*బెంగుళూరు లోని ఓ ఇంటి ముందు*
*తిరుమల తిరుపతి కార్యనిర్వహణాధికారి*
*శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు..కారులోంచి దిగారు.*
లోపలికి వెళ్ళి చూస్తే..అంతా నిశ్శబ్దం.
మంచం మీద ఓ వృద్ధుడు నిస్తేజంగా
పడుకుని ఉన్నారు. చుట్టూ ఎవరెవరో వున్నారు.
ప్రసాద్ తాను వచ్చిన పని గురించి చెప్పారు.
అందులో ఓ వ్యక్తి ఆసక్తిగా ముందుకు వచ్చి..
నాన్నగారు వారం నుంచి కోమాలో వున్నారు,
అంటూ ప్రసాద్ గారిని మంచం దగ్గరకు
తీసుకుపోయి..ఆ వృద్ధుని చెవిలో
"నాన్నగారూ..నాన్నగారూ" అంటూ పిలిచాడు.
సమాధానం లేదు. ఈ సారి చెవి దగ్గరగా..
"మీ కోసం తిరుమల నుండి ప్రసాదం వచ్చింది"
అన్నాడు. అప్పుడు తెరుచుకున్నాయి..
ఆ వృద్ధుని కళ్ళు. అర్ధ నిమీలిత నేత్రాలతో
ఆయన ప్రసాద్ వంక, ఆయన చేతిలోని ప్రసాదం
వంక చూస్తున్నాడు. ప్రసాద్ వెళ్లి ఆయన మెడలో
శ్రీవారి డాలర్ హారం అలంకరించి, శాలువా కప్పి,
శ్రీవారి ప్రసాదాన్ని ఆయన చేతిలో ఉంచారు..
"మిమ్ము స్వామి వారి ఆస్థాన విద్వాంసునిగా
నియమిస్తున్నాము" అని నియామక పత్రాన్ని
ఆయనకు అందించారు. ఆ వృద్ధుని కళ్ళు
వాటి వంక చూశాయి..కళ్ళనుంచి
నీళ్లు కారుతున్నాయి.పెదాలు వణుకుతున్నాయి.
ఏవో మాటలు వినిపిస్తున్నాయి.
ఏదీ అర్ధం కావడం లేదు.
ఆఖరు మాట ఒక్కటే అందరికీ వినిపించింది..
"స్వామీ! ఇన్నాళ్లకు నా మీద దయకలిగిందా?"
అంటూ..తన చేతనున్న వాటిని తడుముకుంటూ..
అనిర్వచనీయ అనుభూతిని అనుభవిస్తూన్నాడు.
స్వామి వారి కరుణ లభించింది.ఇక తన
జీవితానికి విముక్తి లభించిందన్నట్లు మరో
పది నిముషాల తరువాత....
"రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి ప్రాణాలు
అనంత వాయువుల్లో కలిసిపోయాయి!
అందరికీ అదో అద్భుతం,అనిర్వచనీయం!
ఎవరీ..రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ?
శ్రీనివాసునిపై అన్నమయ్య రాసిన కీర్తనలు
30 వేలకు పైగా ఉన్నాయి. అప్పటి పాలకులు
అన్నమయ్య కీర్తనలను తాళపత్రాలపై
చెక్కించారు. వాటిని స్వామి వారి ఆలయంలో
నిక్షిప్తం చేశారు. 20 శతాబ్దంలో ఆలయ
నిర్వహణప్పుడు..ఇవి బయటపడ్డాయి.
ఆ తాళపత్రాలను గ్రంధ రూపంలోకి తెచ్చి,..
"జో అచ్యుతానంద..జోజో ముకుందా"
అని మనం పాడుకోగలుగుతున్నామంటే..
ఆ కృషికి కారకులు..'వేటూరి ప్రభాకర శాస్త్రి,
రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు!
ఓ రోజు సంగీత సమావేశం ముగిశాక..
అన్నమాచార్య ప్రాజెక్ స్పెషల్ ఆఫీసర్
కామిశెట్టి శ్రీనివాసులు..ప్రసాద్ గారితో..
సర్! రేపు మీరు బెంగుళూరు వెళుతున్నారు.
రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ గారు ప్రస్తుతం
అక్కడే ఉన్నారు. అన్నమయ్య కీర్తనలను
జనబాహుళ్యంలోకి తీసుకు రావడానికి
ఆయన కృషి ఎంతో ఉంది. ఆయన
సమకాలికులకు అన్ని గుర్తింపులు లభించాయి.
కానీ రాళ్లపల్లి వారికి మాత్రం అన్యాయం జరిగింది.
ఆయనను మీరు కలిస్తే బాగుంటుంది" అన్నారు.
పివిఆర్కే ప్రసాద్ చాలా సేపు ఆలోచించి
ఓ నిర్ణయానికి వచ్చారు. డిప్యూటీ ఈ.ఓ.ని పిలిచి..
ఉదయానికల్లా..రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని
ఆస్థాన విద్వాంసునిగా నియామక పత్రం,
శ్రీవారి గోల్డ్ డాలర్,శాలువా, ప్రసాదం
అక్షింతలు వగైరా సిద్ధం చేయండి అన్నారు!
డెప్యూటీ ఈ.ఓ.అవాక్కయ్యాడు.
"సర్! అలా నియమించే అధికారం మీ
పరిధిలోనిది కాదు.బోర్డు ఓ కమిటీని నియమించి,
ఆ కమిటీ ఎంపిక చేసిన వారిని మాత్రమే
బోర్డు నియమిస్తుంది. రూల్స్ కు విరుద్ధంగా
అలా చేస్తే మీ మీద ఏ చర్యలైనా తీసుకునే
అధికారం బోర్డుకు ఉంటుంది.అవసరమైతే
మిమ్ము ప్రభుత్వానికి సరెండర్ చేయొచ్చు
అన్నాడు..
అయినా ప్రసాద్ గారు వినలేదు.
వెంటనే నేను చెప్పినట్లు చేయండి..అన్నారు!
అలాగే అన్నీ సిద్ధం అయిపోయాయి.
అవి తీసుకుని బెంగుళూరు బయలుదేరారు
పివిఆర్కే ప్రసాద్ గారు. బెంగుళూరులో ఆఖరు
క్షణాలలో..వాటిని రాళ్లపల్లి వారికి సమర్పించడం.
దాని కోసమే ఆయన ఎదురుచూస్తున్నట్లుగా..
ఆ శుభ సందేశం అందుకోగానే ఆయన
స్వర్గస్థులవడం జరిగిపోయాయి!
* * *
టిటిడి బోర్డు మీటింగ్ హాలు..వాతావరణం
సీరియస్ గా వుంది. జరిగిందంతా చెప్పి
ప్రసాద్ గారు నిశ్శబ్దంగా కూర్చున్నారు.
"ప్రసాద్ గారూ - మీరు చేసినది చాలా పెద్ద
తప్పిదం. రూల్స్ కు విరుద్ధం" అన్నాడో సభ్యుడు.
మీ మనసుకు ఏది తోస్తే అది చేసెయ్యడానికి
ఇక బోర్డు ఎందుకు? అన్నారు మరొకరు.
ఎవరికి తోచింది వారు మాట్లాడారు. చివరిలో
అందరూ చైర్మన్ నాగిరెడ్డిగారి వంక చూశారు.
ఆయన చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వారు!
"స్వామి వారికి బోర్డు చైర్మన్ నుండి..సాధారణ
యాత్రికుడి వరకూ అందరూ సమానం. ఆయన
సమస్త జీవరాసులను సమానంగా ప్రేమిస్తాడు.
ఎవరిని ఎప్పుడు, ఎక్కడ ఆదుకోవాలో
అప్పుడు ఏదో ఒక రూపంలో ఆదుకుంటాడు.
ఆయన లీలలు అలా ఉంటాయి. రాళ్లపల్లి వారిని
జీవన చరమాంకంలో సంతోష పెట్టేందుకే ప్రసాద్
గారిని అలా తరుముతున్నట్లు బెంగుళూరు
పంపించాడేమో? అని నేను భావిస్తున్నాను.
ఈ రూల్సు అన్నీ ప్రసాద్ గారికి తెలియనివి కావు.
రాళ్లపల్లివారికి ఎప్పుడో జరగవలసిన సత్కారం
అప్పుడు జరగలేదు.ఇప్పుడు మనకు భగవంతుడు
కల్పించిన అవకాశంగా నేను భావిస్తున్నాను!
ప్రసాద్ గారి చర్యకు ఆమోదం తెలుపుతున్నాను.
అన్నాడు. అంతా నిశ్శబ్దం. నాగిరెడ్డిగారి
తీర్మానాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఎన్నో చిత్రాలలో..కథలను మలుపులు తిప్పి,
ఉత్కంఠ రేకెత్తించి, ముగింపులో ఓ సందేశంతో
ప్రేక్షకులను ఇంటికి పంపే విజయాధినేత
నాగిరెడ్డిగారు..ఈ సమస్యకు ఒక్క చిరునవ్వుతో
ముగించిన ఆయన స్థితప్రజ్ఞతకు మనసులోనే
కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ప్రసాద్ గారు!
*🙏ఓం నమో వేంకటేశాయా!!!🙏*
Courtesy Whatsapp