*శ్రీరమణీయభాగవత కథలు- 10*
( బాపు-రమణ )
జరిగిన కథ:
పరీక్షిత్తు నారద మహర్షిని చూస్తాడు.
నారదుడు, పరీక్షిత్తుకు శుక మహర్షి జనన వృత్తాంతము తెలిపి, ఆయన ద్వారా శ్రీమన్నారాయణుని గాధలు విని మోక్షమును అందుకోమంటాడు.
ఇక చదవండి:
ఒకనాడు ఒక చోట అప్సరసలు దిగంబరలై జలక్రీడలాడుతుండగా అటు పక్కగా శుకుడు వెళ్లాడు. వాళ్లు అతన్ని చూసి కూడా పట్టించుకోలేదు.
ఇది చూసిన వ్యాసుడు శుకుడిని పిలుస్తూ పరుగున వచ్చాడు. అప్పరసలు కంగారుపడి అందిన బట్టలు చుట్ట బెట్టుకుని బెదిరి చూడసాగారు.
పరీ:
అదేమిటి! యువకుడైన శుకుడిని చూసి పట్టించుకోని వాళ్లు వయో వృద్ధుడైన వ్యాసుడిని చూసి...
నార:
ఆయనా ఆమాటే అన్నాడు. ఇదేమి విడ్డూరమమ్మా అని. అప్సరసలు కారణం చెప్పారు.
శుకుడు నిర్మలమైన జీవి, పసిబిడ్డ నవ్వులాటివాడు. ఆయన కళ్లు అన్ని చూస్తాయి. కానీ దేన్నీ చూడవు. చెట్టూ చేమా జింకా ఆడపిల్లా అన్నీ ఒకటే! అందుకే మేము బెదరలేదు. పడుచువాడైనా ఆయనకు ఏ స్పృహా లేదు. ఇటువచ్చిన మీరు అటు ముఖం తిప్పుకుని మాట్లాడుతున్నారు. మీ కుమారుడికి ఆడామగా అన్న స్పృహేలేదు. మీకు వుంది. అన్నారు. వ్యాసుడు నివ్వెరబోయాడు.
ఆ పరమాత్ముడు ముక్తిని కటాక్షించే వరకూ శుకుడు సుఖంగా సంతోషం బ్రతకాలనే పట్టుదలతో అతడికి భాగవతాన్ని బోధించి ప్రచారం చేయమన్నాడు వ్యాసుడు.
శుకుడు విద్య ద్వారా సంసార సుఖాల ద్వారా పొందలేని పరమానందాన్ని వారి నామ స్మరణ వలన పొందుతున్నాడు నీకు చెప్పి నిన్ను ఉద్దరించడంతో బాటు తాను చెబుతున్నది తానే వింటూ మహదానందాన్ని పొందగల మహనీయుడా శుకబ్రహ్మ.
నారదుడు అదృశ్యమయ్యాడు.
*పరీక్షిత్తు తన కుమారుడైన జనమేజయునకు ఆపద్ధర్మంగా పట్టాభిషేకం జరిపించాడు.*
*నదీతీరం*
వసిష్ట వ్యాస నారదాది మహర్షులు వేద పండితులు కూర్చున్నారు హోమ గుండం వద్ద ఋత్విజులు యాగం నడిపిస్తున్నారు జనమేజయుడు దారి చూపగా పరీక్షిత్తు యాగశాలకు వచ్చాడు.
కిరీటాది రాజాభరణాలు విడిచి మెడలో తులసి మాల వేసుకున్నాడు తెల్లని వస్త్రాలు ధరించాడు జనమేజయుడు కూడా కిరీటం వంటి రాజలాంఛనాలు ధరించకుండా కొద్దిపాటి నగలతో నిరాడంబరంగా ఉన్నాడు.
జన:
తండ్రీ ప్రాణరక్షణా శిక్షణా ఆ పరమాత్ముడి చేతులలోనే వున్నా మీ ఆపద తప్పించడానికి మానవప్రయత్నం చేస్తున్నాను మీ దీర్ఘాయుస్సు కోసం ఆయుష్టోమం చేయిస్తున్నాను. ఇటురండి.
చిరునవ్వుతో తల అడ్డంగా వూపుతూ నా కుమారుడిగా రాజుగా నీ ప్రయత్నాలు నువ్వు చేయవచ్చును. కాని నా ప్రయత్నం ఒక్కటే శ్రీహరిని స్మరిస్తూ ఈ దేహాన్ని విడిచి వెళ్లడం, అందుకు మార్గం చూపగల మహర్షులు ఇటుకాదు అటువేపు వున్నారు. నేనుచేసిన కొద్దిపాటి పుణ్యం వల్ల వారంతా నా కోసం వచ్చారు.
కుమారుని తనవైపు తిప్పుకుని రెండు బుజాలమీద చేతులుంచి సూటిగా కళ్లలోకి చూశాడు
పరీ: నేటికి ఆరోదినాన తక్షకుడనే సర్పరాజు వచ్చి నన్ను కాటువెయ్యడం- నేను చనిపోవడం అంతా పరి లాంఛనం మాత్రమే
ముని మీద పామును విసిరిన క్షణంలోనే నాలోని పొగరు అనే పాము నన్ను కరిచింది అపుడే చనిపోయాను
జనమేజయుడు సూటిగా చూడలేక కళ్లు వాల్చి తల తిప్పుకున్నాడు.
పరీ: ఇపుడు జరుగుతున్నది తప్పుతెలుసుకుని బాధ పడడం అంతే రాజ్యపాలకుడిగా నా కుమారుడికి నేను చెప్పేమాట ఒక్కటే నేను అరవయ్యేళ్ల ధర్మ పరిపాలన నడిపానని నలుగురూ మెచ్చుకున్నారు కాని ఈ ఒక్క తప్పు నాశనానికి దారి తీసింది.
కడివెడు పాలలో ఒక్క ఉప్పురాయిలా నువ్వు పొగరు అనే ఒక్క దానిని ఎల్లప్పుడూ దూరంగా వుంచు.
పొగరు పుట్టించేవి పొగడ్త అది అహంకారానికి తల్లి. అది అందంగా అప్సరసలా వుండి కౌగిలించు కుంటుంది కాని నిజానికది విషకన్య హెచ్చరికగా వుండు ఇక నా వెంటరాకు నీ ద్వారా ఈ దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మేలే జరగాలి
రాజు కుమారుని శిరసు ముందుకి వంచి శీర్షాన్ని ఆఘ్రాణించాడు. గడ్డం కింద ముని వేలుంచి ముఖం పైకెత్తాడు జనమేజయుని కళ్లల్లో నీరు తండ్రి చిరునవ్వుతో ఆ నీటిని మీటాడు. ఆయన కంట నీరులేదు గిరుక్కువ వెనుతిరిగి ఋషుల కూటమివైపు చరచర నడిచి వెళ్ళాడు జనమేజయుడు కదలబోయి ఆగి అక్కడి నుంచే నమస్కరించాడు
*యాగశాల*
పరీక్షిత్తు ప్రాయోపవేశానికై దర్భాసనం మీద కూర్చున్నాడు గంగా తీరం వ్యాసుడు, అగస్త్యుడు, వశిష్టుడు, భృగుడు. భరద్వాజుడు, గౌతముడు, మొదలగు మహర్షులు, బృహస్పతి, నారదాది దేవర్షులు - జనకాది రాజర్షులూ ఆసీనులైవున్నాడు.
అంతలో దివ్యతేజంతో వెలుగుతున్న శుక బ్రహ్మ వస్తున్నాడు. అతడిని దూరం నించే చూసి అందరూ లేచి అభివాదాలు చేశారు.
ఉదయ సూర్యబింబంలోంచి శుకుడు పశ్చిమాభిముఖంగా నడుస్తూ యాగశాల ప్రవేశిస్తున్నాడు. అందరూ లేచి నించుని వున్నారు.
పరీ:
వ్యాసమహర్షీ! ఆ వస్తున్న శుక బ్రహ్మ మీ పుత్రుడే కదా! మీరు కూడా లేచి నిలవడం...
వ్యాసుడు:
నాయనా! శుకుడు పంచభూత స్వరూపాత్మకుడు. శివ కటాక్ష స్వరూపుడు. జన్మరీత్యా నా కుమారుడు కావచ్చుగానీ ఈ బంధాలకు అతీతుడు. అందరి లాగే నాకూ వంద్యుడే. ఆవుపాలు పితికేటంత సేపు గోదోహనకాలం (పన్నెండు నిముషాలు) కూడా ఏ యింటా నిలవని శుకుడు - నీ ఇంటికి పిలవకుండా రావడం నీ పుణ్యఫలం ఆ శ్రీహరి అనుగ్రహం. మధురమైన భాగవత కథలు చెప్పి నిన్ను కాపాడమని వేడుకో.
శుకబ్రహ్మ- తాకితే కందిపోయే పువ్వులాటి సుకుమారుడు. బాల మార్యుని తేజం ఉదయ చంద్రుని చల్లదనం కలబోసిన వర్చస్సు... ఆయనను చూస్తున్న మునులూ జనులూ అందరూ చూపు మరల్చుకోలేక సంభ్రమాశ్చర్యాలతో నమస్కరిస్తూ నిలచి వున్నారు.
పరీక్షిత్తు చేతులు జోడించి శిరస్సు వంచి వందనం చేశాడు. శుకుడు ఆయన చేతులు తన రెండు చేతులతో పొదివి పట్టుకున్నాడు.
శుక: ఆకాశాత్పతితం తోయం యథాగచ్ఛతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి॥
ఆకాశం నుడి భూమికి పడే ప్రతి నీటి బిందువూ చివరకు నదీరూపాన సముద్రాన్ని చేరుకున్నట్లే ఎవరు ఎవరికి నమస్కారాలు చేసినా అన్నీ ఆ నారయణుడి పాదాలనే చేరుకుంటాయి. ఈశ్వరార్పణం - ఓ రాజా!
రాజు చేతులను ఆకాశం వైపుగా పైకెత్తి పట్టుకుంటూ అరమూసిన కన్నులతో పైకి చూస్తూ
*త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ సేవ్యశ్చ గురుస్త్వమేవ త్వమేవ సర్వం మమదేవదేవ*
రాజు కూడా అలానే పైకి చూస్తూ శుకుడి మాటలను వెనువెంట పలికాడు.
ఇద్దరూ ఆకాశానికి నమస్కరిస్తున్నారు.
శు : అన్యధా శరణం నాస్తిః త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన!
ఆకాశంలోని ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉజ్వల కాంతులు వెదజల్లాడు
*ప్రాయోపవేశ స్థలం*
అలికి ముగ్గులు పెట్టిన చిన్న తిన్నె పై శుకుడు కూర్చున్నాడు. పక్కన దండ కమండలాలు, పరీక్షిత్తు ఆయన కుడివైపున దర్భాసనంపై కూచున్నాడు. ఎదురుగాను అటూ ఇటూ మహర్షులూ రాజర్షులూ కూచున్నారు.
దూరాన యాగశాలలో హోమాలు జరుగుతున్నాయి. పల్చగా పొగలు లేస్తున్నాయి.
ఆ వెనుక ఒంటిస్తంభం మేడ.
(సశేషం)
No comments:
Post a Comment