Friday, June 28, 2024

 శ్రీమద్రామాయణము.

(205 వ ఎపిసోడ్),

""'''"'"'''ధర్మో  రక్షతి  రక్షితః"""""""""'

ధర్మము  అవలంబించుట మిక్కిలి కష్టతమమైన విషయము.ధర్మము మిక్కిలి సూక్ష్మమైనది.చాలా నిశితముగ పరిశీలించవలసిన విషయము. ఈ ధర్మాన్ని పాటించాలంటే  కామజములైన వ్యసనములనుండి బయటపడిన వారికి మాత్రమే సాధ్యమగును.

రామాయణము అరణ్యకాండములో సీతాదేవి రామలక్ష్మణులతో దండకారణ్యము నకు బయలదేరు సమయములో  మిగుల వ్యాకులపడి

"" త్రీణ్యేన వ్యసనసన్యత్ర  కామజాని భవంత్యుత,
మిథ్యావాక్యం పరమకం తస్మాద్గురుతరావుబౌ,
పరదారాభిగమనం వినా వైరం చ రౌద్రతా||,(09-03),,

ఓ ఆర్యపుత్రా రామా! నేను చెప్పు మాటలు ఆలకించు.ఇవి నీకు తెలియనివి కావు. లోకములో  "" కామజములు" యను మూడు వ్యసనములు కలవు.అవి వరుసగా 1.అసత్యమాడుట,2.పరస్త్రీ వ్యామోహము,.3.ఎట్టి వైరభావము లేకున్నను ప్రాణ హింసకు పూనుకొనుట. వీటిలో చివరి రెండు అనృతముకన్నా మిక్కిలి ప్రమాదకరములైనవి.

"" మిథ్యావాక్యం న తే భూతం న భవిష్యతి రాఘవ!,
కితో~భిలాషణం స్త్రీణాం పరేషాం ధర్మనాశనమ్||,(09-04),

ఓ రామా! తమరు జన్మలో అసత్యమాడి ఎరుగరు.ఇక ముందు అసత్యవచనములు పలుకరు.ధర్మనిరతులైన తమకు పరస్త్రీవాంఛ కలలో కూడ స్ఫురించని విషయము.మీ మనస్సులో దానికి చోటే లేదు.కానీ...........

"" త్వం హి బాణధనుష్పాణిః భ్రాత్రా సహ వనం గతః,
దృష్ట్వా వనచరాన్ సర్వాన్ కచ్చిత్ కుర్యాః శరవ్యయమ్||,(09-14),,

ఇట్లా మీ అన్నదమ్ములు ధనుర్భాణములు చేబూని వనములలో తిరుగాడుటవల్ల, అక్కడ సంచరించు మృగములు మీకు హాని తలపెట్టక పోయినా వాటిని సంహరించెదరు.ధనుర్భాణములు ధరించుట వల్ల జీవహింస చేయవలెనని యావ పెరుగును.కారణము,

"" క్షత్త్రియాణామపి ధనుః హుతాశస్యేంధనాని చ|,
సమీపతః స్థితః తేజో బలముచ్చ్రయతే భృశమ్||,(09-15),,

ఓ రామా! సమిధలు సమృద్దిగా యున్నచో అగ్ని యొక్క తేజోబలములు వృధ్దియగునట్లు ,ధనుర్భాణములు ధరించుటవల్ల క్షత్రియులకు వారి వారి శౌర్యపరాక్రమములు ప్రకటితము అగుటకు ఉద్రేకపడును.

"" ధర్మార్థః ప్రభవతి ధర్మాత్ ప్రభవతే సుఖమ్,
ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్||,(09-40),

ఓ రామా! ధర్మముల వలన సంపదలు,సుఖశాంతులు,జ్ఞానము,లభించును.తద్వార ముక్తి లభింపగలదు.జగత్తుకు ధర్మమే ఆధారములు.
స్త్రీ చాపల్యమతో మీ యందు అనురాగముతో ఈ ధర్మములు వివరిస్తున్నాను గానీ అసలు ధర్మము గురించి తమకు తెలుపగల సమర్థులెవ్వరు? మీరు మీ తమ్మునితో ఆలోచించి మీ ఇష్టానుసారము చేయగలరు.

సీతామాతలోని పతిభక్తికి ఈ ధర్మాచరణ హితోక్తులే నిదర్శనములు. జీవహింస పట్ల వ్యతిరేకత ,పరస్త్రీ వ్యామోహముపట్ల అసహ్యత,అనృతమైన మాటలపట్ల విరక్తి సీతా మాతలో ధర్మాచరణ పట్ల విధేయతను రామాయణము మనకి ప్రస్పుటముగ తెలియచేస్తున్నది.

అందుకే రామాయణ కర్త వాల్మీకి మహర్షి  ఇతిహాసాలలో గొప్ప కవిగా పేర్గాంచాడు.
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్.

No comments:

Post a Comment