Monday, June 24, 2024

 కాఫీ కబుర్లు సంఖ్య 637 (జూన్ 03 - 2024) -- ప్రపంచ సైకిల్ దినోత్సవం (world cycling day). --   నడక - సైకిల్ - స్కూటర్ - మోటార్ సైకిల్ - కారు - నడక - సైకిల్.. --  ఇది రీసైక్లింగ్ సిద్ధాంతం.  1980-85 ముందు వరకూ సైకిలే మన వాహనం.  ఒకరు లేక ఇద్దరు సైకిల్ పై వెళ్ళొచ్చు.  అప్పట్లో సైకిల్ లేని ఇల్లు ఉండేదికాదు.  మరీ చిన్న పిల్లలు ఇంట్లో లేదా తోట లో ఆడుకునేందుకు మూడు చక్రాల బేబీ సైకిల్స్ ఉండేవి. పది పన్నెండేళ్ళ వయసు గలవారికి  చిన్న సైకిల్స్ ఉండేవి.  పదహారేళ్ళ దగ్గర్నుంచి మామూలు సైకిల్స్..  ఇవి విస్తృతంగా వినియోగంలో ఉండేవి.  అప్పట్లో రోడ్డు మీద సేకిల్స్, పెడల్ రిక్షాలే కనపడేవి.  విద్యార్థులకు, అమ్మాయిలకు ప్రత్యేకంగా సైకిల్స్ ఉండేవి.  పాఠశాల కళాశాల లకు స్టూడెంట్స్ సైకిల్స్ పైనే ఎక్కువ మంది రావడంతో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసేవారు.  సినిమా హాల్స్ లలో కూడా సైకిల్ పార్కింగ్ కి స్థలాలు ఉండేవి.  కొత్త సినిమాలు విడుదలైనప్పుడు మూడు నాలుగు వరుసలలో రెండు వందల సైకిల్స్ వరకు థియేటర్ సైకిల్ స్టాండ్ లో కనబడేవి.  సినిమా హిట్టా కాదా అని ఈ సైకిల్స్ సంఖ్య బట్టీ బేరీజు వేసుకునేవారం టీనేజ్ లో ఉన్నప్పుడు.  ఇదో రకమైన అలవాటుగా ఉండేది.  హీరో, అట్లాస్, హెర్క్యూలెస్ సైకిల్స్ మంచి ప్రాచుర్యంలో ఉండేవి.  BSA విద్యార్ధిని విద్యార్థుల సైకిల్స్ తయారీలో మంచిపేరు గడించింది.  ఈ సైక్లింగ్ అన్నది చక్కటి శారీరక వ్యాయామం.  మెయింటెనెన్స్ ఖర్చు ఉండదు,  పర్యావరణ రహిత వాహనం, పైగా అంత ఖరీదైనది కాదు, అందరికీ అందుబాటులో ఉండే సులభమైన ఆరోగ్యకర రవాణా సాధనం.  నిత్యం సైకిల్ తొక్కేవారికి డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు రావని వైద్యనిపుణుల పరిశోధనలలో తేలింది.  ఐతే 1985 తరువాత క్రమంగా స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు, కార్లు పెరగడం, సామాన్యులకు అందుబాటులోకి రావడంతో ప్రమాదకర, పలు అనారోగ్య సమస్యలను తెచ్చే ఈ వాహనాలు ఎక్కువ కావడం వలన నగరాల్లో పట్టణాల్లో రద్దీ పెరిగి విపరీతమైన ట్రాఫిక్ సమస్య అందరికీ ఓ తలనొప్పిగా మారింది.  శారీరక శ్రమ లేకపోవడం వలన డయాబెటిస్ టైప్ 2, టైప్ 1 రోగుల సంఖ్య విశ్వవ్యాప్తంగా పెరిగింది వయసుతో నిమిత్తం లేకుండా.  ఆధునిక గృహోపకరణాల వలన మహిళలకి వంట శ్రమ తగ్గిపోయింది.  ఈ రెండు కారణాల వలన ఇంకా నడక సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయకపోవడం వలన రోగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.  ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018 లో గుర్తించి, సభ్యత్వం ఉన్న దేశాలను సమావేశపరిచి ప్రజలకి మంచి ఆరోగ్యాన్నిచ్చే సైక్లింగ్ అలవాటు చేయాలన్న దృఢ సంకల్పంతో ఏటా జూన్ 03న (ఈరోజే) వరల్డ్ సైకిల్ డే గా జరపాలని నిర్ణయం తీసుకుంది.  ప్రపంచ వ్యాప్తంగా సైక్లింగ్ వలన వచ్చే ప్రయోజనాలను జనాలకు  ముఖ్యంగా యువతకు వివరించాలని వైద్య సంస్థలకు, వైద్య నిపుణులకు ఆదేశాలు ఇచ్చి అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటోంది.  నడక సైక్లింగ్ వ్యాయామం..  ఈ మూడు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఆరోగ్యవంతుల మవుతాం.  ముందుతరాల వారి ఆరోగ్య రహాస్యం సైక్లింగే అని పెద్దలు అంటారు.  మా నాన్నగారికి 65 ఏళ్ళు సైకిలే నేస్తం.  తన 82వ ఏట వరకు సైకిల్ తొక్కారంటే ఎవరికైనా ఇపుడు ఆశ్చర్యం కలుగుతుంది.  నడక కూడా అలవాటు ఉండేది.  అడపాదడపా సినిమాలు చూసేవారు.  85 తరువాత వృద్ధాప్యం మీద పడటంతో కొంత అనారోగ్యానికి గురై 87వ ఏట మరణించారు.. బెడ్ రిడెన్ కాకుండానే.  సైకిల్, ట్రాన్సిస్టర్ రేడియో, పోర్టబుల్ టైప్ రైటర్..  యీ మూడు మా నాన్నగారికి చిరకాల నేస్తాలు.  ఇవి ఎప్పుడు నాకు తారసపడినా గుర్తొచ్చినా నాకు మా నాన్నగారి రూపమే కనిపిస్తుంది.  ఇప్పుడు వైద్యులు కూడా సైక్లింగ్ చేయాలని సూచిస్తున్పారు.  సైకిల్ నుంచి ఆరంభించి మళ్ళీ సైకిల్ కే రావడం..  ఓ రీసైక్లింగ్..  ------- గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం ఫోన్ 99855 61852....

No comments:

Post a Comment