*శ్రీరమణీయభాగవత కథలు- 11*
( బాపు-రమణ )
జరిగిన కథ:
పరీక్షిత్తు నారద మహర్షిని చూస్తాడు.
నారదుడు, పరీక్షిత్తుకు తనకుమారుడైన జనమేజయునికి పట్టాభిషేకం చేయమంటాడు.
శుకమహర్షి జన్మవృత్తాతం తెలుపుతాడు.
పరీక్షిత్తుకు మరణభయం పోయింది.
*****
*ప్రయోపవేశస్థలం*
అలికిముగ్గులు పెట్టిన తిన్నె పై శుకుడు కూర్చున్నాడు. పక్కన దండకమండలాలు. పరీక్షిత్తు ఆయన
కుడివైపున
కూర్చున్నాడు.
ఎదురుగానూ
అటూ ఇటూ మహర్షులు రాజర్షులు కూచున్నారు
దూరాన యాగశాలలో హోమాలు జరుగుతున్నాయి. పల్చగా పొగలు లేస్తున్నాయి. ఆ వెనక ఒంటి స్తంభం మేడ.
శుక:
ఓ రాజా! జీవులందరూ- మెలకువలో నిద్రలో శ్రద్దలో పరాకులో తెలిసి తెలియ కుండా క్షణక్షణం చేసే పని ఏమిటి? చెప్పగలవా?
పరీ:
(ఒక్క క్షణం ఆలోచించి చిరునవ్వు నవ్వి) ఊపిరి పీల్చడం విడవడం
శుక:
జననం- మరణం కూడా అటువంటివే సహజ ధర్మాలు సామాన్య ధర్మాలు. అయినా మనుషులు జననాన్ని పండుగగా మరణాన్ని గండంగా భావించి మరణం గురించే భయపడతారు. మరణం ఒక మార్పు మాత్రమే.
నీరు వేడెక్కితే - మరిగితే - ఏమవుతుంది?
పరీ: ఆవిరి
శుక:
ఆవిరి చల్లబడితే
పరీ: నీరు
శు: నీరు గట్టిపడితే?
పరీ :
మంచుగడ్డ
శు:
పాలు తోడేస్తే?
పరీ: పెరుగు
శుక : దాన్ని చిలికితే?
పరీ: వెన్న
శుక: వెన్న కాస్తే ?
పరీ: నేయి
శుక:
రూపాలూ కొన్ని గుణాలూ మారతాయి తప్ప వాటిలోని ముడి పదార్థం పాలే చావుపుటకలు కూడా ఇంతే.
కమండలం పెకెత్తి ఒక పాత్రలోని జలం ఒక పిడతలో పోశాడు. బుడగలు లేచాయి. ఒక దర్భతో చూపిస్తూ.
శుక : ఈ బుడగలో ఏముంది?
పరీ: గాలి
శుక: ఇంతకు ముందు ఈ గాలి ఈ రూపంలో వుందా?
పరీ : లేదు
శుక - (బుడగని దర్భతో పొడిచాడు. బుడగ పేలింది) ఇపుడు?
పరీ:లేదు.
శుక: నీరు?
పరీ: అదీలేదు.
శుక : ఏమైపోయినట్టు?
పరీ:
నీరు నీరులో కలిసిపోయింది. గాలిగాలిలో కలిసి పోయింది!
శుక:రెండూ చనిపోయినట్టేనా?
పరీ:
చావులేదు. రెండూ ఎప్పటి లాగే వున్నాయి.
శుక :
గాలి నీరూ సరసాలాడుకుంటే ఈ బుడగ పుట్టింది.
అందులో వున్న చిలక, రంగులీనే ఈగాజు మేడను చూసి మురిసిపోయింది.
అంతలో గాలో నీరో కొస్తో కూస్తో తోసుకున్నాయి. బుడగ పేలింది. చిలక ఎగిరి పొయింది.
