2301. 2-4. 050323-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*యజ్ఞాల లక్ష్యం...*
*భగవదనుగ్రహమే!*
➖➖➖✍️
*‘బ్రహ్మ’ అనే శబ్దం ఆధ్యాత్మికమని, భగవంతుడు ఆధ్యాత్మకుడని పెద్దల మాట.*
*భగవంతునిపై స్థిరమైన భక్తికలవాడు అశాశ్వతమైన భౌతిక ప్రయోజనాలనే కాలుష్యాలకు ఆకర్షితుడు కాడు.*
*పరమాత్మ స్థితిని తెలుసుకొన్నవాడు కావడం వల్ల.. తాను చేసే కర్మల ప్రయోజనాలన్నీ పరమాత్మకే సమర్పిస్తాడు.అవన్నీ యజ్ఞకార్యాలుగా పరిగణన పొంది, దివ్యత్వంలో లీనమౌతాయి.*
*పాపభూయిష్టమైన కర్మల దుష్ఫలితంగా భౌతిక జీవితం ఏర్పడుతుంది. పాపమనే పంకిలానికి వశం కావడానికి అజ్ఞానమే కారణం.*
*అయితే, యజ్ఞ విధానాలు వ్యక్తిలో ఆధ్యాత్మిక వికాసాన్ని కలుగజేస్తాయి. అజ్ఞానాన్ని తొలగిస్తాయి. నిరాకార బ్రహ్మంలో లీనం చేస్తాయి.*
*అటువంటి యజ్ఞ విధులను శ్రీ కృష్ణుడు వివరించాడు…*
*1. దైవరూప యజ్ఞం:*
*దైవ సంబంధమైన పూజాది కార్యాలు చిత్తశుద్ధితో నిర్వహించడం... ‘దైవరూప యజ్ఞం’.*
*ఆ యజ్ఞానికి ఎంత ధనం వెచ్చించామన్నది ముఖ్యం కాదు. ఎంత నిష్ఠతో చేశామనేదే ముఖ్యం. ఫలమో, పత్రమో, పుష్పమో, తోయమో.. భక్తిప్రధానంగా సమర్పించాలి. అప్పుడు సర్వేశ్వరుని కరుణ తప్పకుండా ఉంటుంది.*
*ఉదాహరణకు.. కుచేలుడు సభక్తితో సమర్పించిన అటుకులను ప్రేమతో భుజించిన శ్రీకృష్ణుడు... అతని దారిద్ర్యాన్ని రూపుమాపాడు.*
*గోపికలు కూడా పరాభక్తితో పరమాత్మను చేరుకున్నారు.*
*2. ఆత్మరూప యజ్ఞం:*
*ఇక.. ఆత్మవిచారణతో చేసే యజ్ఞం... ‘ఆత్మరూప యజ్ఞం’.*
*జ్ఞానయోగి అశాశ్వతమైన దేహాన్ని విశ్వసించడు. శాశ్వతమైన ఆత్మానందం కోసం మనసును నిర్మలం చేసుకొని, ఆత్మనిష్ఠుడై ఫలితాన్ని సాధిస్తాడు. మరో జన్మలేని మహత్తరమైన స్థితిని కరతలామలకం చేసుకుంటాడు. తనను ఆశ్రయించిన వారికి ఆత్మజ్ఞాన భిక్ష పెట్టగలుగుతాడు.*
*ఆధ్యాత్మికాచార్యుని ఉపదేశంతో విద్యార్థులు ఇంద్రియతృప్తుల నుంచి విముక్తులవుతారు. మనస్సును నిగ్రహిస్తారు.*
*ఆస్తిక సంబంధమైన అంశాలు అర్థం చేసుకోవడానికి శ్రవణం... వినడం మూలం.*
*3. శ్రోత్రాది యజ్ఞం:*
*అలాగే కీర్తించడం ద్వారా కూడా దివ్యమైన ధ్వని ప్రకంపనాలు మానసిక నిర్మలత్వానికి దోహదపడతాయి. ఈ ప్రక్రియనే ‘శ్రోత్రాది యజ్ఞం’ అంటారు.*
*ఈ విధానం గృహస్థులకు, వానప్రస్థులకు, సన్యాసులకు వర్తిస్తుంది. *
*4. ద్రవ్య రూప యజ్ఞాలు:*
*కొందరు తమకు ఉన్నదాన్ని దానధర్మాల రూపంలో ఇతరులకు ఇస్తారు. ధర్మశాలలు, అన్నదాన కేంద్రాలు, అనాథశరణాలయాలు, విద్యాపీఠాలు, సత్సంగ సాధనా కార్యాలు, వైద్యశాలలు, వృద్ధుల రక్షణాలయాలు నిర్వహిస్తుంటారు. ఇలాంటి ధర్మకార్యాలను ‘ద్రవ్య రూప యజ్ఞాలు’ అంటారు.*
*5. తపోరూప యజ్ఞాలు:*
*నియమ నిష్ఠలకు ప్రాధాన్యతనిచ్చేవారు చాతుర్మాస్యవ్రతం వంటి వ్రతాలు ఆచరిస్తూ పరమాత్మకు చేరువవుతారు. వీటిని ‘తపోరూప యజ్ఞాలు’గా వ్యవహరిస్తారు.*
*6. యోగరూప యజ్ఞాలు:*
*యోగానికి ప్రాధాన్యతనిచ్చే యజ్ఞాలను ‘యోగరూప యజ్ఞాలు’ అంటారు. ఈ యజ్ఞం చేసేవారు హఠయోగం, అష్ఠాంగయోగం వంటివి చేపట్టి కార్యసాఫల్యాన్ని సాధిస్తారు. యోగరూప యజ్ఞాలు మానసిక పరిపక్వతకు దోహదపడతాయి.*
*7. స్వాధ్యాయ రూప యజ్ఞం:*
*అలాగే, వేద వేదాంత సూత్రాల్లో నిమగ్నులై, వాటి అంతరార్థాలను అవగతం చేసుకొని, వాటికి అనుగుణంగా వర్తించడాన్ని ‘స్వాధ్యాయ రూప యజ్ఞం’గా చెబుతారు.*
*8. ప్రాణయామ రూప యజ్ఞం:*
*ప్రాణాయామ సంబంధ సాధనలను ‘ప్రాణయామ రూప యజ్ఞం’ అని అంటారు.*
*ఇలా ఎవరు ఏ యజ్ఞం చేసినా.. వాటన్నింటి ధ్యేయం, అందరి లక్ష్యం ఒక్కటే.. ఆ పరమాత్మ అనుగ్రహం పొందడమే!* ✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment