Tuesday, March 26, 2024

తాంత్రిక విద్యల మర్మం

 *తాంత్రిక విద్యల మర్మం*

ప్రస్తుత కాలములో తంత్రం అంటే అదేదో చెడు చేయడం అని, రహస్యంగా కుట్రలు పన్నటం అని అందరూ అనుకుంటున్నారు. దాన్ని తంత్రం అనరు. “కుతంత్రం”  అంటారు. ఒక కార్యాన్ని విజయవంతం చేయడానికి ఇష్ట కార్య సిద్ధి జరగడానికి కొన్ని మంత్రాలను, వస్తువులను, ఉపయోగించి చేసే కార్యక్రమమే “తంత్రము”. తంత్రం అనేది ఒకశక్తి గల మంత్రముతో గూడిన సాధనం లాంటిది. ఆ సాధనమును శత్రు సంహారనకి ఉపయోగించవచ్చు. చెడు సంకల్పముతో చెడు కార్యములకు ఉపయోగించవచ్చు. కత్తితో ఫలములను, దర్బలను కోయవచ్చు,  జీవహింస చేయవచ్చు. అది చేసే వారి ఆలోచనా సంకల్పమును బట్టి నిర్దేశించబడుతుంది. మంచికి చేస్తే మంచి ఫలితమును, చెడుకు చేస్తే చెడు ఫలితమును పొందటం జరుగుతుంది. భారతములో శకుని తంత్రమును ఉపయోగించి తన ఇష్టకార్య సిద్ధి జరపుకోవటానికి తంత్ర విద్య ద్వారా మాయా జూదమును జరిపించాడు. అందుకారణంగా అది చెడు అవటం వలన అప్పటికి మాత్రం వారి కార్యం విజయవంతం అయింది కానీ కౌరవులు పాచికల రూపములో ప్రేతత్మలను ఉపయోగించి  ఈ చెడు బుద్ధితో చేసిన పాప తాంత్రిక కర్మ వలన  చివరకు సర్వ నాశనం అయిపోయారు. చేసే సంకల్పమును బట్టి ఈ తంత్ర విద్యల ద్వారా ఫలితం పొందటం జరుగుతుంది. ఆ శ్రీ కృష్ణుడు తాను సృష్టించిన మంచికి , ధర్మానికి చెడు ఎదురవుతున్న  సంధర్భములో ఆ చెడును నిర్మూలించగల శక్తి ఆ పరమాత్మకి ఉన్నప్పటికి, తంత్ర విద్యల ద్వారా మానవ రూపములో ఉన్న పాండవుల ద్వారా ప్రయోగింపజేసి  నిర్మూలించాడు. ఇందులో సూక్ష్మం ఏమిటంటే కర్మఫలం వలన మానవుడు ఎదుర్కొనే చెడు కర్మలకు నిర్మూలనా మార్గాలను తంత్ర విద్యల రూపములో ఆ శ్రీమహా విష్ణువే వరంగా ప్రసాదించాడు.  మనం ఎదుర్కొంటున్న శత్రు సమస్యలను, వారు చేసే/చేయించే అభిచార కర్మలను, మనమే తొలగించుకునేలా తంత్ర విద్యలను ప్రసాదించాడు. ఎంతో శక్తివంతులు మరియు శూరులు, ధీరులు, ధర్మ పరాయణులైన పాండవులు శత్రు సంహారానికి తంత్రాలను ఉపయోగించడం జరిగింది.

