*మార్పు- మరక*
"శారదా, శేఖర్ ని నిద్ర లేపు. ఇప్పటికే ఎనిమిది గంటలయింది." సంధ్యారామ్ చెప్తున్నాడు చెప్పులేసుకుని రైతు బజార్ కి వెళ్తూ.
"సరే, మీరెక్కడికి?"
"కొత్తిమీర కావాలన్నావ్ కదా! "
"ఇంతోటి కొత్తిమీర కోసం ఇప్పుడు మీరు బైక్ మీద వెళ్ళాల్సిన అవసరం లేదు లెండి. "
"అదికాదు కొత్తిమీర లేకుండా చారేం బాగుంటుంది చెప్పూ..."
"మీరీవంకతో సిగరెట్లు కాల్చుకు వస్తారు. ఎవరికి తెలియదు మీ వేషాలు.!!"
"అదికాదు శారదా, పొద్దున్న ఒక దమ్ములాగకపోతే...అదోలా ఉంటుంది. ఇంట్లో ఎలాగూ అడ్డుపడతావు కదా! ఆఫీసులో కూడా సరిగా కుదరదు."
"ఎందుకు కుదర్దు!!? మీరెంత ఛైన్ స్మోకర్లో మీ ఆఫీసు వాళ్ళనెవరిని అడిగినా చెప్తారు. ఈ దురలవాటు మానమంటే మానరు కదా!!"
"సర్లే, పది నిమిషాల్లో వచ్చేస్తాను. ఈలోపల వాడిని నిద్ర లేపి టిఫిన్ తినమను. ఇంత పొద్దేక్కే వరకు పడుకోకూడదు" అంటూ బైక్ కిక్ కొట్టి ముందుకు వెళ్ళాడు.
"సరిపోయింది.మిమ్మల్ని సిగరెట్లు మానమని, వాణ్ణి తొందరగా లేవమని చెప్పి చెప్పీ నా నోరు నొప్పెడుతోంది కాని ప్రయోజనం కనబడలేదు." విసుగ్గా అంటూ లోపలికి వెళ్ళింది శారద.
*************************
"నా వల్ల వీలవ్వదేమో బావా ఈ సిగరెట్లు మానడం..." తన అసక్తత వెలిబుచ్చుతూ శారద అన్న హరితో అన్నాడు సంద్యారామ్.
"నువ్వు పెద్ద ఆఫీసరువి. నీకు చెప్పగలిగే వాణ్ణి కాదు. నీఈ దురలవాటు వలన నలుగురిలోనూ చులకన అవుతావు. నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు. తద్వారా నిన్నే నమ్ముకున్న నీ కుటుంబాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తావ్ బావా!"
అనునయంగా చెప్పాడు హరి.
"కరెక్టే నువు చెప్పింది బావా!! కానీ మానలేక పోతున్నాను. నా వల్ల కాదేమో!! ఇప్పటికే రెండు సార్లు ఆ డి ఎడిక్షన్ ట్రీట్‌మెంట్ తీసుకున్నాను. అయినా ప్రయోజనం శూన్యం." అన్నాడు నిరాశగా.
ఆలోచనలో పడ్డాడు హరి.
**************************
"చూడు శేఖర్, నువ్వపుడే డిగ్రీ రెండవ సం.కి కొచ్చావు. కొన్ని మంచి అలవాట్లు ఇప్పటికైనా నేర్చుకోవాలి." చెప్తూ ఆగాడు హరి.
"మావయ్యా! నువ్వనేది నాకర్థమయింది. నేనేదైనా చెయ్యగలనోమో కాని ఎర్లీ మార్నింగ్ ఎయిటోక్లాక్ ముందుగా నిద్ర లేవలేకపోతున్నాను. ట్రై చేసాను. కుదర్లేదు. నా వల్ల కాదేమో!" అని శేఖర్ అక్కడినుండి వెళిపోయాడు.
హరి ఆలోచనలో పడ్డాడు.
**************************
రెండు నెలలు గడిచాయి. ఈ మధ్యన శారదకి తరచుగా ఒంట్లో బాగోకపోవడంతో తరచుగా హాస్పిటల్ కి తిరుగుతున్నారు ఆ ఇంట్లో వారు.
హరి కూడా వీళ్ళకి సాయంగా వచ్చాడు.
శారదకి కొన్ని రక్తపు వాంతులు కూడా అయాయి.
ఎన్నో పరీక్షల తర్వార తెలిసింది, శారదకి బ్లడ్ కేన్సర్ ఆఖరి దశలో ఉందని.!
ఎన్నాళ్ళో బ్రతకదని!!
ఆ వార్త ఆ కుటుంబ సభ్యులను ఎంతో కలచి వేసింది.
శారద బ్రతికే కాలం పెరగాలంటే తనకెంతో ప్రశాంత జీవనం గడపే అవకాశం ఇవ్వాలని, ఆరోగ్యకరమైన వాతావరణం ఇంట్లో ఉంచాలని చెప్పారు, డాక్టర్లు.
ఈ మాటలతో సంధ్యారామ్, కొడుకు శేఖర్ అప్రమత్తమయారు.
సంధ్యారామ్ సిగరెట్లు తగ్గించి, క్రమంగా మానేసాడు. శేఖర్, శారద లేవకముందే పొద్దున్నే లేచి, ఇంటి పనుల్లో సాయం చేసేవాడు.
ఇలా రెండు నెలలు గడిచాయి.
***********************
"ఇంక నా వల్ల అవ్వదేమో అన్నయ్యా ఈ విధంగా."
అంటోంది శారద.
"కొంచెం ఓపిక పట్టమ్మా!! వాళ్ళిద్దరిలోనీ మంచి మార్పులు వస్తున్నాయి. అవి కొంచెం లోతుగా పాదుకోనీ."
"కానీ ఇలా నాటకం ఆడడం కష్టమైపోతోంది అన్నయ్యా! రేప్పొద్దున్న వాళ్ళకి నిజం తెలిస్తే వాళ్ళు మళ్ళీ మారిపోతారేమో!"
"ఏ ప్రయత్నమూ చేయకపోవడం కన్నా ఇది నయం కదా!! కొంచెం భరించమ్మా." అనునయంగా చెప్తున్నాడు హరి.
కొన్నాళ్ళకి శారద భర్తకి, కొడుక్కి అసలు విషయం తెలిసింది. శారదకి ఏ అనారోగ్యమూ లేదని, హరి తన స్నేహితులైన డాక్టర్లతో కలసి ఇలానాటకం ఆడించాడని.
కానీ శారద భయపడినట్లుగా వాళ్ళు మరలా మారిపోలేదు.
సిగరెట్లు మానడం వలన తన ఆరోగ్యం లో వచ్చిన మంచి మార్పుకి, నలుగురిలోని పెరిగిన గౌరవానికి సంధ్యారామ్ సంతోషించి అదేవిధంగా ఉందామనుకున్నాడు.
శేఖర్ కూడా పొద్దున్నే లేవడం వలన కలిసొచ్చిన సమయాన్ని, కలిగిన ఉషారుని మరలా పోగొట్టుకోదల్చుకోలేదు.
మార్పు మంచి కోసమైతే, ఆ మార్పుతెచ్చే అబద్ధమనే మరక కూడా మంచిదే కదా!!
*దేవులపల్లి దుర్గాప్రసాద్*
No comments:
Post a Comment