Friday, March 15, 2024

ఓ సాధారణ సాధకురాలి స్వగతం.......

 [3/14, 06:18] +91 73963 92086: ఓ సాధారణ సాధకురాలి స్వగతం.......

తనువు తనది కాదని తెల్సుకున్నవాడికి జపమేలా, తపమేలా....."
ఉదయం బిక్షాటనకు వచ్చిన ఓ కొమ్మదాసరి ఈ పాట పాడాడు.... బహుశా త్యాగరాజు కృతి అనుకుంటా. ఈ పాట విన్నప్పుడు మదిలో ఏదో భావన..... ఇంతలోనే ప్రక్కింటినుండి జేసుదాసు గారి పాట......
"గాలివానలో వాననీటిలో పడవప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం......."
 ఈ పాట వింటుంటే మనసంతా వికలం...... ఈ రెండు పాటలు ఒకేరోజు  వినడం యాదృచ్చికమైన, ఎందుకో నాలో ఏదో అలజడి. ఈ పాటల్లో సత్యముందని తెలుసు, కానీ.......... ఊహు...చెప్పలేని అంతర్యుద్ధం.
నాలో ఆధ్యాత్మిక తపన వుంది. కానీ, పూర్తిగా వైరాగ్యం ఇంకా రాలేదు. అటు అడుగులు వేస్తున్నా విరాగినిని కాలేదింకా. పారమార్ధిక విషయాలకు ఎంత ప్రాముఖ్యతనిస్తానో, ప్రాపంచికతకు, మానసిక ఆనందంకు అంతే  ప్రాముఖ్యతనిస్తూ పయనిస్తున్నాను. ఇదిగో ఇక్కడే సంఘర్షణ మొదలైంది...... ఇలా ఐతే ముందుకు సాగడం అసాధ్యమని అర్ధమైనదగ్గరనుండి అంతర్యుద్ధం.......
ప్రాపంచిక ప్రపంచంలో అనేక ఆకర్షణలుంటాయి. మనస్సు కోరుతుందని, ఇందులో మానసిక ఆనందం వుందని పరుగులు పెడ్తే ఎలా? మనస్సువైపు కాదు, మాధవునివైపు సాగిపొమ్మని అంతరంగంలో హోరు....
అటా.......ఇటా..........  రెండింటిని సమన్వయపరుస్తూ ఎలా సాగను? ఎంతో గుంజాటన........
ఈ మద్య రోజుకు రెండు,మూడు గంటలు నెట్ కు అటుక్కుపోతున్నా...... ఈ ఆధునిక అభిరుచుల అల్లికలో కాలాన్ని వృధాగా చేజార్చుకుంటున్నానేమోనన్న ఆవేదన.

ప్రాపంచికత, ఆధ్యాత్మికత సమతూకం అంటే సరిగ్గా సమన్వయపరుచుకుంటూ జీవన పయనం సాగించడం దుర్లభం కాకపోవచ్చు గానీ కొంత కష్టతరమే.

భార్య మాటలతో కనువిప్పై భార్యను వదిలి పరమాత్మునికై పరితపించిన తర్వాతే తులసీదాసు యోగి అయ్యాడు. సిద్ధార్ధుడు భార్యాపుత్రులను, తల్లితండ్రులను, రాజ్యాన్ని పరిత్యజించి పరిశ్రమించి పరిశుద్దుడైనాడు. ప్రాపంచిక బంధాలకు బద్ధుడవ్వక బుద్దుడైనాడు. వెంకటరమణ తల్లిని, తోబుట్టువులను, బంధువులను వదిలి అరుణాచలం వెళ్లి యోగాపరుడై రమణమహర్షిలా భాసిల్లడు.
అలాగని బంధాల్ని వదిలి వెళ్ళితే పరమాత్ముడు తెలియబడతాడా????? ఊహు..........
విషయ వస్తువుల పట్ల అనురక్తచిత్తుడైన వ్యక్తి అరణ్యాలకు వెళ్ళిన లాభం లేదు. మనో నిగ్రహం లేక ఎక్కడకు పోయినను ఇక్కట్లే. సత్కార్యాచరణుడై పంచేంద్రియ నిగ్రహంగల వ్యక్తికి గృహజీవనమే తపస్సుగా వుంటుంది. సంసారములో వుంటూనే దేనిని అంటుకోకుండా, పరిత్యాగబుద్ధి (పరిత్యాగమంటే నాది అనే భావాన్ని,దానిపట్ల అనురక్తిని త్యజించడం)ని అలవర్చుకున్న వ్యక్తి తపస్వే. తపమెరిగినవాడు పతన మెరుగడు. ఆంతర్యములో చోటుచేసుకున్న బలహీనతలను పారద్రోలునదియే తపస్సు. బాహ్యప్రేరణలకు లొంగక ఆంతర్య సౌందర్యమును వీక్షించించుటకు చేయు ప్రయత్నమే తపస్సు. నియమబద్దక సాధనాలు అనుష్టించి మనస్సు నియంత్రిచుకున్న వ్యక్తికి గృహమైనా, అరణ్యమైనా ఒక్కటే. ఎక్కడున్నా ఏంచేస్తున్నా అతడు నిత్యముక్తుడే, ఆనంద పరిపూర్ణుడే . అటువంటి ముక్తసంగునికి గృహమే తపోవనమని హితోపదేశం వుంది. అటువంటివారే సమన్వయ జీవితాన్ని గడపగలరు. 


