Monday, June 17, 2024

నీకు నీవే సృష్టికర్తవి...!

*నీకు నీవే సృష్టికర్తవి...!* 

ప్రతీ మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు. అందుకే మనిషి స్వయంకృషితో ఏం సాధించాలనుకున్నా, ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది. మనిషి వేసే ప్రతి అడుగూ అతడి జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి. 

నిజానికి మనిషి శారీరకంగా చాలా బలహీనుడు, నిస్సహాయుడు. పక్షిలాగా నింగిలో ఎగరలేడు. పులిలాగా వేగంగా పరిగెత్తలేడు. కాని, ఈ సృష్టిలో మనిషికున్న మానసికశక్తి అమితమైనది. అద్భుతమైనది. అలాంటి మానసికశక్తితోనే బలమైన ఏనుగును సైతం మావటివాడు లొంగదీసుకుంటున్నాడు. ఈ సృష్టిలో ఏ జీవికీ లేని గొప్ప ఆలోచనా సామర్థ్యం ఆ భగవంతుడు మనిషికి మాత్రమే ప్రసాదించాడు. ఆ మేధతోనే చుట్టూ ఉన్న పరిసరాలను మనిషి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఆశించినవి, ఇష్టపడినవి, కోరుకున్నవి పొందేశక్తి మనుషులకు మాత్రమే ఉంది. తనకున్న పూర్తి శక్తుల్ని వినియోగించుకోవాలన్న నిర్ణయమే మనిషి జీవితంలో అద్భుతాలు సృష్టిస్తుంది. సుడిగాలి చుట్టేంతవరకు గాలి బలం తెలీదు. ఉప్పెన పోటెత్తేవరకు నీటి బలం తెలీదు. మొలకెత్తేంతవరకు విత్తనం బలం తెలీదు. అలాగే మనమీద మనకు నమ్మకం, విశ్వాసమున్నంతవరకు మన బలం మనకు తెలీదు. కీలకమైన జీవనపోరాట సమయాలలో స్వశక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది. మానసిక శక్తిమీద మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే అసాధ్యాలను సుసాధ్యాలు చేయిస్తుంది.

నూరు యోజనాల సముద్రాన్ని దాటి సీత జాడ కనిపెట్టాలి. వానరులు ఎవ్వరూ ఆ సాహసం చేయలేకపోయారు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడితో 'నీ పరాక్రమం, ప్రతిభ గురించి రాముడికి తెలుసు. అందుకే నీకు ఉంగరాన్ని ఇచ్చాడు. ఆ రాముడి నమ్మకాన్ని నిలబెట్టి నీవే సముద్రలంఘనం గావించాలి' అన్నాడు. ఆ ప్రోత్సాహంతోనే హనుమంతుడు సీత జాడ తెలుసుకుని రామకార్యాన్ని పూర్తిచేశాడు. కష్టాలు పర్వతమంతగా కనిపించినా, పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నా భీతిల్లకూడదు. పట్టుదలతో చేసే ఏ ప్రయత్నమైనా విజయాన్నే చేకూరుస్తుంది.

మనం కోరుకున్న స్థాయికి ఎదగడానికి అన్ని అవకాశాలు ఉన్నా, శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నా ఏదో పిరికితనం, ఆందోళన మనల్ని వెనక్కి లాగుతుంటాయి. కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధాలతో సిద్ధంగా ఉన్న గురువులు, బంధుజనాన్ని చూసి అర్జునుడు కలత చెంది గాండీవం జారవిడిచాడు. 'ఈ విజయం వల్ల ఒనగూడే రాజ్యం అవసరంలేదు' అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుడికి స్వధర్మం గొప్పతనాన్ని వివరించి భగవద్గీతను బోధించి కర్తవ్యోన్ముఖుణ్ని చేశాడు. ఒక్కొక్కప్పుడు నిత్యజీవితంలో ఎదురయ్యే సంఘటనల వల్ల మనసు అలజడికి లోనవుతుంది. అయినా ప్రయత్నాలు ఆపకూడదు. మన బలహీనతలను బలాలుగా మార్చుకోవాలి. భయాలను, మానసిక దౌర్బల్యాలను అధిగమించాలి.

 *జీవితంలో అన్నీ మనల్ని సంతోషపెట్టేవే జరగవు. దుఃఖం కలిగించే సంఘటనలూ ఎదురవుతాయి. అప్పుడు కూడా దైవంపై విశ్వాసం కోల్పోకూడదు. శ్రీకృష్ణుడి ముఖతా యుద్ధభూమిలో గీత ఆవిర్భవించింది. అంపశయ్యపై ఉన్న భీష్ముడు విష్ణుసహస్రనామాన్ని లోకానికి అందించాడు. చీకట్లను చీల్చుకునే ఉషోదయకాంతులు లోకానికి వెలుగునిస్తాయి. అందువల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా ఎవరికివారే తమ మేధాశక్తితో ముందుకు సాగాలి. వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవాలి. అప్పుడే ఎలాంటివారైనా అనుకున్నది సాధిస్తారు...!*
                                                                                                                                                                                                                                                                                                                                                                                       *మనం శుభం అందరికీ జరగాలని మనసా,వాచా,కర్మేణా త్రికరణ శుద్ధిగా వాంఛిస్తే అదే జరుగుతుంది. ’యద్భావం తద్భవతి’ అన్నారు పెద్దలు.*

  *అందుచేత అందరికీ మంచి మాత్రమే జరగాలని కోరుకుందాం.సమస్త మానవాళి సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో సుఖంగా జీవించాలని కోరుకుంటూ...*
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాః సమస్తాః సుఖినో భవంతు...!*

*మీకు నేడు అన్నియు శుభములు కలుగుగాక...!!*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment