Sunday, July 7, 2024

 "జ్ఞానగీత" (నిత్యజీవితంలో ఉపనిషత్తులు) - *ముండకోపనిషత్తు* - 07 ముగింపు భాగము.
పరమాత్మ అత్యంత సూక్ష్మమైనది. కళ్ళతోగాని, కర్మలతోగాని, వాక్కుతోగాని, ఇంద్రియాలతో గాని దానిని గ్రహించుట దుర్లభం. పరిశుభ్రమైన మనస్సుతో మాత్రమే దానిని గ్రహిచవచ్చు. అజ్ఞానం తొలగిపోయినప్పుడు ఆత్మజ్ఞానం ద్వారా పరమాత్మ దర్శనం లభిస్తుంది.

ఆత్మజ్ఞానం పొందుటకు శరీరబలం, మనోబలం తప్పక వుండాలి. జీవుడు ఆ శక్తిని పొందడానికే కొన్ని విహిత కర్మలను బోధించడం జరిగింది తప్పా లౌకికంగా లబ్ది పొందడానికి కాదు. లౌకిక లబ్ది బంధాన్ని, అనురాగాన్ని పెంచి శోకానికి హేతువవుతుంది. విహిత కర్మలను శాస్త్రోత్తంగా, జ్ఞానంతో, నిష్కామంగా ఆచరిస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది.

బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. బ్రహ్మజ్ఞాని అన్ని సంశయాలను, శోకాలను పోగొట్టుకొని పరమాత్మగా అమరుడవుతాడు.

వేదములలో ఇదే చెప్పబడింది. ఆ విషయాలను జ్ఞానంతో గ్రహించి, విజ్ఞానంతో కర్మలను ఆచరించి, బ్రహ్మవిద్య పొందుటకు అర్హతసాధించి, గురుసేవ ద్వారా గురు సంరక్షణలో బ్రహ్మవిద్యను అభ్యసించి, ఆత్మానుభూతిని పొంది పరమాత్మతో విలీనం కావలెను.

ఈ విధంగా బ్రహ్మవిద్యను అంగీరసుడు తన శిష్యుడైన శౌనకునకు ఉపదేశించెను.

ఆత్రేయస గోత్ర మహాకవి శ్రీ జగన్నాధ శాస్త్రి గారి మునిమనుమడు, ఉద్దండపండిత శ్రీ గోపాల శాస్త్రి గారి మనుమడు, ఉభయభాషాప్రవీణ మహాకవి పండిత శ్రీ సూర్యనారాయణ శాస్త్రి గారి పుత్రుడనైన, నాచే విశ్లేషింపబడిన "ప్రస్థానత్రయము, జ్ఞానగీత, ముండకోపనిషత్తు వివరణ" సర్వం సంపూర్ణం... 🙏🏻

No comments:

Post a Comment