Friday, June 28, 2024

 *మానవజన్మ ఆదర్శమును నిరూపించే నిమిత్తమై వచ్చింది!!!*

*మనము యీనాడు కర్మలద్వారా అనేక సంపదలను ఆర్జిస్తున్నాము. కర్మలే అస్థిరమైనప్పుడు కర్మఫలమైన సంపద స్థిరముగా ఎట్లు ఉంటుంది? అవన్నియు కూడా అనిత్యములే, అసత్యములే! అని చెప్పింది భగవద్గీత. నిత్యసత్యమైన దైవము ఒక్కడే! ఇలాంటి దివ్యత్వాన్ని మనము ఈనాడు విస్మరిస్తున్నాము. మనయొక్క మానసిక తత్త్వము నమ్మినట్లుగా, ఆరాధన చేసినట్లుగా, విశ్వసించినట్లుగా మనము భావిస్తున్నాము. 'యద్భావం తద్భవతి' అన్నట్లుగా మన భావములను పురస్కరించుకొని మనము ఫలితములను అందుకోగలుగుతున్నాము. మనము బాహ్యరూపముగా అనేక విధములుగా చెప్పవచ్చు. కొన్ని ప్రదర్శించవచ్చు. కానీ భగవంతునకు నీ భావాన్ని మూసి పెట్టటం సాధ్యము కాదు. నేను పరమభక్తుడనని చెప్పవచ్చును. అన్నివిధములు భగవంతుని సంతృప్తి పరచకోసము కావలసినన్ని మాటలాడవచ్చును. కాని మన మనసుకు మనము, మన conscience కు మనము తృప్తిగా ఉంటున్నదా అని విచారించాలి. అన్నమాచార్యులు యిదే విధముగా భగవంతుని ప్రార్ధించి నీవే నా సర్వస్వమని అనేక పాటలు వ్రాసాడు. కట్టకడపటికి తన యథార్ధమును గుర్తించుకున్నాడు. మాటలతో భగవంతుని మోసగిస్తున్నానని ఒక్కతూరి పరిణామము చెందాడు. మన గ్రంథములచేతను, మన మాటలచేతను భగవంతుని సంతృప్తిపరచలేము. మన చదువులచేతను, మన పాండిత్యముచేతను, మన యుక్తులచేతను, మన ధీశక్తిచేతను భగవంతుని సంతృప్తి పరచటము సాధ్యము కాదు. 'ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు' అని అన్నమాచార్యుడు అన్నాడు. ఓ భగవంతుడా ఏ భావముతో ఎవరు తలుస్తున్నారో అంతమాత్రమే నీవు ఉంటున్నావు. అంతకు మీరిపోవు. మనము ఎంతపాత్ర తీసుకొని సముద్రములో ముంచుతామో అంతనీరే ఆపాత్రలో ప్రవేశిస్తుంది.*

 *చిన్న చెలమలో ముంచినగాని* 
 *ఎన్ని సముద్రముల్ నించినగాని* 
 *కడవెంతో నీరంతేరా* 
 *కావాలన్నను ఎక్కువ రాదురా*
 *కర్మదాటవశమా! నరుడా! కర్మదాట వశమా!* 
 *ఘనపాఠంబులు చదివినగాని* 
 *కులదేవతలను కొలచినగాని*
 *కారడవులకే పోయినగాని* 
 *కఠిన తపస్సులు చేసినగాని*
 *కర్మదాట వశమా! నరుదా! కర్మదాట వశమా!* 

*మనక్రియలు పవిత్రమైనవిగా ఉంటుండాలి. వానివలన మనము కావలసినంత ఫలితాన్ని పొందగలము. ఎట్టి పిండో అట్టి రొట్టె. ఎట్టి తిండో అట్టి త్రేపు. అదేవిధముగనే మనము మంచి కర్మలలో ప్రవేశించాలి. ఆదర్శాన్ని నిరూపించే నిమిత్తమై ఆవిర్భవించినది మానవజన్మ అనే సత్యాన్ని నిరూపించాలి.*

*~శ్రీ సత్యసాయి వచనామృతం.*
*17-07-1988.*

No comments:

Post a Comment