కానీ-
చొక్కా గుండీలు ఊడిపోయాయి, బట్టలు సర్దుతున్నప్పుడే చూసుకోవచ్చు కదా,బయటికి వెళ్ళడానికి సిద్ధమౌతూశ్రీవారి చిందులు. ఏంటమ్మా, ఎప్పుడూ ఇడ్లీ, దోశలు, ఉప్మా తప్ప నూడిల్స్ లాంటివి చేయవచ్చుకదా, టిఫిన్ ముందు అమ్మాయి అలక. నేను రాత్రి చెప్పాను కదమ్మా, నా టి షర్టు ఇస్త్రి చేసి వుంచమని... ఎన్ని బట్టలున్న వాడి చెప్పింది రెడీ చేయలేదని అబ్బాయి అరుపులు. ఇది ఇలా చేశావేమిటి, అది అలా చేశావేమిటీ......అత్తగారి పెద్దరికపు అదిలింపులు. ఏం చేస్తునారు వదినగారు...... ఇరుగు పొరుగు పలకరింపులు............ స్నేహితులకి సమయం కేటాయించలేనంత బిజీయా...... మిత్రుల మాటలతూటాలు..... ఈ ప్రాపంచిక అనుబంధాల్లో ఏ ఒక్కరికి సమయానికి ఏం చేయకున్నా అడుగుతారు, అరుస్తారు, అలుగుతారు...... సో..... వీరందర్నీ ఆనందపరచడానికి ఉరుకులు,పరుగులు తప్పవు. పారమార్ధికము కంటే ప్రాపంచికము వైపే ఎక్కువ తూగుతున్న. తూగాలి, తప్పదు. ఈ నేపద్యములో పరమాత్మున్ని పలకరించేది, పలవరించేది ఎలా కుదురుతుంది? భగవంతుని విషయంలో ఓ వెసలబాటు...... పలకరించకపోయిన ఏమీ అనడు. పైగా నారాయణుడు నారదుని గర్వభంగం చేసే కధ... (నిండు నూనెగిన్నెనిచ్చి తొణకకుండా గుడి చుట్టూ తిరిగి రమ్మంటే, దాని మీద ధ్యాసతో నారాయణుని తలవడు. అదే ఓ కర్షకుడు లేస్తూనే ఓసారి, పొలములో పనికి దిగుతూ ఓసారీ, భోజనముకు ముందోసారి, రాత్రి పడుకునే ముందోసారి తలవడం చూపించి నీకంటే ఉత్తమ భక్తుడని చెప్పే కధ)... గుర్తు చేసుకొని ఆ కర్షకుని కరుణించిన నారాయణుడు ఇన్ని పనుల మద్య పరుగులు తీస్తున్న నన్ను కూడా కనికరించి కరుణించడా........ మనస్సు ఇలా సర్దిచెప్పేస్తుంది, సమర్ధించేస్తుంది...... ఇదో మనో మాయ.
[3/14, 06:18] +91 73963 92086: ఇక బంధంలో వుంటూ బంధాలు అంటుకోకుండా వుండగల్గితే...........
నిజమే, జీవితం ధన్యమౌతుంది. కానీ ఎప్పుడో త్రేతాయుగం నాడు జనకునికి ఇది సాధ్యమైంది. సంసారములోనే ఉండి తరించిన కర్మ యోగి ఆయన. ఇక రామదాసు లాంటి వారికి తగును. సేవ, స్వాధ్యాయం(శాస్త్ర పఠనం) సాధన, సత్యం, సంయనం (నిగ్రహం) ఈ ఇదు "స"కారాలు సంసిద్ధిని అత్యుత్క్రుష్ట సాధనాలు. వాటిని సదా పూనికతో శక్తిసామర్ధ్యాలమేరకు అలవర్చుకొని చాలామంది ఆచరించి తరించారు. కానీ,
అంతటి శక్తి నాకెలా సాధ్యమౌతుంది? ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గంకు ఎగిరినట్లు వుంటుంది. ప్రాపంచికమును, పారమార్దికమును సమన్వయపరుచుకోలేని నేను ఏదీ అంటకుండా ఎలా వుండగలను? భర్తాపిల్లలకు చిరు అనారోగ్యం కల్గిన ఆందోళన పడతాను. ఆత్మీయులకు ఏ బాధ కల్గిన తల్లడిల్లుతాను. భర్త ఉన్నతిని, పిల్లల, స్నేహితుల అభివృద్ధిని చూసి ఆనందముతో మరింత ఆకాంక్షిస్తాను. వారి వారి కష్ట సుఖాల్లో తాదాప్యం చెందుతాను. అటువంటి నేను బంధాలను అంటుకోకుండా వుండగలనా? వస్తు, వ్యక్తుల బ్రాంతిలో తగులుకొనిన నేను వాటిని వదలకనే వస్తురహిత చైతన్యస్థితి కలుగవలెనని అభిలషించడం అత్యాశే. ఆశుద్ధమైన మనసు ఆత్మసాక్షాత్కారం చేసుకోగలదా? మనస్సులో ఎటాచ్మెంట్స్ పెట్టుకోకుండా, దేనితో తాదాప్యం చెందకుండా, ప్రతీది ఈశ్వర పనే, అనే భావముతో వుండి, ఆచరించు కర్మలన్నీ భగవానుడు వొసగిన పవిత్ర ధర్మములుగా భావించి ఆచరిస్తే ఆ కర్మలు నైష్కర్మములు అయి అంటుకోవు. కానీ అది నాకింకా అలవడలేదు.
గమ్యం తెలియకపోయినా పారమార్ధిక పయనంలో సాధనాగమనం సరిగ్గా వుంటే చాలు, స్మరణం వీడని మననం తోడుంటే చాలు.... జ్ఞాన జననం జరిగినట్లే, అంధకారం అదృశ్యమైనట్లే, విజ్ఞాన తీరాలు సమీపించినట్లే అని అన్నారు శ్రీ సుందర చైతన్యనందులు.
ఒకటి మాత్రం నిజం -
గమ్యంచేరేటంతటి సాధన చేయలేకపోయినను ఈ ఆధ్యాత్మిక చింతన అలవడిన దగ్గరనుండి మంచిచెడుల వివేకంతో నా గమనం ప్రశాంతముగా సాఫీగా సాగిపోతుంది. కానీ ఇది చాలదు. ప్చ్.....
ఏ తీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా
నా తరమా భవసాగర మీదను నళినదళేక్షణ రామా....... 


సేకరణ రాధ 🙏

No comments:

Post a Comment