ధర్మ సూక్ష్మం - ఏది ధర్మం ?
ఏ గుణం వల్ల వస్తువు వస్తువుగా బోధపడుతుందో అదే దాని ధర్మం..
ఏ మనిషి తన ప్రవర్తన వల్ల తన ఉనికిని తెలుపుకో గలుగుతాడో అది అతడి ధర్మం..
ఇలా సృష్టిలో ప్రతిదీ ఏదో ఒక ధర్మం కలిగి ఉంటుంది. అది వస్తువు కావచ్చు... ప్రాణి, చరం, అచరం, మనిషి, పశువు, ద్రవం, వాయువు... ఇంకా విశ్వరచయిత సృష్టించిన ఇంకేదైనా కావచ్చు. అన్నీ తమతమ నియమిత ధర్మాలు కలిగి ఉంటాయి. ప్రతిదానికి ఉండే స్థిరధర్మం మాత్రం ఒక్కటే. పరిస్థితుల ప్రభావం వల్ల జరిగే మార్పుల వల్ల తలొకరూ తలోరకంగా చూస్తారు. భావిస్తారు. స్వీకరిస్తారు. అందువల్లనే ఒక్కొక్కప్పుడు ఏది సరైన ధర్మమో తెలుసుకోలేని అయోమయ స్థితి ఏర్పడుతుంది. ప్రతిదానికీ సహజంగా ఉండే ధర్మమే శాశ్వతమైనది. దానికి అనుగుణంగా ప్రవర్తించడం సద్ధర్మం. అది చెక్కు చెదరనిది. దానికి తగినట్లుగా స్వధర్మాన్ని మలచుకునే ప్రయత్నం చేస్తే తనను తాను ఉద్దరించుకున్నట్లే. అందుకే దేని ధర్మం దానికి ఎలా ఉన్నా, ఎలా మారినా- మానవ ధర్మం మాత్రం స్వస్థితిలో ఉండాలి. అలా ఉంచడానికి ఉపయోగ పడేదే ధర్మ సూక్ష్మం..
ధర్మం-ధర్మసూక్ష్మాల విషయంలో భాగవతం ఎక్కడికక్కడ పూర్తి వివరణ, విశ్లేషణ ఇస్తూనే వచ్చింది. ప్రతి స్కంధం, ఘట్టం, ఆఖ్యానం(కథ), ఉపాఖ్యానం, సంఘటన, ఉదాహరణలాంటివీ సరళంగా అర్థమయ్యేటట్లు రచించారు. భాగవత కర్తలు. సూటిగా, నర్మగర్భంగా, మార్మికంగా... ఇలా ఎవరికి ఇష్టమైన పద్ధతిలో వారు స్వీకరించే విధంగా పలురీతుల్లో ధార్మిక విషయాలు చెప్పింది. భాగవతం. విన్నవారు, ఆచరించినవారు, ఆలోచించిన వారు వాటి మధ్య ఉన్న తేడాలను సులభంగా గుర్తించగలిగేలా ఉంటాయి ఆ చిత్రీకరణలు. బలి చక్రవర్తి ధర్మబద్ధంగా తపస్సు చేశాడు. ఫలితంగా వరాలు పొందాడు. అది ధర్మం. ఆ గర్వంతో దేవలోకంలో అరాచకం సృష్టించాడు. అది అధర్మం. అందువల్లనే విష్ణువు వామనావతారం ఎత్తి అతణ్ని పాతాళానికి అణచేశాడు.
తపోధనుడైనా ఆయనపట్ల భగవానుడు కఠినంగా ప్రవర్తించిన తీరులో ఉన్న ధర్మసూక్ష్మం- ధర్మ సంస్థాపన. తండ్రిని గౌరవించడం సామాన్య ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించిన ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు పెట్టిన హింసలను భరించాడు. వేసిన శిక్షలను సహించాడు. ధర్మవర్తి అయిన ఆ ప్రహ్లాదుడే, తండ్రి ధర్మం తప్పి భగవద్వేషి అయినందువల్ల విష్ణువును ఆశ్రయించి, తండ్రినే హతమార్చడానికి కారకుడయ్యాడు. కన్నతండ్రి కన్నా ధర్మరక్షణే గొప్పది' అనేది ఈ కథలోని ధర్మసూక్ష్మం. అంబరీషోపాఖ్యానంలో దుర్వాసుడితో 'నా భక్తులకు ఆపద వస్తే కాపాడటం, నా ధర్మం. వారికి హాని తల పెట్టినవారిని కాపాడటం నా ధర్మంకాదు. అయినా, నీవు శరణు అని వచ్చావు కాబట్టి. ఏ భక్తుడికి హాని తలపెట్టావో, పోయి అతడినే వేడుకో' అని అంబరీషుడి వద్దకు పంపేశాడు. తాను రక్షించగల అవకాశం ఉన్నా, దుర్వాసుణ్ని అంబరీషుడి దగ్గరకు పంపడంలో ధర్మసూక్ష్మం- 'వ్యక్తి విలువ ప్రత్యేకంగా తెలియజేయాలనేదే ..
