మనం చేసే మేలు మనకేగాని లోకానికి కాదు
కర్తవ్యనిష్ఠ ఆధ్యాత్మిక పురోగతిలో మన కెలా తోడ్పడుతుందో అనే విషయాన్ని విచారించడానికి ముందు మరొక దృక్పథం నుండి కర్మానికి భారతీయులమైన మనం గ్రహించే అర్థం సూక్ష్మంగా తెలుసుకుందాం. ప్రతి మతానికి తత్త్యవిచారం, పురాణాలు, క్రతుకలాపాలు అనే మూడు భాగాలుంటాయి. తత్త్యవిచారమే నిస్సంశయంగా ప్రతిమతం యొక్క సారాంశం; మహాపురుష చరిత్రలలోని ఐతిహాసాల చేతను, అద్భుత విషయాలను గురించిన గాథలచేతను, కథలచేతను పురాణాలు తత్త్యాన్ని సోదాహరణంగా విశదీకరిస్తాయి; క్రతుకలాపాలు దానికి సర్యజనగ్రాహ్యమైన రూపాన్నిస్తాయి.అంటే తత్త్యశాస్త్రం యొక్క మూర్తీభవించిన రూపమే క్రతు కలాపాలు; తత్యశాస్త్ర స్థూలరూపమే క్రతుకలాపాలు. ఈ క్రతువులే కర్మ. ప్రతిమతంలోను ఇది అవసరమైవున్నది. ఎందుకంటే విశేషమైన ఆధ్యాత్మిక అభివృద్ధి పొందనిదే గ్రహింపవీలుగాని పారమార్థిక విషయాలను మనలో అనేకమంది తెలుసుకోలేరు. సమస్తం తమకు బోధపడుతుందని మానవులు అనుకోవటం తేలికేగాని అనుష్ఠానానుభవానికి వచ్చేసరికి ఆధ్యాత్మిక విషయాలను గ్రహించటం ఎంతో కష్టమని తెలుస్తుంది. సంకేతాలు మనకు చాలా తోడ్పడతాయి. సంకేతాల ద్యారా తత్త్యాన్ని బోధించే విధానాన్ని మానుకోలేము. అతిప్రాచీనకాలం నుండి సంకేతాలు అన్ని మతాలలోను వినియోగింపబడుచుండేవి. ఒక విధంగా చూస్తే సంజ్ఞల ద్వారానే మనం ఆలోచించగలం, అసలు శబ్దాలు భావాల సంజ్ఞలే. పక్షాంతరంలో జగత్తులోని ప్రతిదీ సంజ్ఞ అనే భావింపనగును. జగత్తంతా ఒక సంజ్ఞ. ఈ సంజ్ఞకు మరుగున వుండే తత్యం భగవంతుడు. ఈ విధమైన సంజ్ఞాశాస్త్రం కేవలం మానవకల్పితం కాదు; ఫలానా మతానికి చెందిన కొంతమంది జనులు ఒకచోట చేరి, కొన్నిసంజ్ఞలను ఊహించి వాటిని తమ మనస్సుల నుండి వెలువరిస్తున్నారని భావింపకూడదు. ఈ పారమార్థిక సంజ్ఞలకు ఒక సహజాభివృద్ధి ఉంది. లేకపోతే దాదాపుగా ప్రతి వ్యక్తి మనస్సులోను కొన్ని సంజ్ఞలు ప్రత్యేకంగా కొన్ని భావాలకే స్ఫురణను కలిగించడానికి కారణం ఏమిటి? ‘సిలువ’ అనే ‘✝’ ఈ చిహ్నం మొట్టమొదట క్రైస్తవమతం నుండి ఉద్భవించినదని మీలో అనేకమంది భావించవచ్చును. కాని నిజానికి ఇది క్రైస్తవ మతానికి పూర్వం, మోసెస్ పుట్టడానికి ముందు, వేదాలకు ముందు, మానవులను గురించిన విషయాలకు ప్రమాణగ్రంథాలు ఏర్పడడానికి పూర్వమే