారు తానూ, తన స్నేహితుడూ ముచ్చటించుకుంటూ ఉండగా పిల్లలు వాళ్ళ ఇంట్లోని వంటపాత్రలతో ఆడుకుంటూ ధ్వనులు చేస్తుండగా స్నేహితుడా పిల్లలను వారించాడు._*
*_అప్పడు చలం “మనకు మన ముచ్చట్లు ఎంత ముఖ్యమో, ఆ పిల్లలకు వాళ్ల ఆటా అంతే ముఖ్యం. వయసులో పెద్దవాళ్లమైనంత మాత్రాన వాళ్ల ఆటలను ఆపెయ్యమనడానికి మనకు హక్కెక్కడిదీ ?” అన్నారు. ఇలాంటి ఉన్నతాలోచనా పథాన్ని అలవరచుకునే ప్రయత్నంలో కొంత విజయం సాధించాలి._*
*_వాణీ జయరామ్ గారు చిన్న పిల్లలను సైతం “మీరు” అనే సంబోధిస్తారు. ప్రయత్నించినా ఆ తత్త్వం అబ్బడంలేదు._*
*_ఎస్పీ బాలు గారు శబరిమలకు డోలీలో వెళ్ళిన సందర్భంలో డోలీ మోసినవాళ్ళ కాళ్ళకు మోకరిల్లారు. అది వాళ్ళ వృత్తికావచ్చుగాక. వాళ్ళు ఆ పనిచేసినందుకు డబ్బులిస్తుండ వచ్చు గాక. వాళ్ళే లేకపోతే మనవద్ద డబ్బులుండీ లాభమేమిటి ?_*
*_మనమెలాగూ ఎస్పీలాగా పాదాభివందనం చేసేంత గొప్పవాళ్లం కాలేం. కనీసం “థాంక్స్” చెప్పొచ్చు కదా._*
*_కాగా ఒక సందర్భంలో “మన శరీరంలో తగినంత శక్తి ఉండగా ఇతరులకు డబ్బులిచ్చే అయినా బ్యాగులు మోయించొద్దు” అనీ “ఎవరిచేతనైతే నీ లగేజీని మోయిస్తావో వాళ్ళ పదింతల లగేజీని వచ్చే జన్మలో నీవు మోయకతప్పదు” అన్నారు శ్రీకంచి కామకోటి పీఠాధిపతి స్వామి గారు. చాలామటుకు దీనికీ కట్టుబడి ఉండే ప్రయత్నము చేయాలి._*
*_మనం చాలా విషయాలను పట్టుకోవటం కష్టం కానీ వదిలేయడంలో బాధ ఏమిటీ ?_*
*_ఏం వదిలివేయాలో చూద్దాం :_*
*_"అమ్మాయీ గ్యాసు కట్టేసావా !!_*
*_గీజర్ ఆఫ్ చేసావా ??_*
*_ఏ.సి ఆన్ లో ఉన్నట్లుంది.._*
*_పాలు ఫ్రిజ్ లో పెట్టావా ??_*
*_..లాంటి ఎంక్వయిరీలు వదిలేద్దాం._*
*_”మా కొడుకూ, కోడలూ పట్టించుకోరు" అంటూ తామేదో పర్వతాలను మోస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ తమ పరువు తామే తీసుకుంటున్న తలిదండ్రులున్నారు._*
*_వాళ్ళ హయాంలో వాళ్ళిష్టం.._*
*_కష్టనష్టాలు కూడా వాళ్ళవే !!_*
*_ఎవరితో ఏపనీ చేయించుకోకుండా, ‘ప్రతీపనీ’ “మన పనే” అనుకుంటే ఎంత ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండగలమో కదా !_*
*_”నా అభిప్రాయం ఏమిటంటే" అని అనటం తగ్గించి.. నీ ఇష్టం, నువ్వు చెప్పు" అని వాళ్ళ ఇష్టాయిష్టాలతో వాళ్ళని బ్రతకనిస్తే గృహమే ఔతుంది కదా స్వర్గసీమ._*
*_’నాకూ తెలుసు'తో పాటు “నాకు మాత్రమే తెలుసు” అనే ఆలోచనను తగ్గించుకుని, వాళ్ళకి చాలా విషయాలు, టెక్నాలజీ ‘నాకంటే ఎక్కువ తెలుసు' కదా అనే నిజాన్ని ఒప్పేసుకుంటే చాలు._*
*_మన పిల్లలకోసం వచ్చేవారితో మనం మితంగా మాట్లాడాలి. “వాళ్ళు మనకోసం రాలేదు” అని గుర్తుంచుకుని కాసేపు కర్టెసీకి మాట్లాడి లేచి మన గదిలోకి మనం వెళ్ళిపోగలగాలి._*
*_పెద్దవారిని పలకరించే మర్యాదతో ఎవరైనా సహజంగా అడుగుతారు “ఆరోగ్యం బాగుంది కదా" అని. దయచేసి వెంటనే అతిగా స్పందించవద్దు. మన బి.పి, ~షుగర్.., కీళ్ళనొప్పులు, ~నిద్ర పట్టకపోవటం.., నీరసం అంత రసవత్తరమైన విషయాలుకావు కదా. “బాబోయ్ ! ఎందుకు అడిగామా" అనే పశ్చాత్తాపం వారికి కలిగించవద్దు._*
*_కాలం మారింది, మారుతున్నది శరవేగంగా.. టెక్నాలజీ అన్నింటా చోటు చేసుకుంటున్నది. విమానంలో ప్రయాణించే వారికి ఎర్రబస్సులో సీటెలా పట్టుకోవాలో మనం చెబితే ఏం ప్రయోజనం ??_*
*_పెద్దతనంలో మన పరువును కాపాడుకోవటం పూర్తిగా... పూర్తిగా మన చేతుల్లోనే ఉందని ఘంటాపథంగా చెప్పగలను._*
*_అనవసరవిషయాల్లో జోక్యం చేసుకోకుండా మితభాషిగావుంటూ మన ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోకుండా, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, జిహ్వచాపల్యం తగ్గించుకుని.. అన్నింటికంటే ముఖ్యమైన విషయం "నన్ను ఎవరూ గౌరవించటంలేదు" అనే ఆత్మన్యూనతాభావం దరికి చేరకుండా జాగ్రత్తపడాలి..._*
*_భావం, బంధాలు, అంత తేలికగా తగ్గించుకోలేము.. కనీసం కొన్ని విషయాలను వదిలివేద్దాం._*
*_ప్రతీ విషయాన్నీ పాజిటివ్ గా చూడాలి. ఉద్యోగానికి పరిగెత్తాలనే హడావిడి లేదు. మొత్తం సంసారాన్ని లాగే బాధ్యతా లేదు. పిల్లలకి సహకరిస్తున్నామనే తృప్తి ఉండనే ఉంది._*
*_హాయిగా పూజలు చేసుకోవచ్చు. భగవద్గీత, భాగవతం చదువుకోవచ్చు. పుణ్యమూ, పురుషార్థమూ కూడా సిధ్ధిస్తాయి._*
*_రోజూ అనుకుందాం ఇలా :~_*
*_"I love my self.._*
*_I respect my self "_*
*_~మన ఆత్మవిశ్వాసాన్ని పెంచే మంత్రాలివి. చివరగా… మనం దిగవలసిన స్టేషన్ దగ్గరౌతూనే వుంది. సమయం దగ్గర పడుతూనే ఉంది._*
*_మన బోగీలో ఉన్న మన తోటి ప్రయాణీకులతో తగువులు, మనస్పర్థలు, ఎత్తిపొడుపు మాటలు అవసరమా ?_*
*_మనం దిగుతుంటే వారి ముఖాల్లో 'హమ్మయ్య' అనే భావం కనిపించాలో లేక 'అయ్యో అప్పుడే వీళ్ల స్టేషన్ వచ్చేసిందా' అనే భావం కనిపించాలో నిర్ణయం మన చేతిలోనే ఉంది.._*
*_పెద్దతనం మనకో వరం. అది మన 'అహం' తగ్గించి మనకి జీవితం అంటే ఏమిటో, మన నిజమైన విలువ ఏమిటో సరియైన అవగాహన కల్పిస్తుంది._*
*_నస అనిపించుకునే కంటే నైస్ అనిపించుకోవడం మంచిది కదా ! ”సర్వకాల సర్వావస్తేషు”…ఘంటాపథంగా చెప్పగలను. మన గౌరవం మన చేతుల్లోనే ఉంది._*
*_మనం చేయగలిగినంత చేయాలి. కానీ ఇతరులను… కొడుకూ కోడళ్లనైనా, కూతురూ అల్లుళ్లనైనా సరే “చేయలేదు,” “చేయడంలేదు” అనవద్దు. అంటే విలువ తగ్గడమే ఖాయం._*
*_విలువను పెంచుకోవడమైనా, ఉంచుకోవడమైనా, తుంచుకోవడమైనా ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉన్నదనేది సత్యం . -
No comments:
Post a Comment