3009. 1-2. 050323-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*పాపము-ప్రాయశ్చిత్తం!*
➖➖➖✍️
*‘అనుకోకుండా ఏదైనా పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపంతో దానిని మళ్ళీ చేయనని మనస్ఫూర్తిగా నిశ్చయించుకొంటే ఆ పాపం నుండి విముక్తి పొంది పవిత్రుడవుతాడు’.*
*మతిమరపువల్ల లేదా పరధ్యానంలో ఉండి చేసినా కూడా పాపం పాపమే. దానిని పోగొట్టుకోవడానికి రెండే మార్గాలు ఉన్నాయని మన సనాతన ధర్మం చెబుతున్నది. మిక్కిలి కోపిష్ఠుడైన కౌశికునికి ధర్మోపదేశం చేసిన ధర్మవ్యాధుడు కూడా అతనికి ఇదే మాటను నొక్కి చెప్పాడు.*
*మది మఱపున బాపము దన కొదవుటయును బిదప వగచి యొక సగమును నే*
*నిది సేయనింక ననియెడు మదిఁ బెఱ సగమును నరుఁడు మలుఁగు నఘంబున్.*
-మహాభారతం (ఆరణ్యపర్వం:5-41)
*‘తెలియకుండా చేసిన పొరపాటును తలచుకొని బాధ పడటం వల్ల ఆ పాపంలోని సగభాగం తొలగిపోతుంది. అలాంటి తప్పులను ఇక ముందెప్పుడూ చేయనని మనస్సాక్షిగా నిర్ణయించుకొని, ఆ కట్టుబాటును పాటిస్తే మిగతా సగ పాపం తొలగిపోతుంది’. ఏదైనా పాపం గానీ, నేరం గానీ తెలియకుండానో, అనుకోకుండానో చేయడం మానవ సహజం. ‘తప్పిదం ఏదైనా జరిగినప్పుడు ఆ పొరపాటును తెలుసుకొని, ఇక ముందెప్పుడూ దానిని చేయకూడదని నిర్ణయించుకొని బాధ పడటమే’ పశ్చాత్తాపమని మన సనాతన ధర్మం చెపుతున్నది. అనుకోకుండా చేసిన పాపానికి పరిహారంగా చేసే ప్రయత్నాన్నే ‘ప్రాయశ్చిత్తమని’ అంటారు. ప్రతి మనిషీ మనసా వాచా కర్మణా ఎప్పడూ ఏ తప్పులనూ చేయకుండా ఉండాలి. ఏ తప్పుకైనా ఆ పాపం ఊరికే పోదు. ఒకవేళ ఏవైనా పొరపాట్లు అనుకోకుండానో, పరధ్యానంలోనో చేసినా వాటికి పరిహారంగా ఆ పాప ప్రాయశ్చిత్తం చేస్తుండాలి. అప్పుడే, ఆ పాపం తొలగిపోతుంది. ‘కొన్ని సందర్భాల్లో అనుకోకుండా చేసిన పాపాన్ని మనసులో తలచుకొని సిగ్గుతో తలవంచుకొని కుంగిపోయినట్లయితే, ఆ పాపం పటాపంచలవుతుందని’ పురాణాలు చెపుతున్నాయి.*
*దానినే ‘మనఃప్రాయశ్చిత్త’మని అంటారు.*
*పిత్రోర్నిత్యం ప్రియం కుర్యాత్*
*ఆచార్యస్యచ సర్వదా*
*తేషుహి త్రిషు తృప్తేషు*
*తపస్సర్వం సమాప్యతే.*
*‘తల్లి, తండ్రి మాటనుగానీ, గురువు మాటనుగానీ జవ దాటకుండా ఎప్పుడూ వారికి అనుకూలంగా నడుచుకోవాలి. ఈ ముగ్గురూ తృప్తి పడినట్లయితే ఎన్నో తపస్సులు చేసిన ఫలితం సిధ్ధిస్తుంది’. తల్లిదండ్రులను బాధ పెట్టడం వల్ల కలిగే పాపానికి మాత్రం నిష్కృతి లేదు. ఎప్పుడైనా గురువు మాటను ధిక్కరించి మాట్లాడితే, ఆ పాపం సదరు గురువును వినయ విధేయతలతో ఆహ్వానించి, ఉపాహారాన్ని సమర్పించుకొని సంతోష పెట్టడం ద్వారా తొలగింపజేసుకోవచ్చు. కొట్టివేయ కూడని చెట్టును నరికి వేయడం, స్వేచ్ఛగా జీవించే పక్షులను స్వార్థబుద్ధితో వధించడం వంటివీ మహాపాప హేతువులే.*
*ఐతే, అనుకోకుండా చేసే పాపాలు ‘అన్నపానీయాలను వదిలిపెట్టి కేవలం గాలిని మాత్రమే పీలుస్తూ నియమనిష్ఠలతో జీవితాన్ని గడపడం ద్వారా’ నశిస్తాయి.*
*దైవసన్నిధిలో ఇతరులు వెలిగించిన దీపాన్ని దొంగిలించిన పాపం వల్ల గుడ్డివాళ్లయి పోతారు.*
*గుడిపైనగానీ, రథంపైగానీ, పర్వతంపైగానీ మళ్ళీ దీపం వెలిగిస్తేనే దానికి పరిహారం లభిస్తుందని సనాతన ధర్మం ప్రబోధిస్తున్నది.*
*చేసిన పాపాలకు పరిహారంగా ఇలాంటి శిక్షలు ధర్మశాస్ర్తాలలో చెప్పడమనేది మనం అలాంటి పాపాలకు పాల్పడకూడదనే.*
*ఇతరులను బాధ పెట్టడమనేదే మహాపాపం. అలాంటి పాపాలకు ఏ మాత్రం తావివ్వకుండా ధర్మబద్ధంగా బతుక గలిగినప్పుడే మానవ జీవితం సార్థకమవుతుంది.*✍️
. 🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment