Friday, April 12, 2024

 భారతదేశములో సనాతనధర్మములో ఋషులు కాలవిభాగమునకు ఇచ్చిన ప్రాధాన్యత దేనికీ ఇవ్వలేదనిపిస్తుంది. ఎందుచేత అనగా సమస్తజగత్తు కాలములో వచ్చి కాలములో పెరిగి కాలములో లయము అయిపోతుంది. మనము కాలము భగవంతుని స్వరూపముగా ఆరాధన చేస్తాము. ఆ క్రమములో కాలమును సద్వినియోగము చేసుకోవడానికి, ఏ కార్యమునందు ఏ సమయమును పాటించాలి అనేటటువంటిదానికి మార్గనిర్దేశనము చెయ్యడము కోసము ఋషులు మనకి చక్కటి కాలవిభాగము చేసి అందించారు. మొదటి ప్రమాణము ఒక సంవత్సరము. దానిని మళ్ళీ దక్షిణాయనము, ఉత్తరాయణము అని రెండు ఆయనములుగా, ఆయనమును మాసములుగా, ప్రతి మాసము రెండు పక్షములుగా, ప్రతి పక్షము వారములుగా, వారమును రోజులుగా, రోజులు రాత్రి పగలుగా, వాటిని గంటలుగా, గంటలు హోరలుగా, హోరలు నిమిషములుగా, నిమిషములు క్షణములుగా విభజించారు. ఎంతవరకు కాలమును సూక్ష్మతరమైన స్థితి వరకు విభాజన చెయ్యవచ్చో అంతవరకూ చేసారు. సంవత్సరమన్నది అత్యంత ప్రధానమైన ప్రమాణము. శ్రీ ప్లవ నామ సంవత్సరము ప్రారంభము అవుతున్నది. కొత్త సంవత్సరము ప్రారంభము అవడమును ఉగాది, యుగాది అని పిలుస్తు ఉంటారు. ఆరోజునే సృష్టి ప్రారంభము అవడము చేత యుగాది అని పేరు వచ్చిందని పెద్దలు చెపుతూ ఉంటారు. ఋషులు ఆరోజున చేసే కార్యక్రమములను కూడా నిర్ణయము చేసారు. సాధ్యమైతే ఆరోజు సూర్యోదయానికి 88 నిమిషములముందు నిద్ర లేచి తైలాభ్యంగనము అనగా నువ్వులనూనెను వంటికి అలదుకుంటారు. ఆ కారణము చేత అలక్ష్మి పరిహారము అవుతుంది. అలక్ష్మిని దూరము చేసుకోవడము కోసము, శరీరములో ఆరోగ్యమును పెంపొందించుకోవడము కోసము తైలమర్దనము ప్రధానమైన అంశముగా నిర్ణయించారు. తరవాత పెద్దలయొక్క ఆశీర్వచనము తీసుకుని శిరః స్నానము నిర్వర్తిస్తారు. నూతన వస్త్రధారణ చేసి నిత్యకర్మలు నెరవేర్చి భగవంతుని ఆరాధన చేస్తారు. ఆరోజు ప్రతివారు ఒక విశేషమైన ప్రసాదమును తయారు చేసి భగవంతునికి నివేదన చేస్తారు.

యద్వర్షాదౌ నింబసుమం శర్కరామ్ల ఘ్రుతైర్యుతం

భక్షితమ్ పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం

ఆ ప్రసాదములో ప్రధానమైనది ‘నింబసుమం’ వేపపువ్వు.

మనుష్యునకు ఏది విశేషమయిన ఆరోగ్యప్రదాయిని అయి ఉంటుందో, దేనియొక్క గాలి, సమస్త పదార్థములు ఆరోగ్యమునకు హేతువులయి ఉంటాయో దానిని సంస్కృతములో నింబ అని పిలుస్తారు. నింబవృక్షము అనగా వేపచెట్టు. ఆ సమయములొనే వేపపువ్వు వస్తుంది. దానితో ప్రధానముగా ఈ పదార్ధమును తయారు చేస్తారు. పంచదారతో కలిపి కానీ, బెల్లము మంగళద్రవ్యము కనక దానితో కలిపి చేస్తారు. ఆమ్ల అనగా చింతపండు. పుల్లని పదార్థమయిన ఆ చింతపండు రసముతో కలిపి, అందులో ఆవునేతిని కలుపుతారు. అగ్నిహోత్రములయందు హోమములు చేసేప్పుడు వ్రేల్చడానికి ఉపయోగించే అమృత సమానమైన నెయ్యి చాలా విశేషమైన పదార్థము. అది వ్యాపించేటువంటి లక్షణము కలిగి కరిగిపోయే స్వభావముతో ఉంటుంది కనక ఆవునెయ్యి కలుపుతారు. ఒక్కక్క చోట కొత్తగా వచ్చిన మామిడిపిందె ముక్కలు కలుపుకునే సంప్రదాయము కూడా ఉన్నది. సూర్యోదయమునకు పూర్వమే పూజ పూర్తి చేసి ఆ పదార్ధమును భగవంతునికి నివేదన చేసి ప్రసాదముగా స్వీకరిస్తారు. ఈశ్వరానుగ్రహము చేత మనము ఆరోగ్యముగా ఉండాలనేది అందులో ప్రధానమైన లక్షణము. భగవంతుడు ఇచ్చిన శరీరము ధర్మసాధనకు గొప్ప ఉపకరణము కనక దాని ఆధారముతో ధర్మానుష్టానము చెయ్యకలుగుతారు. అందుచేత కొత్త సంవత్సరము ప్రారంభములో శరీర ఆరోగ్యమునకు శ్రద్ధ పెడతామన్న విషయములో పునరంకితులు కావడానికి వేపపువ్వు తినిపిస్తారు. ప్రారంభములోనే కొద్దిగా చేదు ఉండే పదార్థముతోనే ఎందుకు? ప్రారంభము చెయ్యడము అనగా ఎప్పుడైనాసరే కష్టపడటము అన్నది అంత తేలికగా ఉండదు. ఏపనీ చెయ్యకుండా సోమరితనముతో కూర్చోమంటే హాయిగా ఉండవచ్చు కానీ కష్టపడటము అన్నది చేదుగా ఉన్నా దానిని ప్రయత్నపూర్వకముగా స్వీకరించాలి. స్వీకరించడానికి సిద్ధపడ్డవారు అనేకమైన ప్రతిబంధకములను ఎదుర్కొంటారు. ఎన్నో విఘ్నములు వస్తాయి అయినా మొక్కవోని ధైర్యముతో, దీక్షతో అడ్డుగా వచ్చిన ప్రతిబంధకములను తొలగించుకుని దాటి ముందుకు వెళ్ళి లక్ష్యసాధన చెయ్యకలిగితే కృతక్రుత్యులు అవుతారు. అలాకావడానికి తగిన మనోబలము కలగాలి. శరీరము దానికి తగిన రీతిలో సహకరించాలని దాని కొరకు చేదు తినడము ప్రారంభము చేసారు అనగా కష్టపడటము మొదలు పెట్టినట్టు. దానికి ఫలితము మళ్ళీ భోగి పండగ. భోగి అనగా భోగము అనుభవించడము. వ్యవసాయదారుడు ఆరు కాలము కష్ట పడి పంట పండిస్తే భోగినాటికి కోతలు పూర్తయి పంటలు అన్నీ ఇంటికి వస్తాయి. సంతోషముతో పొంగల్ అనగా మధుర పదార్ధమును తింటారు. కష్టపడి చేదు తినడము మొదలు పెట్టినవారే మధురపదార్ధమును తినడానికి యోగ్యతను పొందుతారు. ఎవరూ కష్టపడకుండా వ్యక్తిగతముగా, కుటుంబపరముగా, సమాజపరముగా, రాష్ట్రపరముగా, దేశపరముగా అభివృద్ధి చెందే అవకాశము ఉండదు. కష్టపడటము నేర్చుకోవాలి. భగవంతుడు ఇచ్చిన ఉపకరణము శరీరము పట్ల శ్రద్ధపెట్టి చక్కగా ఆరోగ్యముతో ఉండి మనసుకి మంచి విషయములను ఆలంబనముగా ఇచ్చి ధర్మానుష్టాము చేసి సమాజము యొక్క అభ్యున్నతి కొరకు ప్రయత్నించి కీర్తిమంతులు అవమని చెప్పడము ఆ ప్రసాదమును స్వీకరించమని చెప్పి అందులో వాడవలసిన పదార్థములను కూడా నిర్దేశించడము వెనక ఉన్న తాత్పర్యము.

ఉగాదినాడు ప్రతి ఇంటిమీదకూడా విజయానికి గుర్తయిన ధ్వజారోహణము చేస్తారు. ధ్వజము అందరికీ కనపడేట్టుగా స్ఫుటముగా ఎగురుతుంది. ఆ రోజు దవనము తీసుకు వచ్చి ప్రత్యేకముగా భగవంతుని ఆరాధన చేస్తారు. అదిఎంత సువాసనతో ఉంటుందో దాని యొక్కకాండము కూడా అంతే సువాసనతో ఉంటుంది. ఆద్యంతము సువాసన కల దవనము అందరి చేత ఎలా ఆకర్షించి చక్కగా కీర్తింప బడుతున్నదో అలాగే నడవడి చేత తాము కూడా అందరి చేత ఆమోదయోగ్యమైన ప్రవర్తనతో కీర్తివంతులు కావాలని అలా అవడానికి తగిన నడవడి తమకు ప్రసాదించమని భగవంతుని కోరడము ఆ దవనముతో చేసే పూజ.

ఆరోజు తప్పకుండా పంచాగ శ్రవణము చేస్తారు. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అన్న ఐదు అంగముల సమాహార స్వరూపము. ఈ ఐదు అంగములతో కూడుకుని ఉంటుందని పంచాంగము అని పేరు. ఇది జ్యోతిషశాస్త్రమునందు అంతర్భాగము. జ్యోతిషము వేద పురుషునికి నేత్రస్థానములో ఉంటుంది. కన్నులులేని వారు విషయాన్ని దగ్గరకు వెళ్ళి చేతితో ముట్టుకుని అది ఏ వస్తువు అన్నది నిర్ణయించుకుంటారు. కన్నులు ఉన్నవారు దూరముగా ఉన్న వస్తువుని చూసి అది ఏ వస్తువు అన్నది తెలుసుకుంటారు. వేదపురుషునికి నేత్రస్థానములో జ్యోతిషము ఉన్న కారణము చేత గ్రహ గతులను నిర్ణయిస్తుంది. రాబోవు కాలము ఎలా ఉంటుంది? శుభ, అశుభ పరిణామములు ఎలా ఉంటాయి? లెక్కకట్టగలిగిన ప్రజ్ఞతో కూడిన శాస్త్రమునకు జ్యోతిషము అని పేరు. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అన్న ఈ ఐదింటినీ ప్రతి రోజూ పరిశీలించిన కారణము చేత ఐదుఫలితములు కలుగుతాయని పెద్దలు చెపుతారు. ప్రతిరోజు తిథిని పరిశీలించిన కారణము చేత సంపద కలుగుతుంది. ప్రతిరోజు వారమును పరిశీలిస్తే దానివలన ఆయువు వృద్ధి పొందుతుంది. ప్రతిరోజూ నక్షత్రము తెలుసుకుని దానియొక్క పాదము ఏది? అన్నది తెలుసుకోవడము వలన పాపవినాశనము జరుగుతుంది. యోగము చేత రోగము నశించడము, కరణము చేత విజయము సంభవించడము జరుగుతాయి. కాలమును, కాలముయొక్క విభాగమును బాగా పరిశీలించడము అలవాటు అయితే కాలముయొక్క విలువ మనిషి గుర్తిస్తాడు. కాలము విలువ తెలుసుకున్న నాడు ఈ కాలము సద్వినియోగము చేసుకున్ననాడే కాలాతీతులు అవుతారు. కాలమును దుర్వినియోగము చేస్తే కాలమునందు మళ్ళీ పుట్టి, మళ్ళీ మరణించి అనేక జన్మలు ఎత్తవలసి ఉంటుంది. కీర్తివంతులు కావడమన్నది కేవలము కాలమును సద్వినియోగము చేసుకోవడము మీద ఆధారపడి ఉంటుంది. మనిషి జీవితానికి అభ్యున్నతి కల్పించ కలిగినటువంటి ఏ ఐదు ఏ ఐదింటి పరిశీలనము పరిశీలనము చేత వస్తాయో వాటియొక్క అసమాహార స్వరూపమే పంచాంగము. అందులో గ్రహముల యొక్క గతులన్నిటినీ చెప్పి రాశి ఫలితములను చెపుతారు. ఏ ఏ రాశులలో ఏ ఏ నక్షత్ర పాదముల వారు జన్మించారో విని, దానిని బట్టి రాబోయే సంవత్సరములో శుభ, అశుభ ఫలితములను ఎలా ఉంటాయన్న విషయములో ఒక అవగాహనకు వస్తారు. పంచాంగము విన్న కారణము చేత కొన్ని విశేషమైన ఫలితములు కలుగుతాయని పెద్దలు చెపుతున్నారు.

శ్రీకల్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం

గంగాస్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం ఋణాన్

ఆయుర్వృద్ధిదముత్తమం శుచికరం సంతాన సంపత్ప్రదమ్

నానాకార్య సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం

అనేకమైన కార్యములు నిర్వహించవలసి వస్తే పంచాంగమును ఆలంబనము చేసుకుంటారు. అనేక కార్యములు చెయ్యడానికి సాధనముగా ఉపయోగపడుతుంది. ఏ కార్యమును ఎప్పుడు మొదలుపెడితే అది దిగ్విజయముగా పూర్తయ్యే అవకాశము ఉంటుంది? కాలమునందు అంతర్లీనముగా అనేకమైన విషయాలు మనపట్ల ఆనుకూల్యత పొందుతాయన్న విషయములు అన్నీ పంచాంగ శ్రవణము వలన తెలుస్తాయి. విన్న మాత్రము చేత గంగా స్నానఫలితము, గోదానము చేసిన ఫలితము ఇత్యాదులు కలుగుతాయి. కాలవిభాగము గురించి పరిశీలనము చెయ్యడమనేది ఎంత ప్రధానమైన విషయములో లోకమునకు తెలియ చెయ్యడము కోసము ఇప్పటికీ ‘కలౌ శ్రీవేంకట నాయకః’ అనిపించుకున్న శ్రీ వేంకటేశ్వరుడు ప్రతి రోజు పంచాంగ శ్రవణము చేస్తాడు అంటే పంచాంగము వినడము, పరిశీలనము చెయ్యడము, ఇంట్లో ఉండడము అనేది ఎంత ముఖ్యమైన విషయమో మనకు అర్థమవుతుంది. అందులో గ్రహణములు పేర్కొనపడతాయి. ప్రతిరోజు సూర్యోదయ సూర్యాస్తమయములు నిర్ణయింపబడి ఉంటాయి. వాటిని జాగర్తగా పరిశీలనము చేస్తే దానిబట్టి మనము చెయ్యవలసిన ఆరాధనా కార్యక్రమములు అన్నిటినీ నిర్ణయము చేసుకుంటారు. నిత్య నైమిత్తిక తిథులు తెలుస్తాయి. అలాతెలియదము చేత ఏ నైమిత్తిక తిథినాడు ఎటువంటి కార్యాచరణ చెయ్యవలసి ఉంటుందో దానిని పూనికతో చేసి దానివలన పొందవలసిన ప్రయోజనమును పొందుతారు. పంచాంగమును మనము చదువుకోకపోయినా ప్రతిసంవత్సరములో మొట్టమొదటి రోజున ఉగాదినాడు పంచాంగ శ్రవణము చేస్తారు.

ఒక విషయమును గమనించవలసి ఉంటుంది. గ్రహములు జాతకములో సంచారము చేస్తున్నప్పుడు మిశ్రమఫలితములను ఇస్తాయి. మనిషి తెలుసుకోవలసిన విషయము ఒకటి గమనించాలి ఇది మర్త్య లోకము కేవలము సుఖములు, కేవలము అశుభములు మాత్రమే ఉండవు.

శ్రీకాళహస్తీశ్వర శతకము చేస్తూ ధూర్జటి మహాకవి ప్రతిపాదన చేస్తాడు.

గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీకళ్యాణనామంబు ప్ర

త్యహముం బేర్కొనుత్తమోత్తముల బాధంబెట్టగానోపునే?

దహనుం గప్పంగంజాలునే శలభసంతానంబు నీ సేవఁ జే

సి హతక్లేసులు గారుగాక మనుజుల్ శ్రీ కాళహస్తీశ్వరా!

జననసమయమును బట్టి గ్రహములు ఒక సంవత్సరములో కొన్ని ఫలితములను ఇవ్వడానికి సిద్ధముగా ఉండవచ్చు కానీ అధిగమించడానికి కూడా అవకాశము ఉంటుంది. దేనిచేత అధిగమిస్తారు? రావాలిసిన అశుభ పరిణామము చాలా ఉపద్రవముతో కూడుకుని భయంకరమైనది అయినప్పటికీ కూడా అది తప్పించుకునే సాధనము ఒకటి ఉన్నది.

నీకల్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధన్ పెట్టగాను ----

భగవంతుని నామ సంకీర్తనము ప్రతిరోజూ చేయడానికి అలవాటు పడినవారు ఎవరు ఉంటారో అటువంటివారిని గ్రహములు బాధించవు. భగవన్నామము ప్రతిరోజూ తెలిసి కానీ, తెలియక కానీ చెప్పకలగడము ఒక అదృష్టము. కేవలము నామము చెపితే ప్రయోజనము కలుగుతుందని చెప్పిన మాటకు ఎంత సారము ఉన్నదో దానియొక్క కొనసాగింపుకూడా అంత సారవంతము. భగవంతునియొక్క నామములు గౌణములు. అవి ఆయనకు బాలసారె చేసి పెట్టిన పేర్లు కావు. ఒక్కక్క నామము చెప్పగా చెప్పగా ఆ నామముయొక్క అర్థము ఏమిటి? అని తెలుసుకునే ప్రయత్నము చేస్తే దానివలన భగవంతుడు ఒక్కక్క గుణమును ఆవిష్కరించినప్పుడు, లోకాన్ని సంరక్షణ చెయ్యడానికి ఆయనయొక్క లీలను ప్రదర్శించినప్పుడు, ఆయా సమయములలో ఆయన చూపించిన దయ, కారుణ్యము జ్ఞాపకమునకు వచ్చినప్పుడు లోకము ఆయనను కీర్తించినప్పుడు వచ్చినవి ఆయనకు ఆపేర్లు అనుకున్నప్పుడు భగవంతునితో ఒక ఆనుబంధము కలుగుతుంది. ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతకడము గొప్ప అని అలా బ్రతకడము అలవాటు అవుతుంది. అలా బ్రతికితే ధర్మమును పాటించినట్టు అవుతుంది. ధర్మమును పాటిస్తే అప్పుడు మనము ప్రశాంతముగా ఉంటాము. లోకము ప్రశాంతముగా ఉంటుంది. సమాజముయొక్క శాంతిభద్రతలు అన్నీ దేనిమీద ఆధార పడి ఉన్నాయి అనగా ధర్మాచరణము వలన మాత్రమే సాధ్యము అవుతాయి. అటువంటి ధర్మాచరణ చెయ్యడానికి మొదట సమన్వయము ఎక్కడ కలుగుతుంది? అనగా భగవన్నామమును పలకడములో ఉంటుంది. ఒకవేళ గ్రహగతులు అంత బాగాలేవు ఆనుకూల్యత ఎక్కువగా లేదు అంటే బెంగపెట్టుకోవలసిన అవసరము లేదు. ఏ బెంగ పెట్టుకోకుండా భగవంతుని నమ్ముకుని ధర్మమార్గములో ప్రయాణము చేస్తే వారు చేతికి నూని వ్రాసుకుని పనసతొనలు తీసిన వారితో సమానము. పనసతొనలు ఎంత జిగురుగా ఉన్నా, పనసపాలు చేతికి అంటుకునే లక్షణము కలిగినవి అయినా చేతికి నూని వ్రాసుకుంటే తొనలు తీసేవారికి ఆ జిగురు అంటుకోదు. ధర్మమార్గములో ప్రవర్తించేవారికి భగవంతుని యొక్క అనుగ్రహము ఉంటుంది. అటువంటివారిని గ్రహములు చెణకి విశేషముగా బాధపెట్టవు. శ్రీకాళహస్తిక్షేత్రములో నవగ్రహములను భగవంతుడు కవచముగా ధరిస్తాడు. ఆయన గొప్పవాడా! ఆయన కవచము గొప్పదా! అంటే కవచము ఆయనకు ఉపకరణము. ఆయన కట్టుకోవడము వలన కవచమునకు గొప్పదనము వచ్చింది. ఆయన శాసనమునకు గ్రహములు వశవర్తులై ఉంటాయి. భగవద్భక్తిని, ధర్మమార్గమును అనుసరిస్తున్నవారు గ్రహగతులు కొద్దిగా తేడాగా ఉన్నాయని బెంగ పెట్టుకోవలసిన అవసరము ఎంతమాత్రము ఉండదు. బాగా అనుకూలముగా ఉన్నది, కలిసి వస్తుందని, విశేషమైన శుభములు జరుగుతాయని గర్వపడవలసిన అవసరము కూడా ఉండదు. అంతా భగవంతుని అనుగ్రహమని ప్రసాదబుద్ధితో స్వీకరించి ఇలాగే శుభములను పొందాలి అంటే భగవంతుని అనుగ్రహమునకు పాత్రుడనై ఉండాలని ధర్మాచరణమును కొనసాగించవలసి ఉంటుంది. అందుకొరకుప్రతివారినీ ఆరోజు పంచాంగము వినమని చెపుతారు.

ఉగాదినుంచి వాతావరణమును తపింపచేసే లక్షణము పొందుతుంది. సమస్తప్రాణులు దాహముచేత శోషించిపోతాయి. నీరు తగ్గిపోతే ప్రాణములు తమ స్థానములనుంచి పైకి లేచిపోతాయి స్పృహ తప్పి పడిపోతారు. నీటిని ఇవ్వడము అన్నిటికన్నాగొప్పది. చలివేంద్రము పెట్టలేని వారు ఒక మంచినీటి కుండను చల్లటి నీటితో ఎవరికైనా ఇచ్చి, అయ్యా! మీరు ఇందులో మంచినీళ్ళు పోసుకుని ప్రతిరోజు త్రాగండి అని ఇస్తారు. చైత్రమాసము ప్రారంభమయిన తరవాత నాలుగునెలల పాటు చలివేంద్రము పక్కనుంచి వెడుతున్న బాటసారులు అందరూ తనివితీరా తృప్తిగా త్రాగడానికి చల్లటి నీటిని ఇస్తారు. మనుష్యులే కాదు సమస్తభూతములు నీటి కోసము కటకటా లాడిపోతాయి. అవి స్వ్వేచ్ఛగా వచ్చి సంతృప్తిగా నీళ్ళు త్రాగడానికి వీలుగా సౌకర్యమును కల్పిస్తారు. ఒక్కరుగా చెయ్యలేకపోతే అందరూ కలసి చెయ్యాలి. ఒకరికొరకు అందరు, అందరి కొరకు ఒకరు అని నిలబడగల స్థితిని మనకు ఉగాది పండగ నేర్పుతుంది.

ఉగాదినాడు అందరూ చక్కగా ఉగాది పండగకు సంబంధించిన కార్యక్రమములు అన్నిటినీ కూడా నిర్వర్తించి భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహమునకు పాత్రులు అవ్వాలి. సంవత్సరమునకు మొదటి నెలలో మొదటి తిథి ప్రారంభము అవుతున్నది కాబట్టి తల్లి తండ్రుల పాదములకు నమస్కరించి గురువులు, సాధుపురుషులు, యతిపురుషులు. గొప్పవిద్వాంసులు, లోక హితము కొరకు ప్రయత్నించే వారికి నమస్కరించి వారి ఆశీస్సులు పొందుదాము. ఈ కొత్త సంవత్సరములో రాష్ట్రము, దేశము వృద్ధిలోకి వచ్చి అన్నివిధములుగా అందరూ సంతోషముగా శాంతిభద్రలతో ఆనందముగా ఉండాలని దానికి సంబంధించి సమస్త విభూతులను భగవంతుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములచేత మనకు అనుగ్రహించాలని ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ అసంఖ్యాకమైన శ్రోతలకు ప్రేక్షకులకు

శ్రీ క్రోధి  నామ ఉగాది శుభాకాంక్షలు....

-- *బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు*

No comments:

Post a Comment