Wednesday, June 26, 2024

 ఒకప్పుడు జీవుని శరీరంలో నున్న పంచభూతములు, ఇంద్రియములు కలిసి, "ఈ శరీరం ఇంత చైతన్యంగా, ప్రకాశవంతంగా వుండటానికి కారణం మేమే కనుక మేమే దేవతులమని భావించేయి. ఇది గ్రహించిన "ప్రాణం" వాటినుద్దేశించి, అసలు ఈ శరీరం నా వలనే నిలిచివుంది, నేనే ప్రాణాపాన రూపంలో దీనిని చైతన్యవంతంగా వుంచుతున్నాను, ఇదిగో చూడండని చెప్పి, శరీరాన్ని విడిచిపెట్టే ప్రయత్నంచేసింది. వెంటనే శరీరంలో పంచభూతాలు, ఇంద్రియాలు నిర్వీర్యమై ప్రాణంతో పాటూ పైకి పోవలసి వచ్చింది. వెంటనే అవి తేరుకొని ప్రాణముంటేనే తాము వుండగలమని తెలుసుకొని, ప్రాణాన్ని వుండమని బ్రతిమాలి, ప్రాణాన్ని ఈ విధంగా స్తుతించడం ప్రారంభించేయి -
ఓ ప్రాణమా! నీవే జీవశక్తివి, నీవే ఈ శరీరంలో అగ్నిగా దహిస్తున్నావు, సూర్యుడిలా ప్రకాశిస్తున్నావు, వాయువు నీవే, పదార్ధం నీవే, స్థూలసూక్ష్మాలు నీవే, అమృతం నీవే, ఇంద్రుడవు నీవే, వేదాలు నీవే, జ్ఞానం నీవే, ధర్మాలు నీవే, నీవే గర్భంలోనుండి జన్మిస్తావు, నీవే ప్రజాపతివి, మమ్మల్ని ధరించేది నీవే, దేవతలకు ఆహుతులను అందించేది నువ్వే, పితృదేవతలకు పిండమును అందించేది నువ్వే, నీవే ఋషులయొక్క సదాచారము.
ఓ ప్రాణమా! నీవే ఇంద్రుడవు, రుద్రుడవు, అందరిని సంరక్షించేది కూడా నువ్వే, అన్ని వెలుగులకు మూలమైన వెలుగువి నువ్వే, జీవుల జ్ఞానేంద్రియములు నువ్వే, మనస్సు నువ్వే, నీ స్వరూపాన్ని మా యందు వుంచుము, మమ్ము వీడి వెళ్ళవద్దు. మాకు ఐశ్వర్యమును, బుద్ధిని ప్రసాదింపుము అని స్తుతించేయి.
ఈ విధంగా భార్గవుడు అడిగిన రెండో ప్రశ్నకు సమాధానం చెప్పేడు పిప్పలాదుడు.
*మూడో ప్రశ్నతో వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాము...🙏🏻

No comments:

Post a Comment