పుట్టని వాడు, పుట్టి గిట్టిన వాడు, మూర్ఖుడు- ఈ ముగ్గురిలో మూడవ- అనగా మొరటువాని కంటే మొదటి ఇద్దరే మేలు చేకూర్చే మంచివారు. ఎందుకని? వీరు జీవితంలో ఒక్కసారే ఏడిపిస్తారు. కాని, మూర్ఖుడు బ్రతికినంత కాలం, రేయింబవళ్లు బాధ పెడుతూనే ఉంటాడు. భాగవతంలో తపఃపూతుడైన భక్తికవి పోతన పలికిన పూతరేకుల వంటి భక్తి మాధుర్య భరితమైన ఆపాతరమణీయ,ఆలోచనామృత పద్యగద్యాలను పఠించి పరవశించే భావుక భక్తులు నేటికీ ఎందరో! ఆ మహానుభావులందరికీ వందన చందనాలు!
కల్యాణాత్మకమైన కృష్ణ కథలు వినడంలో విసుగు, విరామం ఎరుగని విశేష తృష్ణ కలిగిన విదురుడు, మహనీయుడైన మైత్రేయ మహర్షిని- ‘మునీంద్రా! మనోవ్యథలను మరపించి మానిపించే పుణ్య శ్లోకుడైన పురుషోత్తమ పరమాత్ముని కథా పీయూషం (అమృతం) చెవులనే దోసిళ్లతో ఎంత తాగినా నాకు తగిన తృప్తి కలగడం లేదు, తనివి తీరడం లేదు. విమలమతీ! విష్ణుభక్తుడైన ధ్రువుని అశేషమైన వంశ విశేషాలు వివరించ’మని వినుతించాడు. ఆ మహాత్ముడు, ధ్రువుని వంశంలో మరో ధ్రువతారగా వెలిగే, చక్రధారి మహావిష్ణువు యొక్క అంశావతారమైన ‘పృథు’ చక్రవర్తి విచిత్ర, పవిత్ర చరిత్రను విన్నవించాడు.
ధ్రువుని వంశంలో జన్మించిన ‘అంగుడు’ అనే పేరుగల అవనీపతికి (రాజశ్రేష్ఠునికి) చాలా కాలం వరకు సంతతి కలగలేదు. యజ్ఞ పురుషుడైన వెన్ను (విష్ణువు)ని ఆరాధించగా ఆ రాజచంద్రునికి ‘వేనుడు’ అనే కుమారుడు కలిగాడు. కాని వాడు అన్ని విధాల అత్యంత హీనుడయ్యాడు. వేనుని మాత సునీథ మృత్యువు కూతురు కావటం వలన మనుమడికి తాత బుద్ధులే తారసిల్లినై. (ఇక్కడ మృత్యువు అంటే అధర్మ వంశంలో పుట్టినవాడు. అంతేకాని ధర్మరూపుడైన ‘మృత్యుదేవత’ కాదు.) కిరాతుని వలె క్రూరుడై, పాపపు మార్గంలో సంచరిస్తూ సర్వులకూ సర్వదా మనస్తాపాన్ని కలిగిస్తున్న కన్నకొడుకును అంగరాజు ఎన్నో విధాలుగా దండించి కూడ భంగపడ్డాడు. పాత్రత (యోగ్యత) లేనివానిపట్ల మన ప్రయత్నాలు ఫలించవు. బకము (కొంగను)ను తెచ్చి ఎంత నేర్పినా శుకము (చిలుక) వలె పలుకలేదుగా! అన్ని యత్నాలు వ్యర్థం కాగా ఖిన్న హృదయుడై ఇలా విలపించాడు.
‘ఇలాంటి కుపుత్రుని కనటం, కలకాలం కుమిలిపోతూ మనటం కన్నా, బిడ్డలు లేకపోయినా భూమిమీద బ్రతికినంత కాలం పరువుతో, ఆదరువు బ్రతికి చనటం బహుభంగుల బాగైన బ్రతుకు కదా! విచారించగా వైరాగ్యం కలిగించే కుపుత్రుడు కలగటమే, కేశవ భగవానుని కరుణగా కనిపిస్తోంది. అదే మంచివాడైతే మోహాన్ని పెంచి, వైరాగ్యాన్ని త్రుంచి, మాయా సంసారంలో ముంచుతాడు. ఇక ఆ బంధనాలు తెంచుకోవడం ఇంచుకైనా సాధ్యం కాదు’ ఇలా విచారించి విజ్ఞానవంతుడై ఒకనాటి అర్ధరాత్రి అంగుడు అంతా వదిలించుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ప్రథమంగా పుత్ర సంతానం లేకపోవడం, పుత్రుని పొందాలనే అనుతాపం, తర్వాత ప్రారబ్ధఫలంగా కుపుత్ర ప్రాప్తి, వానిమీద మాతామహుని (తల్లితండ్రి) ముద్ర- స్వభావ ప్రభావం, దానివలన భరించలేని మనస్తాపం, అన్నిటిని మించి ఆఖరికి వీటన్నింటిలో విష్ణుదేవుని విశేష కృపను వీక్షించి వైరాగ్యం పొందటం- ఇవన్నీ మానవునికి ముక్తి కలిగించే జ్ఞాన, వైరాగ్య భిక్షా శిక్షా స్మృతులు!
ఇక రాజులేని రాజ్యంలో అరాజకత్వం రాజ్యమేలింది. పశువుల వలె ప్రవర్తిస్తున్న ప్రజలను చూచి మంత్రులు, పురోహితులు, మునులు అయిష్టంగానే దుష్టుడైన వేనునికి పట్టం కట్టారు. చండశాసనుడైన వేనుడు మత్తవేదండం (మదించిన ఏనుగు) వలె నిరంకుశంగా సంచరిస్తూ సజ్జనులను కించపరచేవాడు. యజ్ఞదానహోమాలను నిషేధించాడు. మునులు బోధించిన వేదధర్మాలను వేనరాజు తోసిరాజన్నాడు. తన అధర్మమే ధర్మమన్నాడు. ‘మునులారా! నేనే యజ్ఞనారాయణుడను, మగని మీద మమత లేని మాయలాడి మిఠారి రంకు మగనిపై వలపు ఒలకబోసినట్లు, మీరు కూడా మహారాజునైన నన్ను కాదని మరెవరిమీదనో మరులు (ప్రేమ) గొని మసలుతున్నారు. దేవతలంతా ధరణీపతి దేహంలోనే కొలువై ఉంటారు. కాన, భూపతియే భగవంతుడు. నన్నే సేవించండి. నాకే బలులు అర్పించండి’ అని శాసించాడు. యజ్ఞపతి అయిన ఇందీవర శ్యాముని, ఇందిరా రమణునే నిందించే ఈ నికృష్టుడు ఇక నేలమీద నిలువరాదని మునులు పెల్లుబికిన కోపంతో ఒక్కపెట్టున హుంకరించారు. ఆ హుంకారానికి అసుర అంతకుడైన విష్ణుని నిందించిన వేనుని ప్రాణాలు అనంతవాయువులో ఐక్యమైపోయాయి. సుతుని మరణానికి దుఃఖించిన సునీథ యోగశక్తిచే అతని శరీరాన్ని చెడిపోకుండా కాపాడింది. వేనరాజు మరణించగా రాజ్యంలో మరల అరాజకత్వం ఆరంభమైంది. పైశాచికత్వం ప్రబలింది. వేనరాజులో వేనుడు వైదిక ధర్మాన్ని కాలరాచి, మొత్తం సమాజాన్ని అతలాకుతలం చేసే దుర్మార్గుడు. నాస్తికుడు, ప్రజలను మూఢుల్ని చేసే మతవిశ్వాసాలను, యజ్ఞాల్లోని జీవహింసనూ వ్యతిరేకించే వ్యక్తి……..
No comments:
Post a Comment