చరిత్ర లోకి వెళితే అను ఆయుధాలు తంత్ర విద్యలే కదా? మహాభారతములో ఉపయోగించబడిన అత్యంత శక్తివంతమైన ఆచరణకి కష్ట సాధ్యమైయన నాగాస్త్రం,దీనినే వశీకరణ అస్త్రం అని కూడా అంటారు.ఆగ్నేయాస్త్రం, కుజాస్త్రం ఇది కుజుడికి సంబంధించినది, పాశుపతాస్త్రం ఇది మహా శివుడికి సంబంధించినది. వాయువ్యాస్త్రం ఇది కేతువు , వాయు దేవునికి సంబంధించినది. వారుణాస్త్రం ఇది వరుణ దేవుడికి సంబంధించినది. ఇలా ఎన్నెన్నో శస్త్ర అస్త్రాలు అధర్వణ వేదములోని భాగాలే. అంటే ఇక్కడ మనము తెలుసుకోవలసినది ఏమిటంటే ఈ శస్త్ర అస్త్రాలు అన్నీ కూడా తాంత్రిక విద్యలే.  రాక్షస పీడను, శత్రు పీడను, నిర్మూలించడం కోసం రూపొందించబడినవే ద్వాపర యుగములో ,త్రేతా యుగములో కూడా రాక్షస పీడను నిర్మూలించి లోక కళ్యాణం కోసం ఈ శస్త్ర అస్త్రాలను ఉపయోగించక తప్పలేదు. ఇందులో మర్మం ఏమంటే పైశాచికతను నిర్మూలించడమే. కొంచెం శ్రద్ధగా గమనిస్తే ఇందులోని మర్మం మీకు అర్ధమౌతుంది.రాముడు చేసింది లోక కళ్యాణర్థం. రావణుడు చేసింది స్వధర్మం కోసం. స్వధర్మం అనగా పాప కర్మ అనుభవించడం.ఉదాహరణకు మీరు ఒక వస్త్ర దుకాణం నడుపుతున్నారు ,మీ వ్యాపారం బాగా సాగాలి అని మీరు కోరుకుంటారు. మీ వ్యాపార పరంగా  బాగా ధనార్జన చేయాలి ఆశిస్తారు. ఈ సంధర్భములో మీ వ్యాపార పోటీదారులు శత్రువులుగా మారి మీపై, మీ కుటుంబముపై, మీ వ్యాపారములపై కుతంత్రములు జరిపించి మీ సర్వ వినాశనానికి పూనుకుంటారు . అందుకోసం ఎన్నో మీ శత్రువులు ఎన్నో ఘాతుకాలకు పాల్పడతారు. ఆ స్వార్థపూరితమైన, పాప గ్రస్తమైన ఆలోచనలతో మిమ్ములను దెబ్బతీయుట కోసం, మీ పై కుతంత్రములు ప్రయోగించి నాశనం చేయుట కోసం కుతంత్ర విద్యలు చేసేవారిని సంప్రదించడం జరుగుతుంది. వారి ఉద్యోగ, వ్యాపారాభివృద్ధి బాగుండాలని ఇతరుల వ్యాపారాలు సన్నగిల్లలని ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకోసం ఎన్నో ఘాతుకాలకు పాల్పడుతూ ఉంటారు.ఈ సంధర్భములో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎవరికైతే పైశాచిక గ్రహ పీడ ఉంటుందో, వారు తప్పనిసరిగా ఈ కుతంత్ర విద్యల వలన ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఇది జాతకములోని అవయోగాలకు మూలం. ఎవరికైతే జాతకములో అవయోగాలు ఉంటాయో, వారు ఈ కుతంత్ర విద్యలకు గురి కావడం జరుగుతుంది.  అంటే ఒక విధంగా ఇది కూడా పూర్వజన్మ పాప కర్మ ఫలమే. ఆ పాపమును ప్రక్షాళన చేయడానికి విరుగుడుగా తాంత్రిక పరిహారములను  చేసుకోక తప్పదు.  మరి అలాంటి సందర్భాలలో తంత్ర విద్యలను ఉపయోగించి ఆ పైశాచిక ప్రభావాన్ని నిర్మూలించక తప్పదు. ఎదుటివారి పై తంత్ర విద్యలు ప్రయోగించాలన్న వారికి పూర్వ జన్మ పాపాలు, శాపాలు అధికంగా ఉంటేనే అవి వారిపై ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే చేసే ప్రతి క్రియ కూడా కర్మ ఫలమే. అది మంచి గాని,చెడు గాని. పైశాచిక గ్రహాల చెడు ప్రభావము నిర్మూలించడానికి  మాత్రమే  తంత్ర విద్యలు ఉపయోగపడతాయి.




మన నుదిటి వ్రాత ఆ బ్రహ్మ ఆజ్ఞనుసారంగా జరుగుతుంది. మనిషి ఎదుర్కొంటున్న బాధను తన బాధగా స్వీకరించే ఆ పరమాత్మ ఆ బాధని తొలగించడం కోసం తంత్ర మార్గాలను అధర్వణ వేదం ద్వారా
ఉపయోగించి ప్రయోగించడాన్ని తంత్రం అంటారు.  
                                                    
🪷⚛️✡️🕉️🪷

No comments:

Post a Comment