వుండేది. ‘ఏజ్టెక్’, ‘ఫానిషియను’ జాతులలో ఈ చిహ్నాన్ని చూడవచ్చును. ప్రతిజాతిలోను సిలువ అనే ఈ చిహ్నమున్నట్లు కనిపిస్తుంది. అలాగే సిలువ వేయబడిన మానవుని ప్రతిమ కూడా ప్రతి జాతివారికీ పరిచితమైనదిగానే కనిపిస్తుంది. వృత్తం లోకమంతటా వ్యాప్తిగాంచిన ఒక మహాసంజ్ఞ. అన్ని సంజ్ఞలకంటే అధిక విశ్వవ్యాప్తి వున్న సంజ్ఞ ‘స్వస్తిక’. బౌద్ధులు దీన్ని లోకమంతటా వ్యాపింపచేశారనే నానుడి ఒకప్పుడుండేది. కాని బౌద్ధమతానికి అనేక యుగాలకు ముందే ఇది వివిధ జాతుల వాడుకలో వుండేదని తెలియవస్తూంది. ప్రాచీన బాబిలోనులోను, ఈజిప్టులోను ఇది కానవస్తుంది. దీనివలన తేలేదేమిటి? ఈ సంజ్ఞలన్నీ కేవలం ఆచారాన్ని అనుసరించి ఏర్పడినవి కావు. వీటి కేదో ఒక కారణం వుండి వుండాలి. మనిషి మనస్సుకు ఈ సంజ్ఞలకు సహజ సంబంధం వుండివుండాలి. భాష ఎప్పుడూ ఒక ఒడంబడిక ద్వారా ఏర్పడదు. ఈ భావాలను ఈ మాటతో తెలుపుదామని ప్రజలు తమలో తామే ఒడంబడిక చేసుకోలేదు. భావానికి సరిపడే శబ్దం – శబ్దానికి సరిపడే భావం లేకుండటం ఎన్నడూ లేదు; భావాలకు మాటలకు అవినాభావ సంబంధం సహజం. ఇలా భావాన్ని తెలిపే సంజ్ఞలు శబ్దరూపంలోగాని, వర్ణరూపంలోగాని వుండవచ్చును. చెవిటివారు, మూగవారు శబ్దేతరాలైన సంజ్ఞలతో ఆలోచించాలి. మనస్సులోని ప్రతిభావానికీ జతపడే రూపంవుంది; సంస్కృత వేదాంతంలో ఇవే నామరూపాలని చెప్పబడుతున్నాయి. ఏర్పాటుచేత (ముందుగా అనుకొని) భాషను సృష్టించటం ఎంత అసాధ్యమో సంజ్ఞా శాస్త్రాన్ని సృష్టించటం కూడా అంతే అసాధ్యం. కర్మ కలాపంలోని సంకేతాలలో మానవుల పారమార్థికాశయాలు ప్రకటితాలవుతున్నాయి. కర్మ కలాపాలు, దేవాలయాలు మొదలైన ఉపకరణాలు నిష్ప్రయోజనాలని చాలా తేలికగా చెపుతుంటారు. ఆధునిక కాలంలో ప్రతి శిశువు ఇలా చెబుతున్నాడు. కాని దేవాలయంలో దేవుణ్ణి అర్చించేవారు, అలా అర్చించని వారికంటె అనేక విషయాలలో మెరుగ్గా వున్నారనటం జనం సులభంగా గుర్తించగల సంగతే. కాబట్టి కొన్ని ఆలయాలకు, క్రతుకలాపాలకు, ఇతర బాహ్య విధులకు కొన్ని మతధర్మాలతో వున్న సంబంధంచేత, ఆయా మతధర్మాలను అవలంబించేవారికి, ఆ రూపాలు వేటికి సంజ్ఞలై వున్నాయో ఆ ఆశయాలను స్ఫురింపచేస్తాయి. కాబట్టి క్రతుకలాపాలను, సంజ్ఞలను పూర్తిగా ఉపేక్షించటం వివేకం అనిపించుకోదు. వీటిని గురించిన వివేచన, అనుష్ఠానం కూడా కర్మయోగంలో భాగమే.
కర్మశాస్త్రానికి రూపాంతరాలు అనేకం వున్నాయి. శబ్దార్థాల అన్యోన్యసంబంధ పరిశీలనాన్ని, శబ్దశక్తితో ఏం సాధించగలమో పరిశీలించడమూ దీనిలో ఒకటి. ప్రతిమతమూ శబ్దశక్తిని అంగీకరిస్తుంది. కొన్ని మతాలలో శబ్దంనుండే సృష్టి సమస్తమూ ఉత్పన్నమైనదని చెప్పబడివుంది. భగవత్సంకల్ప బాహ్యరూపమే శబ్దం. ముందుగా తాను అనుకొన్న విధంగా, సంకల్పించిన విధంగా భగవంతుడు సృష్టించాడు. శబ్దంనుండి సృష్టి వెలువడింది. మన ఐహిక జీవిత వేగపు ఒత్తిడిలో నాడీమండలం గ్రహణశక్తిని కోల్పోయి మొద్దుబారుతోంది. వయస్సు పైబడినదంటే అధికంగా ఈ లోకంలో ఆటుపోట్లకు గురై ఉన్నాము అనీ, అంటే మరింత స్తబ్ధత మనల్ని ఆవరించి ఉంటుంది. మన చుట్టూ నిత్యమూ జరిగే ప్రక్రియలపై కూడా శ్రద్ధ పెట్టము. అయినా మానవస్వభావం ఒకొక్కప్పుడు తన ఔన్నత్యాన్ని ప్రకటింప చూస్తుంది. అప్పుడీ సామాన్య జీవిత సంఘటనలను చూసి అబ్బురపడి వాటి తత్త్వాన్ని గ్రహించడానికి ప్రేరితులమౌతాము; ఇలా అబ్బురపడటమే జ్ఞానార్జనకు తొలిమెట్టు. మతంలో వేదాంతంలో శబ్దానికి వున్న అధిక ప్రాముఖ్యాన్ని అలావుంచి, మానవజీవిత నాటకరంగంలో శబ్దసంజ్ఞలు ప్రధానపాత్ర నిర్వహిస్తుండటాన్ని గుర్తించ వచ్చు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. మిమ్మల్ని నేను తాకటంలేదు. నా మాటలవల్ల పుట్టే వాయుస్పందనాలు మీ చెవులలో ప్రవేశించి, నాడులను స్పృశించి మీ మనస్సులలో ప్రతిస్పందనను కలుగ చేస్తున్నాయి. దీనిని మీరు నిరోధించలేరు. ఇంతకంటే ఆశ్చర్యకరమైన దేమిటంటే – ఒకవ్యక్తి మరొకణ్ణి ‘మూర్ఖుడా’ అనగానే అతడు లేచినిలబడి పిడికిలిబిగించి తనను తిట్టినవాడి ముక్కుమీద గుద్దుతున్నాడు. శబ్దశక్తి ఎలాంటిదో చూడండి! అతిదీనురాలైన ఒక స్త్రీ విలపిస్తోంది; మరొకామె ఆమెను సమీపించి మారటగా కొన్ని శాంతి వచనాలు పలుకుతుంది. క్రుంగిపోయిన ఆ దీనురాలు ఊరడిల్లి దుఃఖవిరహితయై నవ్వుతుంది. శబ్ద ప్రభావం ఎలాంటిదో చూడండి! వేదాంతంలో శబ్దం శక్తిమంతమే, సామాన్య జీవితంలోనూ అది శక్తిమంతమే. ఎలాంటి ఆలోచన, విమర్శన లేకుండానే రేయింబవళ్లు ఈ శబ్దశక్తిని మనం వినియోగిస్తున్నాము. శబ్దశక్తి ప్రభావాన్ని గ్రహించటం దానిని వినియోగించటంకూడా కర్మయోగాంశమే.
No comments:
Post a Comment