*🌴సుఖదుఃఖాలు...... ఉత్థానపతనాలు సహజo:🌴*
*దుర్దశలలో ధైర్యంగా ఉండటమే కర్తవ్యమని, ధైర్యం వల్లే సర్వం సానుకూలం అవుతుందనీ, సుఖమైనా దుఃఖమైనా అనుభవించడం కంటే గతిలేదనీ భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు.*
*మహాసంపదతో వెలుగుతూండే బలి చక్రవర్తి విధివశంవల్ల ఒకసారి గాడిద అయ్యాడు. ఆ సంగతి బ్రహ్మవల్ల తెలుసుకున్నాడు ఇంద్రుడు. ఖర రూపంలో ఉన్న బలిని చంపనని బ్రహ్మకు మాట ఇచ్చి, ఆ గార్దభం ఆచూకీ తెలుసుకుని వెళ్ళాడు. 'అయ్యో పాపం! ఎన్నో ఏనుగులు చుట్టిరాగా భద్రగజం మీద ఊరేగేవాడివి. అప్పుడు మమ్మల్ని కాసుకుకూడా లక్ష్య పెట్టేవాడవు కావు. ఇప్పుడిలా గాడిదవయ్యావా? బంగారు యూపస్తంభం నాటించి యజ్ఞం చేసేవాడివి. ఇప్పుడీ ఖర్మ పట్టిందా? నిన్ను చూస్తుంటే బాధగా ఉంది నాకు' అన్నాడు.*
*అందుకు బలి నవ్వుతూ 'నువ్విప్పుడు అధికుడవు. అల్పుల దగ్గర బీరాలు పలకడం తగదు. ప్రాణులన్నీ కాలాన్ననుసరించి సుఖదుఃఖాలు పొందుతూంటాయి. ఆ సంగతి తెలుసుకో గర్వపడకు' అని ఇంద్రుడితో అన్నాడు బలి చక్రవర్తి.*
*~ఇంతలో బలి శరీరం నుండి ఒక అందమైన స్త్రీ బయటకు వచ్చింది. ఇంద్రుడు ఆశ్చర్యపోతూ, 'ఎవరీమె?!!' అని అడిగాడు. 'ఆమెనే అడుగు' అన్నాడు బలి. ఇంద్రుడు అడిగాడు.*
*’శ్రీ,, భూతి, లక్ష్మి అని మూడు పేర్లు నాకు. నువ్వే కాదు, ఏ యుగాల్లోనూ ఎవరూ నన్ను ఎరుగరు' అందామె. 'ఇప్పుడు ఇతగాణ్ణి ఎందుకు విడిచిపెట్టేస్తున్నావ్?'*
*’సత్యం, ధర్మం, దానం, దమం, పరాక్రమం, వచన మాధుర్యం ఉన్నచోటే ఉంటాను నేను. ఇన్నాళ్ళూ సచ్చరితంగానే ఉన్నాడు. ఈమధ్యనే ఈర్ష్యాద్వేషాలు, అసూయ పొడసూపాయి ఇతనిలో అందుకని ఇతన్ని విడిచిపెడుతున్నాను నేను' అంది. అది విని బలి ఏం దిగులు చెందలేదు. అంతా విధివిధానం అనుకుని శాంతిపొందాడు.*
*నిజమే! కాలంవల్లే జనులకు కర్మ పరిపాకం కలుగుతోంది. లేకపోతే ఒకరికి ఒక సమయంలో హీనస్థితి కలుగుతూంటే మరొకరికి అదే విక్రమకాలం ఎలా అవుతోంది? అంతా కాలమహిమ. చెడుకాలం దాపురించేసరికి చేయ కూడని పనులు చేయవలసినవిగా కనిపిస్తాయి. బుద్ధి వక్రమార్గాన పడుతుంది. పక్కవాడి సొమ్ము పరమాన్నంలా, పరదార పంచదారలా అనిపిస్తుంది.*
*~లేకపోతే శుక్రాచార్యుడి నీతిశాస్త్రాన్ని ఔపోసన పట్టిన రావణబ్రహ్మ సీతను అపహరించుకు పోవడమేమిటి? నిండు సభలో దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్రను చేయడమేమిటి? అందుకు దుర్యోధనుడు, కర్ణుడూ మొదలైన వాళ్ళంతా పగలబడి నవ్వడమేమిటి? వచ్చినవాళ్ళకు అన్నీ విపరీత బుద్ధులు పుడతాయి.*
*అన్ని పరిస్థితుల్లోను ధైర్యంగా ఉండాలంటూ భీష్ముడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు :~*
*పుత్ర దారైః సుభైశ్చైవ విముక్తస్య ధనేన ।*
*మగ్నస్య వ్యసనే కృచ్ఛే ధృతిః శ్రేయస్కరీ నృప ||*
*~’కట్టుకున్న భార్య, కన్నబిడ్డలూ దూరమైనా, చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, కష్టాలన్నీ ఒకేసారి కూడబలుక్కుని దండెత్తివచ్చినా, ధైర్యం విడువకుండా ఉంటే శ్రేయస్సు దానంతటదే కలుగుతుంది'.*
*ఇంతకూ భీష్మపితామహుడు చెప్పిందేమిటంటే..’ఎంతటివారు అయినా కాలానికీ, ఏటికీ ఎదురీదలేరు. కాలమే అన్నిటికీ కారణం. కాలం కారణంగానే మనుష్యులు నిన్న ఉన్నట్లు ఈరోజు లేరు. ఈరోజు ఉన్నట్లు రేపు ఉండరు. కాలమే ఎవర్ని ఏ దశకు తీసుకువెళ్ళినా, ఎవర్ని ఏ స్థితికి చేర్చినా! కాలగమనంలో సుఖదుఃఖాలు, ఉత్థానపతనాలు సహజమని తెలుసుకొని ధైర్యంగా ఉండగలిగేవాడు శాంతివంతుడై జీవిస్తాడు.*
-శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి
🪷⚛️✡️🕉️🪷
No comments:
Post a Comment