"జ్ఞానగీత" (నిత్యజీవితంలో ఉపనిషత్తులు) - *ప్రశ్నోపనిషత్తు* - 1వ భాగము./ 2వ భాగము./ 3వ భాగము.
- శాస్త్రి ఆత్రేయ(ఆకుండి శ్రీనివాస శాస్త్రి).
ఈ ఉపనిషత్తు మొత్తము ప్రశ్నల రూపంలో నడుస్తుంది కాబట్టీ దీనికి "ప్రశ్నోపనిషత్తు" అనే పేరు వచ్చింది. ఇది అధర్వవేదానికి సంబంధించినది. పిప్పలాదుడు అనే బ్రహ్మవేత్తను ఆరుగురు ఋషులు ఆరు ప్రశ్నలు వేస్తారు. మొదటి నాలుగు ప్రశ్నలు "ప్రాణానికి" సంబధించినవి. మిగతా రెండు ప్రశ్నలు "ప్రణవానికి" సంబంధించినవి.
ఈ ప్రశ్నలు ప్రజాపతి, ప్రాణవాయువు, శరీరధాతువులు, జాగ్రత్సప్నావస్థలు, ఓంకారము, మానవుల షోడశభాగముల విషయమై ప్రశ్నింపబడినవి. వీటికి పిప్పలాదుడు ఎంతో శాస్త్రబద్ధమైన జవాబులు ఇస్తాడు. జడ పదార్ధము - చైతన్యమైన శక్తి కలయికే ఈ సృష్టి ఆవిర్భావానికి మూలమని ఇందులో చెప్పడం జరిగింది.
శాంతిమంత్రము :
ఓ యజ్ఞప్రియులైన దేవతలారా! ఎల్లప్పుడూ మేము మంచి మాటలనే విందుముగాక! మంగళకరమైన వాటినే చూచెదముగాక! పరిపృష్టి గల అవయములతో మిమ్ములను స్తోత్రము చేయుదుముగాక! మీ చల్లని దీవెనలతో దీర్గాయుర్దాయమును పొందెదముగాక! కీర్తిగల ఇంద్రుడు, అంతా నెరింగిన ఆదిత్యుడు, ఆపదలను రూపుమాపు గరుత్మంతుడు, దేవగురువైన బృహస్పతి మాకు శుభమును ప్రసాదించెదరుగాక! ఓం శాంతిః శాంతిః శాంతిః.
ఉపోద్ఘాతము :
ఓం పరమాత్మునికి నమస్కారము. భరద్వాజ గోత్రుడైన సుకేశుడు, శిబి కుమారుడైన సత్యకాముడు, గర్గవంశ సూర్యుని మనుమడు, అశ్వలుని తనయుడైన కౌసల్యుడు, విదర్భదేశపు భార్గవుడు, కత్య కుమారుడైన కబంధి వేదాలను అభ్యసించి బ్రహ్మజ్ఞానం పొందుటకు ఎంతోకాలం తపస్సు చేస్తారు. తపస్సులో వారికి కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకదు. వారందరూ కలిసి సద్గురువును అన్వేషిస్తూ, బ్రహ్మవేత్త అయినా పిప్పలాద మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. వారు అతనికి నమస్కరించి తమ ఆరుగురిని శిష్యులుగా స్వీకరించి, తమకున్న సంశయాలను తీర్చమని ప్రార్థిస్తారు.
పిప్పలాదుడు, వారందరికి తన ఆశ్రమంలో చోటిచ్చి, ఒక సంవత్సరం పాటు ఆశ్రమ నీయమనిష్టలను పాటించిన పిదప వారి సందేహాలను తీరుస్తానని మాటిస్తాడు. వారందరు కూడా బ్రహ్మచర్యదీక్షతో, గురుసేవతో ఆ సంవత్సరకాలాన్ని సుసంపన్నం చేసుకుంటారు. వారి వ్రతానికి మెచ్చిన పిప్పలాదుడు, తమకున్న సంశయాలను ప్రశ్నించమని వారిని అడుగుతాడు. ఆ ఆరుగురు శిష్యులు గురువుగారిని ప్రశ్నించడం మొదలుపెడతారు.
17"జ్ఞానగీత" (నిత్యజీవితంలో ఉపనిషత్తులు) - *ప్రశ్నోపనిషత్తు* - 2వ భాగము.
మొదటి ప్రశ్నగా, ఆ ఆరుగురు ఋషుల్లో ఒకడైన కబంధి, బ్రహ్మవేత్తయైన పిప్పలాదునుద్దేశించి, ఆచార్యా! సకల జడజీవ పదార్ధములలో కూడిన ఈ సృష్టికి మూలమేది? అని ప్రశ్నిస్తాడు.
దానికి సమాధానంగా పిప్పలాదుడు, మొట్టమొదటిగా అన్నము (జడపదార్ధము) మరియు ప్రాణము (శక్తీ లేదా చైతన్యము) అనే మిధునం (జంట) వెలిసింది. ఆ రెండింటి కలయికే ఈ సృష్టి. ఈ ధరణికి సంబంధించి సూర్య-చంద్రులే ఈ మిధునం. ఒకటి చైతన్యాన్ని ప్రసాదించేది, ఇంకొకటి ఆ చైతన్యాన్ని స్వీకరించేది. అంటే సూర్యుడు పురుషత్వానికి, చంద్రుడు ప్రకృతికి సూచికలు.
ఆదిత్యుడు కిరణాల రూపంలో అన్ని చోట్లకి ప్రసరించి, అన్ని ప్రాణశక్తులను ప్రేరేపిస్తుంటాడు. ఇతడే వైశ్వానరుడనే పేరుతొ అన్ని జీవులందు జఠరాగ్నిరూపంలో వున్నాడు. జీవులన్నింటిలో ఆకలిదప్పులు కలుగుటకు ఇతడే కారణం. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచమే తన స్వరూపంగా కలవాడు. ఇతడే కాలాన్ని శాసిస్తున్నాడు. కాలగమనం ఇతడివల్లనే సాధ్యపడింది. దిక్కులను సూచించేది ఇతడే.
ఇతడే ప్రజాపతి. ఉత్తరాయణం, దక్షిణాయణం అనే రెండు దారులలో ఇతడు సంచరిస్తాడు. ఆరు ఋతువులుగా, పన్నెండు మాసాలుగా ఇతడే పన్నెండు రూపాలతో విరాజిల్లుతున్నాడు. ఇతడే ఈ సృష్టికి తండ్రి. జీవుల బుద్ధిని వికసింపజేయువాడూ ఇతడే.
పగలు-రాత్రిగా, శుక్ల-కృష్ణ పక్షాలుగా, అన్నము-వీర్యంగా, పదార్ధము-చైతన్యంగా, స్త్రీ-పురుషునిగా, జీవుడు-ఆత్మగా, ఆత్మా-పరమాత్మగా ఇలా అనేక మిధునములుగా వ్యక్తమౌతున్నవాడూ ఇతడే. దీనిని గ్రహించడమే "ప్రజాపతివ్రతము". జీవులు నిష్కామంతో, చిత్తశుద్ధితో, జ్ఞానంతో, తపస్సుతో, సత్యశోధనతో, బ్రహ్మచర్యంతో దీనిని ఆచరిస్తే ఆ ప్రజాపతితత్వాన్ని గ్రహించగలరని పిప్పలాదుడు మొదటి ప్రశ్నకు సమాధానమిస్తాడు.
"జ్ఞానగీత" (నిత్యజీవితంలో ఉపనిషత్తులు) - *ప్రశ్నోపనిషత్తు* - 3వ భాగము.
రెండవ ప్రశ్నగా, ఆరుగురు ఋషుల్లో ఒకడైన భార్గవుడు, బ్రహ్మవేత్తయైన పిప్పలాదుడిని ఉద్దేశించి, ఆచార్యా! సృష్టిని ప్రకాశింపజేసే దేవతలు ఎంతమంది? వారిలో ఎవరు గొప్పవారు? అని ప్రశ్నించేడు.
దీనికి సమాధానంగా పిప్పలాదుడు, ఈ విషయం మీకందరికీ సులువుగా అర్థమయ్యేటట్లు ఒక కధలా చెబుతాను, శ్రద్ధగా ఆలకించండని ఈ విధంగా చెప్పనారంభించేడు -
No comments:
Post a Comment