Tuesday, January 2, 2024

****మరణం లేని మీరు (లోబ్ సాంగ్ రాంపా) 🔺 🔹(అనువాదం:- P.G.రామ్మోహన్) 🔹 🌺 Chapter -- 20 🌺 🌹 ఆత్మ సంయమనం

 🔺 మరణం లేని మీరు (లోబ్ సాంగ్ రాంపా) 🔺
🔹(అనువాదం:- P.G.రామ్మోహన్) 🔹
🌺 Chapter -- 20 🌺
🌹 ఆత్మ సంయమనం 🌹

◆ టెలిపతీ - యోగదృష్టి సాధించాలంటే శాంత స్వభావం , ప్రశాంతమైన మనస్సూ ఉండి తీరాలి లేకపోతే మొదటి తరగతిని కూడా దాటలేం .

◆ మీకు ఆశ్చర్యం కలుగుతూ ఉండవచ్చు - మేము రేడియో గురించీ , ఎలక్ట్రానిక్స్ , ఎలక్ట్రిసిటీల గురించి ఎప్పుడూ ఎందుకు వ్రాస్తూ వుంటామని ? దీనికి సమాధానం - మెదడులో , శరీరంలో విద్యుత్తు తయారవుతూ ఉంటుంది కాబట్టి . మెదడూ , శరీరంలోని అన్ని కండరాలూ క్రమపద్ధతిలో విద్యుత్తును ప్రసారం చేస్తూనే ఉంటాయి . మన శరీరానికి సంబంధించిన రేడియో ప్రోగ్రామ్ లాగా దీన్ని అనుకోవచ్చు . మన శరీరం పనిచేసే పద్ధతి గురించి గానీ , యోగదృష్టి , సైకోమెట్రీ , టెలీపతీ లాంటి విద్యల్ని రేడియో , ఎలక్ట్రానిక్ విజ్ఞానంతో పోల్చి అధ్యయనం చేస్తే సులువుగా అర్ధమవుతాయి . ఈ విద్యల గురించి అవగాహన మీకు సులువుగా ఏర్పడాలన్నదే మా ఆకాంక్ష . అందువల్ల మిమ్మల్ని మేము కోరేది ఏమిటంటే - ఈ రేడియో , ఎలక్ట్రానిక్స్ , విద్యుత్తుల విషయాల జ్ఞానాన్ని జాగ్రత్తగా అర్ధం చేసుకోమని . ఎంత ఎక్కువగా రేడియో , ఎలక్ట్రానిక్స్ విషయాలను అధ్యయనం చేస్తే అంత సులువుగా మీ మీ సాధనల్లో మీరు అభివృద్ధిని సాధించగలుగుతారు .

◆ మనం ఆలోచించినప్పుడల్లా మన మెదడులో విద్యుత్తు తయారవుతుంది . బలమైన ప్రేరణ ఏదీ లేకుండా , ప్రశాంతంగా మన ఆలోచన సాగినప్పుడు పుట్టే విద్యుత్తు ఒకే విధమైన అనుకంపనా వేగంతో తరంగాల్లో హెచ్చు తగ్గులు లేకుండా సాఫీగా సాగుతూ ఉంటుంది . ఎప్పుడైనా ఓ శిఖర కెరటం ' ఎత్తు ఎక్కువైతే ఆ అలజడి కారణం మరేదో ఆలోచన సాఫీగా సాగే మన ఆలోచనలను భగ్నం చేస్తోందని అర్ధం చేసుకోవాలి . కాబట్టి , మనం మన మెదళ్ళలో సాగే రకరకాల సంకల్పాలూ , భయాందోళనలూ మన ఏకాగ్రతను భగ్నం చేస్తాయని అర్ధం చేసుకోవాలి . కాబట్టి , మనం మన ఆలోచనాసరళిలోకి “ భయమూ - నిరాశ " లను ఏ మాత్రం రానీయకూడదు . 

◆ఈ జన్మనుంచి ఇంకో జన్మలోనికి మనం ఒక్క పైసా డబ్బుల్ని కూడా తీసుకెళ్ళలేం; కానీ , మనం నేర్చుకున్న విద్యల , అనుభవాలసారం మాత్రం మనతో బాటు వస్తుంది .ఈ జ్ఞానమే మనకు ఇంకో జన్మ ఎలా ఉండాలో నిర్ణయింపబడే విధానానికి దోహదకారి  అవుతుంది . కాబట్టి , ఏ జ్ఞానాన్ని మనం మనతోబాటుపట్టుకుని తీసుకెళ్ళగలుగుతామో ఆ జ్ఞానాన్నే ఇప్పుడు సంపాదించుకునే ప్రయత్నాన్ని చేద్దాం.