పరీ:
తమ దయవల్ల, శ్రీ నారదుల కృపవల్ల మరణ భయం పోయింది. అందుకు సిద్ధమై ప్రాయోపవేశానికి కూచున్నాను. ఈ ఇల్లు వదలి కదిలి పోడానికి నా కున్న వ్యవధిలో...
శుక:
రాజా చావు చెప్పిరాదు. నాకు మరణం ఎప్పుడో నాకే తెలీదు. అందరికీ అంతే నీ అదృష్టం ఏవిటంటే శృంగి శాపం వల్ల ఏడు నాళ్ల గడువుందని నీకు స్పష్టంగా తెలిపింది. అందువలన నువ్వు ఆ దేవుని శరణు కోరవచ్చు. ఆయన పుణ్య కథలు విని తరించవచ్చు.
*** ***
పూర్వం ఖట్వాంగుడనే రాజు దేవదానవ యుద్ధంలో దేవతలకు సహాయం చేశాడు. వారు మెచ్చి వరం కోరుకోమన్నారు. వరాలిస్తారు గాని వాటిని అనుభవించాలి గదా! నాకు ఆయుస్సు ఇంకా ఎంత వుంది అని అడిగాడు. వారు చూచి ఇంకా రెండు ఘడియలే అని చెప్పారు. ఖట్వాంగుడు వెంటనే భూలోకం వచ్చేసి భక్తితో దేవుని ధ్యానిస్తూ కూచున్నాడు. అతనికి ముక్తి లభించింది.
పరీ:
ఖట్వాంగుడు దేవతలకే సాయం చేసిన పుణ్యాత్ముడు. కాని నాలా పాపం చేసిన వాడిని దేవుడు ఆదరిస్తాడా?
శుక; రాజా! పాపం చేసిన వారికే పరమాత్ముని క్షమ దయ కావాలి. ఆయనను కోరుకుంటే తప్పక దయచూపిస్తాడు.
అజామీళుడి కథ అలాటిదే.
అతడు చిన్న వయసులోనే చెడు దారులు పట్టి ఎన్నో పాపాలు చేశాడు. చివరకి ఎన్నో జబ్బులతో మంచం పట్టాడు. ఒకనాడు అతనికి ఆయుస్సు మూడింది. యమదూతలు వచ్చారు. వారిని చూసి బెదిరి ఏమీ తోచక తన చివరి కొడుకు నారాయణుడనే వాడిని ఆత్రంగా పిలిచాడు.
నారాయణ! *నారాయణ! నారాయణ యని ఆత్మనందను బిలిచెన్.*
అలా ఆపద్ధర్మంగా చిన్న కొడుకు అనుకొని పిలిచినా విష్ణుదూతలు వచ్చి నారాయణ స్మరణం చేసిన భక్తుడని వాదించి యమ దూతలను వెళ్ల గొట్టారు.
అజామీళుడు బుద్ధి తెచ్చుకుని చివరి రోజులు విష్ణుధ్యానం చేసి ముక్తి పొందాడు.
ధర్మానికి హాని జరిగినపుడల్లా ఆ జగన్నాధుడు ఆదుకుంటాడు.
అధర్మాన్ని ఖండించి ధర్మాన్ని కాపాడుతాడు. ఇందులో చిన్న పెద్దా అన్న తేడా వుండదు.
చీమనించి బ్రహ్మాండం వరకూ ఎక్కడ కష్టం వచ్చినా ఆయన అవతరిస్తాడు.
ఒకసారి కల్పాంతాన బ్రహ్మ నిదురిస్తూండగా సోమకాసురుడనే రాక్షసుడు వేదాలను అపహరించాడు.
పరీ :
ఎందుకోసం?
శు:
సృష్టిలో జీవకోటిని నడిపే ధర్మసూత్రాలు వేదాలు. వాటిని నాశనం చేసి అరాచకం తేవాలన్నదే రాక్షసుల కోరిక....
*ఓం నమో భగవతే వాసుదేవాయ!!*
***
(సశేషం)
No comments:
Post a Comment