◆ ప్రశాంతతను పొందడానికి అత్యంత సులభపతి - " ఒకే విధమైన పద్ధతి క్రమంతో శ్వాసక్రియను జరపడం ” . చాలామంది , దురదృష్టవశాత్తూ , గాలిని లోపలికి బలంగా లాక్కుంటూ , బయటికి ఊదుతూ శ్వాసక్రియను జరుపుతూంటారు . మెదడుకు ప్రాణవాయువు అందే అవకాశాన్ని ఇవ్వకుండా రొప్పుతూ ఉంటారు . సృష్టిలో గాలి చాలా తక్కువగా ఉన్నట్లు అనుకుంటారేమో గాలిని వేగంగా మింగుతూ బలంగా కక్కుతూ ఉంటారు . వాళ్ళు పీల్చే గాలి బాగా వేడిగా ఉన్నట్లు ఇలా అది లోపలికి వెళ్ళగానే అలా దాన్ని బయటకు తరిమేయాలని బెంగపెట్టుకుంటున్నట్లు  , ఆ పనిని చేస్తూ మళ్ళీ ఇంకో గుటకచేసేందుకు సిద్ధపడుతూంటారు .

◆  మనం గాలిని నెమ్మదిగా గాఢంగా తీసుకోవడం నేర్చుకోవాలి . ఊపిరితిత్తుల్లో ఉన్న పాత గాలిని పూర్తిగా బయటకు పంపించెయ్యాలి . పై పైనే గాలి తీసుకుంటూ ఉంటే ఊపిరితిత్తుల్లో పాడయిపోయిన గాలి మిగిలిపోయే ఉంటుంది . ఊపిరితిత్తుల్లో గాలి ఎంత తిరుగుతుందో అంత బాగా మన మెదడు పనిచేస్తూ ఉంటుంది . మన జీవితం ఆక్సీజన్ మీదే ఆధారపడి ఉంది . ముఖ్యంగా మన మెదడుకి చాలా ఆక్సిజన్ కావాలి . మెదడుకు ఆక్సిజన్ తగ్గిపోతే నునకు అలసిపోయినట్లు అనిపిస్తుంది . నిద్రపోవాలనిపిస్తుంది . మన పనుల వేగం తగ్గిపోతుంది , ఆఖరికి ఆలోచించడం కూడా కష్టమవుతుంది . కొన్నిసార్లు తీవ్రమైన తలనొప్పి ప్రారంభం కావచ్చు . అప్పుడు మనం బయటికి వెళ్లి కాస్త మంచి గాలిని పీల్చుకుంటే ఆ తలనొప్పి తగ్గిపోయి , మెదడుకు తగినంత ఆక్సిజన్ తప్పక అందాల్సిందేనని మనకు ఋజువవుతుంది .

◆ క్రమపద్ధతిలో శ్వాస తీసుకుంటే కలతపడ్డ మనస్సు కుదుటపడుతుంది . మీకు ఎవరిమీదయినా పిచ్చికోపం వచ్చేసి వాళ్ళని ' చావగొడదా మన్నంత ఉద్రేకంతో ఉన్నారనుకోండి . అట్లాంటప్పుడు అందుకు బదులుగా గాఢంగా ఓ సారి శ్వాస తీసుకోండి - ఎంత గాఢంగా తీసుకుంటే అంత మంచిది - తీసుకుని కొన్ని సెకండ్ల వరకూ ఆ శ్వాసను బిగబట్టి అటు తరువాత నెమ్మదిగా ఆ గాలిని నిశ్వసించండి . ఈ విధంగా గాఢంగా ఊపిరి తీసుకుంటూ , కాసేపు లోపల నిలిపి ఉంచుతూ , నెమ్మదిగా వదిలి పెట్టేపనిని కొన్నిసార్లు మీరు చేస్తే మీరు ఎప్పుడూ ఊహించనంత త్వరలోనే ప్రశాంతతను పొందుతారు .

◆ వేగంగా గాలిని తీసుకోవడం , వేగంగా గాలిని వదిలిపెట్టడం మానండి . నిదానంగా ఊపిరితీసుకుంటూ ప్రాణశక్తి మీలోకి వస్తున్నట్లు ఊహించండి . నిజంగా జరిగేది యిదే. ఇప్పుడు మేం చెప్పబోయే ఈ పద్ధతిని అభ్యసించి చూడండి . మీరొమ్మును వీలయినంత లోపలికి తీసుకుని మీ ఊపిరితిత్తులలోని గాలిని మొత్తం బయటికి తరిమేసే ప్రయత్నం చెయ్యండి . గాలి కోసం మీ నాలుక బయటకు వచ్చి వ్రేలాడుతున్నా సరే - ఇంకా ఇంకా కొంత గాలిని బయటకు పంపించేందుకు ప్రయత్నించండి . తరువాత , సుమారు పది సెకండ్ల సమయంలో మీ ఊపిరితిత్తులను గాలితో పూర్తిగా నింపుకోండి . మీరొమ్మును పూర్తిగా వ్యాకోచింపజేయండి . వీలయినంత అధిక మొత్తంలో మీ ఊపిరితిత్తులు నిండాలి . నిండాక , ఇంకొంచెం గాలిని లోపలికి త్రోసేందుకు ప్రయత్నించండి . లోపలికి తీసుకున్న గాలిని నెమ్మదిగా - సుమారు ఏడుసెకండ్ల సమయాన్ని తీసుకుని - బయటకు పంపించండి . గాలి పూర్తిగా వెళ్ళిపోవాలి . మీ కండరాలని లోపలికి కుంచింపజేసి మొత్తం గాలిని బయటకు తోసెయ్యాలి . ఈ విధంగా అరడజను సార్లు చేస్తే చాలా మంచిది.మీ ఆందోళనలూ , నిరాశా నిస్పృహలూ అన్నీ ఎగిరిపోయి స్వస్థత చేకూరుతుంది . ప్రశాంతత నెలకొంటుంది .

◆ మీరు ఏదయినా ఇంటర్వ్యూకు వెళ్ళాలనుకోండి . మీరు ఉద్విగ్నంగా ఉండొచ్చు . ఈ ఇంటర్వ్యూలో విజయాన్ని సాధించడం మీకెంతో ఆవశ్యం కావచ్చు . ఒక పని చెయ్యండి . కొన్నిసార్లు గాఢంగా శ్వాస తీసుకుని వదిలి పెట్టండి నెమ్మదిగా. పరుగెత్తుతున్న మీ ' పల్స్ ' ( నాడి కొట్టుకోవడం ) వేగం తగ్గడం మీరు గమనించవచ్చు . క్షణాల్లో మీకు ప్రశాంతత ఏర్పడుతుంది . మీ ఆత్మవిశ్వాసం ఉప్పొంగుతుంది. విచారం,ఆందోళనా మాయమవుతాయి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు మీ ప్రశాంతతకూ , ఆత్మవిశ్వాసానికి ముగ్ధులవక తప్పదు . ప్రయత్నించి చూడండి ! 

◆ ఎప్పుడూ విసుక్కుంటూ ఉండేవాళ్ళలో , కోపం తెచ్చుకుంటూ ఉండేవాళ్ళలో  జీర్ణరసాలు ఎక్కువగా స్రవించి వాటి సాంద్రత మరింత ఎక్కువై ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి . ఈ జీర్ణరసాలు నిజానికి ఆమ్లాలు (Acids). ఈ ఆమ్లాల శక్తి పెరిగేసరికి జీర్ణకోశపు రక్షణ పొరలను ఇవి కరిగించేస్తాయి . జీర్ణకోశంలో “ అల్సర్లు వస్తాయి . బాధా , నిరాశా కూడా కలుగుతాయి . ' ఇర్రిటేషన్లు ' ఎక్కువగా ఉన్నవాళ్ళకే ఈ ' కడుపులో పుళ్ళు వస్తాయని డాక్టర్లు చెప్తున్నప్పుడు మీరు వినే వుంటారు . 

◆ స్త్రీలకు , ప్రత్యేకించి ఋతుక్రమం ఆగిపోతున్న సమయాల్లో , మానసిక తరంగాల నిర్మాణ , ప్రసార ప్రక్రియల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. శరీరంలోని కొన్ని గ్రంధుల్లోంచి స్రవించే రసాయనాలు పూర్తిగా ఆగిపోవడంగానీ , దారి మళ్ళీపు ద్వారా గానీ , కొన్ని శారీరక మార్పులతో బాటు మానసిక ప్రవృత్తిలో కూడా మార్పు చోటుచేసుకోవచ్చు . ఇంకొకళ్ళు మాటలను విని తమ జీవితంలో ఘోరమైన మార్పు జరుగబోతూ ఉందని కొందరు “ గోరంతని కొండంత ” గా ఊహించి తీవ్రంగా ఆలోచించి , ఆలోచించి నిజం చేసుకుని జీవితాన్ని తమ చేతుల్తో తామే పాడు చేసుకుంటారు . సరియైన అవగాహన ఉంటే ఏ ఉపద్రవాలూ జరుగవు .
 " హిస్టరెక్టమీ ” ఆపరేషను చేయించుకున్న కొందరు స్త్రీల పరిస్థితి ఇంకా దురదృష్టకరంగా ఉంటుంది .స్ర్తీలకు బలవంతంగా ఋతుక్రమాన్ని పాడు చేసే ఓ పద్దతే ఈ ఆపరేషను . స్త్రీలకు ఏదో జబ్బో మరో బలవంతమైన కారణమో ఉంటే తప్ప ఈ శస్త్రచికిత్స చెయ్యరనుకోండి . కానీ , జరిగే ఫలితం ఇంకోరకంగా పరిణమిస్తుంది . ఆ స్త్రీ మెదడులో ఓ తుఫాను రేగుతుంది . కొంతమందికి మనఃస్థిమితం కూడా తప్పవచ్చు . తగిన పద్దతిలో వైద్యమూ , తగినంత సానుభూతీ వుంటేనే అలాంటి దీనురాళ్ళకు స్వస్థత చేకూరుతుంది . 

◆ ఈ శరీరపు యంత్రం నుంచి విద్యుత్తు ఒకే స్థాయిలో స్థిరంగా తయారవుతున్నప్పుడు మనం శాంతంగా , ప్రశాంతంగా ఉంటాము . చింతల , కోపతాపాల వల్ల ఈ విద్యుత్తులో తేడాలు ఏర్పడినా , మన ప్రశాంతత తాత్కాలికంగా దెబ్బతిన్నా , మళ్ళీ ఈ విద్యుత్తు సరిగ్గా పునరుద్ధరింపబడుతుందనీ , మనకు స్వస్థత కలుగుతుందనీ మనం గ్రహించాలి.

◆ ఎంత నేర్చుకుంటే అంత జ్ఞానాన్ని మీతో బాటు ఇంకో జన్మలోకి తీసుకెళ్ళవచ్చు. సంపాదించుకుంటే దుఃఖపూరితమైన ఈ భూమి మీదకు రావాల్సిన జన్మల సంఖ్యను అంత గణనీయంగా తగ్గించుకోవచ్చు .

◆ మా సలహా ఏమిటంటే సుఖంగా పడుకుని రిలాక్స్ కండి . పడుకుని ఇబ్బంది లేకుండా ఏ కండరాల్లోనూ టెన్షను లేకుండా సర్దుకోండి . తేలికగా చేతులు కట్టుకుని గాఢంగా క్రమపద్ధతిలో శ్వాసక్రియను నిర్వహించండి . శ్వాసతో బాటు తాదాత్మ్యం చెందే విధంగా “ శాంతి .... శాంతి .... శాంతి ” అని మనస్సులో అనుకుంటూ ఉండండి . ఈ విధంగా అభ్యసించడాన్ని సాగిస్తూ ఉంటే నిజంగానే దైవికంగా మీ మీదకు శాంతి ప్రసరించడాన్ని మీరు గమనించవచ్చు . మళ్ళీ , అసంబద్ధమైన ఆలోచనలు అపశృతీ ఎప్పుడూ మీ ఆలోచనలలో దొర్లకుండా చూసుకోండి .

◆ మీ ఆలోచనలు ఎప్పుడూ శాంతిమీదా , ప్రశాంతత మీదా , సుఖం మీదా మాత్రమే పరిభ్రమిస్తూ ఉండాలి . శాంతి కోసం ఆలోచన చేస్తే శాంతే మీకు లభిస్తుంది . సుఖం గురించి మీరు ఆలోచిస్తే సుఖం మీకు లభిస్తుంది . ఈ పాఠాన్ని ముగించే ముందు ఓ మాటని మేము మీకు చెప్పదలచాం . అందరూ తమకున్న ఇరవైనాలుగ్గంటల సమయంలో కేవలం ఓ పదినిమిషాల సమయాన్ని ఈ శాంతిసాధన కోసం కేటాయించుకోగలిగితే, ఈ భూమ్మీద డాక్టర్లు అందరూ నిరుద్యోగులైపోతారు ! వాళ్ళు నయం చెయ్యడానికి భూమి మీద జబ్బులేవీ ఉండవు కనుక !

◆ మరణం లేని మీరు.                  సే::మాధవ కొల్లి.                 

No comments:

Post a Comment